వాకిలిని పెండ్లికూతురులా ముస్తాబుచేయడం; పసుపు, కుంకుమలు బాసింగమవడం; అనే ఉపమానాలు పరిశీలించినపుడు స్త్రీలు పొద్దున లేచి, వాకిలూడ్చి, అలుకుజల్లి, ముగ్గుపెట్టి, గడపలు పూదిచ్చి ఇంటి ముందరి పరిసరాలను కళాత్మకంగా తీర్చిదిద్దడం, అది దినచర్యలో భాగం కావడం, సాంస్కృతిక జీవన విధానంలోని ఒక ఘట్టాన్ని సాంప్రదాయికంగా, వారసత్వంగా బదిలీ చేయడం మొ.న అంశాలు కండ్లముందర దృశ్యాలుగా నిలుస్తయి. చేసే పని లోని శ్రద్ధ, సౌందర్యాత్మకత, గ్రామీణ నేపథ్యపు వాతావరణం, కొన్ని తరాల సంస్కృతి తొణికసలాడుతుంటది.
*
ఒక కుటుంబం సంతోషం మొత్తం ఆ ఇంట్లోని స్త్రీ వల్లనే సిద్ధిస్తది. ఇంట్లో వసంతం పూయించడమంటే మాటలు కాదు. పందిరి గుంజకు పాకిన తీగలెక్క ఇంటికి అల్లుకుపోవడంలో కుటుంబ సభ్యుల మధ్య నిలిపివుంచుతున్న ప్రేమానురాగాలకు, ఆత్మీయతానుబంధాలకు స్త్రీ ఇస్తున్న ప్రాధాన్యత తెలుస్తది. మొదటి రెండు స్టాంజాల్లో ఒక స్త్రీ – ఉదయం లేచి ఇంటి పనుల్లో నిమగ్నమవడం తద్వారా కుటుంబంలోని ఆనంద సమయాలకు కారణమవడం కనిపిస్తది. ఇంటిశ్రమ ఒక్కటేనా? అని ప్రశ్న వేసుకుంటే ఇంటి చాకిరీతో పాటు వ్యవసాయ పనులకు వెళ్లడం తర్వాత స్టాంజాల్లో కనిపిస్తది.
*
‘కవి’ ఉదయపు కిరణాలు భూమాతను ముద్దాడుతున్న గడియల్ని, తెల్లారగానే.. అని చెప్పడానికి ‘పంట ప్రియుడు చేనును కౌగిలించుకోగానే’ అని ప్రతీకాత్మకంగా దృశ్యమానమై పఠితుల్ని ఆహ్లాదపరుస్తడు. కల్వపిల్ల గా రూపించబడిన కోమల – ‘మట్టి సంపెంగ ‘గా మరో మెటఫర్ లా మెరిసి; బురదలో శ్రమ కావ్యమై నిలిచిపోవడాన్ని ‘ సెమట సుక్కల పరిమళమైతది’ అని మట్టికి మనిషికీ వున్న అనుబంధాన్ని తెలిపే వ్యవసాయిక మట్టి సోపతికి పట్టం గడుతడు కవి.
సాధారణంగా ఎండపనికి పోయినపుడు, అలసట తెల్వకుండ పని-పాటగా రూపుగడుతది. అది చేసే పనికి మరింత జోష్ ను, ఉత్సాహాన్ని అందిస్తది. ‘పనిపాటలు’ విడదీయరానంతగా కలగలిసి పోయి వుంటయి. కోమల – ‘పాటల పల్లకి’గా రూపాంతరం చెంది, మట్టి పెల్లల రాగమైతది. కోమల చేతిలోని ‘మొలక’ ‘పచ్చని పడసు పిల్ల’ అవతారమెత్తి బంకమన్ను ఎదలో సన్నని బొట్టయితది. నాట్లేసే పాటలున్నట్టే, కలుపు పాటలు సుత ఉంటయి. యిప్పుడు కోమల ఎండను చల్లని వెన్నెల కురిపించే సందమాను రాత్రిలా పాటలా ప్రవహిస్తది. కోమల మాటంటే మాటే! ఆమె నవ్వితే ‘పత్తి పువ్వు” యాదికొత్తది. ఆమె లేత పెదాలు చింత చిగుర్లతో పోటీపడుతయి. పగటాల్ల బువ్వకు తోడు కోమల రోట్లో నూరిన శెల్కతొక్కు (శెల్కలో నూరిన తొక్కు, అప్పటి కప్పుడు నూరినది) – ఎర్రని టమాటాలు, పచ్చని మిరపకాయల ప్రేమతో కలిసి కంచాల్లో కమ్మదనమై పర్సుకుంటది. సాయంత్రం దాకా పని జరిగిన, కొనసాగిన సూచనగా కోమల ‘ముద్దబంతి’ లా మారుతది. నింగికి దిద్దిన పోకరంగు తిలకమైతది.
*
“పనిలో పుట్టతేనె లెక్కుండడం’- పనిని ఇష్టపడుతూ చేయడం, వరిమళ్ళ జ్ఞాపకమై బతకడం – పనిని కలవరించడం, అందుకు కారణమైన ఒళ్ళు నొప్పుల గాయాలను నిందించడం, ప్రధానంగా ముగింపుకి ముందరి స్టాంజాలో కనిపిస్తది. కాల ప్రవాహం ఎవరి కోసమూ ఆగదు. స్థిరంగా వుండదు. ప్రకృతిలో మార్పులు వస్తయి. క్రమక్రమంగా ప్రకృతి మాయమవుతూ జనారణ్యాలు పెరుగుతూ వుండొచ్చు. వ్యవసాయం చేసే పరిస్థితులు మారొచ్చు. వయసు మీద పడుతున్న కొద్దీ కల్వపిల్ల కోమల మునుపటిలా ఉత్సాహంగా పని చేయకపోవచ్చు. ఇవన్నీ జిగ్మంట్ భౌమన్ ప్రతిపాదన (Liquid modernity) ‘ద్రవాధునికత’ ను సంతృప్తి పరచవచ్చు. కానీ ఆలోచనలు స్థిరత్వ భావన(solid state) చుట్టే జ్ఞాపకాల తేనెటీగలై తిరుగుతుండవచ్చు.
*
కవి ఇప్పటి వరకు మాట్లాడుతూ వచ్చిన ‘కల్వపిల్ల కోమల’ తనకు జన్మనిచ్చిన తల్లిగా చెప్పటంతో మనసు కుదేలయితది . ఇంత వరకూ తన కష్టం మీద సంసారాన్ని సవురిచ్చిన అమ్మకు ఆసరా అవ్వాల్సింది మేమే అని ప్రతిపాదించటం ముగింపు అయితది. జాగ్రత్తగా గమనిస్తే బంధాలు, అనుబంధాలు, భావోద్వేగాల నడును ‘స్త్రీ’కి ‘అంతర్గత బానిసత్వం’ అంటుగట్టడం అనే ప్రక్రియ అవిరళంగా కొనసాగుతూ వస్తుందనేది నిర్వివాదాంశం. ‘కల్వపిల్ల” అనే రూపకాన్ని ధరించి, ఉత్ప్రేరకపు జడిలో తడిసి ముద్దయి, నీరు గారిపోవడం వరకు కాయకష్టాన్ని, శ్రమను, నెత్తుటిని కుటుంబ పోషణ కొరకై ఆరుగాలం కష్టపడి తపించిన ఒక స్త్రీ, మాతృమూర్తి ‘కోమల’ అనే నామవాచకం తో తరించడం ఈ కవితలో సాక్షాత్కరించబడింది. ఈ సందర్భంలో జీతం కోరని, జీవింతం అర్పించే అమ్మలందరూ మన కండ్ల ముందు మెదులుతరు. వాళ్లందరికీ మేడే శుభాకాంక్షలు చెబుతూ ‘కల్వపిల్ల కోమల’ కవిత చదువుకుందాం. ఇప్పుడిప్పుడే కవిత్వాన్ని ఒంటపట్టించుకుంటున్న కవి ‘దాసరి శ్రీధర్’ ను ఒకసారి గుండెలకు గట్టిగా హత్తుకుందాం. కవిత్వ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందమని ఈ ఓరుగల్లు పిల్లగాన్ని మనసారా ఆశీర్వదిద్దాం.

*
కల్వపిల్ల కోమల…!!
~
తొలిపొద్దు వాకిలిని
పెండ్లి కూతురు చేసి,
గుమ్మం ముందు
పసుపు,కుంకుమల బాసింగమైతది
మా కల్వపిల్ల కోమల..!!
పందిరి గుంజకు పాకిన తీగలెక్క
ఇంటికి అల్లుకుపోయి,
ఇంటిల్లిపాది వసంతాన్ని
తానే పూయిస్తది..!!
పంట ప్రియుడు
చేనును కౌగలించుకోగానే
మట్టితో సోపతి చేసే
మా మట్టిసంపెంగ,బురదలో
సెమటసుక్కల పరిమళమైతది.!!
నాటేసేటప్పుడు
చేతిలోని పచ్చని పడుసుపిల్ల
బంకమన్ను ఎదలో సన్నని బొట్టైనప్పుడు,
మా పాటల పల్లకి
రేగడిలో మట్టిపెల్లల రాగమైతది.!!
కలుపు తీసేటప్పుడు
సందమామల పదాలను
సక్కని పాటగా కూర్చి
వెలుగుపూట,వెన్నెల గీతమై వినిపిస్తది.!!
మాట మాటకు
కమ్మని కావ్యమై,
మదిలో నిలిచే వాక్యమై,
పత్తి పూల నవ్వులను
చింతచిగుర్ల పెదాలపై వికసింపజేస్తది.!!
ఎర్రని టమాటాలు
పచ్చని కారానికి ప్రేమను కలిపి
రోట్లో నూరిన శెల్కతొక్కు
మధ్యాహ్నం కంచాల్లో కమ్మని బువ్వైతది.!!
మలిపొద్దు
కొండల నడుమ కొసకొమ్మ ఎక్కితే
మా ముద్దబంతి
నింగికి దిద్దిన పోకరంగు తిలకమైతది.!!
పనిలో పుట్ట తేనెలెక్కుండే
మా కల్వపిల్ల కోమలకు
పాడుకాలం చేసిన ఒళ్ళునొప్పుల గాయాలకి
పంటకు దూరమై, నేడు
వరిమళ్ళ జ్ఞాపకమై బతుకుతున్నది..!!
అందుకేనేమో…!
ఆమె పొట్టన పుట్టిన మాలోనే
ఇప్పుడు వరిగింజలను చూస్తున్నది
మా కల్వపిల్ల కోమల.
ఇక మెతుకవ్వాల్సింది మేమే…!!
*
Add comment