(రెంటాల గోపాలకృష్ణ కవిత్వాన్ని విద్యార్థి దశలోనే చదివి, ఆ పైన విశ్వవిద్యాలయ పరిశోధనలో భాగంగా అధ్యయనం చేసి, ఆనక కవి మిత్రుడిగా ఎదిగిన ప్రముఖ కవి డాక్టర్ సి. నారాయణరెడ్డి. రెంటాల మరణానంతరం వెలువడ్డ ‘శివధనువు’ కవితా సంపుటానికి ముందుమాటగా, అలాగే రెంటాల స్మరణోత్సవ సంచికకు నివాళిగా ఆయన రాసిన మాటలివి)
“అర్థాన్నీ, శబ్దాన్నీ, అభివ్యక్తినీ కైవసం చేసుకున్న తొలితరం కవుల్లో సొంత గొంతుక ఉన్న సంతకం మిత్రుడు శ్రీ రెంటాలది. కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడే నా మనసులో మిరుమిట్లు గొలిపే అభ్యుదయ కవుల పేర్లలో రెంటాలది ఒకటి. శ్రీశ్రీ, ఆరుద్రల తరువాత అప్పుడు బలంగా వినిపించిన కంఠాల్లో సోమసుందర్, గంగినేని, రాంషా, అవసరాల, దాశరథి…. – రెంటాల.
‘సంఘర్షణ’ కవి… ‘సర్పయాగ’ రవి!
1950లో ప్రచురించిన ‘సంఘర్షణ’, 1957లో వెలువరించిన ‘సర్పయాగం’ రెంటాలను అభ్యుదయ కవిగా పరిచయం చేసిన పదునైన కవితా సంపుటులు. ‘సంఘర్షణ’ కవితా సంపుటికి శ్రీరంగం నారాయణబాబు రాసిన పీఠిక – ‘ప్రవర’… ప్రగతిశీల కవిత్వానికి కరదీపిక. ఇక, ‘సర్పయాగం’ కవితా సంపుటి పేరెత్తితే చాలు – అప్పటికీ, ఇప్పటికీ రెంటాల మూర్తి చైతన్యస్ఫూర్తితో అగుపడుతుంది. “ఖబడ్దార్ ఖబడ్దార్ నిజాం పాదుషాహే” అని సోమసుందర్ గర్జించిన రోజుల్లోనే… “పగలేయ్ నిజాం కోట… ఎగరేయ్ ఎర్రబావుటా” అంటూ రెంటాల తీవ్రస్వరంతో నైజాం ప్రభుత్వాన్ని నిరసించడమే కాకుండా, తన కమ్యూనిజం నిబద్ధతను బాహాటంగా ప్రకటించాడు.
భావానికి తగ్గ సునిశితమైన అభివ్యక్తి రెంటాల కవితకు తెచ్చిన దీప్తి. కవిగానే కాదు… వ్యాసరచయితగా, అనువాదకుడిగా, పత్రికా రచయితగా, నాటకకర్తగా రెంటాల ఆధునిక సాహిత్యలోకానికి ఆప్తుడిగా నిలిచాడు.
విజయవాడ వెళ్ళినప్పుడు…
అప్పుడప్పుడు నేను విజయవాడకు వెళ్ళినప్పుడు సమావేశాల్లో, మిత్ర గోష్ఠుల్లో రెంటాలను కలుసుకునేవాణ్ణి. ఎప్పుడు కలిసినా అదే తీయని పలకరింపు. అదే చల్లని చిరునవ్వు చిలకరింపు. రచయితగానే కాదు మంచి మనిషిగా, లలిత మనస్విగా రెంటాల ఎందరి హృదయాల్లోనో ఆత్మీయముద్ర వేశాడు.
ఆరోగ్యం అంతగా సహకరించని అవిశ్రాంత సాహితీ పథికుడు, నా చిరకాల మిత్రుడు శ్రీ రెంటాల గోపాలకృష్ణ ఈ లోకాన్ని విడిచివెళ్ళిన వార్త విని, ఎంతో విచారించాను.
అరవై ఏళ్ళ పాటు కవిత, కథ, నాటకం, విమర్శ లాంటి వివిధ సాహితీప్రక్రియల్లో శతాధిక గ్రంథాలను రచించిన రెంటాల రాసిన కొన్ని కవితలను ఆయన మరణానంతరం ‘శివధనువు’ పేరిట సంపుటి రూపంలో తెస్తున్నందుకు సంతోషం. ఈ ‘శివధనువు’లో 1950 నుంచి ఇటీవలి కాలం వరకు ఆయా పత్రికల్లో రెంటాల ప్రచురించిన కవితల్ని పొందుపరిచారు.
పురాణ ప్రతీకలతో… సమకాలీన సామాజిక చైతన్యస్ఫూర్తి
పౌరాణిక పదబంధాలను గ్రహించి, సమకాలీన సామాజిక చైతన్యస్ఫూర్తిని అందించే ప్రవృత్తి రెంటాలది. ‘సర్పయాగం’, ‘శివధనువు’, ‘వైతరణి’ లాంటి శీర్షికలు ఆ కోవకు చెందినవే. ఈ ‘శివధనువు’ సంపుటిలో శివధనువంటే సంక్లిష్ట జీవితానికి ప్రతీక. దానిని జయప్రదంగా చేపట్టడం అంత సులభం కాదు సుమా అని అంటాడు రెంటాల. ‘వైతరణి’లో…
“మానవుడా! ఎక్కడ నీ మనుగడ?
మృత్యువేరా నీకు తలగడ!”
అనే పంక్తుల్లో రెంటాల తాత్త్విక చింతన కనిపిస్తుంది. అభ్యుదయ కవులందరి లాగే రెంటాల నగర జీవితాన్ని బహుముఖాలుగా సమీక్షించి, వాటిలోని కృత్రిమత్వాన్ని ఆరేసి చూపాడు. నగరంలోకి ‘క్రాస్ రోడ్స్’ను ఉద్దేశించి…
“చూడు చూడు నగరి శృంగాటకం
చూడు చూడు నరుడి దొంగాటకం”
అని ఓ చరుపు చరుస్తాడు. “పడగ విప్పిన నగరు”ని, “పసరు కక్కిన నరు”ణ్ణి ఎక్స్ రే తీసి చూపుతాడు.
ఆర్ద్రత… ఆవేశగాఢత… అభివ్యక్తి స్పష్టత…
ఈ సంపుటిలోని కవితల్లో కొన్ని మాత్రాగతి స్పర్శ ఉన్న వచన కవితలున్నాయి. కొన్ని గానయోగ్యంగా ఉన్న పాటలూ ఉన్నాయి. ‘ఆకలి పాటలు’ అనే శీర్షికతో రాసిన పాటల్లో జానపద గేయ సరళి ఉంది. చెమ్మగిల్లిన గుండె రవళి ఉంది. మౌలిక సృజన చేసినా, అనువాద రచన చేసినా ఆర్ద్రత, ఆవేశగాఢత, అభివ్యక్తి స్పష్టత రెంటాల కృతుల్లో విలక్షణంగా అగుపిస్తాయి. మంచి రచయితగానే కాక ఉత్తమ పాత్రికేయుడిగా – అంతకంటే మించి స్నేహపాత్రుడిగా నిలిచిపోయిన శ్రీ రెంటాల గోపాలకృష్ణ కవితలను ‘శివధనువు’ సంపుటి రూపంలో ప్రచురించిన ప్రచురణకర్తలకు హార్దికాభినందన.
కవిగా, నటుడిగా, నాటకకర్తగా, పాత్రికేయుడిగా శ్రీ రెంటాల చెరగని దరహాసంతో, సాహిత్యలోకంలో చిరంజీవిగా ఉంటాడు. ఈ నాలుగు అక్షరాలు అతని స్మృతికి నేనందించే నివాళులు. రెంటాల స్మృత్యంకంగా ప్రత్యేక సంచికను వెలువరిస్తున్న సహృదయులకు నా అభినందన.”
21 డిసెంబర్ 1996, హైదరాబాద్.
Add comment