విడిపోవడం మొదలయ్యాక
నిమిషాలు గంటలు రోజులు
అంటూ ఉండవు
నిశ్శబ్దాన్ని బద్దలు చేద్దామని ఎంతగా ప్రయత్నించినా
నీ అహంకారం అడ్డుగోడగా నిలిచింది
అపోహ ఊపిరిపోసుకుని మనమధ్య గీతని పెంచుతున్నది
ప్రతి క్షణం ప్రతిస్పందన లేనిదిగా వుంటున్నది
నాలో నేనే ఘర్షణ పడుతూంటాను
పువ్వు లాంటి సున్నితత్వం కావాలనుకుంటాను నేను
ఘనీభవించిన నదిలా వుంటావు నువ్వు
కన్నీళ్ళు ఉపశమనం ఇస్తాయని
తలగడ తడిసిన తర్వాత తెలిసింది
అందుకేనేమో
తలవకుండానే నీటి చలమలవుతున్నాయి కళ్ళు
నీవైపునుండో మోహపు మేఘం
నాపై వర్షిస్తుందని అనుకుంటాను
ఉరుములు మెరుపులేతప్ప
సాంత్వన పరచే సమీరాలే కరువైనాయి
విభజన రేఖల్లా చెరోవైపుకి జరిగిపోతున్నాము
కలిసుండటానికి కలుసుకోవడానికి
ఎంతో బేధంవుంది కదూ…
కాలి అందెల చప్పుడు తో కలిసి నడిచే పాదాలు
నీకోసం వెదుకుతాయి
వడిగా కొట్టుకునే హృదయం
ఇక నిరీక్షించలేక ఆగిపోతుందేమో అనిపిస్తుంది
నీ మనసు తలుపులు పూర్తిగా మూసేశావని
ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను
నువ్వు నానుండి చాలా దూరమయ్యావని
కనపడని నీ ఉనికి సమాధానమయింది.
*
సాంత్వన పరచే సమీరాలే కరవైనాయి