సరిగ్గా నేను విజయవాడ స్టేషన్ లో చేరి ఇంకా నెల కూడా పూర్తి కాలేదు.మా ఇన్ ఛార్జ్ “పెక్స్ కో” (ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ కో ఆర్డినేషన్) నాకో పనప్పగించారు. అదేమిటంటే – జనవరి 26వ తేదీన సాధారణంగా అన్ని రేడియో కేంద్రాలు స్థానికంగా జరిగే రిపబ్లిక్ డే జెండా వందనం కార్యక్రమాలను రికార్డు చేసి ఒక రిపోర్టు గా ప్రసారం చేస్తాయి.దానికి సంబంధించి నేనో రికార్డింగ్ చేయాలి
ఇక్కడో విషయం చెప్పాలి.
విజయవాడ కేంద్రంలో వార్తా విభాగం కూడా ఉంది.(ఉదయం 6గం.45ని.లకు ప్రాంతీయ వార్తలు రెండు రాష్ట్రాలకు ఇప్పటికీ ఆ కేంద్రం వారే ప్రసారం చేస్తున్నారు). ఇలా ప్రసారం చేసే రిపోర్ట్ ను “రేడియో నివేదిక” అంటారు.ఇంతకీ మా ఇన్చార్జి పెక్స్ కో నాకో ఇన్విటేషన్ ఇచ్చి నన్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు ఓ పెట్రోల్ బంక్ లో జెండా వందనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాళ్ళ టాప్ బాస్ వస్తున్నారు. మీరు కవర్ చేయండి అని చెప్పారు.
సాధారణంగా ఇలాంటి రికార్డింగ్ ను OB ప్రోగ్రాం అంటారు.అంటే outside broadcast అని పూర్తి పేరు.
దానికి తగినట్లుగా రికార్డు చేసేందుకు టెక్నికల్ టీమ్ ను ఏర్పాటు చేసుకోవాలి.వాహనం కోసం అభ్యర్థనను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు ఇవ్వాలి.ఇవన్నీ అప్పటికప్పుడు తెలుసుకుని అన్నీ సిద్ధం చేసుకుని ఆ రికార్డింగ్ చేసుకొచ్చాను.ఇవన్నీ నాకు కొత్త కాబట్టి, టెక్నికల్ టీం అంటే మా ఇంజనీరింగ్ మిత్రులు హెల్ప్ చేశారు.
మరుసటి రోజు ఆ రికార్డింగ్ ను న్యూస్ సెక్షన్ లో ఇమ్మని మా ఇన్చార్జి చెప్పారు.అక్కడ న్యూస్ ఎడిటర్ ఆ సెక్షన్ అధిపతి. అప్పటికి రికార్డింగ్ లన్నీ స్పూల్ టేప్ మీద చేసేవాళ్ళం.ఇంకా కంప్యూటర్ రికార్డింగ్ లు ప్రవేశించలేదు.
ఆ టేప్ ఆయనకు ఇవ్వగానే, అసలు మీరెవరు అన్నారు.మీరెందుకు కవర్ చేశారు అన్నారు
ఆయనకు నేనెవరో తెలీదు. నా ప్రవర చెప్పుకున్నాను. కొత్తగా చేరిన డ్యూటీ ఆఫీసర్ నని..
మేము చేయమని అడగలేదు కదా. మాకేమిటి సంబంధం అంటారాయన. మీ పెక్స్ కో చేత మాట్లాడించండి అని కొంచెం కటువుగా చెప్పారు. నాకు ఇదేమిటి ఈయన అలా అంటున్నారు అని, పైకి ఫస్ట్ ఫ్లోర్ కి పరిగెత్తాను.ఆయన అంటే మా పెక్స్ కో చిరునవ్వుతోనే ఇలాంటివి మీరు హేండిల్ చేయాలని అన్నారు.కానీ దానివెనుక మళ్ళీ మీరు నా దగ్గరకు వచ్చి నన్ను మాట్లాడమనకూడదన్న సూచన ఉంది..
అలా ఆ ఎపిసోడ్ సామరస్యంగా ముగిసింది కానీ, ఒక విభాగానికి ఇంకో విభాగానికి మధ్య గేప్,ఎగోలు,గోలలు ఎలా ఉంటాయో తెలిసింది.
రేడియో ఉద్యోగంలో చాలా మందిని కలుపుకు పోవాలి.
అలాగే నేనే రైట్ అన్న మొండి వాదన కన్నా సమయానుకూలంగా వ్యవహరించాలి.
నిజానికి డ్యూటీ రూం ఆ రోజుల్లో కీలకంగా ఉండేది.అటు ట్రాన్స్మిషన్ చూసే టెక్నికల్ వింగ్ (ఇంజనీరింగ్ విభాగం) తోను, న్యూస్ విభాగంతో ను, ప్రసారానికి సంబంధించిన టేపులు, రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
తర్వాత కాలంలో ఆ న్యూస్ ఎడిటర్ మంచి ఫ్రెండ్ అయిపోయారు.అది వేరే విషయం.న్యూస్ రీడర్లుగా కొప్పుల సుబ్బారావు,ప్రయాగ రామకృష్ణలు ఉండేవారు.ఇద్దరూ వేర్వేరు శైలిలో వార్తలు చదివేవారు.ఇద్దరూ అద్భుతంగా చదువుతుండేవారు.ఇప్పటివారికి రోల్ మోడల్ వారు.వీరిలో కొప్పుల సుబ్బారావుగారు 2013లో స్వర్గస్థులయ్యారు.
ఒకసారి ఉదయం కొప్పుల సుబ్బారావు వార్తలు చదువుతున్నారు. సాధారణంగా పదినిముషాల బులెటిన్ కు సంబంధించిన న్యూస్ ఐటెమ్స్ రాసి పెట్టుకుంటారు.
న్యూస్ ఎడిటర్ వాటిని ఎడిట్ చేసి ఓకే చేస్తారు.
ఆరోజు లైవ్ బులెటిన్ చదువుతూ సుబ్బారావు గారు, హఠాత్తుగా బయటకు వచ్చి న్యూస్ లేదు అని గట్టిగా అనేసి వెళ్ళిపోయారు. అప్పటికింకా నాలుగు నిమిషాల బులెటిన్ ఉంది. నేను వెంటనే న్యూస్ సెక్షన్ కు పరిగెత్తాను. వాళ్ళు కొన్ని స్టాండ్ బై న్యూస్ ఐటెమ్స్ రెడీగా ఉంచుకుంటారు. న్యూస్ ఎడిటరే, దాదాపు పరిగెత్తినంత పనిచేసి న్యూస్ ఐటెమ్స్ ను స్టూడియో లో సుబ్బారావు గారికి ఇచ్చారు.అలా ఆరోజున ఆ బులెటిన్ అంతరాయం లేకుండా ముగిసింది అంతకుముందు నాతో కఠినంగా వ్యవహరించిన ఆన్యూస్ ఎడిటర్ నాకు ఆరోజు కృతజ్ఞతలు చెప్పారు.
ఇలా నేను డ్యూటీ ఆఫీసర్ గా పనిచేసిన పదకొండు సంవత్సరాలలో(1988-1998), అనేక అనుభవాలు చూశాను.
అలా రేడియో ఉద్యోగం అనేక విషయాలు నేర్పింది. ఇప్పటివారికీ నేర్పుతోంది
నన్ను ఈ ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వూలో “నో స్మోకింగ్” మీద మిమ్మల్ని ప్రోగ్రాం చేయమంటే ఎలా చేస్తారు అని ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల్లో ఒకరైన పి.ఆర్.రెడ్డి అడిగారు(ఆయన రేడియో డైరెక్టర్ గా చేస్తున్నారని చేరాక తెలిసింది). అప్పుడేదో నాకు తోచినట్లు చెప్పాను కానీ, నన్ను మే 31వ తేదీ కాబట్టి పొగాకు వ్యతిరేక దినోత్సవంగా ఒక కార్యక్రమం చేయమని డ్రామా, ఫీచర్స్ సెక్షన్ చూసే ప్రోగ్రాం ఎక్సిక్యూటివ్ అడిగారు. నాకు ఇంకా అనుభవం లేదని చెప్తే ఒప్పుకోలేదు.. ఇది నాకు ఛాలెంజ్ అని నవ్వేశారు.
కరెక్ట్ గా మూడు రోజుల ముందు చెప్పారు.
అప్పుడు నన్నెవరు ఆదుకున్నారంటే…
*
Excellent Sir. మీరు మాతో కూర్చొని మాట్లాడుతున్నంత హాయిగా…ఇన్స్పిరేషన్ గా ఉంది…మీరు మాకు PEX గా గైడ్ చేసిన రోజులు…మాకు ఎప్పటికీ గుర్తుంటాయి…
ఎన్నో విషయాలు..ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం..
మీ రేడియో జాకీ
యల్లేష్ రావు
Fm Rainbow..hyderabad