పదనిసలు

“మీరిద్దరూ ఇంకా విడిపోవాలనే అనుకుంటున్నారా?” సైకాలజిస్ట్ యోగేష్ ప్రశ్నించాడు, తెలుగును వత్తులు లేకుండ పలుకుతూ. లండన్ లో స్థిరపడిన రెండో తరం తెలుగువాడు అతను. రష్మి తల నిలువుగా ఊపుతూ యస్ అంది. నేను నా పెదాలను అడ్డంగా సాగతీసా.

కుడిపక్కనున్న కిటికీ లో నుండి చూస్తే, రంగులు మారిన ఆకులు ఒకొక్కటిగా  రాలుతున్నాయి. దూరం నుండి ప్రకృతి పరిచిన తివాచి అందంగా కనిపిస్తూ.

“ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, మీకు పెళ్ళి అయ్యి టూ ఇయర్స్ కదా?” కంప్యూటర్ లో చూస్తూ అన్నాడు యోగేష్.

“టూ ఇయర్స్ త్రీ మంత్స్” లెక్క సరిచేసా. మా పెళ్ళి రోజు నాకు బాగా గుర్తు, మూడు ముడులు సరిగ్గా వేయలేకపోయా. రష్మీ జడ మందంగా ఉండేసరికి నా వేళ్ళు నాకే సరిగ్గా కనిపించలేదు.

“ప్రణయ్, మీ ఫైనల్ సెషన్ ఒక నెల తరువాత బుక్ చేస్తా” తన ముందున్న కీబోర్డ్ ను దగ్గరకు లాక్కుంటూ అన్నాడు యోగేష్.

“వచ్చే వారం రోహిత్ లండన్ వస్తున్నాడు. ఈ లోపులో ఆ ఫైనల్ సెషన్ ఉంటే బెటర్” నిట్టూర్చింది రష్మీ.

“రోహిత్..?”

“మై… ఫ్రెండ్.” రష్మీ సమాధానమిచ్చింది.

“ఆ.. ఓకే. వీలుంటే రోహిత్ ను కూడా తీసుకురండి కౌన్సిలింగ్ కు. ఎక్స్ ట్రా ఫీజు తీసుకోను” తన నల్ల కళ్ళజోడును తెల్లని టేబుల్ మీద పెడుతూ అన్నాడు.

రష్మీ కి  ఉక్రోషం వచ్చేలోపు థాంక్స్ చెప్పి బయటపడ్డాం. కారిడార్ లో ఒకామె కాలు మీద కాలు వేసుకుని మ్యాగజైన్ తిరగేస్తోంది. ఆమె-అతను రెండు కుర్చీలు మధ్యలో వదిలి అటు మొహంతిప్పి కూర్చున్నాడు. రిసెప్షనిస్ట్ ఎర్ర లిప్ స్టిక్ అంటిన పళ్ళు బయటపెట్టి ‘సీ యు ఎగైన్’ అంది.

కార్ దగ్గరికి వెళ్ళడానికి ఆరుసార్లు ఏడడుగులు వేశాం, విడివిడిగా. చలికి ఎండ దాక్కుంది, ఎక్కడో వెలుతురు. ఇక్కడ నల్లటి మేఘాలు.

“ప్రణయ్.. నేను ఇండియా వెళ్దామనుకుంటున్నా.”

సీట్ లో కూర్చుని బెల్ట్ పెట్టుకుంటూ, “మార్పు కోసమా..?”

“ఇక్కడ బాగలేదనిపిస్తోంది. హైదరాబాద్ కు వెళ్ళి.. మళ్ళీ మొదలుపెట్టాలి.”

హీటింగ్ ఆన్ చేసి కూర్చున్నాం, బరువెక్కిన ఆలోచనలతో.

రష్మీ కి యస్ పి బాలు గాత్రం వినడం ఇష్టం. కొన్నిసార్లు మైమరచి పోతుంది. బ్లూ టూత్ ద్వారా కార్ లో పాటలు పెట్టింది. కార్ ముందుకు, నా ఆలోచనలు వెనక్కి వెళ్తున్నాయ్.

*

ఆరు నెలల క్రితం ముచ్చట.

ఎండాకాలం, శనివారం. ఉదయం తొమ్మిదింటికే మా బెడ్రూమ్ కిటికిలో నుండి సూర్యుడు తొంగి చూస్తున్నాడు. పొద్దునపూట ఎక్కువసేపు పడుకోవచ్చనుకుంటే, కింద నుండి మాటలు వినిపించాయి. పక్కన రష్మీ లేదు, వాళ్ళ నాన్నతో మాట్లాడుతోందేమో అనుకుని మళ్ళీ నిద్రపోవడానికి పక్కకు తిరిగా. అక్కడ హైదరాబాద్ లో వాళ్ళకు ఏమైనా జరిగుంటే!? ఆ ఆలోచన నన్ను హాల్ వరకు లాక్కెళ్ళింది. రష్మీ కర్టెన్స్ తీయకుండ సోఫా లో కూర్చొని ఉంది.

ఫోన్ లో మాటలు వింటూ తల ఊపుతోంది. కళ్ళల్లో నీళ్ళు. బయటకు వచ్చేంత లేకపోయినా లోపలికి ఇంకిపోనివి, ఏమైందన్నట్టు తల ఎగరేసా. లేచి, ఊ కొడుతూ కిచెన్ లోకి వెళ్ళింది. కాఫీ తాగుదామని నేను కూడా కిచెన్ లోకి వెళ్ళి కెటిల్ ఆన్ చేశా. ఈసారి ఊ.. ని సాగదీస్తూ హాల్ లోకి పొయ్యింది.

ఎదురింటి యూరోపీయన్, నోరు తిరగని పేరు, వాళ్ళ ఇంటి ముందు జాగింగ్ చేయటానికని స్ట్రెచ్ చేస్తూ, నన్ను చూసి హాయ్ అని అరచేయి గాల్లో ఊపింది. ప్రతిగా సెల్యూట్ చేశా ఆమె ధ్యాస కు. ఈ ఎండకు ఆమె కంది పోవడం ఖాయం. ఎండ లేనప్పుడు కావాలి అని, ఉన్నప్పుడు ఎక్కువ ఉందని కంప్లైంట్ చేయడం ఇక్కడి జనాల అలవాటు, నాతో సహా.

కెటిల్ టప్ మని శబ్దం చేసింది. మా ఇద్దరికి బ్లాక్ కాఫీ కలిపి హాల్ లోకి వెళ్ళా.

“అంతా ఓకే నా?” కాఫీ కప్పు ఇస్తూ అడిగా. కప్పు ముక్కు దగ్గర పెట్టుకుని వాసన గట్టిగా పీల్చి “రోహిత్, మానస విడిపోతున్నారు” అన్నది.

“మూడు సంవత్సరాలు దాటాయా, వాళ్ళ పెళ్ళి అయ్యి?” జవాబు లేదు.

“డాక్టర్లిద్దరికీ  కాపురానికి సమయం సరిపోవడం లేదా?” సిప్ చేశాక అన్నా. నేను బ్యాడ్ జోక్ వేసానని రష్మీ మొహం చెప్పింది.

“పాపం రోహిత్” గోడ వైపు చూస్తూ అంది.

“రెండో వైపు ఏం జరిగిందో మనకు తెలియదు”

“రోహిత్ దే తప్పు అంటావా?”రష్మీ చూపు గుచ్చుకుంది నాకు.

“ఉద్వేగంతో ఆలోచించకు!”

“రోహిత్ గురించి నీకు తెలియదా?”

“పరిస్థితులను బట్టి మనం మారుతుంటాం. ఎప్పుడు ఒకేలా ఉండగలుగుతామా?” రష్మీ వైపు తిరిగి అన్నా.

“హైదరాబాద్ లో ఉన్నప్పుడు రోహిత్ నన్ను ఇష్టపడ్డాడని నీకింకా కోపం ఉందా?”

“ఇష్టం వేరు. నిబద్దత లేదు”

“ఇప్పుడేమంటావ్?” రష్మీ కళ్ళు ఎరుపెక్కడానికి తయారుగా ఉన్నాయ్.

“ఇక్కడ లండన్ లో కూర్చుని అక్కడ హైదరాబాద్ లోని వాళ్ళ జీవితం మీద జడ్జిమెంట్ ఇవ్వలేం”.

తను తాగిన కప్పు మాత్రమే తీసుకుని అడుగులు పెద్దగా వేసుకుంటూ అక్కడినుండి వెళ్ళింది.

నేను, రష్మీ డిగ్రీ ఆఖరి సంవత్సరం లో ఉన్నప్పుడు రోహిత్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. జూనియర్ డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూనే మాకు ఫిజియోథెరపీ లో పాఠాలు చెప్పేవాడు. మా చదువులు అయ్యాక, తను పనిచేసే హాస్పిటల్ లోనే ఉద్యోగాలు ఇప్పించాడు. మా ముగ్గురి మధ్య స్నేహం పెరిగింది, నలుగురిలో రోహిత్ ని పేరు పెట్టి పిలిచే అంత. మా ఇద్దరి కన్నా నాలుగైదు ఏళ్ళు పెద్ద అవ్వొచ్చు.

అప్పట్లో రష్మీ కి అతనితో కేవలం స్నేహం కాదు, రోహిత్ అంటే ఇష్టం కూడా. కానీ రోహిత్ అమ్మకు రష్మీ నచ్చలేదు. రోహిత్ కొన్ని రోజులు బెట్టు చేసాడు. చివరికి తన తల్లి ఒత్తిడి కి లోనై మానస ను పెళ్ళి చేసుకున్నాడు. ఆ పెళ్ళి లో లుకలుకలు.

తాగేసిన కప్పు లో కాఫీ కోసం వెతుకులాట తో ప్రస్తుతం లోకి వచ్చా. కిచెన్ డోర్ దగ్గరకు వెళ్ళి నిలబడ్డా.

“టిఫిన్ పరిస్థితి ఏంటి?”

“నాకు మూడ్ లేదు!”

“లాంగ్ వాక్ కు వెళ్దామా?”

“నేను కొద్దిసేపు పడుకుంటా ప్రణయ్” నా వైపు చూడకుండానే మెట్లు ఎక్కుతూ పైకెళ్ళింది.

హాల్ లోకి వచ్చి రిమోట్ కోసం వెతికి టీవీ ఆన్ చేసా. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ లో “తో లుట్ గయే.. హమ్ తె్రీ మొహబ్బత్ మే” పాట వస్తున్నది. ఐశ్వర్య రాయ్ చున్నీ కు నిప్పు అంటుకుంటే నాకు ఎక్కడో కాలింది. వాట్ ఎ మెలోడ్రామా అనుకుని షూస్ వేసుకుని జాగింగ్ కు వెళ్ళిపోయా.

*

మూడు నెలలకు ముందు.

“ఈ మధ్య ములాకాత్ లేదు?” అని తన కుడి చెయ్యిని నా ఎడం చేతిలో బంధించి అడిగా రష్మీ ని.

“బిజీ..” అని తన చెయ్యి లాక్కుంది. షాపింగ్ మాల్ లో జనాలు తక్కువగానే ఉన్నారు. వీకెండ్స్ లో పొద్దున్నే వస్తే ఇదే లాభం, లేకపోతే భుజాలు రాసుకుంటూ అడుగులో అడుగులు వెయ్యాలి లెక్కపెట్టుకుంటున్నట్టు.

“ఆల్ ఓకే నా?” రష్మీ ని చూస్తూ అడిగా.

“ఈ మధ్య కళ్ళు తిరుగుతున్నాయ్. ఆకలి బాగా వేస్తున్నది” అన్నది

“జాబ్ స్ట్రెస్?” అడిగా.

పెదవి విరిచింది. మా అడుగులు భారంగా పడుతున్నాయ్.

“హాట్ చాక్లెట్ డ్రింక్?” కాఫీ షాప్ కనిపించగానే అడిగా. రష్మీ సరేనంది. డ్రింక్స్ తీసుకుని, విండో పక్కన హై ఛైర్స్ లో కూర్చున్నాం. ఈ చలికి వేడిగా ఉన్నది ఏదైనా అమృతమే. అరచేతుల మధ్య కాఫీ కప్పు ను బంధీ చేశా.

“ప్రణయ్ నేను…ఇండియా కు వెళ్ళిపోదామనుకుంటున్నా”.

నాలో సన్నటి భయం “అత్తా మామ లకు బాలేదా?”.

తన డ్రింక్ సిప్ చేసి “వాసన అదోలా ఉంది.” అని కప్పు పక్కకు పెట్టింది. ముక్కును రెండు సార్లు చూపుడు వేలుతో అటు ఇటు రుద్ది, ఊపిరి వదిలింది. “నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు”.

నేను విండో అవతల మనుషులను గమనించా, వాళ్ళ ప్రపంచం ఆగకుండా ఉరుకుతూనే ఉంది.

“రోహిత్ కు నా అవసరం ఉంది” అన్నది రష్మీ.

“వాపస్ ఎప్పుడు?”

“చెప్పాగా.. చెప్పలేనని” తన చేతి గోళ్ళు చూసుకుంటూ అంది.

“విడిపోదాం అంటున్నావా?” మౌనం వహించింది రష్మీ .. కాలం తో పాటు.

వెళ్దామని లేచా. నా చెయ్యి పట్టుకుని “నువ్వేమంటావ్” అంది.

“నువ్వు నిర్ణయం తీసేసుకున్నావ్” నా ప్రమేయం ఎక్కువ లేదనిపించింది.

నిమిషం తరువాత షాపింగ్ బాగ్స్ తీసుకుని ఇంకో షాప్ లోకి వెళ్ళాం ఇద్దరం. బిల్లింగ్ కౌంటర్ క్యూ లో నించుంటే, నన్ను మళ్ళీ అడిగింది నా అభిప్రాయం గురించి. కౌన్సిలింగ్ కి వెళదామని చెప్పా, మొదటేం మాట్లాడలేదు. ఇంటికొచ్చాక సరేనంది.

కొన్ని రోజుల తరువాత, మొదటి కౌన్సిలింగ్ సెషన్ కు వెళ్ళా, వెళ్లాల్సివచ్చింది. ఆ రోజున రష్మీ కూడా రావాల్సి ఉంది, లాస్ట్ మినిట్ లో రానన్నదీ. నేను బలవంతం చెయ్యలేదు.

సైకాలజిస్ట్ యోగేష్ నా వివరాలు అడిగాక “మీరొక్కరే వచ్చారు, మీ వైఫ్ బయట ఉందా?” అని అడిగాడు. “సారీ, తనూ.. షీ కాన్ట్ మేక్ ఇట్” ఇబ్బంది పడుతూ చెప్పా.

“ఓకే , మీ ఒక్కరితో మొదలెడదాం. ఈ కుర్చీలో కూర్చుని రిలాక్స్ అవ్వండి” అన్నాడు. రూమ్ చిన్న గా, కుర్చీ సౌకర్యంగా ఉంది. యోగేష్ తన లాప్ టాప్ లో బుద్దుని మంత్ర జపం పెట్టాడు.

“ప్రణయ్, నా ప్రశ్నలకు మీరు సమాధానం దాచకుండా చెప్పాలి”.

“ష్యుర్” ఏమి అడుగుతాడో అనుకుంటూ అన్నాను.

“మీకు జాబ్ స్ట్రెస్ ఎక్కువగా ఉందా?”

“నా జాబ్ ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు సమస్యే లేదు” నిజమే చెప్పా.

“ఈ మధ్య మీకు బాగా దగ్గర అయిన వాళ్ళు ఎవరైనా చనిపోయారా?”

“లేదు” నాకు తెలిసినంత వరకు.

“మనం డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు ఇంకొక ప్రశ్న. బీ హానెస్ట్. మీ సెక్సువల్ లైఫ్ ఏలా ఉంది?” సూటిగా అడిగాడు.

“యూజువల్ గా మంత్లీ రెండుసార్లు.” అన్నాను.

“మీ మధ్య మనస్పర్థలు ఎప్పుడు మొదలయ్యాయి, మీకు గుర్తున్న ఒక సంఘటన చెప్పండి”.

గుర్తు తెచ్చుకోవడం కోసం కళ్ళు మూసుకున్న. ఏవో సగం సగం వస్తున్నాయ్. రిలాక్స్ అవ్వమని చెప్పాడు సైకాలజిస్ట్. గోడ గడియారం ముల్లు శబ్దం వినసొంపుగా ఉంది. కొద్దిసేపు తరువాత చెప్పడం మొదలుపెట్టా.

పావుగంట ఆగాక గాలి గట్టిగా వదులుతూ కళ్ళు తెరిచా. టేబుల్ మీద ఉన్న నీళ్ళు తాగా, హాయిగా ఉంది.

“మీకు చెమటలు పట్టాయి, టిష్యూస్ అక్కడ ఉన్నాయ్” అని చెయ్యి చూపించాడు యోగేష్.

“బయట ఎండ విపరీతంగా ఉంది” అన్నాను, చెమట తుడుచుకుంటూ.

“ఈసారి రష్మీ ని కూడా తీసుకురండి” అని నెక్స్ట్ సెషన్ డేట్ చెప్పాడు యోగేష్. థాంక్స్ చెప్పి బయటపడ్డా. మనసు తేలికగా ఉంది, అడుగులు గాలిలో వేస్తున్నట్టు ఉంది.

*

జ్ఞాపకాల్లో నుండి బయటపడ్డా, కుక్కర్ స్.. స్ మంటూ విజిలేసింది. మంట బంద్ చేసి కుక్కర్ ని డైనింగ్ టేబుల్ మీద పెట్టా. ఫ్రిజ్ లో ఉన్న నిన్నటి రసం తీసా. రష్మీ కిందకు దిగుతున్నట్టు తన పెర్ఫ్యూమ్ చెప్తోంది.

“చిత్రా కు పుట్టింది కూతురా, కొడుకా?” ప్లేట్స్ టేబుల్ మీద పెడుతూ అడిగింది. “కూతురే. అర్జున్ ఫోటో పంపించాడు” అని నా ఫోన్ కోసం చూశా. “కోట్ జేబు లో ఉందనుకుంటా”.

“చూసొద్దామా?” అంది.

“ఇప్పుడు వెళ్దామా?”

“తిన్నాకా పోదాం”

“కిచిడి ఎక్కువే చేశా” కుక్కర్ మూత తీసి చూపించా “వాళ్ళక్కూడా సరిపోతది”. రష్మీ పెద్ద కంటైనర్ తీసుకొచ్చింది “నేను దీంట్లో కి మారుస్తా. బాగా వండావ్, అన్నీ సరిపోయాయి.”రుచి చూసి అంది. ఆమె కళ్ళల్లో చిన్న వెలుగు.

“నువ్వు స్నానం చేసి రా” అంది.

షవర్ కింద నించోగానే నాకు ఆలోచనలు వరదలా చుట్టుముట్టాయి.

రోహిత్ ఎందుకు నా ఫోన్ కాల్స్ ఎత్తడం లేదు?

నేను రష్మీ ని వెళ్ళొద్దు అనుండాల్సిందా?

పెళ్ళైన రెండేళ్లకే మా ప్రేమ పాతగైపోయిందా?

బుర్ర తో పాటు నీళ్ళు కూడా వేడిగా పొగలు కక్కుతున్నాయ్. తయారై అర్జున్ ఇంటికి బయల్దేరాం.

*

“రెండు మైళ్ళు దాటి రావడానికి ఇన్ని రోజులు పట్టిందా?”అర్జున్ తన కూతురు అన్వి ని ఇస్తూ అన్నాడు.

“నీకు తెలియని కథ కాదుగా” మోచేతులు రెండూ పొట్ట కు ఆనించి జాగ్రత్తగా పట్టుకున్నా. అన్వి చిన్నగా, అమాయకంగా ఉంది. నా వంక విచిత్రం గా చూస్తున్నది. సన్నటి ఈల వేస్తే చేతులు, కాళ్ళు ఆడించింది లయబద్ధంగా.

చిత్ర, రష్మీ వచ్చి పక్క సోఫాలో కూర్చున్నారు. “ఇది పుట్టి అప్పుడే నెల అయ్యిందా?” ఈల ఆపి అడిగా. “మనుషుల తో పాటు, నెలలు కుడా మర్చిపోతున్నారా మీరిద్దరూ? ” చిత్ర చురక అంటించింది.

“నేను తెచ్చిన కవర్ లో కిచిడి ఉంది. ఆకలేస్తోంది, తిందామా?” అన్వి ని అర్జున్ కు ఇస్తూ అన్నా. “అచ్చా. మాడు వాసన వచ్చిందంటే, నువ్వే వండావా?” అర్జున్ నవ్వుతూ అన్నాడు.

“నువ్వు ప్రణయ్ వంటకే వంక పెడుతున్నావా? గురువారం నాడు నువ్వు చేసిన టమాటో పప్పు సంగతి చెప్పనా?” చిత్ర కన్ను గీటుతూ అంది.

రష్మీ కంటైనర్ కోసం వెళ్ళింది. “మాఫ్ కరో..” అర్జున్ రెండు చేతులు ఎత్తాడు. చిత్ర ఇప్పుడే వస్తానని రష్మీ వెనకాలే వెళ్ళింది.

“బ్రో, ఇప్పుడు చెప్పు నీ వీర గాధ” అర్జున్, అన్వి ని సోఫాలో పడుకో బెట్టి, కింద పడకుండా దిండు అడ్డం పెట్టాడు.

“రష్మీ గంధరగోళం లో ఉంది, నేను చెప్తే వినే పరిస్థితి లేదు”.

“నువ్వు ప్రేమ సరిగ్గా ఇవ్వడంలేదేమో. రోహిత్ ఇస్తానని వాదా చేశాడంటావా?” అర్జున్ అనుమానం వ్యక్తం చేసాడు.

“ఐడెంటిటీ క్రైసిస్, లేదా ఈగో సాటిస్ఫై అవుతున్నది ఇక్కడ” రష్మీ గురించి తెలిసే అన్నా.

“ఎలా?”

“మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు, రోహిత్ రష్మీ ని ప్రేమించాడు. రోహిత్ వాళ్ళ అమ్మ పెళ్ళికి ఒప్పుకోలేదు”.

“ఒక్క నిమిషం బ్రో. రష్మీ కూడా రోహిత్ ని ప్రేమించిందా?” అర్జున్ స్టూడెంట్ లా అడిగాడు.

“కావొచ్చు. ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రేమ కథలు కామన్. ఇంకా..

రోహిత్ తన మాటే వింటాడనుకుంటుంది.”

“ఇందాక ఈగో అన్నావ్?” తన కూతురు నిద్ర లేచిందేమోనని చూసాడు అర్జున్.

“పెద్ద కథ. వింటావా?” అన్నానేను.

“అన్వి లేచేంత వరకు మనకు సమయం ఉంది” అర్జున్ ఓరగా నవ్వాడు.

“రష్మీ మాటకు నో చెప్తే అవమానం అనుకుంటుంది. ఒకప్పుడు రోహిత్ తనను వద్దు అనుకుని, వాళ్ళ అమ్మ కు ఇష్టమైన మానసను పెళ్ళి చేసుకున్నాడు. ఆ జంట మధ్య గొడవలు. ఇప్పుడు పడట్లేదు”.

“అయితే?” అర్జున్ నన్ను వదిలేలా లేడు.

“రష్మీ అప్పుడు మా పెళ్ళికి ముందనుకున్నది కరెక్ట్ అని, రోహిత్ మానస వాళ్ళ గొడవలే సాక్ష్యం అని నమ్మింది.”

“తను వెళ్ళిపోతే, నీ పరిస్థితి ఏంటి అని రష్మీ ఆలోచించలేదా?” అర్జున్ తన అనుమానం వ్యక్తం చేసాడు.

నా దగ్గర సమాధానం లేదు. విడిపోవడానికి, కలవడానికి ప్రమాణాలు పరిధులు పెద్దగా ఉండటంలేదు. కాలం తో పాటు కారణాలు మారుతున్నాయ్. గట్టిగా ఆలోచిస్తే, రష్మీ నిర్ణయంలో  తప్పోప్పులకంటే తన నిజాయితీ నచ్చింది. ఏదైనా నాతో చెప్పే చేస్తున్నది.

“వివాహం అంటే బాధ్యత అని రష్మీకి తెలియదా?” అర్జున్ పోలీస్ లాగా అడిగాడు.

“బాధ్యత అర్ధాలు మారాయి అర్జున్”

అర్జున్ ఆలోచనలో పడ్డాడు. “కౌన్సిలింగ్ వల్ల ఉపయోగం ఉందా?”

“గాడ్ నోస్”

“నీ గురించి చెప్పు బ్రో?” నా గురించి తెలియదన్నట్టు అడిగాడు.

“ఏం కావాలి?”

“ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తోంది?” కొంచెం స్నేహితుడిలా అడిగాడు ఈసారి.

“రష్మీ గురించి నాకు బాగా తెలుసు. తను జీవితాంతం రోహిత్ తో ఉంటానంటే నాకు అభ్యంతరం లేదు. కానీ…”

“కానీ?” అడిగాడు అర్జున్.

“ఇక్కడ ఉండలేక, అక్కడ ఇమడలేక ఏమైపోతుందో అని నా భయం”.

“రష్మీ వెళ్ళిపోతే నువ్వు భాధపడవా?”

“పడతా. శాశ్వతంగా అయితే కాదు”.

చిత్ర, రష్మీ హాల్లోకి వచ్చి “మేం వంట సూపర్ గా చేసాం. మీరిద్దరూ వెళ్ళి అవన్నీ ఇక్కడికి తీసుకురండి. సినిమా చూస్తూ తిందాం” అన్నారు ఒకరికి ఒకరు వత్తాసు పలుకుతూ. “ఏం వంటలు చేసారు?” అడిగాన్నేను.

“వంటలు కాదు. ఓన్లీ చికెన్ కర్రీ” అంది చిత్ర. అర్జున్ సోఫాలో నుండి లేచి “ఇంతసేపా, చికెన్ తో ముచ్చట్లు పెట్టారా?” అన్నాడు.

“మీరిద్దరూ ఏం చేశారు, ఇంతా.. సేపు..” సాగదీసింది చిత్ర. “అన్వి ని నిద్రపుచ్చాం” అర్జున్ కిచెన్ లోకి వెళ్తూ అన్నాడు.

“ఘనకార్యమే. జల్దీ పట్టుకురండి, రష్మీ కి ఆకలి దంచుతోందట. మంచి సినిమా పెట్టుకుని చూస్తూ తిందాం” చిత్ర రిమోట్ ఇచ్చింది.

అర్జున్ వచ్చి తన థర్టీయత్ బర్త్డే పార్టీ వచ్చే వారం ఉంది, మమ్మల్ని తప్పక రమ్మని చెప్పాడు. రోహిత్ ఇండియా నుండి వస్తున్నాడు, తను రాలేనని రష్మీ అంది. చిత్ర కు అర్ధమై అవసరమైతే రోహిత్ ను కూడా తీసుకురమ్మని వార్నింగ్ లాగా చెప్పింది.

తిరుగు ప్రయాణం లో నేనే మొదట మాట్లాడాను. “రోహిత్ లండన్ వస్తే మన ఇంట్లోనే ఉండమని చెప్పు” అన్నాను రష్మీ తో.

“వద్దు, నేను భరించలేను” జవాబు వెంటనే వచ్చింది. “రోహిత్ మన ఇద్దరికీ స్నేహితుడే కదా!” అన్నానేను. ఎదురుగా వచ్చే కారోడు హై బీమ్ లైట్స్ వేశాడు. కాంతి ఎక్కువై కళ్ళల్లో గట్టిగా కొడుతోంది.

*

రష్మీ తీరిక లేకుండ ఉంది. రోహిత్ వచ్చి అప్పుడే వారం రోజులు. ప్రతీ రోజూ రష్మీ హడావిడి చేస్తూనే ఉంది. ఫ్రిడ్జ్ లో పెట్టినవి తినడు, తాజాగా వండాల్సిందే. పొద్దున్నే ఐదు గంటలకు లేచి, రెండు కూరలు వండి, ఎక్సర్సైజ్ చేసుకుని జాబ్ కు వెళ్ళేది.

చదువుకుంటున్నాడని, రోహిత్ ని నేను డిస్టర్బ్ చెయ్యలేదు. నిన్న సాయంత్రం తన FRCS పరీక్ష వ్రాసి రాగానే, బయటకు వెళ్ళి పార్టీ చేసుకుందామన్నాడు. ఈరోజు అర్జున్ పార్టీ ఉంది కదా, రెండు రోజుల తరువాత వెళ్దాంలే అన్నా.

నేను తయారయ్యి జాబ్ కు వెళ్ళే సమయం లో రోహిత్ కిందకు వచ్చాడు.

“సాయంత్రం అర్జున్ పుట్టినరోజు పార్టీ. గుర్తుందా?” మెయిన్ డోర్ తెరిచా. శబ్దం లేకుండ గాలి దూసుకొచ్చింది. “యస్, అర్జున్ నిన్న మెసేజ్ పెట్టాడు” చలికి వణుకుతూ అన్నాడు.

డోర్ వేశా, కిచెన్ లో ఏమేం ఎక్కడ ఉన్నాయో చెప్పా. “ఓకే మరి, నేను వెళ్ళొస్తా”

“ప్రణయ్. నీతో..” రోహిత్ నమిలాడు. “రేపు శనివారం కదా ఇంట్లోనే ఉంటా. మాట్లాడుకుందాం” అన్నాను.

కాలింగ్ బెల్ మోగింది. పోస్టుమాన్ పార్సెల్ ఇచ్చి, సంతకం తీసుకున్నాడు. “గుడ్ డే” చెప్పి వెళ్ళిపోయాడు.

రోహిత్ కు నేను బై  చెప్పి బయటకు వచ్చేశా.

*

సాయంత్రం ఎడింటికల్లా మేం ముగ్గురం తయారై హాల్లో  కూర్చున్నాం.”టీ షర్ట్ మార్చుకో. ఇది బాగా వదులుగా ఉంది” పేచీ పెట్టింది రష్మీ. నన్ను కాదనుకుని, నేను టిక్ టాక్ ఓపెన్ చేసి చూస్తున్న. “మిస్టర్, నిన్నే” అని చిటిక వేసింది. తల ఎత్తా “ఆ నేవీ బ్లూది వేస్కో” అంది నన్ను ఉద్దేశించి .

నేను పైకి వెళ్ళి షర్ట్ మార్చుకుంటుంటే వాళ్ళిద్దరి సంభాషణ కొద్దిగా వినిపిస్తోంది.

“నా షర్ట్ ఎలా ఉందో చెప్పలేదు?” రోహిత్ ప్రశ్న.

“నీకు నచ్చే తీసుకున్నావ్ కదా!”

“ఆ..” అన్నాడు రోహిత్.

“నిజంగా నీకు ఇష్టమై తీసుకున్నావా..? లేక..”

“నీ అనుమానమేంటి?” రోహిత్ గట్టిగా అంటున్నాడు.

“నన్ను అవమానించావని నీకు అనిపించలేదా?” రష్మీ అడిగింది.

“వై సో?”

“రోహిత్, ఇంకా… ఇంత వయసు వచ్చాకా మీ అమ్మ అనుమతి కావాలా?”

“అమ్మంటే నాకు ఇష్టం. నాకు ఏది నచ్చుతుందో తనకు బాగా తెలుసు”

నేను చప్పుడు చేయకుండా మెట్లు దిగా. వాళ్లిద్దరూ నన్ను గమనించలేదు.

“మరి.. నా గురించి మీ అమ్మ ఏమంది?” సూటిగా అడిగింది రష్మీ.

గూడలు ఎగరేసాడు రోహిత్.

నన్ను చూసి ఇద్దరూ ముభావంగా ఉన్నారు.

“కాఫీ?” అని అడిగా. సరేనని అన్నారిద్దరూ.

కిచెన్ లోకి వెళ్ళి కెటిల్ ఆన్ చేసి వచ్చి హాల్లో కూర్చున్నా. ముగ్గురం తెల్లటి గోడలు చూస్తూ ఉన్నాం. ఈ గదిలో మాతో నిశ్శబ్దం కూడా కూర్చుని ఉంది. కెటిల్ లో నీళ్ళు తెర్లే  శబ్దంలో, బంధాలు బలహీనమైపోతున్న అనుభూతి వినిపించసాగింది.

“మీరిద్దరూ వెళ్ళండి. నాకు వాళ్ళతో పెద్దగా పరిచయం లేదు” రోహిత్ తన ఇన్ షర్ట్ తీసేస్తూ అన్నాడు. “నువ్వు వస్తావని అర్జున్ వాళ్ళు ఎదురుచూస్తుంటారు” కార్ కీస్ తీసుకుంటూ అన్నాను. రష్మీ హై బూట్స్ వేసుకుంటోంది.

రోహిత్ లేచి “నాకు కడుపులో నొప్పిగా ఉంది. ఫుడ్ పడటం లేదు. మీరు… ” రోహిత్ మాట పూర్తయ్యేలోపు రష్మీ కోట్ వేసుకుని నా వైపు వెళ్దామా అన్నట్టు చూసింది.

“సరే, భద్రం” అని నా కోట్ జిప్ సరి చేసి బయటపడ్డాం. చలి పెరిగింది, మంచు పడచ్చేమో! ఆలోచనకే వణుకు వస్తోంది. నా మనుసు నిశ్చలం గా ఉంది. కనపడని నవ్వుతో కార్ రివర్స్ చేశా.

ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో అర్జున్ ఇల్లు తొందరగానే వచ్చింది. రష్మీ కార్ దిగుతూ “మెడ చుట్టూ స్కార్ఫ్ వేసుకోలేదా?” అన్నది. నేను బాగానే ఉన్నానని తలూపాను. చలి కి మాట పెగల్లేదు.

అర్జున్ తలుపు తీసి “అతనేడి?” అన్నాడు. “ఆయన్నడగు” కళ్ళు పైకి తిప్పి అన్నది రష్మీ. “చిత్రా…” అంటూ హాల్లోకి వెళ్ళింది.

అర్జున్ నుదిటి మీద గీతలు ఎక్కువయ్యాయి “నీకు అర్థమైందా?” నన్ను అడిగాడు. నోట్లో నుండి గాలి పెద్దగా వదిలి ‘హ్యాపీ బర్త్డే’ అని వాటేసుకున్న.

ఇంకో మూడు నిముషాల తరువాత నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు పెద్ద గిఫ్ట్ బ్యాగ్ లతో. గ్లాసులు ఘల్లు  మనడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. స్పీకర్ లో సంగీతం వస్తోంది.

రష్మీ, చిత్ర ఓ పక్కకు ఉండి, వాళ్ళ గ్లాస్సుల్లో ఉన్న స్ట్రాలను నములుతున్నారు, మధ్యలో మాటలు. వినపడటం లేదు కానీ చేతులు కళ్ళు ఆగకుండా తిప్పుతూనే ఉన్నారు.

మ్యూజిక్ తగ్గించమని అర్జున్ కు సైగ చేశా. వాళ్ళిద్దరి మాటల గాలి ఇటు సోకింది.

“నాకు పిచ్చెక్కుతున్నది” రష్మీ గ్లాస్ కిందపెడుతూ అన్నది.

“నేను, అర్జున్ కూడా ఇదే అనుకున్నాం. ఒక రాధ ఇద్దరు కృష్ణులను తలచుకుని”

“ప్రణయ్ భలే ఖతర్నాక్. రోహిత్ ను మా ఇంట్లోనే ఉండమనడం, నా కళ్ళు తెరుచుకోవడం. అంతా సర్రియల్గా ఉంది”.

“వారానికే నిజస్వరూపాలు బయటపడతాయా?” చిత్ర ఐస్ నములుతు అంది.

“మూడు రోజులు చా.. లు..” సాగదీసింది రష్మీ.

“నీకు రోహిత్ ఎప్పటినుండో తెలుసు కదా?”

“ఇన్నిరోజులు కలిసి ఒకే ఇంట్లో ఎప్పుడు లేం” రష్మీ నిర్ధారించింది.

“అయితే?”

“మొహానికి మాస్క్ ఎక్కువసేపు వేసుకోలేం” రష్మీ నిజం మాట్లాడింది.

“వినడానికి నేను రెడీ”

“దానికోసం ప్రత్యేకంగా కలుద్దాం, అప్పుడు చెప్తా. రోహిత్ ఫ్లైట్ ఎక్కి ఎప్పుడేళ్ళిపోతాడా అని చూస్తున్నా” నవ్వుతూ అంది రష్మీ.

“ఇప్పుడే చెప్పు బేబీ”

“సరే, మధ్యలో మాట్లాడకు” రష్మీ గుటక వేసి అంది.

“ప్రయత్నిస్తా” కళ్ళు ఎగరేస్తూ అంది చిత్ర.

రష్మీ తన ఖాళీ గ్లాస్ ను పక్కన పెట్టింది.

“రోహిత్ ను షాపింగ్ కు తీసుకెళ్ళినప్పుడు, మెరూన్ రంగు చొక్కా కొనిపెడతానన్నా. గుర్తుగా ఉంటుంది అని. సరే అని ట్రయల్ రూమ్ లో కెళ్ళి వాళ్ళ అమ్మకు వీడియో కాల్ చేసి కలర్ బాగుందా అని అడిగాడు. రోహిత్ బయటకు వచ్చి తనకు బాగా నచ్చింది అని చెప్పాడు. ఇంత వయసు వచ్చాకా వాళ్ళ అమ్మ సరే అంటేనే సమ్మతమా?”

రష్మీ ఊపిరి గట్టిగా తీసుకుని వదిలింది.

“ముఖ్యమైన కారణం, నా ఐడెంటిటీ ని లాక్కుందామని చూసాడు. మేము పార్టీకి వచ్చేముందు రోహిత్ నాతో ‘నువ్వు లండన్ లో ఉద్యోగం చేస్తున్నావ్, హైదరాబాద్ వెళ్ళాకా ఆ అవసరం లేదు అన్నాడు’. ఎందుకని అడిగా.. ‘నేను డాక్టర్ని, ఎక్కువ సంపాదిస్తున్న. నన్ను బాగా చూసుకుంటే చాలు అన్నాడు’.

ఇంకో పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకుని తాగింది రష్మీ.

“ఒకవిధంగా రోహిత్ తనకు బాగా తెలిసిన ‘ఒక ఆడది’ కావాలి అనుకున్నాడు, నేనైనా ఇంకెవరైనా కావొచ్చు. నాకు మొదటినుండి స్వతంత్రం గా ఉండటం అలవాటు. నా అస్థిత్వాన్ని వదులుకోలేను. దొబ్బేయ్ అని చెప్పేసా. అందుకే సార్ పార్టీ కు రాలేదు.” నవ్వింది రష్మీ.

“సో?” చిత్ర కళ్ళు పైకి తిప్పింది.

“ఇక్కడికి కార్ లో వచ్చేటప్పుడు, ప్రణయ్ తో నా సమస్య ఏమిటని ప్రశాంతంగా ఆలోచిస్తే, పెద్ద కారణాలు కనపడలేదు. చిన్నవాటినే భూతద్ధం లో చూసా. ప్రణయ్ ఇస్ డిఫరెంట్, నన్ను వదిలేయడం లోనూ ప్రేమ చూపించాడు. ఎక్కడా ఒత్తిడి చేయలేదు.”

చిత్ర, రష్మీ భుజం మీద చెయ్యి వేసి “ప్రణయ్ బెటర్ ఛాయస్ అని అంటావా?”

“నా కథ ఇంకా మిగిలింది. రోహిత్ ను మా ఇంట్లోనే ఉండమని చెప్పాడు కానీ ఒక్కసారి కూడా నాకు తెలిసి, రోహిత్ ను నిలదీసి అడగలేదు. రెండు, నేను రోహిత్ తో ఉండిపోతా అన్నప్పుడు ప్రణయ్ నన్ను కారణాలు అడగలేదు, నా మంచి కోరుకున్నాడు. రోహిత్ వద్దు ప్రణయే ముద్దు అనడానికి ఇంతకన్నా ఏం కావాలి?”

“తెరలు తొలిగాయి అంటావ్” పెదవంచు నవ్వుతో అన్నది చిత్ర.

“పక్కా. ఇంకొక.. ”

“.. హ్యాపీ బర్త్డే బా… వా” ఆ నలుగురి లో ఇద్దరు సాలేగాళ్ళు హోరెత్తి అరుస్తూ అర్జున్ ని గాల్లోకి ఎత్తారు. ఇంకోడు మ్యూజిక్ సౌండ్ పెంచాడు.

బయట మంచు కురవడం మొదలయింది, పచ్చని గడ్డి మీద తెల్లటి దుప్పటిలా.

*

నిద్ర లేచిన దగ్గర నుండి రష్మీ ఇంట్లో పనులు చేస్తూనే ఉంది. టైం పదకొండు అయ్యింది. కిచెన్ సర్దేసింది. డిష్ వాషర్ లోడ్ చేసింది. లాండ్రీ వేస్తూ, మెరూన్ షర్ట్ ని పక్కకు పెట్టింది. స్టోర్ రూమ్ లోకి వెళ్ళి చారిటీ కవర్ లో ఆ షర్ట్ ని వేసొచ్చి నా పక్కన కూర్చుంది.

“రోహిత్ లేవలేదా?” చప్పుడు లేకపాతే అడిగా.

“పొద్దున్నే వెళ్ళిపోయాడు”

“ఎక్కడికి..? ఎలా వెళ్ళాడు? ”

“టాక్సీ లో… ఎయిర్పోర్ట్ కి. వంట ఏం చేయమంటావ్?” నవ్వుతూ అడిగింది.

“ఫస్ట్ అయితే ఛాయ్ తాగుదాం” అన్నానేను.

రష్మీ వెళ్ళి పొయ్యి మీద పప్పు పెట్టింది. ఆలుగడ్డలు కోసి ఫ్రై చేద్దామని ముక్కలు ఇంకో గిన్నెలో వేసింది. గోడ మీద  పెళ్ళి ఫోటో  జీవితాన్ని వెనక్కి తీసుకెళ్ళింది. చెంపల పై నుండి నీళ్ళు ప్రవహిస్తూనే ఉన్నాయి. మాడు వాసన ముక్కుకు తగలటం లేదు. సెల్ ఫోన్ మోగటం తో ఉలిక్కిపడి, ఆలు ఫ్రై మంట తగ్గించింది.

నేను ఛాయ్ పెడతానని చెప్పా. ఎంత లేట్ అయినా  టీ పడక పోతే, ఆ రోజు షురూ కానట్టే. ఏదో గుర్తుకు వచ్చిన దానిలా… బాత్రూం కు వెళ్ళొస్తానని రష్మీ ఊరికినట్టు వెళ్ళింది.

ఛాయ్ మరగ పెట్టి కప్పులో పొసే సమయానికి, డార్లింగ్ అంటూ వేగంగా వచ్చి వాటేసుకుంది. అలానే గట్టిగా పట్టుకుంది చాలాసేపు. నా టీషర్ట్ వెనక తడిచేంతవరకు నాకు అర్ధం కాలేదు, తను ఏడుస్తున్నదని. జ్ఞానోదయం అయ్యిందిలే అనుకున్నా.

నా చెవిని ముద్దాడుతూ గుసగుసలాడింది “తండ్రివి కాబోతున్నావ్ మిస్టర్.”

నా కళ్ళల్లో.. ఆనంద బాష్పాలు.

*

సూర్యకిరణ్ ఇంజమ్

సూర్య కిరణ్ ఇంజమ్

Surya resides in the United Kingdom and works in a hospital for Bread and Beans. Alongside his professional life, he is pursuing the "Write from Life" course at the University of Oxford, honing his craft as a writer.
A passionate creative, he extends his artistic pursuits beyond writing into photography and acting, embracing a multifaceted approach to storytelling and self-expression.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు