గత మూడు భాగాలుగా మనం స్థలకాలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక కథ నిర్దుష్టంగా ఒక కాలంలో, ఒక ప్రదేశంలో మాత్రమే జరుగుతున్నట్లు కథ చెప్పాలి. కానీ, ఆ కథ ఏ ప్రదేశంలో అయినా, ఏ కాలంలో అయినా జరిగే కథలా అనిపించాలి అని చెప్పుకున్నాం. ఇలా కథ ఒక సందర్భానికి కట్టుబడి ఉంటూనే సార్వత్రికతను ఎలా సాధించాలి అనే చర్చ చేస్తూ అందుకు ఐదు మార్గాలు ఉన్నాయని చెప్పి అందులో మూడు మార్గాలను గత భాగంలో మీకు చెప్పాను. ఈ రోజు ఆ మూడింటిని మళ్లీ పరిశీలించి మిగిలిన రెండింటి గురించి వివరంగా చర్చిద్దాం.
ఒక స్థలకాలాలలో స్థిరంగా నిల్చున్న కథ సార్వజనీయత సాధించేందుకు మార్గాలు –
- కాలంతోపాటు మారని భావోద్వేగం మీద దృష్టి పెట్టాలి. కథ మారచ్చు కానీ భావోద్వేగం మారదు. రాముడు,సీత అయినా సీతారామం అయినా ఎడబాటు అనే ఎమోషన్ కథని నిలబెడుతుంది.
- ప్రతి పాత్ర ఒక మనిషే. పాత్రలు మీరు సృష్టించినవే అయినా వాటికీ జవజీవాలు ఉంటాయి. పాత్రని మనిషిలా గుర్తించి, మనిషిలా ప్రవర్తించనిస్తే ఆ కథ పాఠకుడు అనే మరో మనిషికి దగ్గరగా అనిపిస్తుంది.
- సంఘటన స్థానికం – ఇతివృత్తం సార్వజనికం. ఇది కూడా ఒక రకంగా భావోద్వేగానికి సంబంధించినదే. మీరు కథలో చెప్పే సంఘటన ఫలానా కాలంలో, ఫలానా చోట జరుగుతుండచ్చు కానీ ఆ సంఘటన ద్వారా మీరు చెప్పదల్చుకున్న విషయం సార్వజనీయమైనదైతే కథ నిలబడుతుంది.
ఇవీ గత పక్షం చెప్పిన మూడు మార్గాలు. మిగిలిన రెండు మార్గాలను ఇప్పుడు చర్చిద్దాం.
- కాలాతీత చిహ్నాలు / ఉపమానాలు
1857 సిపాయి తిరుగుబాటు నేపథ్యంలో ఒక కథ. ఢిల్లీలో అప్పటి మొఘల్ పాదుషా బహదూర్‌షా జఫర్‌ని ఆ తిరుగుబాటుకి నాయకత్వం వహించమని అడగటానికి ఉద్యమ ప్రతినిధులు వచ్చి మాట్లాడటం సంఘటన. ఈ కథ చెప్తున్నప్పుడు మనం ఏం చెప్పదల్చుకున్నాం? పేరుకే తప్ప అధికారం లేని రాజు సమాజానికి ఎంత హాని చేస్తాడో చెప్పాలని అనుకున్నాం అనుకోండి. అదే చెప్పదల్చుకుంటే సైనిక ప్రతినిధులు వచ్చేటప్పటికి ఖాళీ “సింహాసనం వెక్కిరించింది” అని రాయచ్చు. బహదూర్ షా జఫర్ “ఎండిపోయిన చెట్టులా ఉన్నాడు” అని చెప్పచ్చు. “ఎవరో యూరోపియన్ వ్యాపారి బహుమతిగా ఇచ్చిన కర్ర సాయంతో నడుస్తున్నాదు. ఆ యూరోపియన్ ఊతకర్ర లేకపోతే నడవలేని పరిస్థితిలో ఉన్నాడు” అని కూడా చెప్పచ్చు.
ఖాళీ సింహాసనం, వట్టిపోయిన ఆవు, ఊత కర్ర ఇవి ఉపమానాలు. ఇప్పుడు ఇవే ఉపమానాలు వాడి కేంద్ర ప్రభుత్వం / అధిష్టానం మీద ఆధారపడి నడిచే రాష్ట్ర ప్రభుత్వం కథ రాయచ్చు, అమెరికా హెడ్‌క్వార్టర్స్ చెప్పినట్లు ఇండియాలో ఆఫిసు నడిపించే కథ రాయచ్చు, ఈంF నాదస్వరం ఊదితే నాట్యం చేసే వెన్నెముక లేని పాము ప్రభుత్వాల గురించి రాయచ్చు. (ఇక్కడ నాదస్వరం, వెన్నుమకలేని పేము మరో రెండు ఉపమానాలు.) కథలో ఉండే వాస్తవాలు, సంఘటనలు కాలానుగుణంగా ఔచిత్యాన్ని కోల్పోవచ్చు కానీ ఉపమానాలు కాలాన్ని దాటినా, వేరే సంస్కృతులలోకి వెళ్లినా అంతరార్థాన్ని తమతోపాటు తీసుకువెళతాయి. “తాళం వేసిన తలుపు” ఏ కాలమైనా, ఏ ప్రాంతమైనా రహస్యాన్నే సూచిస్తుంది.
పాత పెళ్లి చీర, విరిగిపోయిన రేడియో, రెండు ఊర్ల మధ్యలో కూలిన వంతెన, ఎండిన బావి, సన్నగా తడిపే వర్షం ఇవన్నీ ఒక భావోద్వేగాన్ని నిక్షిప్తం చేసుకున్న ఉపమానాలు. ఇలాంటివి కథానుసారంగా, మీ ఊహాశక్తిని బట్టి పుట్టుకొస్తాయి. వాటిని పట్టుకుని కథలో చేర్చడం ద్వారా ఆ కథకి సార్వజనీయత సాధించవచ్చు. ఇలాంటి చిహ్నాలు పాఠకులని మెదడుతో కాకుండా మనసుతో అర్థం చేసుకునేలా చేస్తాయి. కథ తమకి దగ్గరగా ఉంది అని అనుకులే చేస్తాయి. 5. ముఖ్యమైన ప్రశ్నలను అడగండి
చిరస్మరణీయమైన కథలు ఏవైనా పరిశీలించండి. అవేవీ సమస్యలకి పరిష్కారంగా రాసినవి కావు. కేవలం ప్రశ్నలు రేకెత్తించి వదిలేస్తాయి. (ఒక వేళ పరిష్కారం ఇచ్చినా అది పాఠకులకి ముగింపులో కలగాల్సిన సంతృప్తి కోసం ఇచ్చినవే తప్ప, కథ ప్రధాన ఉద్దేశ్యం ప్రశ్నించడమే అయ్యుంటుంది. ముగింపులో సంతృప్తి గురించి మళ్లీ ఎప్పుడైనా చెప్పుకుందాం. ప్రస్తుతానికి…) ఎలాంటి ప్రశ్నలు అవి?
ప్రపంచం ఎంత మారినా ప్రాసంగికత కోల్పోని ప్రశ్నలు అవి. స్వేచ్ఛ అంటే ఏమిటి? కుటుంబ బాధ్యత అంటే ఏమిటి? ప్రేమ సామాజిక ఒత్తిడుల నుంచి బయటపడగలదా? అధికారం అనివార్యంగా అవినీతికి దారితీస్తుందా? ఇలాంటి ప్రశ్నలు. ఒక కథ ఈ ప్రశ్నలను అడిగినప్పుడు, అది ఎన్నో శతాబ్దాలుగా మనిషి విప్పలేకపోయిన అనేక చిక్కుముడులను కళ్ల ముందు నిలబెడుతుంది. ఉదాహరణకు, ఎదిరించడానికి వెనకాడే భయాన్ని ఒక భూస్వామ్య కథలో, ఆధునిక ప్రజాస్వామ్యంలో, భవిష్యత్తులోని తయారవ్వబోయే డిస్టోపియన్ ప్రపంచంలో ఒకే విధంగా జొప్పించి, ప్రశ్నించి, ఆ ప్రశ్నలో కొత్త లోతుల్ని అన్వేషించవచ్చు. నేపథ్యం ఫ్రేమ్‌ను అందిస్తుంది, కథ సంఘర్షణను నాటకీయం చేస్తుంది, కానీ పుస్తకం మూసిన తర్వాత కూడా పాఠకుడి మనస్సులో నిలిచి ఉండేవి ఇలాంటి ప్రశ్నలే. ఏమి ఆలోచించాలో చెప్పి నేర్పించే కథల కన్నా పాఠకులే తమంతట తాము ఆలోచించుకోవడానికి అవకాశం ఇచ్చే కథలు స్థల కాలాల పరిథుల్ని అధిగమించి పాఠకుల చైతన్యంలో సజీవంగా ఉంటాయి.
ఒక్కసారి ప్రపంచ సాహిత్యంలో గొప్ప పేరున్న కొన్ని కథలను తీసుకోని అవి ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తాయో చూడండి.
సిండ్రెల్లా (Cinderella – Unknown): మంచితనం, వినయం క్రూరత్వాన్ని ఓడించగలవా? లేక అదృష్టం కలిసి వస్తేనే విజయం దక్కుతుందా?
బ్యూటీ అండ్ ది బీస్ట్ (Beauty and the Beast – Unknown): ప్రేమ బాహ్య రూపాన్ని, సామాజిక వివక్షను దాటి ముందుకు వెళ్లగలదా? లేక మనం ఎప్పటికీ పైపై మెరుగులనే చూస్తూ ఉండిపోతామా?
కింగ్ లియర్ (King Lear – Shakespeare): వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత ఏమిటి? అధికారం కుటుంబ బంధాలను చిన్నాభిన్నం చెయ్యగలదా?
స్నో వైట్ (Snow White – Mary Shelley): అమాయకత్వం, స్వచ్ఛత – అసూయ నుంచి కాపాడగలవా? అమాయకత్వం ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుందా?
ది లిటిల్ మెర్మైడ్ (The Little Mermaid – Hans Christian Andersen): మార్పు కోసం చెల్లించాల్సిన మూల్యం ఎంత? మన ఉనికిని కోల్పోకుండా స్వేచ్ఛను, ప్రేమను పొందగలమా?
ది మర్చంట్ ఆఫ్ వెనిస్ (The Merchant of Venice – Shakespeare): న్యాయం అంటే ఏమిటి? కేవలం చట్టాన్ని, ఒప్పందాలను కచ్చితంగా అమలు చేయడమా? వాటన్నింటికీ మించిన ‘కరుణ’ కలిగి ఉండటమా?
క్రైమ్ అండ్ పనిష్మెంట్ (Crime and Punishment – Dostoevsky): నేరాన్ని చేసి గొప్ప ఆశయం కోసమని సమర్థించుకోగలమా? అపరాధ భావం మనిషిని లోలోపల దహించివేస్తుందా?
మిడ్‌నైట్స్ చిల్డ్రన్ (Midnight’s Children – Salman Rushdie): ఒక వ్యక్తి గుర్తింపు ఆ దేశ చరిత్రతో ముడిపడి ఉంటుందా? గతాన్ని వదిలించుకుని ఎవరికి వారు స్వతంత్రంగా ఉండటం సాధ్యమేనా?
ది నెక్లెస్ (The Necklace – Guy de Maupassant): సామాజిక హోదా కోసం, ఆడంబరాల కోసం ప్రాకులాడటం చివరికి వినాశనానికి దారితీస్తుందా? విధి మన పట్ల ఎప్పుడూ క్రూరంగానే ఉంటుందా?
***
స్థల కాలాల గురించి గత నాలుగు సంచికలుగా చెప్పుకున్న విషయాలను ఒక్కసారి పునశ్చరణ చేసుకుని, వాటిని వాడుతూ ఒక ఉదాహరణని చూసి ఈ అంశం మీద చర్చని ముగిద్దాం.
స్థల కాలాలను కలిపితే ఏర్పడేదే నేపథ్యం (ఇంగ్లీషులో setting సరైన మాట) అది కేవలం ఒక దృశ్యం మాత్రమే కాదని — కథాంశం, పాత్ర, ఇతివృత్తం, కథ అంతరార్థానికి బలాన్ని ఇచ్చే ఒక పునాది అని మొదట ప్రతిపాదించాను. ఒక కథ ఎప్పుడు జరుగుతోంది, ఎక్కడ జరుగుతుంది అనే ప్రాథమిక విషయాలను రచయిత వీలైనంత త్వరగా, స్పష్టంగా చెప్పాల్సిన అవసరం గురించి కూడా చెప్పాను.
ఆయా కాలాలకు, ప్రాంతాలకు సంబంధించిన వివరాలు consistentగా ఎందుకు ఉండాలో చెప్పాను. ఒక నిర్దిష్ట కాలంలో సాగే కథ ఆ కాలపు వాస్తవాలను — భాష, సాంకేతికత, సామాజిక స్థితిగతులు, ఆ కాలపు/ఆ ప్రాంతపు దైనందిన జీవన శైలిని ఆ కథ తప్పకుండా ప్రతిబింబించాలి. రచయిత దీనిని చిన్న స్థాయిలో ఉల్లంఘించినా, కథ సాధికారికత కోల్పోతుంది. పాఠకుడి నమ్మకం దెబ్బతింటుంది. రచనలో ఉండే పాత్రలు ఏమేమి చెయ్యగలవు, వాళ్ల నమ్మకాలేమిటి, ఎలా మాట్లాడతారు, ఎలాంటి సంఘర్షణలకు లోనౌతారు అనేవి ఈ నేపథ్యమే నిర్ణయిస్తుంది. అందువల్ల స్థల కాలాల విషయం స్పష్టమైన అవగాహన లేకపోతే, రచన ఎంత బలంగా ఉన్నా కథా ప్రపంచం కృత్రిమంగా, నమ్మశక్యం కానిదిగా అనిపిస్తుంది.
ఆ తరువాత రాసిన వ్యాసాలలో సమయం, స్థలం అనేవి కేవలం అంకెలు, ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని, అవి రెండు కలిస్తే ఏర్పడేవి కొన్ని సందర్భాలు అని వివరించాను. ఆ సందర్భాలలో కథ జరిగినప్పుడు అప్పటి సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ వాస్తవాలను చిత్రీకరించాల్సిన బాధ్యత రచయితలపై ఉంటుంది. సందర్భం ఉండీ, అలాంటి వాస్తవాలను విస్మరిస్తూ, లేదా వాటిని తొలగిస్తూ చేసిన రచన సమాజానికి నష్టదాయకం. హానికరం. అది ఒక ద్రోహంతో సమానం. అదే సమయంలో వాస్తవాలను చెప్తూ ఆ సందర్భంలోనే చిక్కుకుపోయి కథని రక్తి కట్టించలేకపోవటం, ఆ సాహితీ ప్రక్రియకి చేసే అన్యాయం. ఈ రెండింటి మధ్యలో చాకచక్యంతో నడవటమే రచన. వీటితోపాటు గతాన్ని కథగా ఆవిష్కరించినప్పుడు ఆధునిక దృక్పథంతో తీర్పు చెప్పకుండా ఉండాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించాను.
స్థలకాలాల విషయంలో నేను ఈ రోజు వ్యాసంలో ప్రతిపాదించిన మూడో సంగతి – కథ జరుగుతున్న స్థలంలో, కాలంలో ఉంటూనే ఆ కాలాన్ని, స్థలాన్ని దాటి విస్తరించేలా రాయాలని. కథలో సార్వత్రికమైన భావోద్వేగాలు, కాలాతీతమైన ఇతివృత్తాలు, ప్రతీకాత్మకమైన దృశ్యాలు, సందర్భాలు, ప్రశ్నించాల్సిన విషయాలను ప్రశ్నించడం ద్వారా రచయితలు కథ జరిగే సెట్టింగ్‌లో స్థానికంగా ఉంటూనే సార్వత్రికంగా ప్రతిధ్వనించే కథలను సృష్టించగలరు. ఇది సరిగ్గా జరిగినప్పుడు, ఒక కథ నేల వాసనను కలిగి ఉంటూనే తరాలు, సంస్కృతులు, భౌగోళిక ప్రాంతాల అతీతంగా ప్రతి హృదయంతో మాట్లాడగలుగుతుంది
ఒక ఉదాహరణ తీసుకోని కథ, సందర్భం, సందర్భాన్ని స్పష్టంగా సూచించే అంశాలు, అదే కథని సార్వత్రికం చేసే అంశాలను పరిశీలిద్దాం.
(మామూలుగా కథ అనుకున్న తరువాత సందర్భం (స్థల కాలాలు) ఆలోచించాలి. మనం చేసేది academic exercise కాబట్టి ముందు సందర్భం అనుకోని ఆ తరువాత కథాంశంలోకి వెళ్దాం.)
సందర్భం: కాలం: 1970-75 మధ్య. స్థలం: ఆంధ్ర ప్రాంతంలో ఒక పల్లెటూరు
కథాంశం:
“తన భూమిని కాపాడుకోవడానికి పోరాడుతున్న ఒక రైతు” కథ కావచ్చు. లేదా “చదువుకుని ప్రయోజనం లేదు కాబట్టి బందూకు అందుకోవాలనుకుంటున్న కొడుకు” కథ కూడా కావచ్చు. “చిన్న వయసులోనే పెళ్లి నిశ్చయమైతే ఇంత్లో నుంచి రహస్యంగా తప్పించుకోవాలని అనుకుంటున్న అతని కూతురు” కథ కూడా కావచ్చు. లేదా ఈ మూడు కలిపిన ఒక కుటుంబం కథ (పెద్ద కథ లేదా నవలిక) అనుకుందాం.
ఇలాంటి ఒక కథలో, ఆ స్థల కాలాన్ని ప్రతిబింబించే విషయాలు ఏముంటాయి? ఎద్దులు, కాలువలు, వర్షాధారంపై ఆధారపడ్డ రైతులు, అప్పులు ఇచ్చి ఊరంతటినీ గుప్పెట్లో పెట్టుకున్న భూస్వాములు, సాగునీటి పరికరాలు అందుబాటులో లేకపోవడం… ఇంకా?
డెబ్భైలలో మొదటి ఐదేళ్లలో జరిగిన సంఘటనలేమిటి?
పాకిస్తాన్‌తో యుద్ధం, ఫలితంగా బంగ్లాదేష్ ఏర్పాటు, మరో ఫలితంగా ద్రవ్యోల్బణం, స్మైలింగ్ బుద్ద, వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, చారు మజుందార్ మరణం, కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం, జార్జ్ ఫర్నాండేజ్ నేతృత్వంలో రైల్వే సమ్మె, బ్యాంకుల జాతీయీకరణ, గరీబీ హటావో, యాంగ్రీ యంగ్‌మాన్‌గా అమితాబ్, ఇందిర విధించిన ఎమర్జెన్సీ…
ఇప్పుడు చెప్పండి కథమేటి?
నాగన్న. తన ఆస్తి ఇది అని నిరూపించుకోడానికి ఆ ఆస్తిని అనుభవిస్తున్న వాళ్ల కాళ్లు పట్టుకునే సామాన్య రైతు. యుద్ధం వచ్చిందని రచ్చబండ మీద రేడియోలో చెప్తుంటే అందరూ ఆసక్తిగా వినేవాళ్లు. “ఎక్కడో యుద్ధం జరిగితే మనకేంరా? మన పనులు మనం చూసుకోక?” అనేవాడు. ఇప్పుడు ఆ యుద్ధం కారణం చెప్పి ధరలు పెరుగుతుంటే అర్థమౌతోంది. మొదటి యుద్ధం సైనికులది. రెండొవ యుద్ధం సామాన్యులది.
ఈ మాటే కొడుకుతో అంటే గోడమీద రాసున్న “గరీబీ హటావో” అనే అక్షరాల మీద ఉమ్మేసి – “అందరూ గరీబీ హటావో ఉద్యమం అంటున్నారు. కానీ ఇది గరీబ్ కో మిటావో అని కొత్త ఫోగ్రాము.” అంటాడు. అతని పేరు రాజారాం. అతను చెప్పేది నాగన్నకి అర్థం కాదు. కానీ అతని నడవడిలో ఏదో తేడా ఉంది. జంజీర్ సినిమా చూసొచ్చి రాత్రి నుంచి అతను నిద్ర కూడా సరిగ్గా పోవటం లేదు. ఈ మధ్యైతే “సీయందా” అని అరిచి మరీ లేచి కూర్చుంటున్నాడు. అది చారు మజుందార్ గురించి అని తెలుసుకునేంత జ్ఞానం అతని తండ్రికి లేదు. రోజూ ఆ వ్యక్తి అతని కల్లోకి వచ్చి తుపాకి చేతికి ఇస్తున్నాడన్న సంగతి ఇంకెవ్వరికీ తెలిసే అవకాశమే లేదు.
కథ ఇలా నడుపుకుంటూ వెళ్లచ్చు. ఈ కథ నిండా స్థలకాలాలను నిర్వచించే (ఎక్కువగా కాలాన్ని చెప్పే) అంశాలు చాలా ఉన్నాయి (అవసరానికి మించే ఉన్నాయా? కావచ్చు). అదలా ఉంచండి. ఇలాంటి ఒక కథని సార్వత్రికం చెయ్యడానికి ఏం మాట్లాడాలి?
కలలు, బాధ్యత మధ్య నలుగుబాటు (రాజారాం కథ) చెప్పచ్చు
తల్లిదండ్రులు – పిల్లల మధ్య సంఘర్షణ (తండ్రీ కొడుకులు) రాయచ్చు
తమ స్వంతమైనది కోల్పోతామనే భయం (పొలం, కొడుకు)
మెరుగైన భవిష్యత్తు కోసం ఆశ (తండ్రీ కొడుకులిద్దరూ)
ఇలాంటి అంశాలను కథలోకి తీసుకురావటం ద్వారా ఆ కథని నెల్లూరు నుంచి నైరోబీ వరకు, ఏ తరం వాళ్లైనా అర్థం చేసుకునేలా, స్పందించేలా రాయచ్చు.
అలా ఆ కథ దాని సరిహద్దులను దాటి ప్రయాణిస్తుంది
అన్ని రకాల సంస్కృతులలోనూ చెప్పుకోబడుతుంది
ఎన్ని తరాలు మారినా అది ఒక జ్ఞాపకంలా నిలిచే ఉంటుంది
(ఇప్పటికి ఇంతే. మళ్లీ కలిసినప్పుడు మీజాన్‌సేన్)
*








Add comment