నెత్తురు పులుముకున్న గాయం లాంటి ఆకాశం మీద
చీముగడ్డలా వివర్ణుడై కనిపిస్తాడు సూర్యుడు!
తెల్లారుతుంది.
అరచేతిలో శాశ్వతంగా ఇమిడిన పుండు..
గుండె గాయాన్ని రిపీటెడ్ గా గుచ్చుతుండే ముల్లు!
పలకరింపు ఒక కత్తి తునక..
‘ఇలా ఎలా?’
ప్రతిసారీ ఒక పృచ్ఛ శలాక పొడుచుకుంటుంది..!
జన్మాంతానికీ మానని గాయాన్ని కెలుకుతుంటుంది..
వేదన ప్రచ్ఛన్నంగా గుండె తెరచుకుంటుంది..
మీట నొక్కినట్టుగా..
నాలుగు మాటలు అప్పజెప్పేస్తాను!
అశ్రురహిత భావరహిత ప్రేలాపనలాగా!
ఏ పాతాళంలోకీ కూరుకుపోలేని అశక్తత..
ఆప్తులు వొస్తారు..
నన్ను ముంచి ఉన్న చీకటి గుయ్యారంలోకి-
తలుపును నిలువు కోత చీలికలా తెరచుకుని!
ఆ వెలుగు రేఖ అతి సన్ననిదే..
చీకటిని లోనికి వొంపుకుంటున్న కళ్లలోకి
చిటపటలాడే నిప్పుకణికలను పంపుతుంది..
చురచుర మండుతాయి!
ఉట్టిమీద నిల్వ పెట్టినట్టుగా ఒకటి అందుకుని
పెదవులపై లిప్తపాటులో పులిమేస్తాను!
సురసంగానే మాట్లాడుతాను!
గుండెలోంచి రాని, బుర్ర దాకా చేరని..
సమయానుకూల వ్యర్థభాషణాన్ని సాగిస్తాను..
నాలుకపైని నచ్చని ఉమ్మిని విసర్జించినట్టు- మాటలు!
నా గుండె దిటవుకు అబ్బురపడి..
అసలు నేను మనిషినేనా అని నివ్వెరపడి..
నా మీద జాలిపడి.. కొండొకచో అసహ్యపడి..
కౌగిలింతతోనో, కరస్పర్శతోనో వీడుకోలు చేసి!
వెలుతురు నెమ్మదిగా నిష్క్రమిస్తుంది!
పగలాంతా యివే..
చేతికందినన్ని పులుముకునే నవ్వులూ..
దూషణ తిరస్కారాదులూ..
కౌగిలింతలూ, కరస్పర్శలూ!
నెమ్మదిగా పలచబడతాయి!
నిర్దయగా ముగిసిపోతుంది పగలు..
చీకటి మీద నల్లదుప్పటిలా పరుచుకుంటుంది రాతిరి!
నిర్మూలమై కరిగిపోతుంది తగిలించుకున్న వేషం!!
విగడియల కొలమానాల మీద జాములను లెక్కపెడుతుంటాను..
మగతలో, లెక్క తప్పి, రెప్ప మూసుకుంటుంది..
ఎప్పుడో తెలియకుండానే.. దైహిక స్పృహలేని వేళలో..!
ఎంతసేపు వాలిఉన్నాయో తెలియదు రెప్పలు..
ఎవరో తరుముతున్నట్టుగా తెరచుకునేస్తాయి..
లోపలా- బయటా-
గాఢత తగ్గినదని, కాటుక దిద్దుకున్న చీకటి
వేషం అవసరం పడనివ్వని చీకటి-
అమ్మ గర్భంలో దాగిఉన్నప్పటి చీకటి-
అమ్మ ఒడిలో తలపెట్టుకుని నిదురించినప్పటి చీకటి!
చీకటి.. చీకటి..
ఘనీభవించిన చీకటి!
వేకువ వద్దనిపించే చీకటి!
బతుకు దాచుకున్న జ్ఞాపకాలన్నీ ఒళ్లు విరుచుకుంటాయి..
పగలు గుచ్చిన శర క్షతాలన్నీ వికటతాండవం చేస్తాయి..
నెత్తురు కారనివ్వని రంపపు కోత కదా- జ్ఞాపకం!
ఆ ఊటబావుల్లో తోడుకుంటున్న కొద్దీ..
పెరుగుతూ ఉండేదే కదా గోడు!
తోడు, జాడల మధ్య- నా నీడ దాక్కుని ఉంటుంది!
బిక్కు బిక్కుమంటూ..
సద్దు సేయకుండా వెక్కుకుంటూ..!
కనులు దిగమింగేస్తున్న నీళ్లు
నాలుకపై ఉప్పగా పోటెత్తుతుంటాయి!
‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదా- … … కావేరీ’..
సంపూర్ణంగా, ఇష్టంగా, అమ్మ మునిగిన నదులన్నీ
నా కనుల కిందనే కదా ఇపుడు పురుడు పోసుకుంటున్నాయి!
కరడుగట్టిన నా గుండెలనే కదా ఆరడి పెడుతున్నాయి!!
ఈ రాతిరి.. ఈ చీకటి..
ఇలా శాశ్వతమైపోతే ఎంత బాగుండు?
అగ్నివర్షాలకు జడవని గండభేరుండాలు..
అనంతాలకూ దిగంతాలకూ ఎగిరి ఎగిరి..
పండిన సూర్యుడిని పొడుచుకు తినేస్తే ఎంత బాగుండు?
ఆశను పరిహసిస్తూ
కనులలో మంటలు, కడుపులో మంటలు జమిలిగా
ప్రాగ్దిశ వేదిక మీదికి పాకుతాయి!
ఎర్రబడుతుంది!
నెత్తురు పులుముకున్న గాయం లాంటి ఆకాశం మీద
చీముగడ్డలా వివర్ణుడై కనిపిస్తాడు సూర్యుడు!
తెల్లారుతుంది.
(అమ్మ హాయిగా మెడికల్ కాలేజీలో విశ్రాంతి తీసుకుంటోంది. మేమే..)
చిత్రం: ముని సురేశ్ పిళ్లే
Add comment