నువ్వూ నేనూ నిర్మలమూ ఆనందమూ అద్వైతమూ…

తెలుగువాళ్ళ అనువాద సేతువు పోనుపోనూ బలహీనపడిపోతోంది. అనువాదరంగం బోసిపోతోంది. అట్లాంటి రంగలో స్థిరంగా నిలబడి తెలుగు నుంచి హిందీలోకి, హిందీ నుంచి తెలుగులోకి గొప్ప అనువాదాలు అందించిన నిర్మలానంద గారు కన్నుమూశారు. వారికి ప్రసిద్ధ రచయిత, నిర్మలానంద సన్నిహిత మిత్రుడూ బమ్మిడి జగదీశ్వర రావు నివాళి.

 

‘నేను తప్పు చేశాను..’ మళ్ళీ అనుకున్నాను.

“తప్పు చేయ్యనోడెవడు?”

ఆ సమాధానం నాది కాదు. ఆ సమర్ధనా నాది కాదు. హహ్హహ్హా.. ఆమాటని అంటిపెట్టుకు వచ్చిన నవ్వూ నాది కాదు. అది బయటినుండి వచ్చిందీ కాదు. నా లోలోపలి నుండి నాకే వినిపిస్తోంది. విడవకుండా వెన్నాడుతోంది!

‘నన్ను క్షమించండి..’ నన్ను నేను క్షమించుకోలేక.

“నీ మొకం..”

నిజమే?! శవ పేటికలో నా ముఖమే?! నన్ను నేను చూసుకున్నాను. నేను చచ్చిపోయాను. మనిషి వుండీ లేనప్పుడు చచ్చిపోయినట్టే. మనిషి లేకపోయినా వున్నప్పుడు బతికున్నట్టే!

‘నేను లేను.. మీరున్నారు..’ నా దుఃఖం నేనే మింగలేక.

“ప్రసూతి వైరాగ్యమూ.. శ్మశాన వైరాగ్యమూ అంటించుకోకూడదు..”

నాదసలే ఏడుపు గొట్టు ముఖం. నిండుగా నవ్వలేని నవ్వడం రాని ముఖం. ఎలా నవ్వాలో చూపించినట్టు హహ్హహ్హా.. పెద్దగా నవ్విన ఆ నవ్వు నాకింకా వినిపిస్తూ వెక్కిరిస్తోంది.

ఇంతలో నన్ను పేరు పెట్టి సంస్థ పెద్దలు పిలిస్తే గులాబీని గుండెలమీద వుంచి చూసాను. కాదు, నేను కాదు. తేరుకొని అందరిలాగే ‘కామ్రేడ్ నిర్మలానంద’ అన్నాను. ‘అమర్రహే’ అందరూ అందుకొన్నారు. వెనక్కి వచ్చాను. అందరిలో వున్నా వొంటరినై!

ఒక్కరొక్కరునీ పిలుస్తున్నారు.

వయసు మీదపడ్డ పెద్దల్ని నెలకో మూన్నెళ్ళకో వొక్కసారయినా కలిసి వొకచోట చేరి వొక రోజంతా అందరం కబుర్లు చెప్పుకోవాలి. భిన్నాభిప్రాయాలు యెన్నయినా వుండనీ మనమంతా కలవాలి. పోయిన తర్వాత నివాళులు అర్పించడం సభలు జరపడం కంటే వుండగా యేదన్నా చేస్తే వాళ్ళకి తృప్తి. మనకి వుపయోగం. ఎన్నెన్ని మాట్లాడాను.. సందర్భం దాటాక..

‘నేనూ అందర్లాగే అయిపోయాను..’ నన్ను నేనే కక్కలేక.

“అయితిప్పుడు ఏటంతావు? నువ్వేదంతే నానూ అదే అంతాను..”

ఏడ్చే వాళ్ళని వెక్కిరించినట్టు.. హహ్హహ్హా.. నవ్వు! ఒరేనాయనా ఆ మొకం చూడలేకపోతున్నాం.. కాస్త నవ్వరా బాబూ.. అన్నట్టు తానే నవ్వుతున్నాడు.

అదికాదు.. నేనున్నాను కదా? నాలాగే మీరూ వుంటారని అనుకున్నాను. వెళ్ళాలి. చూడాలి. కలవాలి. మాట్లాడాలి. అన్నీ అనుకున్నాను. ఏళ్లతరబడి అనుకుంటూనే వున్నాను. నగరాన్నో నా స్థిరంలేనితనాన్నో నిందించి కప్పిపుచ్చి సరిపెట్టుకోవడమో సమర్ధించుకోవడమో కాదు. అలవాటుగా అన్నీ రేపూ మాపూ అని వాయిదా వేసినట్టుగానే వాయిదా వేసాను. ప్చ్..

‘కథని వాయిదా వేస్తే, వొప్పుకోరే?’

“సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి..”

హహ్హహ్హా.. నవ్వు- మన్నించేసినట్టు.

శ్రద్దాంజలి ఘటించాక నివాళి ప్రసంగాలు మొదలయ్యాయి. వీధి యిప్పుడు వీధి కాదు. చిన్న సభ. ఎవరో యెప్పుడు తొలిసారిగా కలిసారో చెప్పుకుపోతున్నారు.

ఆఖరిసారిగా నేను యెప్పుడు కలిసానో గుర్తులేదు. అలాగే మొదటిసారిగా యెప్పుడు కలిసానో గుర్తులేదు. ఇదేమిటి నాకేమీ గుర్తులేదు?! విజయనగరంలో వున్నన్ని రోజులూ కలవడం గుర్తుకొస్తోంది. నేను కలవడం కాదు, మీరే వచ్చారు, ఇంటికయినా ఆఫీసుకయినా. నేవచ్చిందీ కలిసిందీ తక్కువ.. ఆమాటే అంటే- నీ డ్యూటీ నువ్వు చెయ్యి.. నాడ్యూటీ నేను చేస్తా.. హహ్హహ్హా.. నవ్వు! నాడ్యూటీ కథ రాయడమే!

‘ఇప్పుడు కనబడ్డాను కదా?, నన్ను కథ అడగరా?’ దాచలేక.

“నువ్వు కథ యివ్వలేదనుకో.. వైట్ పేపర్లు వదిలేసి సంచిక తెస్తాను. అప్పుడు యెవరన్నా అడిగితే బమ్మిడి బావు కథ యిస్తామనిచెప్పి యివ్వలేదు అని చెబుతా..”

హహ్హహ్హా.. నవ్వు! తన కళ్ళలోంచి ముక్కులోంచి నీళ్ళొస్తున్నాయి!

ఎందుకో ఆనాటి తడిచిన కళ్ళు యిప్పుడు ఆరిపోయి వున్నాయి! నావా? తనవా?

‘ఎందుకో జ్ఞాపకాలకి క్రమం లేదు..’

“మనకే క్రమశిక్షణ లేదు..”

హహ్హహ్హా.. నవ్వు!

నాలో దూరి! నాలో తానై! తానే నేనై! నేనే తానై! నిన్న నేడై! నేడు నిన్నై!

ఆ.. తొంభై మూడులో ఆగ్రోలో చేరాను. అది మొదలు బాకీవాళ్ళు అప్పు వసూలు చేసుకు వెళ్ళినట్టు ప్రజాసాహితి కోసం కథలు వసూలు చేసుకు వెళ్ళడమే గుర్తుంది. ఇదిగో నీ కథ ‘ఏ పేటెంట్ ఆన్ ది సన్’ బెంగాలీలో అస్సామీలో చదువుకో.. తెలుగు తప్ప యేమీ రాని నాచేతిలో పుస్తకాలు పెట్టి హహ్హహ్హా.. నవ్వు!

ఇలా చావులప్పుడు తప్ప మనం కలవమా? యెవరో యెవర్నో అడుగుతున్నారు..

నువ్వు విరసం వాడివి కదా?, ప్రజాసాహితికి యెలా రాస్తావని యెప్పుడూ యెవ్వరూ నన్నడగలేదు. అభ్యంతర పెట్టలేదు. ఈనాడు వాళ్ళలా మాకే రాయాలి, వేరే వాళ్లకు రాయకూడదనలేదు. జనసాహితిలో చేరు అని వొక్కనాడు కూడా తను నన్నడగలేదు. స్నేహానికి సాహిత్యానికీ సంస్థలు అడ్డుకాదని నిరూపించి నిలబడ్డారు.

‘మీరు గొప్పోళ్ళు..’

“అబ్బ ఛ.. నువ్వు నా మీద అలగలేదేటి?”

దెప్పి పొడిచినప్పుడూ అదే నవ్వు హహ్హహ్హా..

నిజమే, అలక నిజమే. ఔను రెండువేలలో ‘మట్టి తీగలు’ కథల సంపుటిని ప్రజాసాహితిలో సూరిగారు సమీక్షించినప్పుడు  జవాబుగా కన్నా- నా సంశయాన్ని నివృత్తికోరి ‘ప్రతిస్పందన’ రాసాను. సమాజంలో వేగవంతమైన మార్పులవల్ల ఒకే అనుభవం వొక్కకరికీ వొక్కోలా అవుపిస్తున్నాయని అందుతున్నాయని అందువల్ల కాల్పనికతను అంగీకరించే వాళ్ళు వాస్తవాల్ని అంగీకరించలేకపోతున్నారని, ప్రపంచీకరణలో యే వొక్కరి అనుభవమూ వొక్కటి కాదని.

ఇలా రాత ప్రతిని తీసుకువెళ్ళి అలా అచ్చుప్రతిని తెచ్చి చేతిలో పెట్టిన మనిషి నేను రాసింది చేతిలో పెట్టినా చెవిలో అడిగినా అచ్చేయ లేదు. భిన్నాభిప్రాయం వుండకూడదా? అడిగితే, ఎందుకుండకూడదు?- అనడమే తప్ప అచ్చేయ లేదు. సంస్థ మిగతా పెద్దనీ అడిగాను. ఎడిటోరియల్ బోర్డులో వుందన్నారు. వచ్చినప్పుడు ఏటి ఎడిటరూ యిది? అని చూసాను. ఆ వొక్కటీ అడక్కు అన్నట్టుండేది.

‘ఇంతకీ వేస్తారా? వెయ్యరా?’

“తెలిసిన విషయాలు అడిగితే చెప్పడం కష్టం..”

అదే నవ్వు. నేను నవ్వలేదు. అలిగాను. బాబ్బాబు- అని వొకసారి, అది కాదురా నాయనా- అని మరొకసారి, వదలవా?- అని నా గడ్డం పట్టుకు వొకసారి.. చాలాసార్లు జరిగినా పోన్లే పెద్దాయన అని నేను మన్నించలేదు. కథలు యివ్వడం మానేసాను. కాని ఆయన అడగడం మానలేదు. నీ కోపం నాకర్థమవుతుంది.. అని అన్నా- క్రమేనా కథలు అడగడం మానేసారు. కనిపిస్తే కబుర్లన్నీ వుండేవి. కథలు మాయమయిపోయేవి. నాకు ఆతర్వాత తెలిసింది, రాసినాయన అప్పటికి ఆ సంస్థలో చేరిన కీలక సభ్యుడు అని. వ్యక్తులే ముఖ్యమని. అది సంస్థకు ముఖ్యమని. అదే చెప్పలేకపోయారని. అందుకే తెలిసిన విషయాలు చెప్పడం కష్టమన్నారని.

నాలోంచి నేను తెగిపోయాను. నివాళి ప్రసంగాలు నడుమ మంత్రోచ్చారణలు వినిపిస్తున్నాయి. లేదు, మంత్రోచ్చారణల నడుమ ప్రసంగాలు వినిపిస్తున్నాయి. ఇంతలో నాకాళ్ళకు చల్లగా తగిలింది. చూస్తే నీళ్ళు.

‘ఇదేమిటి?’

“నాకు మావాళ్ళు స్నానం చేయిస్తున్నారు..”

తలతిప్పి చూసాను. పేటిక అక్కడలేదు. పేటికలో లేరు. కుటుంబ సభ్యుల మధ్యన వున్నారు. సాక్ష్యంగా శంఖం ఖాళీలను పూరిస్తోంది. లేదు.. మాతోనే వున్నారన్నట్టు వొకరి తర్వాత వొకరి ప్రసంగాలు.

‘మీకు రెండు కుటుంబాలు’

“నేను కూడా వొక్కడ్ని కాదు కదా? అక్కడ మల్లేశ్వర్రావు. ఇక్కడ నిర్మలానంద..”

హహ్హహ్హా.. ఆపకుండా నవ్వు. తలదించుకున్నా వినిపిస్తోంది. ఆగని ప్రసంగాలు వొక పక్క. ఆపని పూజలు మరోపక్క. మధ్యలో అదే నవ్వు.. అన్నీ కలగలసిపోతున్నాయి.

‘ఎవరి కష్టాలు వాళ్ళవి..’

“చెప్పాను కదా.. సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి..”

హహ్హహ్హా.. మళ్ళీ అదే నవ్వు.

ఏదీ ఆగడం లేదు? బల నిరూపణ కాదు! కాని యిది యిలా మాత్రం కాదు! ఎందుక్కాదు? ప్రజాస్వామ్యం! భిన్నాభిప్రాయాలను గౌరవించడంగా అనుకోవచ్చుగా? ఒక్క చోటేనా? కాక? ఘర్షణా? ఘర్షణలోంచేగా ఐక్యత! గతితార్కిక భౌతిక దేహం!?

ఈ భూగోళం గందరగోళం!!

ఆఖరి స్నానపు నీళ్ళు. సిమెంటు రోడ్డులో యింకలేక యెటు పోవాలో తెలీనట్టు అందిరి కాళ్ళనూ తాకుతూ పారుతూ పాకుతూ వుంది. కొందరు దాటాలని చూస్తూ ఆ నీళ్ళలో అడుగేస్తున్నారు. మరికొందరు దాటకుండా అసలు పట్టించుకోకుండా నీళ్ళలో నడుస్తున్నారు. అంతా దాటామనుకొని ఆఖర్లో కొందరు అడుగేస్తున్నారు. కాళ్ళు తడవ కుండా ప్రపంచాన్ని ఈదొచ్చేమో కాని కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేమన్న వసీరా మాటలు మారిపోతున్నాయి. కాళ్ళు తడవకుండా కూడా జీవితాన్ని దాటలేం. నీళ్ళ మూటల్ని నెత్తిన మోస్తున్నంత కాలం. మోయ్యాల్సిన కాలం. అందులో చావు పుట్టుకల దగ్గర. లిబరలైజేషన్. ఎన్ని మతతత్వ వ్యతిక సంచికలు తెచ్చినా.. రాసినా.. రాశిపోసినా..

కూర్చున్న చోటు నుండి కుంటుతూ లేచాను. కాలి నొప్పి అందరికీ కనిపిస్తోంది. మనసు నొప్పి కనిపించకుండా వుంది. ఎవరి నొప్పులు వాళ్ళవి.

చాదస్తం కాకపోతే ఆయనేంటి.. ఆయన ఫ్యామిలీ యేంటి? భావ వైశాల్యంగలవాళ్ళే బావురు మనలేక గుసగుసమంటున్నారు.

చాదస్తం కాకపోతే యిప్పుడే యిక్కడే నివాళి అర్పించెయ్యాలా? భావ వైశాల్యంలేనివాళ్ళే బావురు మనలేక గుసగుసమంటున్నారు.

‘రెండూ నిజం..’

“రెండూ నిజం కాదు..”

హహ్హహ్హా.. నవ్వు వినిపించలేదు. తలతిప్పి చూసాను. పాడెకు కట్టేసిన దేహం. దేహానికి చుట్టిన తెల్లని పంచె. పంచెని చుట్టిన యెర్రని జెండా. నుదిటి అద్దిన తెల్లని వీభూతి చారలు. మధ్యలో అశోకచక్రంలా గుండ్రంగా పెద్ద కుంకుమ బొట్టు. గుండెల మీద అనువదించిన పుస్తకాలు. కాళ్ళ దగ్గర శ్రీశ్రీ పుస్తకం. ఇంకా దిగువన పాడె కర్రకు కట్టిన కర్రి(నల్లని) కోడిపిల్ల. ఆ నిర్మలత్వం లేచి పారిపోకూడదనేమో తాళ్ళతో కట్టేశారు. ఆ ఆనందం ఆవిరైపోకూడదనేమో నవ్వుతున్న ముఖాన్ని మూసెయ్యలేదు.

‘మీకిది చూసే అవకాశం వుంటే?’

“ఆ కర్రి కోడిని విప్పి యెగరేస్తాను, నాకు మొక్కుతూ కొట్టిన కొబ్బరి చిప్పల్ని మనిద్దరం కూర్చొని కొరుక్కు తినేవాళ్ళం..”

నవ్వొచ్చింది. నవ్వాను. మిత్రులతో చేతులు కలిపాను. దుఃఖం తీరిపోయింది. ఏదో గూటపడుతోంది. గుండె తేలికగా కొట్టుకుంటోంది.. నిట్టూర్పుగా శ్వాస వదిలాక!

గాలిని పీల్చుకోవాలి! వదిలి పెట్టాలి! రెండూనా? రెండూ వుంటాయి! గాలిని పీల్చుతూ వుండాలి తప్పితే వదిలిపెట్టకూడదు అంటే- లేదు, గాలిని వదలాలి తప్పితే పీల్చకూడదు అంటే- కాదు, మనిషి చచ్చిపోతాడు! ఇప్పుడు మాత్రం చస్తూ బతకడం లేదూ? బతుకుతూ చావడం లేదూ?

అంతిమయాత్రకు చిన్న వేన్ వచ్చింది. ఆగింది. పూజా కార్యక్రమాలు అయిపోయాయి. ప్రసంగ కార్యక్రమం అర్ధాంతరంగా ఆగింది.

వేన్ యెక్కించారు.

కొందరు వెంట నడిచారు. మరి కొందరు విడిపోయారు. క(వ)దిలి వెళ్ళిపోతున్న వేన్ వెంట రెండు అడుగులు వేసి ఆఖరి మాటగా అడిగాను.

‘ఈ రెండు శిబిరాల్లో దేహమొకరికి ప్రాణమొకరికి యిచ్చారా?’

“నాకు ప్రాణమూ లేదు, ఆ దేహమూ నాది కాదు..”

హహ్హహ్హా..

అదే నవ్వు!

ఆ నవ్వుని నా పెదాలకు అతికించుకున్నాను!!

*

 

నిర్మలానంద గారు

ప్రముఖ రచయిత, అనువాదకులు, జనసాహితి కార్యవర్గ సభ్యులు నిర్మలానంద గారు(84)  హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. అనువాదకుడిగా ఆయన చేసిన విశేష కృషి తెలుగుసామాజం చిరకాలం గుర్తించుకుంటుంది. ముఖ్యంగా భగత్ సింగ్ ను, పాలస్తీనా పోరాటాన్ని ఆయన తెలుగింటికి తీసుకొచ్చి ఎంతో స్ఫూర్తిని పంచారు. భగత్ సింగ్ రచనలను ‘నా నెత్తురు వృధా కాదు’ పేరుతో జనసాహితి ప్రచురించిన పుస్తకానికి ఆయనే సంపాదకులు. భగత్ సింగ్ తదితరుల విప్లవ కార్యకలాపాలకు ఎంతగానో సహకరించిన దుర్గాభాభీ జీవితం మీద పరిశోధన చేసి ఆమెపై పుస్తకాన్ని ప్రచురించారు. 

1935లో అనకాపల్లిలో పుట్టిన నిర్మలానంద కాలేజీ చదువులు చదవకపోయినా రైల్వే ఉద్యోగం కారణంగా హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో పట్టు సంపాదించారు. ప్రధానంగా హిందీ నుండి పలు రచనలను తెలుగులోకి అనువదించారు. హిందీ కవిత్వాన్ని ‘కాలాల కవాతు’ పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు. విపుల అనువాద కథల్లో చాలావరకు నిర్మాలానంద చేసినవి ఉన్నాయి.

నిర్మలానంద వాత్సాయన్ పేరుతో హిందీలోనూ రచనలు చేసారాయన. శ్రీశ్రీ మహాప్రస్థానంతో సహా తెలుగు కవిత్వాన్ని హిందీలోకి అనువదించి సాహిత్య వారధిగా పనిచేశారు.

17ఏళ్లుగా ప్రజాసాహితి ఎడిటర్ గా పనిచేసి ప్రస్తుతం గౌరవ సంపాదకుడిగా ఉన్నారు. ప్రజాపక్ష రచయిత, స్నేహశీలి, విరసం మిత్రులు నిర్మలానంద మృతికి విప్లవ రచయితల సంఘం సంతాపం ప్రకటిస్తూ ఆయనకు జోహార్లర్పిస్తున్నది.

-పాణి,  కార్యదర్శి, విరసం 

*

బమ్మిడి జగదీశ్వరరావు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • జనసాహితి నిర్మలానంద గారి మృతికి మీ మనసు పడ్డ నొప్పిని నివాళిగా నివేదించిన
    బమ్మిడి జగదీశ్వర రావు గారూ!

    అవును సుమా ” కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటగలిగినవాడు కూడా
    కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేడు ” – వసీరా

  • డియర్ బజరా,నీ ఉద్వేగం నీవిషాదగానం నా మనసును మరొకమారు తడిచేసింది. నిర్మలానందగారిని కళ్లెదట నిలబెట్టింది. ఆయన్ని ఎరిగిన వారందరిదీ ఇదే పరిస్థితీ
    అనుకుంటాను.ఆ రూపం కనిపిస్తుంది.ఆ నవ్వు వినిపిస్తుంది.

    నిర్మలానందగారి నవ్వుగురించి రాయాలంటే ఒక ప్రత్యేక అధ్యాయమే రాయాలి గదా. నువ్వు కొంత రాసావు. నిన్నభినందించాలా…..లేదు.అందుకైతే నిన్నభినందించలేను. అది మన బాధ్యత కదా … ఆ బాధ్యతను ఎరగి నిర్వర్తించినందుకు నిన్నభినందిస్తున్నాను. ఆ బాధ్యతను నిర్వర్తించిన మిత్రులందరం ఒకరినొకరం అభినందిచుకుందాం.
    మనల్ని అభిమానించి,ప్రేమించి, లాలించి,గర్జించి,తిట్టి, దీవించిన ఆ పసి మనసును ప్రేమించక వుండగలమా ఎవరమైనా..
    అదిగో అప్పుడే నా చెవి దగ్గర గొడవచేస్తున్నాడు
    “ఒరే ఏట్రా ఇదంతా….
    నా పనినేను చేసాను.మీ పని మీరు చేయండ్రా ” అంటున్నాడు.
    “కవితలు రాయరా..పాటలు పంపరా…ప్రజాసాహితికి ” అంటున్నాడు.
    ఆయన కోరినంత పని చేయలేనేమో గాని ఆయన పై మాత్రం ఒక పాట రాసి పంపించా…నా బాధ్యత గా

  • నిర్మలానంద అంటే నవ్వే! ఖంగున మోగే కంఠమే. వైజాగులో ఆయన మా ఆఫీసుకొస్తే అందరికీ తెలిసిపోయేది. “మీ ఫ్రెండు…ఆ పెద్దాయనొచ్చాడా?” అని అడిగేవారు.

  • బతికున్నప్పటి నిర్మలానంద నవ్వు పోయింతర్వాతి నిర్మలానంద నవ్వు రెండింటి లోతునీ కళ్ళకు కట్టారు బజరా ! ఎంతయినా ఏం జరిగినా కళ్ళు తడిసినా కాళ్ళు తడిసినా గతితార్కిక భౌతిక దేహం చూడలేదు కదా !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు