ఓడలు నిత్యం నీటిలో తేలుతూనే ఉంటాయిగనుక, నీటిలో ఉండే ‘హల్’అనే భాగాన్ని, ముఖ్యంగా ప్రొపెల్లర్, చుక్కాని – ఇతర కీలకమైన భాగాలను తనిఖీ చెయ్యడం, అవసరమైతే మరమ్మత్తులు నిర్వహించడం సాధ్యపడదు. కొంతమేరకు, లేదా అత్యవసర పరిస్థితులలో గజ ఈతగాళ్లని (అంటే డైవర్స్‌ని) వినియోగించి ఈ పనులను కొంత వరకూ చేబట్టవచ్చు. నీళ్లల్లో నిరంతరం మునిగి ఉండే హల్‌పై గుల్లలు అతుక్కుపోతాయి – ముఖ్యంగా ఉష్ణ ప్రాతపు సముద్రాలలో. వాటిని ఎప్పటికప్పుడు తొలగించకపోతే ఓడ వేగం పడిపోతుంది; లేదా అదే వేగానికై వెచ్చించాల్సిన ఇంధనం వాడుక, ఖర్చు బాగా పెరిగిపోతాయి. అందుకే సుమారుగా రెండేళ్లకి ఒకసారి ఓడల్ని డ్రైడాక్‌లో ఉంచి, అండర్‌వాటర్ తనిఖీలు, మరమ్మత్తులు, హల్‌ని శుభ్రపరచడం, కొత్తగా రంగులుపూసి ముస్తాబు చెయ్యడం అవసరం. దీన్నే డ్రైడాకింగ్ అంటారు.

సుమారుగా నెల్లాళ్లపాటు సాగే ఈ కార్యక్రమం కోసం ఓడల్ని నిలిపివేసినప్పుడు, వాటిపై ఖర్చే తప్ప ఆదాయం ఉండదు. ఓడల యజమానులు సత్వరంగా ఈ తంతుని ముగించుకొని మళ్లీ యథావిధిగా సరకుల రవాణాని చేబట్టాలని కోరుకుంటారు – సహజంగానే. ఓడల్ని సముద్రయానానికి అనువుగా, అన్ని సర్టిఫికేట్లు చెల్లుబాటులో ఉండేలా చూసుకోవడం అవసరం. ఎలాగూ నెల్లాళ్లబాటు సాగే విరామం గనుక ఇతర మరమ్మత్తులు, ముఖ్యంగా ఇంజిన్ రూంకి సంబంధించిన పనులు చేబడతారు. పాత ఓడలు అంటే 15 ఏళ్ల వయసుకు పైబడ్డవాటిల్లో మరమ్మత్తులు, వాటికయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి.

నా మొదటి ఓడలో – అంటే నేను జూనియర్ ఇంజినీరుగా ఉన్నప్పుడే రెండు సార్లు – ఒకసారి సింగపూర్‌లో, రెండవసారి ఇంగ్లండులోని ‘న్యూకేసిల్-అపాన్-టైన్’లో డ్రైడాకింగ్ కోసం ఆగాం. న్యూకేసిల్‌లో ఒక గుర్తుండిపోయే అనుభవం కలిగింది. అది చరిత్రకారులకు కూడా ఆసక్తి కలిగించే చరిత్ర పాఠం అవుతుందని అప్పుడు ఊహించలేదు.
మొదటి వారంలోనే మైఖేల్ (మైక్) ఓబ్రయన్ అనే ఐరిష్ యువకుడితో స్నేహం ఏర్పడింది. అతడొక వెల్డరు. వయసు పాతికేళ్లు ఉంటుందేమో. అంటే సుమారుగా అప్పటి నా వయసే. రెండవ ప్రపంచ యుద్ధంలో రాయల్ నేవీలో సీమేన్‌గా పనిచేసి, యుద్ధనౌకలో బొంబాయి వెళ్లిన తన తండ్రిని పరిచయం చేశాడు. ముగ్గురం డ్రైడాక్‌కి దగ్గరలో ఉన్న ఐరిష్ పబ్‌కి వెళ్లి, గిన్నెస్ బ్రౌన్ బీరు తాగుతూ కూర్చున్నప్పుడు, ఆయన తన ఙ్ఞాపకాలను నాతో పంచుకున్నాడు. ఐరిష్‌వాళ్లకీ, ఇండియన్స్‌కీ చాలా పోలికలు ఉన్నాయన్నాడు. పెద్ద ఉమ్మడి కుటుంబాలు, బలమైన సంబంధాలు, స్థిరమైన మత విశ్వాసాలు, (ఇంగ్లీషు వాళ్లల్లా కాకుండా) మనసువిప్పి మాట్లాడడం, తొందరగా స్నేహాలు చెయ్యడం – ఇట్లాంటివి అన్నమాట. ఐరిష్ ప్రజలంతా సహజకవులే అన్నాడు. అతని ఐరిష్ దేశభక్తి నన్ను కదిలించింది. అందులో ఇంగ్లీషు వారిపట్ల తీవ్రమైన వ్యతిరేకత మిళితమై ఉంది.
మా నాన్నగారికి మేనమావ అయ్యే వి.వి. గిరిగారు, డబ్లిన్‌లో చదువుకున్న రోజుల్లో ఐరిష్ స్వాతంత్ర్య పోరాట యోధులతో చెయ్యకలిపాడనీ, ఆయన కార్మిక సంఘాల నాయకుడిగా ఎదిగి, చివరికి దేశాధ్యక్షుడిగా వ్యవహరించాడనీ చెప్పినప్పుడు అతడు లేచి, నన్ను కౌగలించుకున్నాడు.
“నాన్నా! తాగింది చాలు, ఇంటికిపోదాం, పద!” అన్నాడు మైక్, చిరాగ్గా. అతనికి ఇవేవీ అంతగా పట్టవు.
తండ్రి టాయ్‌లెట్‌కి వెళ్లగానే, ఆయన ప్రవర్తనను మన్నించమని నన్ను వేడుకున్నాడు, మైక్.
“అబ్బే, మీ నాన్నగారి కంపెనీ నాకు చాలా సంతోషం కలిగించింది,” అన్నాను.
పెద్దాయన టాయ్‌లెట్‌నుంచి తిరిగి వస్తూనే, “’కార్’ని కూడా మన ఇంటికి తీసుకుపోదాం, ఇవాళ మనింట్లోనే భోజనం చేస్తాడు. మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పు,” అనేశాడు.
ఇంగ్లీషు వాళ్లయితే ఎన్ని సంవత్సరాల పరిచయం, స్నేహం ఉన్నా, ‘పై వాళ్లని’ అంత త్వరగా ఇళ్లకు పిలవరు. ‘ఏం చేద్దాం?’ అన్నట్లు మైక్‌కేసి చూశాను. “నాన్న రమ్మంటున్నాడుకదా? నువ్వు రావాల్సిందే,” అనేశాడు. బార్‌లో ఉన్న పబ్లిక్ ఫోన్‌నుంచి అతిథి వస్తూన్న సంగతి ఇంట్లో వాళ్లకి చెప్పాడు.
ముగ్గురం సిటీ బస్సెక్కి మైక్ ఇంటికి చేరుకున్నాం. వాళ్లది నిజంగానే పెద్ద కుటుంబం. ఇల్లు చిన్నదే అయినా అంతా కలిసే ఉంటున్నారు. మైక్ వదిన, తన చంటిబిడ్డను నా చేతిలో పెట్టింది. అప్పటికి మరీ అంత చంటిపిల్లల్ని ఎలా ఎత్తుకోవాలో నాకు తెలియదు. కంగారు పడ్డాను. “తలక్రింద చెయ్యి పెట్టు. ఇదిగో, ఇలా,” అన్నాడు, మైక్ తండ్రి. ఆ పాఠం నాకు బాగా గుర్తుండిపోయింది. తరువాతి రోజుల్లో ఉపయోగపడింది. ఆ రోజు వాళ్లింట్లోనే భోజనం. నేను వెజిటేరియన్‌ని అనుకొని వాళ్లంతా గాభరాపడ్డారు. “ఫరవాలేదు, అన్నీ తింటాను,” అన్నప్పుడు ఊపిరి పీల్చుకున్నారు.
మరి కొద్దిరోజుల్లో ఓబ్రయన్ కుటుంబాన్ని డిన్నర్‌కని ఒక ఇండియన్ రెస్టారెంట్‌కి ఆహ్వానించాను. యూకేలోని చాలా ‘ఇండియన్’ రెస్టారెంట్‌ల మాదిరిగానే, దాన్ని కూడా బంగ్లాదేశీయులు నడుపుతారు. మైక్, అతని ఇద్దరు అన్నలు, తండ్రి వచ్చారు. చిన్న పిల్లల్ని, పెద్దవాళ్లనీ చూసుకోవాలని చెప్పి ఆడవాళ్లెవారూ రాలేదు.
పిఛర్ (జగ్గు)తో డ్రాఫ్ట్ బీరు ఆర్డర్ చేసి, ‘ఛీర్స్!’ చెప్పాం. మరి కాసేపట్లో బాంగ్లాదేశీ వైటర్ వచ్చాడు.
“ఏం తింటారు?” అని మా మిత్రులని అడిగాను.
“నువ్వే ఆర్డర్ చెయ్యి, ఇండియన్ ఫూడ్ కదా?” అన్నాడు, మైక్.
వెయిటర్‌కి ఇంగ్లీషులో ఆర్డర్ ఇచ్చాను. అతడు తన నోట్‌బుక్‌లో రాసుకొని వెళ్లిపోయాడు.
“మీ భాషలో ఎందుకు ఆర్డర్ చెయ్యలేదు?” అన్నాడు మైక్.
“నాకు బెంగాలీ రాదు; హిందీ అంతంత మాత్రమే. వెయిటర్‌కి తెలుగు రాదు. అంచేత ఇంగ్లీషే శరణ్యం…” ఇలా ఏదో చెప్పేందుకు ప్రయత్నించాను.
అప్పటికే రెండు బీర్లు సేవించిన మైక్ పెద్దన్నయ్య కెవిన్, నవ్వుతూనే ఇలా అడిగాడు – “ఇంగ్లీషు వాళ్లు గనక మీ దేశాన్ని పాలించకపోయి ఉంటే ఇవాళ నువ్వు ఎలా డిన్నర్ ఆర్డర్ చేసేవాడివి?”
నాకు నిషా దిగిపోయింది. ‘అవును సుమా, నిజమే కదా!?’ అనుకున్నాను. మిగతావాళ్లంతా నా జవాబుకోసం కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. ఒక్క క్షణం ఆలోచించి,
“ఇంగ్లీషులో కాకుంటే – ఇవాళ్టి డిన్నర్ బహుశా ఫ్రెంచిలోనో, డచ్‌లోనో, లేదా పోర్చుగీసు భాషలోనో ఆర్డర్ చేసేవాడిని; మా భాషల్లో మాత్రం కాదు,” అన్నాను.
అందరూ జోక్‌గా తీసుకొని పెద్దగా నవ్వేశారు. మళ్లీ “ఛీర్స్!” అంటూ బీరు మగ్గులు పైకి లేపారు. మైక్ తండ్రి, “అవును, ఇండియా చాలా పెద్ద దేశం; అక్కడ ఎన్నో భాషలుంటాయని విన్నాను,” అన్నాడు, మర్యాదపూర్వకంగా.
కెవిన్ ఊరుకోకుండా, “ఎన్ని భాషలుంటే ఏం లాభం? ఏదో ఒక యూరోపియన్ భాష లేకపోతే, ఇవాళ మన పని పస్తు!” అని నవ్వాడు.
“అది నిజమే. నేనయితే ఇంగ్లీషులో కాకుండా, ఫ్రెంచిలో ఆర్డర్ చెయ్యడానికి ఇష్టపడే వాడిని. ఫ్రెంచి వాళ్ల తిండి చాలా ప్రసిద్ధికెక్కింది. ఇంగ్లీషు వాళ్లకి ఫిష్ అండ్ ఛిప్స్, యార్క్‌షైర్ పుడ్డింగ్ తప్ప ఏమున్నాయి?” అన్నాను, ఉక్రోషంగా.
“నువ్వు రుచి చూడాల్సింది బోరింగ్ ఇంగ్లీషు తిండి కాదు, అసలైన ఐరిష్ వంటకాలు! మరోసారి మా ఇంటికి వచ్చి తిందువుగాని. ఈసారి ముందుగా ప్లాన్ చేద్దాం,” అన్నాడు మైక్ నాన్న, పెద్ద మనసుతో. ఆ సాయంత్రం సరదాగా ముగిసిపోయింది. కానీ ఈ కథ ఇంతటితో ముగియలేదు.
ఈ సంఘటనను కథలంటే చెవికోసుకొనే మిత్రుడు సురాకి టూకీగా చెప్పాను. అతడు ఢెల్లీలోని తన మిత్రులకి (బహుశా కొంత డ్రామా చేర్చి) చెప్పాడట. ఆ నోటా, ఈ నోటా ప్రాకి, చివరికి ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ – భారతదేశం వలసగా మారిన క్రమాన్ని చర్చించిన సెషన్‌కి చేరుకుంది! ఇది ఎలా జరిగిందంటే –
మొఘల్ పాలన, అంతర్యుద్ధాలు – వీటి మూలంగా దేశం బలహీనపడి, యూరోపియన్ల బారిన పడిందని హిందుత్వ చరిత్రకారులు వాదించారు. సామ్రాజ్యవాద, వలసవాద విజయం ఆనాటి చారిత్రక అనివార్యత అనీ – ఒక్క భారతదేశమే కాకుండా, వివిధ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు వలసలుగా మారిపోయాయనీ, నిజానికి 1857లో హిందూ-ముస్లిం పాలకులు, సైనికులు సమైక్యంగా బ్రిటిష్ పాలకులపై యుద్ధం చేశారనీ అన్నారు, మార్క్సిస్టులు. వాదనలు హోరాహోరీగా సాగాయట. అప్పటికింకా సంస్కారవంతమైన చర్చలు, వాదనలు సాధ్యపడేవి. మోడరేటర్‌గా వ్యవహరించిన మేధావి, నా న్యూకేసిల్ అనుభవాన్ని సంక్షిప్తంగా పేర్కొని,
“ఆనాడు, ఆ బాంగ్లాదేశీ రెస్టారెంట్‌లో ఆర్డరు చెయ్యడం – ఇంగ్లీషులో, మహా అయితే మరో యూరోపియన్ భాషలో మాత్రమే సాధ్యం,” అని ముగించాడు.
ఇరు పక్షాలూ నవ్వుకొని, శాంతించి, తరువాతి సెషన్‌లోకి వెళ్లిపోయారట!
[చిత్రాలు: జీ.వి. రమణారావు, సీనియర్ మెరైన్ ఇంజినీర్]








Intestering things to know Sudhakar garu
“ఈ సంఘటనను కథలంటే చెవికోసుకొనే మిత్రుడు సురాకి టూకీగా చెప్పాను. అతడు ఢెల్లీలోని తన మిత్రులకి (బహుశా కొంత డ్రామా చేర్చి) చెప్పాడట. ఆ నోటా, ఈ నోటా ప్రాకి, చివరికి ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ – భారతదేశం వలసగా మారిన క్రమాన్ని చర్చించిన సెషన్‌కి చేరుకుంది!”
మీ అనుభవాలు బాగా చెపుతున్నారు.
శాస్త్రి గారిలా చెప్పాలంటే – పంతులూ గొప్పగా సెపుతున్నవు కతలాన్ని . వింతకి ఆ వొతెల్లో ఎతేతి తినేసినరేతి. ఏతో కత సెప్పతమ్ వంతే మాతలనేసుకుంతవ్.