1
మరింత సమయం
ఆకాశం వాకిలి నిండా
అభూతకల్పనల విభూతి పేరుకుపోయి
నడిచే హృదయాలు
దుమ్ము కొట్టుకుపోతుంటే
నేను చారిత్రక సత్యాల చేదబావి నీళ్లు తోడి
దారి పొడుగునా కుమ్మరిస్తూ
మూలమూలలా చిమ్మిపోస్తూ
కవిత్వపు స్క్వీజరుతో శ్రద్ధగా లాగి
శుభ్రం చేన్తున్నాను!
అంతరిక్ష ఉద్యానవనమంతా
అందంగా అల్లుకుపోయిన
స్నేహ సౌహార్థాల పచ్చని పందిళ్ళపై
క్రూర వివక్షా కాంక్షా క్రిమికీటకాలు
విచ్చలవిడిగా విరుచుకుపడి
వైవిధ్యభరితమైన పంటల్ని
దుంపనాశనం చేస్తోన్న సంకట స్థితిలో
మానవీయ సస్య రక్షణకై
నేను పురుగుమందుల డబ్బాను
భుజాలకు తగిలించుకొని
పిచికారీ చేసే పనిలో
నిమగ్నమై ఉన్నాను!
పాలపుంత కవ్వానికి
కండరాల పలుపుతాడు చుట్టి
శ్రమజీవులు సాగించిన
స్వేద సాగర మదనం లోంచి
నెత్తుటి పుష్పంలా ఆవిర్భవించిన
అమూల్య వనరుల అమృత కలశాన్ని
కుట్రపూరితంగా దొరకబుచ్చుకొని
నూట నలభయ్యారు కోట్ల
నక్షత్రాల నోళ్ళుకొట్టి
తన అనుంగు మిత్రుని కృష్ణబిలంలో
కుండపోతగా కుమ్మరిస్తోన్న
కపట మోహినీ కుటిల నైజంపై
నా కలం నెబ్యులాను ఎక్కుపెట్టి
ముడుచుకుపోయిన తాబేళ్ళను
పొడిచి పొడిచి పరుగులు తీయిస్తున్నాను !
అన్నీ చూస్తోన్న మనువాద రాజ్యం
వణుకుతోన్న సింహాసనమ్మీంచి
కన్నెర్ర జేస్తూ చప్పట్లు చరిచి
‘ఎవరక్కడ…!
ఆ దేశద్రోహిని పట్టి బంధించండి! ‘
అంటూ చట్టం ద్వారపాలకుల్ని ఆజ్ఞాపించింది!
ద్వారపాలకులు వినమ్రంగా
శిరస్సు వంచి జీ హుజూర్ అంటూ
సరాసరి నన్ను జైలు గదిలోకి తోసారు
ఆ చీకటి గదిలో నా కలం
అనన్య కాంతుల ధగధ్ధగలతో…
అందుబాటులో లేని తెల్ల కాగితం గురించి
ఆలోచిస్తూ కూర్చోకుండా
చేతికి దొరికిన ప్రతి
చిత్తు కాగితం మీదా
రాతకు అనువైన ప్రతి
అట్టముక్క మీదా
ప్రజాస్వామ్య సూర్యుణ్ణి
ప్రతిష్టించటానికి మరింత సమయం
దొరికినందుకు మురిసిపోయింది!
2
లాల్ సలామ్!
సమస్యల సముద్రంలో
నిత్యం సుళ్ళుతిరుగుతూ
బయటపడే దారిలేక
తమలో తామే గుంభనంగా
కుళ్ళికుళ్ళి ఏడుస్తోన్న
జన జీవన అలల వలయాల్ని
భుజం తట్టి భరోసానిచ్చి
ఉపరితల ఆవర్తం మీంచి
ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాల్లా
మలిచే ఆ చోదక శక్తి ఏదో
నీకు తెలుసా మిత్రమా…!
బాహ్య ప్రపంచ సముద్రపు
అసలు స్వరూపాన్ని
అర్థం చేసుకున్న అభ్యుదయ
కవులూ రచయితల
కల్లోల హృదయాల
ఆవేశంలోంచి
ఆవేదనలోంచి
విచ్చుకున్న విశ్వవ్యాపిత
పవన తీవ్రతే!
సంక్షేమ తాయిలాల
గురుత్వాకర్షణ శక్తి
అడుగునా వాటిని
కిందకి నెట్టేస్తున్నా
గుండె గొంతుకలోంచి కొట్లాడే
ప్రజా కళాకారుల ప్లవన శక్తి
మళ్లీ మళ్ళీ పైకి
లేపుతూనే ఉంటుంది
జన సముద్రాన్ని మోస్తున్న
భూగర్భ సంపదంతా
ధ్వంసమవుతున్నప్పుడు
రోదిస్తున్న సముద్రాన్ని చూసి
వేడెక్కిన కళా సాహితీ
పవన ప్లవన ఉద్దీపనలు
ఏ క్షణాల్లోనైనా ఖచ్చితంగా
తుఫానుల్ని సృష్టించి
తుర్పారబట్టక తప్పదు!
నిర్విరామంగా సాగే
ఈ విప్లవోద్యమ చైతన్య
కెరటాల పోరాట ప్రక్రియలో
నిరంతరం స్వేద బిందువుల
పక్షాన నిలిచే
ఆ పవన తీవ్రతకూ
ఆ ప్లవన సామర్ధ్యానికీ
లాల్ సలామ్!!
*
Add comment