నల్లరంగు కప్పుకున్న ఆకాశం అంటే ఆమెకిష్టం. అందులో మినుకుమంటూ సందడి చేసే నక్షత్రాలంటే ఇంకా ఇష్టం. రోజూ రాత్రి భోజనం చేసి గిన్నెలన్నీ కడిగేశాక మేడపైకి చేరి చల్లగాలిలో తిరుగతూ ఆకాశం వంక చూస్తూ ఉంటుంది. అది ఇష్టమో.. కాలక్షేపమో అనేకన్నా అవసరం అనుకోవడం ఆమెకు బాగుంటుంది.
“మమ్మీ! చందమామ ఎక్కడా?” ఎనిమిదేళ్ల కూతురు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని ఆకాశంలో వెతికింది.
“అదిగో..”
“భలే ఉంది కదా మమ్మీ! నిండుగా బెలూన్ లాగా”
“ఊ..”
భళ్లున పగిలి చెదురుగా పడ్డ గాజుసీసా ముక్కల్లాగా ఆకాశం మీద తచ్చాడుతున్నాయి చుక్కలు. ఆమె తృప్తిగా ఊపిరి పీల్చుకుంది. చిన్నప్పుడు నానమ్మ చెప్పే కథలు గుర్తుకొచ్చాయి.
“ఎత్తుకో” అని చేయి చాపిన పాపను చంకనెక్కించుకుంది.
“నాన్న ఎప్పుడొస్తాడు మమ్మీ?”
“వస్తాడు..”
“పోయిన సారి పండగప్పుడు వస్తాడన్నావ్. రాలేదేం?”
“వేరే పని ఉందంట”
“అంతకు ముందూ అదే చెప్పావ్”
“అప్పుడు ఎరోప్లేన్లు తిరగటం లేదంట. వాటిలోనే కదా డాడీ వచ్చేది”
పాప కళ్లు మెరిశాయి.
“డాడీతో పాటు నేనూ ఎరోప్లేన్ ఎక్కుతా”
“ఊ..”
పాప ఏవేవో అడుగుతోంది. అన్నింటికీ ఆమె ఊ కొడుతోంది.
“ఆ చుక్కని చూడు మమ్మీ!”
అటు చూసింది. పెనం మీద పాలచుక్కలా మెరుస్తోన్న నక్షత్రం. ఇలాగే నవ్వేవాడతను.
“అది కిందికొస్తే బాగుంటుంది కదా?”
ఈసారి ఊ కొట్టలేదామె. ఆకాశంలో చేరిన నక్షత్రం నేలకు దిగదు. రాలిపడతుందే తప్ప.. కిందకు రాదు. ఆ సంగతి పాపకు ఎలా చెప్పడం?
*
తమ్ముడూ బాగుంది. లైట్ ఫ్రమ్ ఎ డిస్టెంట్ స్టార్ రష్యన్ నవల(1965 ) చదవండి. ఎ.బి.చెహొవ్ రచయిత.
Bavundi Vamsi. Keep writing.