అనేక ప్రక్రియల్లో సాహిత్య సృజన చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అడ్లూరి అయోధ్య రామ కవి. వరంగల్ జిల్లా తాటికొండ గ్రామంలో 1922లో జన్మించిన అయోధ్య రామ కవి కథావాటిక (1946), తెలంగాణ మంటల్లో (1948) అనే కథా సంపుటాల్ని వెలువరించారు. అంతేగాక ‘నైజాం ప్రజా విజయం’, ‘సంస్కరణలు’, ‘హైదారాబాద్ పై పోలీసు చర్యలు’ వంటి బుర్రకథలను, ‘ఆంధ్రకేసరి’, ‘ఘంటారావం’, ‘దీపావళి’ ‘తాటికొండ’ వంటి పద్య కావ్యాలను, ‘గేయమాలిక’, ‘స్వాతంత్ర్య గీతాలు’ వంటి గేయాలను,’అన్నపూర్ణేశ్వర శతకం’, ‘సీతారామ శతకం’, వంటి శతకాలను, ‘రుద్రమ్మదేవి’ తదితర నాటికలను రచించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఊరూరు తిరుగుతూ బుర్రకథలు చెప్పేవారు. విజ్ఞాన గ్రంథమాలను స్థాపించి పది వరకు పుస్తకాలు ప్రచురించారు. 1948-1950 మధ్య ‘భాగ్యనగర్’ పత్రికను నడిపారు. ఇటీవల తెలంగాణ సాహిత్య అకాడమి ‘తెలంగాణ మంటల్లో..’, అనే కథా సంపుటిని, ‘హైదారాబాద్ పై పోలీసు చర్యలు’ అనే బుర్ర కథను రెండింటినీ కలిపి ఒక పుస్తకంగా పునర్ముద్రించింది.
తెలంగాణలో నిరంకుశ నైజాం పాలనలో రజాకార్ల దౌర్జన్యాలను కథలుగా రాసి వాటికి ఆ కాలంలోనే ఒక సంపుటిగా తీసుకొచ్చిన ఏకైక కథకుడు అడ్లూరి అయోధ్య రామ కవి. వీటిలో ఆనాటి రజాకార్ల క్రూరమైన దాడులను అక్షరీకరించిన గొప్ప కథ ‘చీకటి రాజ్యం’
అవి నైజాం పాలనలో రజాకార్లు గ్రామాల మీద పడి రాక్షసకాండతో చెలరేగిపోతున్న కాలం. రజాకార్ల దాడులను ఎదుర్కోవడానికి ప్రజలు గ్రామ రక్షక దళాల్ని ఏర్పాటు చేసుకొని భయం భయంగా కాలం గడుపుతున్న రోజులు. ఒక రోజు గుట్టల పక్కన ఏర్పాటు చేసుకున్న ప్రజా రక్షక దళంపైన రజాకారులు దాడి చేశారు. దాన్ని ప్రజా రక్షక దళం తిప్పికొట్టింది. ఈ పోరాటంలో ఆరుగురు రజాకారులు చనిపోయారు. మిగిలిన రజాకార్లు గ్రామ రక్షక దళం చేతి నుండి తప్పించుకొని ప్రాణాలరచేత పట్టుకొని పారిపోయారు. దళం దొరికినకాడికి రజాకార్ల ఆయుధాలను స్వంతం చేసుకుంది. ఈ పరాభవాన్ని అవమానంగా భావించి ఈసారి మరింత ఎక్కువ మందితో ఆ చిన్న గ్రామంపై దాడి చేశారు రజాకార్లు. “గుండు దెబ్బతిని పడిపోయిన సాయన్నని, మైసన్నని కాళ్ళు చేతులు వారి తలలకున్న రుమాళ్లతోనే కట్టి తెచ్చారు రజాకార్లు. నాయకుని ఆజ్ఞ అయింది. అల్లాహో అక్బర్… నారయ తక్బీర్ కాలుతున్న గుడిసెలపై ఎగిరిపడ్డాయి మైసన్న, సాయన్నల కొనూపిరి శరీరాలు.’ దీనితో గ్రామ ప్రజలు భయపడి పోయి రక్షిత ప్రాంతమైన యూనియన్ ప్రాంతాలకు తరలిపోయి తలదాచుకుందామని నిశ్చయించుకుంటారు. అందులో గౌరమ్మ అనే వృద్ధురాలు 13 ఏళ్ల లక్ష్మి అనే ఆమె మనవరాలు కూడా ఉంది.
నిజానికి లక్ష్మి పేరు ‘హామీదా’. హమీదా తల్లి మరణిస్తుంది. తండ్రి రెహమాన్ ఊరు విడిచి రజాకార్లలో చేరిపోతాడు. అనాధగా మిగిలిన హమీదాను గౌరమ్మ చేరదీసి ‘లక్ష్మి’ అని పేరు మార్చి పెంచుకుంటుంది. భయంతో కదిలిపోతున్న గ్రామ ప్రజలు ఇంకొంత సేపైతే యూనియన్ ప్రాంతానికి చేరుకునేవారే కానీ ఇంతలోనే రజాకార్ల రాక్షస మూక అకస్మాత్తుగా వాళ్ళ మీద దాడి చేయడంతో వాళ్ళంతా చెల్లా చెదురయ్యారు. అయినా వాళ్ళ వెంటపడ్డారు రజాకార్లు. ఒక రజాకార్ చేతికి చిక్కిన లక్ష్మి విలవిలలాడుతుంది. ఆ రజాకార్ గొంతు తన తండ్రిదిగా గుర్తించి ‘బాబా… బాబా… అని పిలుస్తుంది. కానీ ఇదేమీ పట్టించుకోని ఆ రజాకారు లక్ష్మిని ‘కాఫిర్ కె లడికీ’ అని చీదరించుకుంటాడు. చివరాఖరికి వాడికి అనుమానమొచ్చి తన ఇనుప పిడికిట్లో ఉన్నది తన కూతురు హమీదానేనని గుర్తించి చలించి పోతాడు. హమీదా మూల్గీ మూల్గీ తండ్రి చేతిలోనే ప్రాణాలు విడుస్తుంది. ఇంతలో వెనుక నుండి వచ్చిన తుపాకీ దెబ్బకి రెహమాన్ కూడా నెలకొరుగుతాడు.
ఈ కథ ఆనాటి రజాకార్ల దమనకాండకి అక్షర రూపం. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి గుత్పలు, వడిసెలలు, కారంలను ప్రయోగించేవారు. ఈ కథ ఆనాటి రక్తసిక్త వాతావరణాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. “తిండి గింజలు, బట్టలు అన్నీ తగలబడిపోయినాయి. పశువుల్ని కూడా మంటల్లో వేశారు. పశువుల కంటే తుచ్చులైన రజాకార్లు”. ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా రజాకార్లను ఎదుర్కోవడానికి గ్రామాలు చేసిన వీరోచిత పోరాటం ఒక వైపు ప్రాణాలను కూడా తృణ ప్రాయంగా వదిలేసిన యువకుల త్యాగం మరో వైపు కనిపిస్తాయి. ఆనాటి సామాన్య ప్రజల త్యాగాలు లెక్క లేనివి. ఈ కథలోని గౌరమ్మ పాత్ర అలాంటిదే. తల్లికి తండ్రికి దూరమై అనాథగా మిగిలిన ‘హమీదా’ అనే ముస్లిం అమ్మాయిని చేరదీసి పెంచుతుంది. ఆ ఘోరకలిలో హిందువుల కుటుంబాలే కాదు, ముస్లింల కుటుంబాలు కూడా తీవ్రంగా నష్ట పోయాయని చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణ. ఇందులోని రెహమాన్ నిజాం ప్రభుత్వంపై భక్తితో నిజాం ప్రభుత్వాన్ని రక్షిద్దామని రజాకార్లలో చేరుతాడు. కానీ చివరికి తన కుటుంబాన్నే కోల్పోతాడు.
ఆనాటి కథలన్నీఎక్కువ శాతం శైలీ, శిల్పాలు లేని కథలే అయినా ఈ కథ దానికి మినహాయింపు. శిల్ప పరంగా గొప్ప కథ. ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ తో నడిచిన కథే అయినా పాఠకుడు కూడా ఉద్యమంలో ఉన్నంత ఉత్కంఠను రగిలిస్తాడు కథకుడు. దృశ్యాలన్నీ ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతున్నట్టే కనిపిస్తాయి. కథంతా అయిపోయిన తరువాతగాని మనం కథలో ఉన్న విషయం గుర్తుకు రాదు. కథ అయిపోయేటప్పటికి మన కంట్లో ఒక సన్నని నీటి పొర అక్షరాలను మసక మసక చేస్తుంది. తెలంగాణ సాయిధ రైతాంగ పోరాటమంతా దృశ్యాలు దృశ్యాలుగా మన ముందు కదిలి పోయి రక్తం పొంగిపోతుంది. పిల్లలు, స్త్రీలు, వృద్ధులు ఈ పోరాటంలో ఎంత నలిగి పోయారో ఈ కథ స్పష్టంగా చెప్తుంది. ఈ విముక్తి పోరాటంలో గ్రామాలను రక్షించడానికి యువకులు ప్రాణాలకు తెగించి పోరాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలంగాణ నేల కోసం నెత్తురు ధార పోసిన మన పూర్వుల త్యాగాన్ని చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆనాడు ఎంత చీకటి రాజ్యం రాజ్యమేలిందో తల్చుకుంటేనే గుండె కదిలిపోతుంది. ఎన్ని త్యాగాల ఫలితం ఇప్పటి తెలంగాణ అని ఒళ్ళు రోమాంచితం అవుతుంది. రజాకార్లు అప్పుడే కాదు. ఇప్పటికీ ఉన్నారనిపిస్తుంది. అయితే వారి రూపం మారి ఉండవచ్చు, వారి అకృత్యాల తీరు మారి ఉండవచ్చు. రోజు రోజూ జరుగుతున్నా విషాదాల మధ్య మనం వెలుతురు రాజ్యంలోనే ఉన్నామా? లేదా ఇంకా ‘చీకటి రాజ్యం’లోనే ఉన్నామా? అని అప్పుడప్పుడు సందేహం కలుగుతుంది. ఒకింత మరో మేలిమి వేకువ కోసం మనమంతా మరో పోరాటానికి తెర తీయాలనే ఈ కథ నిశ్శబ్దంగా చెబుతుంది. ఆ సందేశాన్ని అందుకొని మనమంతా మళ్ళీ సాయుధాం కావాల్సి ఉంది.
*
కథ ఇక్కడ చదవండి
good
Thank you..
అద్భుతమైన వ్యాఖ్యానం కంగ్రాట్స్ అన్న
Thank you…
<కళ్ళల్లో నీళ్ళు నిజంగా తెప్పించింది .సమీక్షన్ ఇట్లా ఉంటే కథ ఎంత మనల్ని ఆ లోకంలో తీసుకెళుతుందో..
ఇప్పుడు స్వాతంత్య్రం వచ్చినా ఇంకా మూర్ఖత్వం ఎక్కువై ఆరాచకత్వం పెట్రేగిపోయింది. కథను పరిచయం చేసినం దుకు అభినందనలు శ్రీధర్.
ధన్యవాదాలు.. మేడం
గడిచిన చరిత్రకు సజీవ సాక్ష్యంలా సాగిన కథకు సహజ విశ్లేషణ… గడిచిన కాలాన్ని స్పర్శించినట్లుగా ఉంది సార్ మీ విశ్లేషణ… నమస్సులు
గడిచిన చరిత్రకు సజీవ సాక్ష్యంలా సాగిన కథకు సహజ విశ్లేషణ… గతించిన కాలాన్ని స్పర్శించినట్లుగా ఉంది సార్ మీ విశ్లేషణ.. బాగుంది…
Thank you Madam..
Cheakati Rajyam review is informative and educative of years just before and after Razakar atrocities sponsored by the Nizam Ruler…The rulers are different now,but the atrocities are still going on under different names like lynchings etc…and the victims may be Daliths…The basic nature of mankind is immutable…violence is eternal..victims change from time to time , some time Muslims,some other time Hindus and Daliths at other times but all of them are helpless,hapless and harmless people who do not any role in the exploitation!