స్క్రీన్ ప్లే అంటే ఏమిటీ? వాటికి ఏమైనా నియమనిబంధనలు వున్నాయా? అనే ఆసక్తి ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది.
మునుపు సినిమా రంగంలోనే స్క్రీన్ ప్లే అనే మాట వినిపించేది. టీవీ, షార్ట్ ఫిలిం రంగాలు విపరీతంగా విస్తరించాక స్క్రీన్ ప్లే నైపుణ్యానికి పెద్ద గిరాకి వచ్చింది. ఆస్కార్ లో స్క్రీన్ ప్లేకు రెండు అవార్డులు ఇస్తున్నారు; Best Original Screenplay, Best Adapted Screenplay.
ఏ కళకైనా లక్ష్యం ఒక్కటే; భావోద్వేగాల్ని లక్ష్య సమూహానికి (Target Group) చేరవేయడం. వాళ్లు పాఠకులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, శ్రోతలు కావచ్చు. భావోద్వేగాల్ని పటిష్టంగా ప్రసారం చేయగలిగినపుడే కళా ప్రక్రియ ఆశించిన ఫలితాలను సాధిస్తుంది.
సినిమా నిడివి రెండు నుండి రెండున్నర గంటలు వుంటుంది. ఏ మనిషి కూడ రెండున్నర గంటలు ఏకధాటిగ ఏడ్వనూలేడు నవ్వనూలేడు. అంచేత Target Groupకు రెండున్నర గంటల వ్యవధిలో విభిన్న భావోద్వేగాల్ని ప్రసారం చేయడం ఎలా? అనేది పెద్ద సవాలు. ఈ సవాలుకు సమాధానంగానే అనేక స్క్రీన్ ప్లే టెక్నిక్ లు వచ్చాయి.
మనిషి శరీరంలో Dopamine, Serotonin, Rines adrenaline, cortisol వంటి కొన్ని గ్రంధుల ఉత్పత్తిలో కలిగే హెచ్చుతగ్గుల వల్ల ఆనందం, ఆగ్రహం, శోకం, భయం వంటి భావోద్వేగాలు కలుగుతాయని శరీరధర్మ నిపుణులు అంటున్నారు. అంతెందుకు, lacrimal glands పని చేస్తేనే మనకు కన్నీళ్ళు వస్తాయి. సినిమాల్లో హాస్య విభాగాన్ని ఎంచుకునేవారు డోపమైన్ హార్మోన్ ను లక్ష్యంగా చేసుకుంటారు. హారర్, సస్పెన్స్ జానర్ ను ఎంచుకునేవారు అడ్రెనలిన్ హార్మోన్ ను చురుగ్గా మారుస్తారు. సినిమాలో కరుణరసాన్ని పండించాలనుకున్నవారు లాక్రిమినల్ గ్లాండ్స్ కు పని చెపుతారు. వైద్య ఆరోగ్యరంగం ముందుకు తెస్తున్న అనేకానేక కొత్త నిర్ధారణల్ని కూడ స్వీకరిస్తే స్క్రీన్ ప్లే టెక్నిక్ మరింతగా అభివృధ్ధి చెందుతుంది.
స్క్రీన్ ప్లే అంటే కాగితం మీద సినిమా చూపించడం. సాంకేతిక భాషలో చెప్పాలంటే ఏ ఫ్రేము తరువాత ఏ ఫ్రేము రావాలో చెప్పడం. జేపెగ్ (JPG)లో వున్న ఫొటోలని ఎంపి4 (MP4)లో సెకనుకు 25 చొప్పున చూపిస్తే అదే మూవీ అయిపోతుంది. దాని పేరే చలన చిత్రం. ఒక్కొక్క సినిమాలో నిడివినిబట్టి లక్షన్నర నుండి, రెండున్నర లక్షల వరకు ఫ్రేములు వుంటాయి. ప్రతి ప్రేమూ ఒక దృశ్యమే; ఒక చిత్రమే. అందుకే స్క్రీన్ ప్లేను చిత్రానువాదం, దృశ్యానువాదం అంటున్నారు. కథను మంచి స్క్రీన్ ప్లేతో నిర్మించినపుడే అది ప్రభావశీలంగా వుంటుంది.
అయితే, ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన నియమం ఏమిటంటే, గొప్ప సినిమాల నుండే గొప్ప టెక్నిక్ పుడుతుంది. ఆ టెక్నిక్ మళ్ళీ మరికొన్ని గొప్ప సినిమాల సృష్టికి పనికి వస్తుంది. అందుకే స్క్రీన్ ప్లేలను అధ్యయనం చేయడం ఒక అవసరంగా మారింది.
సినిమాలకు మాతృక నాటకం కనుక మన తొలి స్క్రీన్ ప్లే నియమాలన్నీ నాటకరంగంలోనే పుట్టాయి. క్రీస్తు పూర్వకాలపు కాళిదాసు రాసిన నాటకాల్లో ‘మాళవికాగ్నిమిత్రము’, ‘విక్రమోర్వశీయము’ కన్నా ‘అభిజ్ఞాన శాకుంతలము’ గొప్ప విజయాన్ని సాధించింది. ఈ నాటకాన్నే స్క్రీన్ ప్లేకు తొలి ప్రామాణికంగా పరిగణిస్తారు. స్క్రీన్ ప్లే రంగంలో కృషి చేయాలనుకున్నవాళ్ళు ముందుగా చదవాల్సింది ‘అభిజ్ఞాన శాకుంతలము’ నాటకాన్ని. దీని మూలం సంస్కృతంలో వున్నప్పటికీ 1889లో కందుకూరి వేరేశలింగం అనువాదం చేసిన తెలుగు కాపీ (1931 నాటి రెండవ ముద్రణ) ఇప్పుడు అందుబాటులో వుంది. ఇంకా ఆసక్తి వున్నవాళ్ళు ఎనిమిదవ శతాబ్దపు కవి భవభూతి రాసిన ‘ఉత్తర రామ చరిత్ర’ను కూడా పరిశీలించవచ్చు.
అన్ని కళలు సమాజం నుండే పుట్టి తిరిగి సమాజానికి చేరుతాయి. కళకు ఆరంభమూ గమ్యమూ సమాజమే. ప్రదర్శన కళల్లో ఈ అనుబంధం నేరుగా ప్రత్యక్షంగా వుంటుంది.
మనుషుల జీవితాల్లో సుఖదుఃఖాలు రెండూ వుంటాయి. నాటక రచయిత వాటిని గమనిస్తాడు. అనుభవిస్తాడు. వాటి మీద కొన్ని అభిప్రాయాలను కూడ ఏర్పరచుకుంటాడు. ఆ భావోద్వేగాలన్నింటినీ కొన్ని పాత్రలు సంఘటనల ద్వార వ్యక్తం చేస్తాడు. ఆ ప్రసారాల్ని అందుకున్న ప్రేక్షకులు ఆ భావోద్వేగాల్ని తమ అనుభవంగానే భావించి అనుభూతి చెందుతారు.
నాటకం ఒక దృశ్యకావ్యం. ప్రదర్శనకావ్యం, ప్రేక్షక కావ్యం, రూపకం అనేవి సాంప్రదాయిక అర్థంలో నాట్యానికి నాటకానికి పర్యాయపదాలే. క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందిన భరతముని నాట్య లక్షణాలను రూపొందించాడు. అంతేగాక, రూపక నిర్మాణంలోని విభిన్న విభాగాలను, ఉపవిభాగాలను కూడ వివరించాడు. మన ఉపఖండపు స్క్రీన్ ప్లే సిధ్ధాంతవేత్తల్లో భరతుడు ప్రముఖుడు. ప్రధముడు అన్నా తప్పుకాదు.
బమ్మెర పోతనామాత్యుని ‘శ్రీమదాంధ్రభాగవతం’ లోని ‘వామనచరిత్రము’లో వామనుడు త్రివిక్రముడిగా విశ్వరూపం దాల్చే సన్నివేశం వుంటుంది. ప్రాచీన తెలుగు సాహిత్యంతో కొద్దిపాటి పరిచయమున్న వారికి కూడ గుర్తుండిపోయే రెండు గొప్ప పద్యాల్ని పోతన ఆ సన్నివేశంలో రాశాడు.
వీటిల్లో మొదటిది “ఇంతై అంతై వటుడింతై …” అనే పద్యం. “ఇంతైనాడు, మరింకింతైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుడికి ఇంకా పైకి సాగాడు, మహర్లోకం దాటినంతైనాడు, సత్యలోకంకన్నా ఉన్నతంగా ఎదిగాడు. బ్రహ్మాండమంతా నిండిపోయాడు” అనేది దీనికి (చీమలమర్రి బృందావనరావు) తాత్పర్యం.
ఈ వరుసలో రెండవ పద్యం “రవిబింబంబుపమింప…”. ఈ పద్యలో వామనుడు ఎంతగా ఎదిగిపోయాడో సూర్యునితో పోల్చి చెపుతాడు పోతన. ముందు వామనునికి సూర్యుడు గొడుగులా వుంటాడు. తరువాత శిరోరత్నము అవుతాడు. ఆ పిదప చెవిపోగు అవుతాడు. ఇంకా కిందికి దిగి మెడలో హారం అవుతాడు. ఆ తరువాత దండకడియంగానూ, ముంజేతి కంకణంగానూ, మొలతాడులో గంటగానూ, కాలి అందెయగానూ మారిపోతాడు. చివరకు త్రివిక్రమునిగా మారిన వామనుని కాలి కింద పీఠం అయిపోతాడు. ఈ క్రమంలో సూర్యుడికీ వామనునికీ మధ్యగల పరిమాణం నిష్పత్తి (ratio) పూర్తిగా మారిపోతుంది. మొదట్లో వామనుడు సూర్యుని పరిమాణంలో లక్షవ వంతు కూడ వుండడు. చివరకు వామనుడు సూరునికన్నా లక్ష రెట్లు ఎక్కువ వుంటాడు. అంటే ఎంతగా ఎదిగాడో ఊహించుకోవలసిందే.
సినిమా చిత్రీకరణ భాషలో చెప్పాలంటే మొదటి పద్యంలో కెమేర ‘ఎక్స్ ట్రీమ్ టాప్- యాంగిల్’ లో మొదలయ్యి వామనుడి మీద పోకస్ చేస్తూ ‘ఎక్స్ ట్రీమ్ లో-యాంగిల్’ కు టిల్ట్-డౌన్ అవుతుంది. రెండవ పద్యంలో కెమేర ‘ఎక్స్ ట్రీమ్ లో-యాంగిల్’ లో మొదలయ్యి సూర్యుని మీద పోకస్ చేస్తూ ‘ఏక్స్ ట్రీమ్ టాప్ యాంగిల్’ కు టిల్ట్-అప్ అవుతుంది.
పాండవవనవాసం సినిమాలో హనుమంతుడు, భీముని మధ్య ఇలాంటి షాట్ ఒకటి వుంటుంది. సన్నివేశం మొదలయినపుడు భీముడు ఏనుగులా వుంటే హనుమంతుడు ఎలుకలా వుంటాడు. సన్నివేశం చివర్లో హనుమంతుడు ఆకాశమంత ఎదిగిపోతే అతని ముందు భీముడు పిపీలకంలా వుంటాడు. ఈ సన్ని వేశానికి దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. కెమేరామేన్ రవికాంత్ నగాయిచ్. పోతన వామనావతారం ఈ షాట్ కు ప్రేరణ అన్నా తప్పుకాదు.
Christopher Nolan సినిమా Inception (2010)లో కొన్ని ఆశ్చర్యకర సన్నివేశాలుంటాయి. ఒకే సమయంలో, ఒకే పాత్రలు, మూడు భిన్నమైన ప్రదేశాల్లో, మూడు భిన్నమైన కాలాల్లో, మూడు భిన్నమైన చలన వేగాలతో ప్రవర్తిస్తుంటాయి. కొంచెం గమనిస్తే ఇలాంటి కథన ఎత్తుగడ మహాభారత రచనలోనూ కొన్ని చోట్ల కనిపిస్తుంది.
జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెపుతున్న కథను, వేరే కాలంలో వేరే చోట శౌనకాది మహామునులకు సూతుడు చెపుతుంటాడు. భీష్మపర్వం మొదలయ్యాక ధృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర యుధ్ధ విశేషాలు చెపుతుంటాడు. అంటే, ఆ సన్నివేశంలో ఒకేసారి మూడుచోట్ల, మూడు కాలాల్లో story telling కొనసాగుతూవుంటుంది.
స్క్రీన్ ప్లే విషయంలో మార్క్సిస్టులు సాధారణంగా వెసెవొలొద్ పుదోవ్ కిన్ (Vsevolod Pudovkin 1893-1953), సెర్జీ ఐసెన్ స్టైన్ (Sergei Eisenstein 1898-1948) లను ప్రస్తావిస్తుంటారు. వీళ్లిద్దరూ సినిమా సిధ్ధాంతవేత్తలు. మూకీ సినిమాల రోజుల్లోనే వాళ్ళు గొప్ప ప్రభావశీలమైన సినిమాలను నిర్మించారు. మాంటేజ్ టెక్నిక్ ని వాళ్ళిద్దరూ అద్భుతంగా అభివృధ్ధిచేశారు. ఐసెన్ స్టైన్ నిర్మించిన ‘బ్యాటిల్ షిప్ ఆఫ్ పొటెమ్కిన్’ (1925), పుదోవ్ కిన్ నిర్మించిన ‘మదర్’ (1926) ఇప్పటికీ గొప్ప సినిమాలు.
ఆయాదేశాల్లో టెక్నిక్ పెరగడానికి అక్కడొక సాహిత్య సాంప్రదాయం వుంటుంది. లాటిన్ అమెరికా ప్రాంతానికి చెందిన కొందరు దర్శకులు ఇటీవల హాలివుడ్ లో మార్మిక వాస్తవికత (మేజికల్ రియలిజం) ధోరణిని ప్రవేశపెట్టారు. అదేమీ గాలిలో పుట్టలేదు. Jorge Luis Borges (1899), Gabriel García Márquez (1927-2014)ల కాలం నుండి లాటిన్ అమెరికా ప్రాంతంలో ఒక సాహిత్య సాంప్రదాయంగా మేజికల్ రియలిజం కొనసాగుతోంది. మన దేశంలో టెక్నిక్ పెరగడానికి మనకూ ఒక సాహిత్య సాంప్రదాయం వుంటుంది. మనం ముందు దాన్ని అధ్యయనం చేయాలి.
వచ్చిన చిక్కేమిటంటే విద్యాలయాల్లో పురాణాలనో, ప్రబంధాలనో బోధించే టీచర్లకు నవినగాయిచ్ ట్రిక్ ఫోటోగ్రఫీ గురించీ, క్రిష్టఫర్ నోలాన్ స్క్రీన్ ప్లేల గురించి తెలీదు. క్రిష్టఫర్ నోలాన్ సినిమాల్ని రివ్యూ చేసేవారికి వ్యాసుడు, కాళిదాసు, భవభూతి, పోతన, తిక్కన వాడిన టెక్నిక్ గురించి తెలీదు. దానితో టెక్నాలజీ అంతా పశ్చిమ దేశాల్లోనే వుందని ఒకరు, అసలు జ్ఞానం మొత్తం తూర్పు దేశాల్లోనే పుట్టిందని మరొకరు అర్థసత్యాలతో చెలరేగిపోతుంటారు. ఇది ప్రమాదకరం. ఒకరి గొప్పతనాన్ని మరొకరు గుర్తించి గౌరవిస్తే జ్ఞానమూ, విజ్ఞానమూ రెండూ ఇరువైపులా పెరుగుతాయి.
*
మంచివ్యాసం