[ఎప్పుడో, చాన్నాళ్ల కిందట సారంగలో నా చదువు గురించి రెండు వ్యాసాలు రాశాను. అప్పట్లో ప్రతినెలా రాద్దామని ఉద్దేశ్యం ఉండింది. కానీ, సహజమైన సందేహాలు, ముఖ్యంగా నేను చెప్పేది ఎవరికైనా ఉపయోగకరం గా ఉంటుందా, కనీసం ఆలోచింప చేస్తుందా అనే సందేహాలతో, ఆగిపోయాను. ఆ సందేహాలు లేవని కాదు గానీ, వాటికి వాయిదా వేసి, ప్రతినెలా ఒక వ్యాసం చదువరి గా నా అనుభవాల గురించి రాద్దామని నిర్ణయానికి వచ్చాను. పుస్తకాల వలన జీవితం ప్రభావం అయిన ఒక తరం మనిషిని. నేను నేర్చుకునే ప్రతి విషయం సాహిత్య పరంగా అన్వయించుకునే అలవాటు ఉన్నవాడిని కాబట్టి, తోటి పాఠకులకు నా ఈ ప్రయాణం ఆలోచనా భరితంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ]
మొదటి వ్యాసంలో, నాకు సాహిత్యం కొత్త ప్రపంచాన్ని చూపించిందని రాశాను. మొన్న ఎవరికో సాహిత్యం ఏమిచ్చిందని చెబుతూ రాసాను: “నాకు చిన్నపుడు, చిన్న ప్రపంచంలో పుట్టి పెరిగిన నాకు, సాహిత్యం పెద్ద ప్రపంచం చూపించింది. పల్లెటూళ్ళు, పట్టణాలు, హిమాలయ పర్వత సానువులు, ఎడారులు, ఉప్పు దొరకని, మంచు కరగని దేశాలూ, కాకులు దూరని కారడవులూ — వీటిలో చదువుకుంటూ, పెరుగుతూ, ప్రేమిస్తూ, పిల్లల్ని కంటూ, డబ్బు సంపాదిస్తూ, ఉన్నదాన్ని చూసి మురిసి పోతూ, దేనికోసమో తపన పడుతూ,ఉద్యమాలు నడుపుతూ, చావు పుట్టుకలు మధ్య బ్రతుకుతూ ఉన్న విలక్షణమైన మనుషులు, ఆదర్శ జీవులు, మానసిక ప్రపంచ సంచారులు, అసాధారణం గా ప్రవర్తించిన సాధారణ మనుషులు, చదువుకున్న వారు, బడుగు జీవులు, కలలు కనే అందమైన అమ్మాయిలూ, పోకిరీ యువకులు, మానసిక, శారీరిక వృద్ధులూ — వీరిని నాకు పరిచయం చేసింది, దగ్గరగా చూపింది, అర్థమయేలా విడమర్చి చెప్పింది”.
రెండవ వ్యాసంలో, సాహిత్యం నాకంటూ ఉండే, నాది మాత్రమే అయిన ఒక అస్తిత్వాన్ని ఇచ్చిందని రాశాను. నేను చూసే నా తోటి వారి ఆశలు, కోరికలు, జీవితాలు నావి కావని తెలిసి వచ్చిందనీ, పల్లెటూళ్ళో ఉండే ప్రతి వారూ బలమో, పనితనమో, ఓపికో, నలుగురికి ఉపయోగపడటమో లాంటి వాటి మూలాన, తమ అస్తిత్వాన్ని, తమ ఉనికిని, తమ ఆత్మ గౌరవాన్ని సంపాదించు కుంటూ ఉంటుంటే, ఆలోచనలు, అవగాహన, ఊహలు — ఇటువంటి అభౌతిక నైరూప్య విశేషాల మూలాన నన్ను నేను నిర్వచించుకొనే ధైర్యాన్ని నాకు సాహిత్యం ఎలా ఇచ్చిందో చెప్పాను. ఏ విధంగా నాకు సాహిత్యం ఇచ్చిన మానసిక ప్రపంచం నా జీవితానికి నన్ను కథానాయకుడిగా చేసిందో చెప్పాను.
కాలక్రమేణా రాయకపోయినా, పాఠకుడిగా ఆ తరవాతి దశ చెబుతాను. పన్నెండవ ఏట నేను ఇల్లు విడిచి తాడికొండ స్కూల్ లో అడుగు పెట్టాను. తాడికొండ ఊరితో అంతకు ముందే పరిచయం ఉన్నా, ఆ బడి గురించి అసలు ఏమీ తెలియదు. కొండకి ఆవల, చెట్ల వెనుక దాగి, ప్రాచీన గురుకుల పద్ధతి లో, పిల్లలు, పంతుళ్ళూ కలిసి, తరగతి గదికీ, బయటకీ తేడా లేకుండా, అన్నివిధాలైన చదువుకి పాధాన్యం ఇచ్చిన ఈ బడి నన్ను మూడేళ్ళ పాటు సరిదిద్దింది.
ముఖ్యంగా అక్కడ విద్యార్థులు గురించి చెప్పుకోవాలి. అంతవరకూ మా ఊళ్ళో ఉన్న పిల్లల్లో నేనే చదువులో, పుస్తకాలు చదవడంలో మొదటి వాడిని. జిల్లాకి పదిహేను మంది చొప్పున, కోస్తా జిల్లాలనుంచి దాదాపు వందమంది ఉన్న మా తరగతిలో, అందరూ పల్లెటూరి వాళ్ళే, అందరూ తమ ప్రతిభా బలంతో వచ్చిన వారే. అంత వరకూ, నేను చదివే పుస్తకాల ద్వారా నన్ను నేను నిర్వచించుకున్న నాకు, నా లాంటి వాళ్ళు అనేకం కనబడ్డారు. టాయ్ స్టోరీ-2 లో బజ్ తనలాంటి బొమ్మలని అనేకం చూసి అస్తిత్వఆందోళన కి గురిచెందినట్లు నేనూ కొన్నాళ్ళు కలవరబడ్డాను.
కానీ, అంతకు ముందే నాకు కొంచెంగా అవగాహన అవుతున్న ఒక విషయం బలంగా తోచింది. ఒక ముఖ్య సాహిత్య ప్రయోజనం ఇతర మనుషులతో సంబంధాలు ఏర్పరచుకోవడం. అంతకు ముందు నాకు ఒకరో ఇద్దరో సాహిత్యాభిమానులు కనబడితే, ఇక్కడ అనేకం కనబడ్డారు. ఇక్కడ నా మానసిక ప్రపంచం నాకొక్కడికే పరిమితమైనది కాదు. నేను చదివిన, చదవని పుస్తకాలు చదివే వారు ఇంత మంది ఉన్నచోట, నాకు సాహిత్యం ఒక సంఘం ఇచ్చింది.
ఉత్తరోత్తరా నాకు జీవితంలో కనబడిందేమిటంటే, చదువు, చదువుతో కూడిన అనేక విద్యా వ్యాసంగాలు, ఈ కూటమి ఏర్పాడు కావటం కోసమే. ఎవరో సామాజిక శాస్త్రవేత్త ఇంగ్లాండ్ గురించి అన్నాడు — “ప్రపంచం పరిపాలించే సంబంధాలు ఈటన్ పాఠశాల లో ఏర్పడుతాయి” అని. అమెరికాలో ఫుట్ బాల్ ఆటలో ఏర్పడిన స్నేహ సంబంధాలు అనేక కంపెనీ లు మొదలవటానికి కారణమయ్యాయి. కాలిఫోర్నియా గుళ్ళలో ఏర్పడిన పరిచయాలతో కంపెనీ పెట్టిన వారిని ఎరుగుదును! సాహిత్యమే కాదు, సంగీతం, అనేక కళలు, చివరికి సిగిరెట్ తాగే పరిచయ సంబంధాలు మనుషులని దగ్గరగా తీసుకురావడం చూసాను. కాకపొతే, సాహిత్యం (ఇంకా కొన్ని రకమైన సామూహిక కార్యాల లాగానే) ద్వారా ఏర్పడే మానవ బంధాలు విశిష్టమైనది — ఆ విషయం తర్వాత చెబుతాను.
ఇంతకంటే, నాకు తాడికొండ కి వెళ్లడం మరికొన్ని లాభాలు కలిగించింది. ముఖ్యంగా, నాకు దొరికిన లైబ్రరీ. మా ఊళ్ళో దొరికే పుస్తకాలు తక్కువ. అందునా, డిటెక్టీవ్ నవలలు లాంటివి ఎక్కువ. రకరకాల పుస్తకాలు చదివే అవకాశం లేదు. ఇక్కడ తాడికొండలో, తరగతి పుస్తకాలు మాత్రమే కాకుండా, అనేక రకాల పుస్తకాలు దొరికేవి. ఇక్కడే నేను మొదటిగా పురాణ వైర గ్రంథ మాల చదివాను. చలం పుస్తకాలు (చిన్నపుడు బిడ్డల పెంపకం చదివాను కానీ, మిగిలిన పుస్తకాలు ఏమీ చదవలేదు) కొన్ని చదివాను. అడివి బాపిరాజు చదివాను. రావి శాస్తి, బీనాదేవి, ఇంకా అనేక మంది రచయితల పుస్తకాలు, చిల్లర మల్లర పుస్తకాలు కూడా చదివాను. లైబ్రరీ కి 200 అడుగుల లోపల ఉండే డార్మిటరీ లో ఉన్న పుణ్యాన, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి పుస్తకాలు తెచ్చుకొని చదివాను.
రెండవ విషయం ఏమిటంటే, అక్కడ చదువుకి ఇచ్చే ప్రాథాన్యం. ప్రతి తరగతిలోనూ పరీక్షల్లో ఫస్ట్ కొంత మంది ఉండేవారు. స్పోర్ట్స్ హీరోలు కొంత మంది ఉండేవారు. వీరందరికన్నా ముఖ్యంగా కళాకారులు అంటే కథలు, కవితలు, పద్యాలూ రాసేవారు, ఉపన్యాసాలు ఇచ్చేవారు, ఏ విషయాన్నైనా విశ్లేషించగలిగే ఆస్థాన మేథావులు ఉండేవారు. పూను స్పర్థలు విద్యలందే అన్నట్లు, వీరి పోటీలు చూడటం మాకు సంబరంగా ఉండేది. మాకు రెండేళ్ల సీనియర్ అయిన భద్రుడు, సోమయాజులు జుగల్బందీ లాగ, బ్లాక్ బోర్డు మీద ప్రతి రోజూ పద్యమో, కవితో రాయడం గుర్తుంది. భద్రుడు కార్తీకమో, మార్గశిరమో దేని గురించో మాట్లాడటం గుర్తుంది. సోమయాజులు “వాన కాలమొచ్చె వర్షమ్ము కనరాద” అని చెప్పడం గుర్తుంది.
వీటన్నిటి ప్రభావం ఏమిటంటే, ఉత్తమ సాహిత్యం అంటే ఏదో ఉంటుందని తెలిసివచ్చింది. అంతకు ముందు, అచ్చయిన ప్రతి వాక్యం చదివే వాడిని. పంచాంగం వెనక ఉండే కథల దగ్గర నుంచీ, యద్దనపూడి నవలల వరకూ, స్త్రీల వ్రత కథల దగ్గరనుంచి, బెంగాలీసాహిత్యం వరకు, దొరికితే విచక్షణారహితంగా చదివే నాకు, కొన్ని పుస్తకాలు మిగిలిన పుస్తకాల కంటే మంచివి అని అనిపించింది. అయితే, చదివించే లక్షణమే కాదు, వినోదమే కాదు, విజ్ఞానమే కాదు, ఆలోచింప చేసే పాత్రలే కాదు — వీటన్నింటికన్నా, మిగిలిన పాఠకులు వేసే ముద్ర దీనికి ముఖ్యం అని తెలిసి వచ్చింది.
ఈ పాఠకులతో పరిచయాలు, సంబంధాలు పెరిగేటప్పటికి, సాహిత్యం అంటే పది మందీ ఏమంటారో అదే సాహిత్యం (లేదా ఉత్తమ సాహిత్యం) అనే భావం పెరిగింది. నిజానికి నాకు యద్దనపూడి నవలలు, బాపిరాజు నవలలకీ పెద్ద తేడా తెలియలేదు. కానీ, అందరూ బాపిరాజు గారి నవలలు మంచి సాహిత్యం అంటే కాబోసు అనుకున్నాను. ఒక సంఘానికి చెందటం అంటే అదే కాబోలు! నిజానికి నాకు ఈ సంఘ స్పృహ సంగీతంలో ఎక్కువ కనిపిస్తుంది. విమర్శ, సమీక్ష, విశ్లేషణ, సంభాషణ — ఇటువంటి అనేక ప్రక్రియల ద్వారా, మిగిలిన పాఠకులు నేను ఏ పుస్తకాలు గౌరవించాలో చెప్పారు.
ఇది నేను ప్రతికూలంగా అనడం లేదు. నాకు అప్పుడు కేవలం అస్పష్టంగా తెలిసింది, తర్వాత నిర్దుష్టంగా తెలిసింది ఏమిటంటే, ఏ కళయినా, మనకి ఒక సామాజిక స్పృహ కలిగిస్తుంది. శారీరిక అనుభవాలు మన బయాలజీ నిర్దేశిస్తే, మానసిక అనుభవాలు అనేకం మనం మిగిలిన వారి నుంచి నేర్చుకుంటాము. ఉదాహరణకి, బెంగాలీ నవలల్లో స్త్రీ పురుష సంబంధాలు ఎంత అసహజంగా ఉన్నప్పటికీ, అవి సాధారణంగా భావిస్తాము. ఏది సాధారణం అనేది అందరూ అనేది. అదే అంటారు లాటిన్ లో ప్రజా వాక్యమే దైవ వాక్యం అని. అందుకని పుస్తకాల్లో ఉత్తమ సాహిత్యం అనే ముద్ర, అందరికీ అర్థమయే ఒక భాషని ఇస్తుంది. మిగిలిన వారితో మాట్లాడటానికి అందరికీ అర్థమయే అనుభవాలు, జ్ఞాపకాలు ఇస్తుంది. అదే కథలు చేసే పని.
తాడికొండ లైబ్రరీ, తోటి మిత్రుల పుణ్యమా అని, ఉత్తమ సాహిత్యం తో బాటు, కొన్ని విభిన్నమైన రచనలు తెలిసి వచ్చాయి. చిన్నపుడు పద్యాలు చదువుకున్నాను కానీ, కవితలేమీ చదువుకోలేదు. నాటకాల్లో ఉండే పద్యాలు కాకుండా, మిగిలిన పద్యాల్లో ఏమీ మాధుర్యం తెలియలేదు. అటువంటిది బడిలో తరగతి గది లో నేర్చుకునే పద్యాలు కాకుండా, రక రకాల పుస్తకాలు చదివాను. దానికి కారణం ఒకటున్నది.
ఆ రోజుల్లో మా బడికి ప్రతి పిల్లవాడి ఖర్చు కు రోజుకు 3 రూపాయిలు ఇచ్చేవారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వ నాయకులు వచ్చి ఎంత పెంచాలో, ఏం అవసరాలున్నాయో చూసి వెళ్లేవారు. ఆ సంవత్సరం వాళ్ళు మా తరగతి గది కి వచ్చారు. ఏం ప్రశ్నలడుగుతారో అని మేం ఉగ్గబట్టుకు నిలుచుంటే, వాళ్ళు “ఒక పద్యం చెప్పండి ఎవరన్నా” అని అడిగారు. ఇంత చిన్న ప్రశ్న అని సందేహం కొద్దీ, ముందుకడుగు వేస్తే బడాయి అనుకుంటారని మొహమాటం కొద్దీ, జంకు కొద్దీ, బిడియం కొద్దీ మేము ఎవరూ చెప్పలేదు. చివరికి ప్రసాద రావు అనే మిత్రుడు ముందుకు వచ్చి పుష్పవిలాపం లోని ఒక పద్యం చెప్పడానికి గంభీరంగా మొదలు పెట్టి, తడబాటులో ఒక పాదం ఎగరగొట్టాడు. మా తెలుగు పంతులు గారికి తల కొట్టేసినట్లయింది. ఒక రెండు నెలల దాకా మాకు పద్యాలు నేర్పారు. మాకు ఎంత మంచి పద్యాలు చెప్పగలమో పోటీ పెరిగిపోయింది.
ఆ ఉత్సాహంలో నేను విజయ విలాసం, తాపీ ధర్మారావు గారు రాసిన వాఖ్యతో చదివాను. నాకు ఆయన ప్రతి పద్యంలో ఉండే చమత్కృతి చెప్పటం బాగా నచ్చింది. అలాగే, పారిజాతాపహరణం మొదటి నుంచి చివరి దాకా, అందులో ఉండే బంధ కవిత్వం, చిత్ర కవిత్వం, గద్యం అన్నీ చదువుకున్నాను. సత్యభామ లాంటి పాత్ర నాకు అసమానంగా తోచింది ఆ రోజుల్లో. స్వతహాగా బలం లేనిది. రాజు గారి భార్య కాబట్టి ఆవిడకి అంత గౌరవం. అటువంటప్పుడు ఆవిడకి ఎంతకోపం, ఆ కోపం ఎంత చేతకాని తనం మీద అసహనంగా మారడం, చివరికి రాజు (కృష్ణుడు) తల తన్నడం (శిరమచ్చో వామపాదమునన్ తొలగన్ ద్రోచె లతాంగి) — ఇవన్నీ నాకు ఈ పద్యాల్లో కూడా కథ ఉంటుందని చూపించాయి. ఇంకా కొంచెం మనుచరిత్ర, వసు చరిత్ర చదువుకున్నాను. కాళిదాసు పుస్తకాలు కొన్ని నాకు నెక్కల్లు వెళ్ళినపుడు శివశంకర్ లైబ్రరీలో దొరికితే, మేఘ సందేశం చదువుకున్నాను.
ఇంతకు మించి, భాష అనేది సాహిత్యానికి విడిగా ఉంటుందని తెలుసుకున్నాను. రకరకాల శబ్దాలంకారాలతో ఉన్న పద్యాలు చదువుకున్నాను ఈ ప్రబంధాల పుణ్యమా అని. అనులోమ విలోమ కందం, ద్వ్యక్షరి కందం, ద్వంద పద్యాలు (రాఘవ పాండవీయం నుంచి), ముక్త పదగ్రస్తము — ఇటువంటివి అనేకం చదువుకున్నాను. ఆరోజుల్లోనే నాకు ఇది కవిత్వం కన్నా పదాల గారడీ లాగ చూడవచ్చు అని తెలిసింది. అయితే, నాకు సాహిత్యం అన్నా, ఈ గారడీ అన్నా ఒకటే గౌరవం. అందరూ ఈ పదాల కర్రసాము మెచ్చుకొనే వారు. నిజానికి, అప్పట్లో అర్థబ్రహ్మం కన్నా శబ్ద బ్రహ్మమే ముఖ్యం!! దానికి మించి భాషలోని సొగసులు, భాషకి భావం మీద ఉండే పట్టు, ఇవన్నీ తర్వాత తెలిసి వచ్చింది. నేను లింగ్విస్టిక్స్ రెండు సెమెస్టర్లు టీచింగ్ అసిస్టెంట్ గా గడిపినప్పుడు, భాష-భావం మధ్యన ఉండే సంబంధాల గురించి నేర్చుకున్నాను.
ఇక వచ్చే నెల కవిత్వం ఎలా రాయడం మొదలు పెట్టాను, కథలు ఎలా రాశాను, ఎందుకు ఉత్తమ సాహిత్యం లో కొన్ని నచ్చడం మానేశాయి — ఈ విషయాలు సాహిత్య ప్రయాణంలో తాడికొండలో మిగిలిన అనుభవాలు రాస్తాను.
*
వెనక్కి స్వాగతం. రాస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో లేదో చూడాల్సిందే. 🙂
… విచక్షణారహితంగా చదివే నాకు, కొన్ని పుస్తకాలు మిగిలిన పుస్తకాల కంటే మంచివి
True. One ought to know what to read instead of running after every printed word. I learnt it sooner than later! 🙂
Let me see how you would keep up your promise to continue on this subject! 🙂
రామారావు కన్నెగంటి గారూ మీకు నెక్కల్లు ఎలా తెలుసు ?
మా అమ్మ పుట్టిల్లు నెక్కల్లు. గుడి ఎదుటి ఇంట్లో ఉండేవాళ్ళు. గుడి వెనకే, ఒక బావి ఉండేది. గుడిలో సిమెంట్ మీద పులిజూదం ఆట ఆదుకునే వాళ్ళం.
ఓ!! మీ తాతగారి వూరన్నమాట!!నాక్కూడా మా తాతగారి వూరే…మా నాన్నగారి నాన్నగారిది:)))