కొన్ని కవితలను అర్థంచేసుకోవడానికి ఆ కవిత పుట్టినకాలాన్ని గుర్తించవలసి ఉంటుంది. అంతేకాక ఆ కవిత పుట్టిన కాలంనాటికి ముందువచ్చిన రచనలగురించి, అప్పటికి ప్రచలితంగా ఉన్న కవిత్వధోరణుల గురించి కూడా తెలియవలసి ఉంటుంది. అప్పుడుగానీ ఆ కవితలను సరైన రీతిలో అర్థం చేసుకోలేం. పఠాభిగారి ‘ఆత్మకథ’ అటువంటి కవిత. ఇది 1938లో రాసిన కవిత.
ఆత్మకథ
– పఠాభి
ఎవర్నని యనుకొంటిరో మీరు నన్ను?
ఏను పఠాభిని…….
కాంగ్రేసు రాష్ట్రపతి స్థానానికోసం
బాబూ సుభాసుబోసుతో పోటీజేసి
ఓడిపోయిన డాక్టర్ పట్టాభిని
గాన్నేను, మరో పఠాభిని
అయితే అతగాడి కున్నంత
ఉపజ్ఞ నాకున్ లేదని తలంపకండీ
గాంధీ టోపీ, జహ్వరుజాకెట్
మీసాలు లేకున్నంత మాత్రాన!
పయిజమ్మాలు వేస్తాను కాబట్టి
నన్ను మీరు షోదాయని; సోషలిస్టని
తిట్టబోకండి, ప్రఖ్యాతంగానున్న
కవిన్నేను;
నాకు విచిత్రంబగు భావాలు కలవు
నా కన్నులందున టెలిస్కోపులు
మయిక్రాస్కోపు లున్నవి.
నా ఈ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో
పద్యాల నడుముల్ విరుగదంతాను;
చిన్నయ్ సూరి బాలవ్యాకరణాన్ని
చాల దండిస్తాను;
ఇంగ్లీషు భాషాభాండారంలో నుండి
బందిపోటుం జేసి కావల్సిన మాటల్ను దోస్తాను,
నా యిష్టం వచ్చినట్లు జేస్తాను
అనుసరిస్తాను నవీన పంథా; కానీ
భావకవిన్మాత్రము కాన్నే, నే
నహంభావ కవిని
(పఠాభిగారి “ఫిడేలు రాగాల డజన్” కవితా సంపుటి నుంచి)
” ఎవర్నని యనుకొంటిరో మీరు నన్ను?
ఏను పఠాభిని ……”
అనే ఈ కవిత ప్రారంభపంక్తులు చదవగానే
“ఎవ్వరని యెంతురో నన్ను? ఏ ననంత
శోకభీకర తిమిరలోకైక పతిని” అన్న
కృష్ణశాస్త్రిగారి కవితాపాదాలు గుర్తుకువస్తాయి.(కృష్ణపక్షం: “నన్నుగని” ఖండిక)
ఇక ఆ తరువాతి కవితాపాదాలు:
” కాంగ్రేసు రాష్ట్రపతి స్థానానికోసం
బాబూ సుభాసుబోసుతో పోటీజేసి
ఓడిపోయిన డాక్టరు పట్టాభిని
గాన్నేను, మరో పఠాభిని
అయితే అతగాడి కున్నంత
ఉపజ్ఞ నాకున్ లేదని తలంపకండీ
గాంధీటోపీ, జహ్వరుజాకెట్
మీసాలు లేకున్నంత మాత్రాన!
పయిజమ్మాలు వేస్తాను కాబట్టి
నన్ను మీరు షోదాయని; సోషలిస్టని
తిట్టబోకండి…”
1938వ సంవత్సరంలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీచేసి సుభాష్ చంద్రబోస్ తో తలపడి ఓడిపోయారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నేను ఆ డాక్టర్ పట్టాభిని కాను, మరో “పఠాభిని” అని చెబుతున్నారు కవి. (పఠాభి అసలు పేరు: తిక్కవరపు పట్టాభిరామరెడ్డి)
డాక్టర్ పట్టాభిలాగా నాకు గాంధీ టోపీ, జవహర్ లాల్ నెహ్రూ జాకెట్, మీసాలు లేనంత మాత్రాన ఆయనకున్న ఉపజ్ఞ (పుట్టుకతో వచ్చిన తెలివి) లేదని భావించవద్దని చమత్కరించారు. అలాగే “పయిజమ్మాలు” వేస్తాను కాబట్టి నన్ను “షోదా” (అంటే రాజపుట్ అనీ, క్షత్రియ యోధుడనీ); సోషలిస్టు అని అనుకోకండని చెబుతున్నారు.
ఇక ఆ తరువాతి కవితాపాదాల్లో — తనకు విచిత్రమైన భావాలు కలవనీ, తన కవిత్వం టెలిస్కోపులా స్థూలంగానూ, మైక్రోస్కోపులా సూక్ష్మంగానూ నిశితంగానూ వస్తుదర్శనం చేస్తుందనీ, తన వచనపద్యాలనే దుడ్డు కర్రలతో ఛందోబద్ధమైన పద్యాల నడుములు విరగదంతాననీ, చిన్నయసూరి బాలవ్యాకరణ సూత్రాల్ని అతిక్రమిస్తాననీ, ఇంగ్లీషు పదాల్ని ఇష్టం వచ్చిన రీతిలో వాడతాననీ, ఇప్పటివరకూ లేని నవీనపంథాను అనుసరిస్తాననీ చెప్పుకున్నారు కవి.
సాధారణంగా ప్రాచీనకవులు కొంత కవిత్వం రాసాక తమ కవితా లక్షణాలను కావ్యావతారికల్లోనో మరోచోటో చేర్చి చెప్పుకోవడం కద్దు. ఈ ఆధునిక కవి కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ తన కవితాలక్షణాలను ఈ ఖండిక ద్వారా ప్రకటించుకున్నారనిపిస్తుంది.
(‘ఆత్మకథ’, ఫిడేలురాగాల డజన్ కవితా సంపుటిలోని మొదటి కవిత. ప్రథమ ముద్రణ: 1939)
ఇక ఈ కవిత ముగింపులో —
” భావకవిన్మాత్రము కాన్నే, నే
నహంభావ కవిని” అనడాన్ని ప్రత్యేకంగా గమనించాలి. కవిత ఎత్తుగడలో “ఎవర్నని యనుకొంటిరో మీరు నన్ను?” అని కృష్ణశాస్త్రిని గుర్తుకు తెచ్చిన కవి, ముగింపులో భావకవిని మాత్రం కాన్నేను అనడం నా కవిత్వం భావకవిత్వ ధోరణికి భిన్నంగా వుంటుంది కొండొకచో ఆ ధోరణిని ధిక్కరిస్తుంది అని చెప్పడమే ననిపిస్తుంది.
ఈ కవిత ముగింపు గురించి చెబుతూ కవి పఠాభి ఇలా అన్నారు: “నిజంగా భావకవిత్వంలో కవులు అహంకారం తగ్గించుకున్నారు. ఎంత తగ్గించుకున్నారంటే – ప్రేయసికి వేడుకోలుగా ప్రార్థించి
దీనాలాపాలు చేశారు. ఇంకా తల్లీ అనీ దేవత అనీ ప్రాధేయపడ్డారు. ఈ పద్ధతి నాకు నచ్చలేదు. అందుకోసం నేను అహంభావ కవిని అని రాశాను.” భావకవి అన్న పదాన్ని ఎగతాళి చెయ్యడం కోసం, దాన్ని వికృతపరచడం కోసం అహంభావకవిని అని పఠాభి అన్నారు కానీ, నిజానికి పఠాభిది అహంభావ కవిత్వం కాదనేది విమర్శకుల అభిప్రాయం.
కవి, తన గురించి తన కవితా తత్త్వాన్ని గురించి చెప్పుకున్న ఈ కవితకు ‘ఆత్మకథ’ అని శీర్షికనుంచడం ఔచితీమంతంగా వుంది.
*
Add comment