1.
గాలి
గాలి వీస్తుంది
తనతో కలిసి ఒక నిరాశ్రయ గీతం తీసుకుని.
ఇది కేవలం ఋతువుల మార్పు కాదు,
ఇది స్వదేశాన్ని దోచుకెళ్లిన కబళింపు,
మనసులో తలుపులు మూయించుకునే బలవంతపు విరహం.
గాలి అడుగుతుంది
– “ఎవరికి ఈ నేల?
ఎవరికి ఈ నీడ?”
2.
చెట్టు
చెట్టు వంగుతుంది
కానీ విరగదు
వేరు కదలదు, వేరు ముడుచుకోదు
ఆ వేరులోనే నిలబడి ఉంటుంది
ఒక తల్లి పాలు, ఒక తండ్రి చెమట,
ఒక బిడ్డ గుండెలో నిద్రపోతున్న గీతం
చెట్టు చెబుతుంది
– “నన్ను నేల నుండి వేరు చేయలేరు
నేనే నేల, నేలనే నేను.”
3.
మనిషి
మనిషి చెట్టును పట్టుకుంటాడు
అతని బలహీనమైన చేతులు
అతని శ్వాసకు సమాధి కట్టుకోవాలనే కాదు,
అతని చరిత్రను నిలబెట్టుకోవాలనే ప్రయత్నం.
అతని శరీరం ఒక సరిహద్దు
అతని రక్తం ఒక పతాకం
– “నా ఓటమి కూడా ఒక జ్ఞాపకమే,”
అని అతను తుఫాన్ చెవిలో చెబుతాడు.
4.
జ్ఞాపకం
జ్ఞాపకం ఒక గూడు
అది పక్షుల కోసం కాదు
తిరుగుతున్న మనసుల కోసం
ఆ గూడులో దాచబడి ఉంటుంది
ఒక ఊరి గల్లీ,
ఒక బామ్మ వంటింటి వాసన,
ఒక చిన్ననాటి మట్టిపాదరసం
గాలి దానిని చెరిపేయలేదు
“జ్ఞాపకం శబ్దం లేని డప్పు
కానీ అది గుండెలో కొట్టుకుంటూనే ఉంటుంది.”
5.
ప్రవాసం
ప్రవాసం అంటే
తన నేలతో వ్రాసిన చిరునామా తన చేతుల్లో ఉండకపోవడం
ఎక్కడికెళ్లినా అడుగులు గాలి అడుగుల్లా
మాయమైపోవడం
కానీ, ప్రవాసం ఒక శాపం మాత్రమే కాదు,
ఒక ప్రతిజ్ఞ కూడా
ఎక్కడ వుండినా మనిషి తనలో మోస్తాడు
ఒక చెట్టును
ఆ చెట్టు స్వదేశపు నేల వైపు మాత్రమే
వాలి ఉంటుంది
6.
చివరి వాక్యం
ఒక రోజు
చెట్టు విరిగిపోవచ్చు
మనిషి నేలపై పడిపోవచ్చు
కానీ గాలి ఎప్పుడూ గెలవదు
చెట్టు నుంచి ఎగురుతుంది ఒక పక్షి,
ఆ పక్షి పేరు
ప్రతిఘటన
*
Image courtesy: Rafi Haque
జ్ఞాపకం శబ్దం లేని డప్పు
చెట్టు స్వదేశంలోనే వాలి ఉంటుంది
ఆ పక్షి పేరే ప్రతిఘటన