జైళ్లలో ఉన్నవారంతా నేరస్థులనీ, బయటి ప్రపంచంలో ఉన్నదంతా నిరపరాధులే అనీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసినవారు గానీ, పదవిలో ఉన్నవారు గానీ గుండెలమీద చేయి వేసుకుని కనీసం తమకు తాము చెప్పుకోగలరా? రాజకీయ వ్యవస్థ కనుసన్నల్లో న్యాయవ్యవస్థ మెసలుతున్నపుడు ఇంతకన్నా ఎక్కువ ఆశించడం అత్యాశే అవుతుంది. ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామిక దేశంగా మనకు మనం గొప్పలు చెప్పుకునే భారతదేశం నిజ స్వరూపం చూడాలంటే జైలుకు వెళ్లాల్సిందే. ఖైదులో మగ్గుతున్న మనుషులను పలకరిస్తే, ఈ నిగనిగల మేడిపండు లోపలున్నదేమిటో బట్టబయలవుతుంది. ఆ పని ఒక ఖైదీ చేసినంత బలంగా మరింకెవరూ చేయలేరు. ఈ చీకటి ప్రపంచాన్ని తెలుగు కథాసాహిత్యానికి పరిచయం చేశారు బి. అనూరాధ.
బీహార్ రాష్ట్రంలోని హజారీబాగ్ జైలులో ఐదేళ్లపాటు ఖైదీగా ఉన్న ఈ తెలుగు రచయిత్రి తన చుట్టూ ఉన్న మనుషులను కథలుగా మలిచారు. ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వరుసగా వచ్చిన కొన్ని జైలు కథలకు మరికొన్ని చేర్చి 16 కథలతో ‘ఏది నేరం?’ పేరుతో ఒక సంపుటి వెలువడింది. ఈ పుస్తకంలోని తొలి కథ పేరు ‘ ఒక పారో కథ’.
‘నల్లగా, పొట్టిగా, నూనెపెట్టి నున్నగా దువ్వి, బిగుతుగా అల్లిన జడ, మడమలపైకి కట్టుకున్న పూల పూల చీరలో’ ఉండే ఖైదీ పేరే పారో. నేరస్థురాలిగా భర్తతో సహా హజారీబాగ్ జైలుకు రెండేళ్ల ఆడబిడ్డని చంకనేసుకుని 15 ఏళ్ల కిందట వచ్చింది పారోదేవి. ఎన్నో భద్రాలు చెప్పి, పెద్ద కూతుర్ని తోడికోడలి దగ్గర వదలి వచ్చింది. మున్నీ మాత్రం 12 ఏళ్ల పాటూ అమ్మతోనే జైల్లో ఉండిపోయింది. నిజానికి ఐదేళ్లు దాటిన పిల్లల్ని జైల్లో ఉండనివ్వరు. ప్రభుత్వ హాస్టళ్లలోనో, అనాథాశ్రమాల్లోనో చేరుస్తారు. వయసును దాచేంత పొట్టిపిల్ల మున్నీ.
బిడ్డను తనకు దూరం చేయవద్దని అమ్మ కాళ్లావేళ్లా పడడంతో జైలు అధికారులు చూసీచూడనట్టుగా వదిలేశారు. నెలల బిడ్డల మొదలు పది పన్నెండేళ్ల వయసు దాకా ఏ నేరమూ చేయని పిల్లలు ఎందరో ఇలా జైలే ఇల్లుగా పెరుగుతుంటారు. ఇక దాయడం వీలుకాని పద్నాలుగేళ్ల వయసులో మున్నీని ఒక మిషనరీ కి పంపేశారు. హాస్టల్లో పెట్టి బాగా చదివిస్తామని, ఏడాదికోసారి తీసుకువచ్చి చూపిస్తామని చెప్పారు. ‘మయ్యా(అమ్మా) మంచిగ సదూకుంటా’ అని మున్నీ కూడా ఖుషీగా అమ్మ కన్నీళ్లు తుడిచింది. చెప్పినట్టే తొలి ఏడాది తీసుకువచ్చి చూపించారు. ఆ తర్వాత రెండేళ్లు దాటిపోయింది. బిడ్డ జాడలేదు. అమ్మ గుండె తల్లడిల్లిపోతోంది. మావోయిస్టు ఖైదీగా అదే జైల్లో ఉన్న ఈ కథా రచయిత్రి అనూరాధ సాయంతో మున్నీ ఆచూకీ వెతికే పని మొదలైంది.
మిషనరీ వాళ్లకు జాబు రాశారు. జవాబు లేదు. జైలు అధికారుల ద్వారానూ అధికారిక లేఖ పంపారు. సమాధానం రాలేదు. పద్నాలుగేళ్ల పిల్లని అప్పగించిన మిషనరీ ఫోన నెంబరు కూడా జైలు అధికారులు తీసుకోలేదు. పిటీషన్లు పెడుతూనే ఉన్నారు. నెలలు గడుస్తూనే ఉన్నాయి. పారో కళ్లే కాదు, నోరూ కట్టలు తెగుతోంది. జైలు అధికారుల మీద విరుచుకుపడుతోంది. జైలు సందర్శనకు వచ్చిన జిల్లా జడ్జిని ఇదే దుఃఖాగ్రహంతో పారో నిలదీసింది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయమని ఆయన సలహాతో సరిపెట్టాడు. పారో పేరుతో రచయిత్రి పిటీషన్లు రాస్తూనే ఉంది. ఒక రోజు జైలు కార్యాలయం నుంచి పారోకి కబురు వచ్చింది. ఆశగా వెళ్లిన పారో బూతులు తిడుతూ తిరిగి వచ్చింది. మున్నీ ఆచూకీ దొరికింది. కాకపోతే ఆమెను బాలనేరస్థులుండే రిమాండ్ హోంకి పంపారు. ఎందుకు పంపారో చెప్పేవారు లేరు. ‘ నీ బిడ్డ ఏదో నేరం చేసివుంటుంది.’ అని చెప్పిన జైలు అధికారులను దులిపేసింది పారో. ‘నా బిడ్డ ఏ తప్పు చేయ్యదు దీదీ! చానా చక్కని పిల్ల’ అని రచయిత్రి దగ్గర భోరుర ఏడ్చేసింది. ఏం జరిగిందో కనుక్కునేందుకు అనూరాధ చేసిన ప్రయత్నాల్లో తెలిసింది ఏమిటంటే- ‘సెక్షన 376 కింద మేజిసే్ట్రటు ముందు వాంగ్మూలం ఇవ్వడానికి మున్నీ కుమారిని హాజరు పరిచారు. తల్లిదండ్రులు గానీ, గార్డియనగానీ లేనందున దేవఘర్ లోని రిమాండ్ హోంకి పంపమని ఆదేశించారు’
ఇంతకీ సెక్షన 376 అంటే ఏమిటి? రేప్ కేసు. అంటే పదిహేడేళ్ల మున్నీ రేప్‌కి గురైంది. ఏ నేరమూ చేయకుండానే పద్నాలుగేళ్ల పాటూ జైల్లో జీవిత ఖైదు అనుభవించిన మున్నీ, బయటకు వెళ్లగానే అత్యాచారానికి గురైంది. మున్నీని బాగా చదివిస్తామని చెప్పి తీసుకువెళ్లిన మిషనరీవాళ్లు ఏమైనట్టు? గార్డియన లేరనే పేరుతో నేర బాధితురాలైన మున్నీ యే మళ్లీ జైలు పాలైంది. చీకటి జైలు లోంచి వెలుగు రెక్కలు విప్పుకుని ఎన్నో కలలతో బయటకు వెళ్లిన మున్నీకి జైలే భద్రమైన ప్రదేశం అనిపించడం కన్నా మించిన విషాదం ఏదైనా ఉంటుందా? ‘ఇన్నేళ్లు తన రెక్కల కింద కాపాడుకున్న బిడ్డ రేప్‌కి గురైందని తెలిస్తే ఆ తల్లి ఎలా తట్టుకోగలదు?’ అయితే రచయిత్రి మనోవేదనకు భిన్నంగా పారో ఈ సమాచారాన్ని స్వీకరించింది. ‘ నా ప్రాణాలన్నీ నీ మీదనే పెట్టుకున్నా బిడ్డా! నువ్వు బతికున్నవ్ సాలు. బతికుంటే మిగిల్నియ్ సక్కజేసుకోవచ్చు.’ అని రచయిత్రి తో రిమాండ్‌లో ఉన్న కూతురికి జాబు రాయించింది పారో. ‘ నాకు తెలుసు. నా బిడ్డకు చానా ధైర్యం. మంచి పని చేసింది.’ అని రచయిత్రి దగ్గర మెచ్చుకుంది. ‘నాబిడ్డ కేసు పెట్టింది కదా! వాన్ని జైలుకి పంపి వుంటారు కదా‘ అని ఊరట పొందింది. మిషనరీ వాళ్ల మీద కేసు పెడతానని చెప్పిన పారో, బిడ్డకు రాయించిన జాబులో ఇలా రాయించింది..
‘కొట్లాడాలె బిడ్డా! హిమ్మత రఖ్!’
పారోని ఓదార్చి ధైర్యం చెబుదామనుకున్న మావోయిస్టు ఖైదీ అనూరాధకే ఉత్తేజాన్నిచ్చింది ఈ మాట. అవును..పోరాడాల్సిందే. పోరాటం తప్ప మరో దారి లేదు పారోకి, మున్నీకి, ఇంకా అటువంటి కోట్లాది మందికి. పారో నేరం చేసిందో లేదో తెలీదు. బయట ఒక బిడ్డ, జైల్లో ఒక బిడ్డతో పదిహేనేళ్లు జైలు జీవితంతో పోరాడింది. శిక్ష పూర్తయినా విడుదల చేయనందుకు సహ ఖైదీలతో కలిసి నిరాహార దీక్ష చేసింది. ప్రభుత్వం హజారీబాగ్ జైలు నుంచి విడుదల చేసిన 34 మంది ఖైదీల్లో పారో ఒక్కటే మహిళ. నిజంగానే పారో విడుదలైందా? బహుశా జైలు గోడల మధ్య నుంచి మాత్రమే విడుదల జరిగింది. ఇన్నేళ్ల తర్వాత పెద్దబిడ్డ తనను గుర్తు పడుతుందా, అసలు తాను గుర్తు పట్టగలదా అనుకుంటూ ఆత్రుతగా ఊరికి చేరుకున్న పారో మరో పిడుగుపాటుకి గురైంది. పారో జైలుకి వచ్చిన ఏడాది లోపే అనారోగ్యంతో పెద్ద కూతురు కన్నుమూసింది. ఇప్పుడు రిమాండ్ ఖైదులో ఉన్న రెండో కూతురి కోసం పారో ఇక పోరాటం కొనసాగించాలన్నమాట. అమ్మ కడుపులో ఉండగానే ఊపిరి కాపాడుకోవడానికి మొదలయ్యే పోరాటం కన్ను మూసేదాకా ఆడవాళ్లకి కొనసాగుతూనే ఉంటుంది. పారోకి పోరాటం కొత్త కాదు. పోరాడి తీరుతుంది.
‘ఒక పారో కథ’ ను అనూరాధ చెప్పిన తీరు ప్రత్యేకమైనది. ఈ కథావస్తువే తెలుగు సాహిత్యానికి కొత్తది. అద్భుతమైన శిల్పనిర్మాణ చాతుర్యం ‘ఒక పారో కథ’లో కనిపిస్తుంది. జైల్లో అల్లరల్లరితో నిద్ర లేకుండా చేసే పిల్లుల గోలతో కథ మొదలవుతంది. విపరీతమైన చలి వణికించే హజారీబాగ్ జైలులో గోనె పట్టా మీద తమకు ఇచ్చిన రెండు కంబళ్లను ఒత్తుగా మడిచి పేర్చుకుని ఐదున్నర అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పు గల పక్క మీద ఒదిగి పడుకుంటారు ఖైదీలు. ‘కాళ్లు నిటారుగా చాచితే గోడ తగులుతుంది. కొంచెం పైకి జరిగితే అవతల పడుకున్న వాళ్లకి తగులుతారు’. ఖైదీల కాళ్ల దగ్గర కంబళ్ల మీద వెచ్చగా పడుకునే పిల్లులు తెల్లవారకముందే కంబళ్ల మీదే దొడ్డికి పోయి పారిపోతాయి. ‘కర్మకాలితే’ ఖైదీల బట్టలు కూడా ఖరాబు అయిపోతాయి. ‘ఆ కంపు బట్టల్ని కటకటాల్లోంచి బయటకు విసిరేసి చలికి వణుకుతూ ఉండాల్సిందే’ . ఉతికినా చలికాలం ఆరవు. ఖైదీలు డ్యూటీలు వేసుకుని, పిల్లులు పక్కలు పాడు చేయకుండా రాత్రంతా కాపలా కాసే హజారీబాగ్ జైలు వాతావరణాన్ని పాఠకులకు పరిచయం చేస్తుంది రచయిత్రి.
అటువంటి ‘వెధవ పిల్లులు’ అంటే పారోకి మాత్రం మహా ప్రేమ. రుదన, సుదన, బుదన అనే పేర్లుతో ఆమె పిలిచే పిల్లులు జైల్లో చేసే అల్లరీ, ఆగం అంతా ఇంతా కాదు. ఖైదీలు దాచుకున్న ఆహారాన్ని కాజేస్తుంటాయి. అచ్చం పిల్లల్ని మందలించినట్టే పారో పిల్లుల్ని మందలిస్తుంది. బుజ్జగిస్తుంది. బుద్ధిమాటలు చెబుతుంది. తన పిల్లుల మీద ఫిర్యాదు చేసిన వాళ్లకు సర్ది చెబుతుంది. వినకపోతే మీదే తప్పంటూ తిరగబడి కేకలేస్తుంది. పిల్లులతో పెనవేసుకున్న పారో అనుబంధాన్ని ముచ్చటగా వివరిస్తూనే రచయిత్రి, పారో పిల్లల కథ చెబుతుంది. తన రెండో కూతురు రేప్‌కి గురైందని తెలిసినప్పుడు కూడా పారో పిల్లులను నిర్లక్ష్యం చేయలేదు. ‘జైలు తిండి పిల్లులు కూడా ముట్టవు. వాటికి పారో క్యాంటీన నుంచి బిస్కట్లు, మైదాతో చేసిన నమ్కిన వంటివి తెప్పించి పెట్టేది’. ఖైదీల పిల్లల కోసం పాలు, పళ్లు పంచే టైంలో పిల్లలు లేకపోయినా పిల్లుల కోసం పారో గిన్నె పట్టుకుని క్యూలో నిలబడేది. ‘ి కుంటిపిల్లి బుధాన సహా అన్నీ బుద్ధిగా ఆమె వెనుకే ఎస్కార్ట్ పార్టీలా క్యూలో నిలబడేవి.’ పారో విడుదలై వెళ్లిపోగానే తిండి కూడా ముట్టకుండా బుధాన చచ్చిపోయింది. సుదన, రుదనలు ఎటో వెళ్లిపోయాయి.
’ఇప్పుడు కొత్త పిల్లులు వచ్చాయి. వాటికి క్రమశిక్షణ నేర్పేందుకు పారో మాత్రం లేదు’ అని విచారపడుతుంది రచయిత్రి కథాంతంలో. ఇట్లా పిల్లులతో మొదలై పిల్లులతోనే ముగిసినా ఈ కథ చెప్పేది మాత్రం నేరస్థురాలిగా జీవిత ఖైదు అనుభవించిన పారో గురుంచే. నేరం చేయకనే జీవిత ఖైదు అనుభవించిన పారో రెండో కూతురు మున్నీ గురించే. నిజానికి ఇది మాత్రమే కాదు.. ి కాళ్లు లేకుండా దేశంలో దేకుతున్న న్యాయం గురించే రచయిత్రి పిల్లులూ పిల్లల పేరుతో, వ్యూహాత్మక శైలితో ఈ కథ చెప్పారని మనకు అర్థం అవుతుంది.
ఎమ్మెస్ రామారావు పాడిన ‘ ఈ ప్రశాంత విశాల సౌధంలో’ అనే పాటను శ్రావ్యంగా సౌమ్యంగా పాడే అనూరాధ, హజారీబాగ్ జైల్లో అన్నేళ్లు ఎలా ఉందా అని తలచుకున్నపుడు, అలా ఉండబట్టే ఈ కథ వచ్చింది కదా అనిపించినా సరే దుఃఖం తన్నుకొస్తుంది. ఇప్పటికీ కేసుల పేరుతో తిప్పుతూ ఆమెను మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేస్తున్న వ్యవస్థలో అచేతనంగా ఉన్నందుకు సిగ్గు వేస్తుంది. జైల్లోనూ, బయటా పోరాడుతూనే ఇంత గొప్ప కథను అందించిన బి.అనూరాథను తెలుగు కథ గుండెలకు హత్తుకుంటుంది.
*
విలువైన పుస్తకాన్ని, దానిలోని ‘నిజమైన’ కథనీ (నిజాలెప్పుడూ తట్టుకోలేనంత భయానకమైనవి), గుండె దిటవు పారోనీ పరిచయం చేసినందుకు థ్యాంక్యూ ఉమన్నా..
కదిలించే కథను పరిచయం చేసారు. అనురాధ గారు జైల్లో పరిస్థిని మనసు కదిలించేలా రాసారు.
ఈ కథలను ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచికలలో వరుసగా చదివాను .ఆమె గురించి తెలుసుకున్నకొద్దీ ఒక సమూహంగా మనం మానవతా విలువలను ఏట్లో కలిపేశామని దుఃఖం కలుగుతుంది.
ఎంత విషాదం,. ఈ కథలో. మానవజీవితంలో. ఇది ఒక పారో కథ. జైళ్లనిండా ఇంకా ఎన్ని వేలమంది వున్నారో తలుచుకుంటే గుండె బేజారవుతుంది