పక్షుల సభ

ఇంటి ముందు

చెట్టు మీద పక్షుల సభ

తెల్లారు జామున

ఒకటే రభస

ఆ చెట్టు నాటిన వాడికి

ముక్తకంఠంతో జై కొడుతున్నాయి

 

మనుషులు గడుపుతున్న

అజీవితం గురించి

ఇవాళ చర్చ

 

ఒక్కోపక్షి

ఈ కాలపు దృశ్యాలను

వణుకుతున్న గొంతుతోచెప్తున్నాయి

అత్యాశల చిటికెన వేలు పట్టుకుని

పరుగెడుతున్న జనం గురించి చర్చిస్తున్నాయ్

 

కూటికి కులం పూసిన వాడిని తల్చుకుని

విలవిల లాడి పోయాయ్

ఉన్నావ్ బాధితరాలు గుర్తొచ్చి

కిలారింపులు మొదలెట్టాయ్

దేశమంతా

ఒకే రంగు కోసం

ప్రయత్నిస్తున్న ఇద్దరు మిత్రుల్ని తల్చుకుని

పగలబడి నవ్వుకున్నాయి

 

రెండు మామిడి పండ్ల కథ చెప్పుకుని

ఒక నిమిషం మౌనం పాటించాయ్

కాశ్మీర్అమ్మాయిలు ఆపిల్ లా ఉంటారన్న వాడి

నాలుక గుర్తోచ్చి ముక్కులుతో

కొమ్మల్ని  బలంగాకొట్టాయ్

యుద్దానికి సిద్ధమన్న

నాయకుడి మాటలు జ్ఞప్తికి తెచ్చుకున్నాయి

 

లోకంలో జరిగిన యుద్దాలు తెలుసు అంటూ

చరిత్ర చదివిన పక్షి ఒకటి

కన్నీటి గింజలు రాల్చింది

ఈ భూమ్మీద

యుద్ధం

అత్యంత నీచమైన మాట అంటూ

పక్షులు ఒక్కసారిగా

దిక్కులు పిక్కటిల్లేలా

ఆకాశం వైపు ఎగిరాయి.

*

 

 

సుంకర గోపాలయ్య

పిఠాపురం రాజా డిగ్రీ కళాశాల లో తెలుగు అధ్యాపకులు. సొంత ఊరు నెల్లూరు.
సంపాదకుడిగా పిల్లల కవిత్వం రెండు పుస్తకాలు తెచ్చారు.రంజని కుందుర్తి,తానా, ఎక్సరే ,పాటూరి మాణిక్యమ్మ మొదలైన పురస్కారాలు అందుకున్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాకులలో ఒకరు.

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • భలే భలే గోపాల్

    మనిద్దరం ఆ పక్షుల్లా ఎటన్నా ఎగిరిపోదామా కాసేపు

  • పక్షుల సభ బాగుంది సర్!👍నిజంగా,మనకన్నా, అవే ఇలా స్పందిస్తాయి ఏమో,నేటి పరిస్థితి లకు, అనిపించింది. goodpoem.

  • సాటి మనిషి జీవితం దుర్భరంగా ఉన్నా కనీసం చూడని సమాజంలో మనుష్యులు కోసం అవి అయినా కన్నీటి గింజలు రాలుస్తున్నాయి…వాటికి నా సెల్యూట్…… సూపర్ సర్ అద్భుతంగా ఉంది…

  • సార్ చాలా అద్భుతంగా రాశారు….. మీకు నా జోహార్లు…….. సమకాలీన అంశాలను కూడా స్పష్టంగా అద్భుతమైన కవిత్వం తో చాలా చక్కగా వివరించారు…. నా శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తున్నాను

  • ప్రారంభం పాంచజన్యం లా మనస్సును తాకితే
    ముగింపు రామబాణంలా గుండె ను
    కొట్టింది

  • సామాజిక అంశాల పట్ల మీ ఆవేదనకు ప్రతిరూపం మీ కవిత.. చాలా బాగుంది..

  • అద్భుతమైన కవిత సమాజానికి దర్పణం మనలో ఎక్కడో ఒక మూలన పడిపోయిన మానవతా ప్రతీకలు ఆ పావురాలు.

  • మీ పక్షుల సభలో నేనో సభ్యుడనైతే బావుండు కదానిపించింది

  • అవి నిజ్జంగా పక్షులేనా . మనుషులు మాట్లాడాలేని స్థితిలో పక్షుల్లా రూపాంతరం చెంది మాట్లాడుకుంటున్న మిత్ర సమూహాలా.మీ కవిత్వం కొన్ని రోజులు ఆలోచింప జేస్తుంది. బావుంది మిత్రమా మీ కలం ఈ మధ్యన కొత్త కొత్త దారులు వెతుకుతుంది.

  • ధ్వని ప్రధానమైన కవిత…నేటి పరిస్థితును అద్దం పడుతోంది….

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు