కొంత కన్నీళ్ల తేమ
రెప్పల వైపర్స్ ఆపి … తుడిచి .. విడిచీ
ఆకాశ వీధి నుంచి
భూమి మీదికి పాదం
బినా పరదా ఆలింగనం!
అపుడు అక్కడ
నేనొక సూఫీ సమాధి ముందు
ఎవరో మొక్కు చెల్లించి పోయిన
ఆకుపచ్చ చాదర్ ని!
దాదా, దాదిలు…
మమ్మల్నిడిసి కొంత దూరం నడిసిండ్రు
ముందుకు జరిగిండ్రు చింతకిందకి
విసుగెత్తి, ఇంక లేవకుండ విరామమెరుగుతున్నరు!
ఎన్నెన్ని మెట్లెక్కినా అదే డెస్టినేషన్!
నలభై రోజుల దినం చెహల్లుమ్
ఫాతెహాలిచ్చిన మాంసం సీకులు
కాల్చిన బూడిద కార్జమ్ ముక్కలు
ఎపుడైనా తిన్నవా సీకుకు గుచ్చిన మరణాన్ని!
ఫాతెహా ఇచ్చిన బగారన్నం ముక్కలు చేతినిండా
కంటినీళ్లు నోట్లే నీళ్లు ఎప్పుడన్నా అలౌకికించినవా
రెండు రుచుల సమ్మేళనం!
చుట్టూ మనిషిని పోగొట్టుకున్న మౌనం
ఘనీభవించి… ఇంట్ల కూడా చింత కింది మౌనం!
ఎల్లెడెలా వ్యాపించిన ఊదు పొగ
బంధాల్నిడిసి పోలేక పోతున్న ఆత్మలా
గోడల సున్నానికి పడ్డెన్ని వాయిదాలు
మనిషి పోయినంక గోడలు తెల్లగయినయ్
నల్లగా తేలిన పాత గోడల జాడలు అప్పులెక్క
కొత్త బట్టలే గని గరగరమనయ్
మౌనం వహిస్తయి
మంది బలగం మస్తుగయితరు
నవ్వులు మొకం చాటేస్తయ్
ఎటు చూసినా శూన్య గంభీరత
మనిషి పోయిన ఖాళీ
చేతిల జారత్ పుట్నాలు ఘల్లుమంటయ్
ఊల్లోళ్లు పోయిన మనిషి మీద
ముచ్చెట పెట్టినట్టు
ఊరి చివర పట్టాల మీద
కీక వెట్టుకుంట పోతుంటది కాలం
కొందర్నెక్కిస్తది కొందర్ని దింపుతది
ఔ … నాకొక ఊరుండెడిది!
*
painting: satya birudaraju
Beautiful lines 👌
మౌనం చింతాక్రాంతం
Superb. Seekuku guchhina maranaalu
ఎప్పుడైనా తిన్నావా సీకుకు గుచ్చిన మరణాన్ని..
ఒళ్ళంతా జలదరించింది ఒక్కసారిగా..
మనిషి పోయిన ఖాళీ
చాలా బావుందండీ
ఒకప్పుడు నాకొక ఊరుండేది!
అన్న పరిస్థితి వస్తుందేమో!
నాదేశం కాని దేశం కాని దేశంలో
నాకేమి లేని ప్రదేశంలో… అన్నట్లు.
ఊరి చివర పట్టాల మీద
కీక వెట్టుకుంట పోతుంటది కాలం
కొందర్నెక్కిస్తది కొందర్ని దింపుతది.
throughout poem.. emotinally