పంటికింద రాయి

వాడుక భాష సమస్యల మీద మీరూ ఈ శీర్షికకి రాయవచ్చు!

ఈ మధ్య ఒక వ్యాసం చదువుతుంటే, ‘తెలుగు భాష మరియు సంస్కృతి’ తగిలింది.

‘తగిలింది’ అని ఎందుకంటున్నానంటే – చిన్నప్పుడు బడి నుంచి ఇంటికి రాగానే మా ఆమ్మమ్మ గుప్పెడు కందిపప్పు పెట్టి, ఒక బెల్లం ముక్క ఇచ్చేది. కంది పప్పు నముల్తూ బెల్లం ముక్కని కొరికినప్పుడు స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లుండేది. కానీ, అప్పుడప్పుడూ కందిపప్పులో చిన్న రాతిముక్క తగిలేది. అది పంటికింద పడినప్పుడు ఒళ్ళు జలదరించేది. స్వర్గం నుంచి ఎవరో కిందికి నెట్టేసినట్లుండేది. ‘మరియు’ తగిలినప్పుడు నాకలాగే అనిపిస్తుంది.

రాముడు మరియు కృష్ణుడు అని తెలుగు వాళ్ళు రాయరు, రాముడూ కృష్ణుడూ అని రాస్తారు. అలాగే చదువు మరియు సంస్కృతి అనరు, చదువూ సంస్కృతీ అంటారు. ఇరవై ముఫై సంవత్సరాల క్రితం ఈ ‘మరియు’ తగిలేది కాదు. కానీ ఈ మధ్య ఇది తరచూ తగులుతూ ఉంది. ఎక్కడినుంచి వచ్చిందో ఏమో? ప్రపంచీకరణ తెచ్చిందేమో! లేక రాసేవాళ్ళకు తెలుగు సరిగ్గా రాదా? మరో విషయం – మాట్లాడేటప్పుడు ఈ ‘మరియు’ ని ఎవ్వరూ వాడరు. రాసేటప్పుడు మాత్రమే వచ్చే జాడ్యం ఇది.

మరియు ఒక్కటే కాదు, ఈ మధ్య నాకు తరచూ తగులుతున్న మరో పంటికింద రాయి, ‘మరిన్ని వివరాలకు’.  వివరాలకు  ఫలానావారిని సంప్రదించండి అనడం మనకు ఆనవాయితీ. ఈ ‘మరిన్ని వివరాలకు’ ఈ మధ్య వచ్చింది. ఈ కలుపు మొక్క కూడా మరియు ఎక్కడనుంచొచ్చిందో అక్కడిదే అనుకుంటా – చదువు లేకపోవడం నుంచి.

నాకు బాగా నవ్వు తెప్పించే తెలుగు ప్రయోగం  – హైదరాబాదుకు స్వాగతం లేక విజయవాడకు స్వాగతం – ఇలాంటివి. ఇక్కడ నాకు ఎలాంటి అనుమానం లేదు, ఇది Welcome to New York లాంటి బోర్డ్ ఎక్కడో చూసి దాన్ని కాపీ కొట్టిన ఫలితం. స్వాగతం అంటే చాలనీ, హైదరాబాదులో హైదరాబాదుకు స్వాగతం చెప్పడం హాస్యాస్పదమనీ  తెలియని బృహస్పతులెవరో ఈ ప్రయోగానికి కారకులని నా నమ్మకం.

మీకు ఇలాంటి రాతిముక్కలు తగిల్తే, దయచేసి వాటి గురించి చెప్పండి. కందిపప్పు నమిలేవారికి  రాతిముక్కలు తగలకుండా చూడండి.

*

ఆరి సీతారామయ్య

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సీతారామయ్యగారూ నమస్తే
    బావున్నాయి పంటి కింద రాళ్ళు…
    ఈ మరియు ప్రయోగం..పత్రికలవారు
    భాషకు పట్టించిన భ్రష్ఠ యోగం…
    ఇంకెవ్వరూ మరచిపోనంతగా పత్రికలతో కలిసి ఛానెళ్ళు
    కూడా కలబడుతూ కంకణం కట్టుకున్నాయి….

  • ‘‘దయచేసి వాటి గురించి చెప్పండి. ’’.

    ’ దయచేసి’ అనే పదం పలుకురాయి కాదా?

    ——————————————————–

    దృశ్య మాధ్యమాల్లో అత్యధికంగా, అనవసరమైన చోట్ల, అసందర్భంగా వినిపించే పదాలు…….

    నేపథ్యం, జరిగింది, పరిస్థితి….. ఇంకా చాలా వున్నాయి.

  • మరియు లాంటి పదాల కంటే ‘ జరిగింది’ పదం అత్యంత తరచుగా అసందర్భంగా వాడుతున్నారు.. .
    అన్య భాశా పదాల ప్రభావం తప్పనిసరిగా వుంటుంది. పూర్వం చాలా ఇంగ్లీషు పదాలను తద్భవం చేసుకున్నారు. ఉదా!1 ఆసుపత్రి, సొలాబి, పంట్లాము,. మొ!!
    వాక్య నిర్మాణాన్ని అనుకరిస్తూ ‘ మరియు’ యొక్క’ లాంటివి వినియోగించటం ఇంగ్లీషు నుంచి తెలుగు వాక్యాన్ని రూపొందించుకునే అలవాటు నుండి వచ్చింది. ఇంగ్లీషు మాధ్యమం చదువుల ఫలితం కావచ్చు.
    నేను హైదరాబదులో పని చేసినప్పుదు కార్మిక సంఘాల సమావేశాలన్నీ ఉర్దూ లో జరిగేవి. ” జో మజ్దూరో0హై” అంటూ మాట్లాడెవారు. అది ఆ భాషా పలుకుబడి. ” ఎవరయితే పంటలు పండించే రైతులున్నారో” అంటూ మాట్లాడే వారు ఇటీవల పెరిగా(రు. — దివికుమార్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు