“సావేరి” నేనొక స్వర విపంచిని.
పాట వినిపించే మానసిక స్థితి కాదు నాది. పోనీ, కథ చెప్ప మంటారా! కథ కేమి తక్కువ!? బ్రతుకు కథ చెబుతాను, వేయి కథలతో పాటు.
ఒక్కో కథకి మూలం ఒక్కోలా ఉంటుంది. నా కథ మూలం ఎందరో స్త్రీల కథ లాంటిదే! ఇంకాస్త విభిన్నంగా ఎందుకు లేదూ.. అనే ఆరోపణ నాక్కూడా వుంది.
నెలాఖరు రోజులు. చేతిలో పైసలు నిండుకున్నాయి. ఎవరికీ యెప్పుడూ కూడా మనసు విప్పి చెప్పుకోలేని మొహమాటం లాగానే అప్పు అడగలేని మొహమాటం. మూడు నెలల అద్దె బకాయి. డ్యూటీ చార్ట్ ఖరారు కాకముందే ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ దగ్గరకు వెళ్ళి తరువాత నెలలో ఆఖరి వారంలో తన షో స్ వుండేలా చూడమని రిక్వెస్ట్ చేసాను. అతను దయతలిస్తే కాస్త ఊపిరి పీల్చుకున్నాను. పిల్లను తీసుకుని హైదరాబాద్ పయనమయ్యాను. అక్క దగ్గర అతిథిగా కొన్నాళ్ళు వుండి కొన్ని జింగిల్స్ చేయాలి. రాసి రికార్డ్ చేసుకున్న జావళి లు వినిపించి ఏదైనా ఛానల్ లో అవకాశం కోసం ట్రై చేయాలి. అదృష్టం కలిసొస్తే యేదైనా అవకాశం లభిస్తే ఈ ఎఫ్ యెమ్ ను వదిలేయాలి. అంతకన్నా ముందు భర్త నుండి విడాకులు తీసుకోవాలి, అక్క మహిళా కోర్టు జడ్జి గా చేస్తుంది. ఆమె సాయం వుండనే వుంటుంది అనుకున్నాను. కొన్ని అనుకున్నట్టే అవుతాయి. ముఖ్యమైనవి తప్ప.
వచ్చిన రెండు రోజుల తర్వాత అక్కను విడాకులకు అప్లై చేస్తానని అడిగాను. అక్క యేమీ మాట్లాడకపోవడం బాధ కల్గించింది.కాస్త వివరంగా చెప్పాను.
“అతన్ని భరించడం చాలా కష్టంగా వుంది. ఎప్పుడెక్కడ వుంటాడో అసలు ఆఫీస్ కి వెళతాడో లేదో తెలియదు. పాప నేసుకుని వెళ్ళి షో చెయ్యడం కష్టంగా వుంది. ఆ జాబ్ చెయ్యకపోతే యింటి ఖర్చులకు కూడా డబ్బులుండవు. జెరాక్స్ సెంటర్ కూడా మూసేయక తప్పలేదు. షట్టర్ తెరిస్తే అప్పుల వాళ్ళ తాకిడితో మెదడు మొద్దుబారిపోతుంది. మూడేళ్ల నుండి యిదే వరుస. అవన్నీ వొకెత్తు. అతను యింటికొస్తే యింకో నరకం. నోటితీట, జుగుప్సాకరమైన మాటలు,చేతలు భరించలేకున్నాను అక్కా!” మనసులో బాధను కళ్ళనీళ్ళతో గుమ్మరించాను.
“కారణాలు గట్టిగానే వున్నాయి. కానీ విడాకులు వరకూ వెళ్ళే ముందు యింకోసారి గట్టిగా ఆలోచించు చెల్లీ! పిల్లదానికి తండ్రి అనేవాడు వుండాలి కదా” అంది.
“ఇంకెప్పుడూ అక్కతో కష్టాలు చెప్పుకోకూడదు” దృఢంగా అనుకున్నాను. ఫ్రెండ్స్ సహకారంతో అవకాశాల కోసం ప్రయత్నించాను.రెండు జింగిల్స్ చేసి కొంత డబ్బు చేతికందాక పర్వాలేదు, ఈ మాత్రం ప్రోత్సాహం వుంటే లైఫ్ లాగించేయవచ్చుననే ఆశ వేళ్ళూనుకుంది. .
“పిల్లకు నీకూ పండుగ కి బట్టలు కొనుక్కో” అని చేతికి పదివేలు యిచ్చింది అక్క.
“వద్దక్కా! యిప్పటికే నీకు చాలా రుణపడి పోయాను” అని సున్నితంగా తిరస్కరించాను.
“తోడబుట్టిన వాళ్ల మధ్య రుణం అనే మాటలుంటాయటే” అని మందలించింది.తర్వాత నేను చూడకుండా యింకొంత కలిపి నా బ్యాగ్ లో పెట్టింది.
బస్ యెక్కించడానికి అక్క బావ యిద్దరూ వచ్చారు. కదలబోతున్న బస్ యెక్కేముందు “అక్కా, బావ గారూ! మీ యిద్దరిని వొక మాట అడగనా?”
“చెప్పమ్మా సావేరి, ఏ హెల్ప్ కావాలన్నా నిస్సంకోచంగా అడుగు” మాటిచ్చాడు బావ.
“నాకేదైనా జరిగితే నా పాపను చూస్తారు కదూ!” సమాధానం కోసం చూడకుండా బస్ యెక్కేసింది. వాళ్ళిద్దరి చూపుల్లో దిగులు వీడ్కోలు బాధలో మిళితమైంది.
**********
జీవితంలో అన్ని రోజులు ఒకేలా వుండవు. జీవితాన్ని మలుపు తిప్పే పరిచయాలు జురుగుతుంటాయి. అప్పటికి అది మాములు పరిచయమే ! ఆ రోజు ఎఫ్ ఎమ్ లైవ్ లో వుంది. నానారకాల పైత్యాలు భరించిన తర్వాత అతని కాల్.
“నా పేరు శ్రీకాంత్! “
“నైస్! ఇంకొంచెం చెప్పండి మీ గురించి?”
“నౌ ఐ యామ్ ట్వంటీ యెయిట్. సినిమాలు అమ్మాయిలు చాట్స్ ప్రేమలు పిక్నిక్ స్పాట్స్ ఫ్రెండ్స్ తో వీకెండ్ పార్టీలు అన్నీ రొటీనైపోయి లైఫ్ బోర్ కొట్టేసింది. నన్ను యెప్పుడూ విడిచిపెట్టనిది పాట వొక్కటే, పాట నా చేతివెన్నముద్ద. ప్రస్తుతానికి దాన్నే పట్టుకుని వేలాడుతున్నాను. మీ స్వరం మీరు ప్లే చేసే పాటలు చాలా బాగుంటాయి.”
“పాట పట్టుకుని వేలాడుతూ వుండటానికి కూడా ఇంకేదో పట్టుకుని వేలాడాలి కదా! అదేంటో చెప్పే సేయండీ”
“చెప్పాలంటారా, చెప్పక తప్పదంటారా?”
“బలవంతం ఏమీ లేదు, fm యెవరు వింటున్నారు అనే సర్వే కోసం అనుకుని చెప్పేస్తే వొక పనై పోతుంది”అని హింట్ పాస్ చేసింది.
“సాఫ్ట్ వేర్ అన్నాననుకోండి” అన్నాడతను.
“ఓకే.. ఓకే. మీకిష్టమైన పాట చెప్పండి?”
“కీరవాణి ప్రణయమా! ప్లే చేయండి.”
“ ఓ! మీది 90’ స్ టేస్ట్ అన్నమాట, మీరు కొంచెం పాడవచ్చు కదా! “
అడగడమే తడవు అతను పాట అందుకున్నాడు. విబ్రాంతి గా వింటూ అనుకున్నాను.
“పాడమని అడిగితే తన ప్రాణాన్ని పాటలో నింపే వాడితను. పాట సాహిత్యానికి జీవం పోసేవాడితను అని.”
ఆ తర్వాత రెండు రెండురోజుల పాటు అతని పాట మెదడులో గింగిరాలు తిరుగుతూనే వుంది.
ఇంకోరోజు.. అతనే! పాట తోనే పలకరింపు.
“నీవే అమర స్వరమే సాగే శృతిని నేనే” అంటూ. పాట కోసం యెవరూ ఫోన్ చేయరు. మీతో మాట్లాడటానికే చేస్తారు” అన్నాడు.
అలా అన్న అతను రుజువు చేయడానికే అన్నట్టు నిత్యం నా షో కి మాత్రమే కాల్ చేసేవాడు. మిడ్ నైట్ కి గంట ముందు యెండ్ అయ్యే షో కి కాల్ చేసినపుడు సంభాషణల్లో డిన్నర్ గురించి ప్రస్తావన.
“మీకేం, మీరు హాయిగా తినేసి రిలాక్స్ అవుతూ కాల్ చేస్తున్నారు. నేను యింటికి వెళ్ళి వొండుకుని తినాలి” అంది.
సైన్ ఆఫ్ చేసి బయటికి వచ్చి పార్కింగ్ వైపుకు వెళ్ళబోతుండగా “సావేరి మేడమ్!” అని గట్టిగా పిలిచాడో వ్యక్తి. అప్రయత్నంగా తల తిప్పి చూసింది.
అతను వేగంగా సమీపించి “మీరు వెజ్ ఆర్ నాన్ వెజ్ ? “
చిరాకుపడి “మీరెవరు? అసలు ఆ విషయం మీకెందుకు?”
“ఇప్పుడు యింటికి వెళ్ళి యేం వొండుకొని తింటారు లెండి. వెజ్ అయితే ఇది తీసుకోండి నాన్ వెజ్ అయితే ఇది తీసుకోండి” చేతులు రెండూ చాచి చూపుతూ అన్నాడు.
“ఆర్ యు శ్రీకాంత్!” ఆశ్చర్యంగా అడిగింది.
“యెస్ మేమ్. తప్పుగా అనుకోకండి. ఆకలి తో యెవరున్నా యిలాగే పుడ్ అందిస్తాను. ఆకలి యెలా వుంటుందో నాకూ బాగా తెలుసు గనుక.” ఈ సారి అతను చూపుల్తో స్నేహ సేతువు కడుతున్నాడు
ఏవో పాజిటివ్ వైబ్స్. అతని చేతిలో వెజ్ పేకింగ్ ని అందుకుని థ్యాంక్స్ చెప్పింది. ఆ అందుకునే క్రమంలో అతని చేతివేళ్లు తగిలి మనసు ముట్టుకున్నట్టు అనిపించింది.
“ఏంటి విశేషం? కొందరు నీ షో కి మాత్రమే కాల్ చేస్తారు. వారికి ఏం మంత్రదండం వేసావ్” అని నవ్వుతూ కో ఆర్జేస్ అడిగినా అందులో కనబడని ఓ వెక్కిరింత ఈర్ష్య కలగాపులగంగా వుండేవి.
“అదేంలేదు, ఏదో పాటల టేస్ట్. అంతే!”
నిజంగా అప్పటికి అంతే! ముందు ముందు ఏం కాబోతుందో నాకు మాత్రం ఏం తెలుసు?
విధి వల్లనో వరం లాగానో ప్రేమ దేవతల కరుణ వల్లనో నాకు తారసపడ్డాడు.
అతను కాల్ చేయగానే.. ఎందుకో నా కళ్ళలో మెరుపు. పెదవి పై లేనగవు అంకురిస్తూ వుంటుంది.
అనేక చికాకులు సమస్యల్లో వున్న నాకు అతని పరిచయం నచ్చింది. నా బాధల గురించి మర్చిపోయే వెసులుబాటు నిచ్చింది. అతని ఆలోచన రిలీఫ్ నిచ్చింది. పర్సనల్ ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకోవడం జరిగిపోయింది. ఫ్లూట్ ప్లేయర్ రాజేష్ చేర్తాల, శాక్సోఫోన్ లిపిక సమంతా ని వారి స్వరనాదాల తీయదనాన్ని పరిచయం చేసింది అతనే! ఎన్నో కబుర్లు, క్లాసికల్ మ్యూజిక్, పుస్తకాలు గురించి అతని మాటల్లో అవలీలగా దొర్లిపోయేవి. అతని నేపథ్యం సంగీతసాహిత్యంతో ముడిపడి ఉందని అర్ధమైంది. అప్పుడప్పుడు ఏ పార్క్ లోనో బీచ్ లోనో కలవడం. సరదా కబుర్లు. లిరిక్స్, స్క్రిప్టులు ఇచ్చిపుచ్చుకోవడం. ఇద్దరం కలసి కొన్ని పాటలు రికార్డ్ చేసాము.
అతనొక ప్రేమ సముద్రం. ఒడ్డున వున్న రాయిలాంటి నన్ను అలల కళ్ళతోనే నిలువెల్లా సృశిస్తుంటే తడిసి ముద్దై సజీవంగా మారినట్లు వుంది. మదిలోకి చొరబడుతుంటే టక్కరిగా ఓరగా తలుపు తీసి మూసి దాగుడుమూతలు ఆడింది.వమూసిన కిటికీ తలుపులపై వాన తన మృదువైన స్పర్శతో సంతకం చేసినట్లు అతని గుండె గుసగుస నా గుండె వరకూ చేరింది.
ఏకాంతమున నేల యెదురైతినే తనకు
లోకాధిపతికేల లోనైతినే
చేకొనిదె మన్నించె శేషాద్రివల్లభుడు
పైకొనిదె మమ్మేల పాలించెనే – పదే పదే పాడుకున్నాను.
మనసు ముట్టుకున్నవాడు బాహ్యంగా దూరంగా ఎలా వుంటాడు?
అటుఇటూ తేల్చుకోలేక ఊగిసలాడాను. మధనపడ్డాను. బిడ్డ తల్లిని కదా.. నేను అని నాలుగునాళ్ళు ఊగిసలాడాను. ఆఖరికి సందేహాన్ని జయించాను.
“ఉత్తమ వ్య క్తినించివొచ్చే వున్నత ప్రేమ మన జీవనానికి పరమ అవసరము, మకుటము అని చలం అనలేదూ” ఆహ్వానించకపోవడం తప్పు కదూ! నా మోహ గిరి అతను. వశం తప్పుతున్న శరీరానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాను.
మంచులా గడ్డకట్టిన నా దేహం కరగడం మొదలైంది. జడము చైతన్యంతో కలిసి ప్రవహించిది. ఆ కలయిక కు పారిభాషిక పదజాలం ఏమిటి? నువ్వు నా స్వైరిణి వి అన్నాడు అతను. ఉలికిపడ్డాను. నిజమే కదా! అతనితో అనుభవం నా జీవితానికో వరం.
అతను ఏ పని చేసినా మనఃస్పూర్తిగా అంకితభావంతో చేస్తాడు. పాపాయి కి పాలు పట్టడం ముక్కు తుడవడం డైపర్ మార్చడంతో సహా. ఆల్కాహాల్ మానేయమని అడిగాను.. మారుమాటాడకుండా వదిలేసాడు. అంతే! తనను పూర్తిగా అతనికి వదిలేసుకుంది.
మూడు నెలలు సెలవు పెట్టేసింది. ముందుకు అడుగు వేసింది. అతని తల్లి నివాసముంటున్న ఇంటికి తీసుకువెళ్లాడు. కోనసీమ లో ఓ పల్లెటూరు. అప్పుడు ఆమె కలకత్తాలో వుంది అని చెప్పాడు. ఆ ఇల్లు గోదావరీ తీరం లో వుంది. గ్రంథాలయంలా పూలవనంలా చిత్రకళా కుటీరంలా వుంది. “ఎంతో రసికుడు దేవుడు ఎన్ని పూవులెన్ని సొగసులిచ్చేడు” పాట పదే పదే పాడుకున్నాను.
అది మండు వేసవి. ఆ మూడ్నెల్ల కాలం ఎలా గడిచిందో చెప్పలేను. నా జీవితంలో గడిపిన అత్యద్భుత కాలం అది. ఏటిలో పడవ ప్రయాణం లా భావగీతంలా సాగిపోతుంది. అతనొక ప్రేమ ప్రవాహం. రేపటి గురించి ఆలోచన లేదు భయం లేదు. స్వేచ్ఛగా హాయిగా కలసి పాడుకుంటూ ఆడుకుంటూ వంట చేసుకుంటూ పిల్లదాన్ని అపురూపంగా పెంచుకుంటూ.
నల్లగా నిగనిగలాడే (ఆకుపచ్చ ) తోటలో అనేక రంగురంగుల కనకాంబరాలు. ఆ రంగులంటే అతనికిష్టమట. పొద్దున్నే పూసి సాయంత్రానికి రాలే పువ్వులు కావవి. తీయని మకరందంతో విరాజిల్లుతూ తుమ్మెదలను ఆకర్షిస్తాయి అని చెప్పాడు. పాపాయి ని ఆ పూలతోటలో నిలుచుండబెట్టి పదుల సంఖ్యలో ఫోటోలు తీసాడు. దాన్ని గుండెలకు హత్తుకుని నువ్వు నా కనకాంబరానివి అనేవాడు. ఈర్ష్య గా చూస్తున్న నన్ను హత్తుకుని నువ్వూ నా కనకాంబరానివే! అనేవాడు ఆకాశాన్ని చూపిస్తూ.కాలం అలా స్తంభించిపోతే బాగుండును అని పదే పదే అనిపించేది కూడా!
“సావేరి, పాపను ఎవరికీ ఇవ్వవద్దు. మన దగ్గరే వుంటుంది. అమ్మకు అంతా చెప్పాను. అభ్యంతరం చెప్పలేదు. మనం ఇక్కడే వుండిపోదాం. సిటీ కి వెళ్ళవద్దు” అని పదే పదే అనేవాడు.
ఇతను ఎల్లప్పుడూ ఇదే ప్రేమ ఇవ్వగలడా? అన్న అనుమానం కల్గేది నాలో. మళ్లీ అంతలోనే ఛీ! నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అని మొట్టికాయలు వేసుకొనేదాన్ని. “అయినా ఈ నగ్నదేహాల బిగింపుల బలమెంతో కాలమే చెప్పాలి” అని అనేక సంశయాలతో అనుకున్నాను. అయినా నాకు యిదే కావాలి అదొద్దు అనడానికి మనమెవరం ? నాకిపుడు ఇది ఇలా జరగాలని రాసి పెట్టి వుంది కాబోలు అనుకునేదాన్ని.
కాలం అలా గడిచిపోతే ఎలా? ఆడియో సంభాషణలతో సరిపెడుతున్న నన్ను వీడియో కాల్ చేయమని బలవంతపెట్టసాగింది అక్క. నేను ఏదో కుంటిసాకులతో దాటేసేదాన్ని. ఆమెకేదో అనుమానం పొడచూపింది. ఆరా తీయడం మొదలెట్టింది. వచ్చి చూస్తే ఖాళీ ఇల్లు వెక్కిరించింది. కొలీగ్స్ ని ఆరాతీసారు. ఎలాగైతేనేం మా ఆచూకీ కనుక్కొన్నారు. రెండు కార్లలో మేమున్న ఇంటికి వచ్చి పడ్డారు.
అప్పుడు శ్రీకాంత్ ప్రక్కనే వున్న టౌన్ కు వెళ్లాడు. అది వాళ్ళకు అనుకూలంగా మారింది.
“చూస్తూ కూర్చుంటే యేకు మేకు అవుతుంది మేకు బాకవుతుంది” అంది అక్క.
బావ గారు “ఇదేం పని అమ్మా! ఫలానా జడ్జి చెల్లెలు ఇలా చేసింది అంట అని చెప్పుకుంటుంటే మీ అక్క కు ఎంత అవమానం? పరువు తక్కువ?“ అన్నారు.
“జీవితాన్ని ఆస్వాదించడానికి అనుభవించడానికి అనుభూతి చెందడానికి సరైన జోడి కావాలి. వయస్సు రాగానే ఎవరినో వొకరిని చూసి ముడి పెట్టేసి చేతులు దులుపుకుంటారు. కనీస అభిరుచులు కూడా కలవకుండా శరీరాలు మాత్రమే కలుస్తూ మనసులు యుద్ధాలు చేస్తూ నిత్యం నటిస్తూ రోజులు గడుపుతారు. కాబట్టే.. ఆ జీవితం నిస్పృహ గా మారింది. దానికి తోడు ప్రేమరాహిత్యం, అతగాడి వ్యసనాలు, ఆర్థిక పరిస్థితులు, అప్పులు, బాధ్యతలు నా జీవితాన్ని నరకం చేసాయి” అని గట్టిగానే చెప్పాలనుకున్నాను. కానీ గొంతు పెగల్లేదు.
ఎలాగో నోరు విప్పి “నాకు నచ్చిన పని నేను చేసాను. అతను నాకు వద్దు. విడాకులకు అప్లై చేస్తాను.”
“అలాగే! విడాకులు తీసుకున్న తర్వాత అతన్ని పెళ్ళి చేసుకుందువు. అప్పటి వరకూ నా దగ్గర వుందువు గాని వచ్చేయ్” అంటే అక్కను నమ్మి వారి వెంట వచ్చేసాను.
అక్కడికి చేరుకున్నాక ఇరువైపు పెద్దలూ చేరి చూపుల చురకత్తులతో మాటల గునపాలతో గుచ్చి గుచ్చి చంపారు. నీకు వాడే కావాలి అనుకుంటే పిల్లను వొదిలేసి వెళ్ళిపొమ్మని పిల్లను లాక్కుని రెండు రోజులు కనబడనీయకుండా చేసారు.
“పాప కావాలా? శ్రీకాంత్ కావాలా!? అంటే ఏం చెబుతాను.” నిస్సహాయంగా చూస్తూ వుండిపోయాను. ఈ లోపు ఎక్కడ వున్నాడో తెలియని భర్తను వెతికి పట్టుకొచ్చి ఇంటికి వొంటికి కాపలా పెట్టారు. శ్రీకాంత్ ని కలవనీయకుండా మాట్లాడకుండా విశ్వాసం కల కుక్కలా అనుక్షణం కనిపెట్టి అనుసరించే వుండేవాడతను. అత్తమామలు సైనికుల్లా కాపలా. తన చేతిలో ఫోన్ అనేది లేకుండా చేసి గృహ ఖైదు చేసేసారు. శ్రీకాంత్ రెండు రోజులు ఇంటి చుట్టూ తిరిగాడు. అక్క కంప్లైంట్ చేసింది. అతన్ని పోలీసులు తీసుకు వెళ్ళారు. ఏం జరిగిందో తెలియదు. అలజడి,భయం,ఏవో పీడకలలు. ఇంట్లో గుసగుసలు. అతని గురించి ఆందోళన.తిండి లేదు, నిద్ర లేదు.
ఎలాగోలా వాళ్ళ కళ్ళుగప్పి పక్కింటి అమ్మాయి నడిగి ఫోన్ తెప్పించుకుని రహస్యంగా శ్రీకాంత్ కి ఫోన్ చేసాను. ఇంట్లోనే వున్నాడు. ఎంత చిక్కిపోయాడో! అంత నిరాశగా వున్నాడు.
“సావేరీ! పాపను తీసుకుని వెంటనే వచ్చెయ్, విడాకుల సంగతి తర్వాత చూసుకుందాం” గొంతు రుద్దమై మాట కన్నీటి మడుగులో చేప పిల్లలా ఈదులాడింది.
“రాలేనేమో శ్రీ” అన్న నా మాట విని ధారగా కన్నీరు కార్చాడు. అతన్ని ఓదార్చడం నా వల్ల కాలేదు.
“శ్రీ! ఇప్పుడు నేను నీ ప్రేయసిని కాదు,ఆ నాటి స్వరఝరి ని కాదు. పరాజయ కంఠధ్వని మాత్రమే! ఓ బిడ్డకు తల్లిని మాత్రమే! కుటుంబ గౌరవాన్ని కాపాడే బానిసని మాత్రమే! నన్ను అర్థం చేసుకో! ప్లీజ్!”
“నాకు రెండు నాల్కలు, రెండు గుండెలు, రెండు జీవితాలు లేవు సావేరి. వసంతంలో పుట్టి శిశిరంలో రాలిపోయేది కాదు నా ప్రేమ. నేను రాలిపోవడమే తప్ప!”
“నీకేమైనా పిచ్చిపట్టిందా! లేక బ్లాక్ మెయిల్ చేస్తున్నావా ? నన్ను మర్చిపొమ్మని చెబుతున్నాను కదా!” అరిచేసాను.
అవతల ఫోన్ పగిలిపోయిన శబ్దం.
“ప్రయత్నిస్తాను అని కూడా తాను ఎందుకు చెప్పలేకపోయింది? అంటే ప్రయత్నించడం లేదనే కదా! ప్రశ్న ప్రశ్నించింది. అపరాధభావంతో ఓ నిట్టూర్పు విడిచాను. ఆలోచించడం మొదలెట్టాను. పాపతో సహా వెళ్ళిపోవడానికి మార్గాలు వెతకసాగాను.
వారం రోజులు గడిచాయేమో! ఆడదాన్ని తిరస్కారాన్ని మగవాడు భరించలేడు. మొగుడైతే మరీనూ. ఆ మొగుడనే వాడు నన్ను తన దారిలోకి తెచ్చుకో ప్రయత్నం చేసాడు. అతన్ని దూరంగా నెట్టి కచ్చితంగా చెప్పాను.
“మనం భార్య భర్త అన్న గీత దాటిపోయింది. ఎవరి సరదాలు సుఖాలు సంతోషాలు వారివి గా మారిపోయాయి. నలుగురు స్త్రీలతో నాకు అక్రమ సంబంధం వుండొచ్చు కానీ నువ్వు మాత్రం నాకు ప్రతివతా శిరోమణి అయిన భార్య గానే వుండాలి అంటే కుదరదు. అసలు నీతో జీవితం కొనసాగించాలంటేనే నాకసహ్యమేస్తుంది. విడాకులు కావాలి. ఇచ్చేయ్!” అని అరిచాను.
జుట్టు పట్టుకుని ఈడ్చాడు. విచక్షణా రహితంగా కొట్టాడు. అసహ్యంగా తిట్టాడు. భరిస్తూనే మొండిగా చెప్పాను.
“నేను అతనితో గడిపిన రోజుల్లో పొందిన ప్రేమ ఆనందం సంతోషం నీతో గడిపిన మూడేళ్ళ లో వీసమెత్తు కూడా దక్కలేదు. మన ఇద్దరికీ ఏ విధంగానూ సరిపోదు. నన్ను వదిలేయ్ ప్లీజ్!” వేడుకున్నాను కూడా!.
అయినా వినలేదు. పశు బలంతో దాడి చేశాడు.ఆ మృగం ముందు నా దేహం ఓడిపోయింది. ఒడలంతా భగభగ మండిపోయింది. ఇక ఈ జీవితం ఇంతేనా? నాపై నాకే అసహ్యం కల్గింది.
నిస్త్రాణంగా పడిపోయిన నేను తడి స్పర్శకు కళ్లు తెరిచాను. లేచి పాపాయి కి డైపర్ మార్చబోయి అది పొడిగా వుండేటప్పటికి జరిగింది గ్రహించాను. అదొక అవమానం. అసహ్యంతో బాత్ రూమ్ లోకి పరిగెత్తాను.
స్నానం చేసి వచ్చి కారిడార్ లో నిలబడ్డాను. అప్పుడే గుడి గంట మ్రోగింది. గోపురం వైపు చూసి హృదయ నమస్కారం చేసుకున్నాను.ఆ చర్య నాలో పాపభీతి కాదు. నేను మనసా వాచా కర్మణా శ్రీకాంత్ తో గడిపానని అర్థమైంది. అంతలో పక్కింటి అమ్మాయి కంగారుగా కారిడార్ లోకి వచ్చింది. సైగ చేసింది. ఫోన్ నాకే అంది. అందుకుని లిఫ్ట్ చేయగానే శాపనార్ధాల వర్షం శరాఘాతంలా తడిపేసింది. ఓ తల్లి గుండె శోకాలు పెడుతుంది. ఆమె శ్రీకాంత్ తల్లి. ఆమె చెప్పిన మాటలు విని..
“నో! అలా జరగడానికి వీల్లేదు” అంటూ గట్టిగా అరిచి పెద్దగా ఏడుస్తున్నాను.
ఇంట్లో అందరూ చుట్టుముట్టారు. విషయం చెప్పాను. భర్త అనే పురుగు నా వైపు చూస్తున్నాడు అతని కళ్ళల్లో వికృతమైన ఆనందం నృత్యం చేస్తోంది. అందరూ వాన కురిసి ఆగిన తర్వాత గొంతు చించుకుని అరిచే బావురు కప్పల్లా బెకబెక మన్నారు. వారందరి కళ్ళల్లో రాక్షసత్వం ద్విగుణీకృతం అయింది. ఏవో అపశకునపు మాటలు.
నాలో ఏదో విస్పోటనం, పశ్చాతాపం. ఇంకేమీ ఆలోచించకుండా ఒక్క ఉదుటన ఇంట్లో నుండి బయటకు వచ్చి తలుపు గడియ బిగించేసాను. రోడ్డున పడి ఎక్కడికో, ఏమో తెలియని పరుగులు తీస్తూ..
నిశ్శబ్దంగా జారుతున్న కన్నీరు, అడుగడుగుకి గుండె బరువు పెరిగిపోతుంది. అడుగు తడబడుతుంది. అయినా ఆగలేదు వగరుస్తూ.. అడ్డదిడ్డంగా అనేక మలుపులు తిరుగుతూ తిరుగుతూ.. రైల్వే స్టేషన్ వైపు.
నేను సమాజానికి భయపడ్డానా? శ్రీకాంత్ పరిచయానికి ముందైనా భర్త తన మెడకు భారమైనా బాధ పెడుతున్నా నాకొద్దీ మనిషని యెందుకు త్యజించలేకపోయింది? ఇప్పుడు మాత్రం ఏమైంది? అది బిడ్డను వదలలేని బలహీనత మాత్రమే కాదు, ఏదో బలవంతపు భరింత.
శతాబ్దాలుగా స్త్రీల మనోభావాలపై అణచివేత వున్నట్లే ఇప్పుడు కూడా తన జీవితంపై మరి కొందరి ఉక్కుపాదం, పెత్తనం, జులుం, స్వారీ. ఇంకా ఏవేవో! నచ్చని వ్యక్తి నుండి విడాకులు ఆశించడం తప్పా!? ఆ హక్కు సుదూర తీరమేనా!?
శ్రీకాంత్ జీవితాన్ని నిర్లక్ష్యంగా సుళువుగా తీసుకునే మనిషి. ఎంత బాధను అనుభవించి వుంటే ఆ కఠిన నిర్ణయం తీసుకుని వుంటాడు?. అందుకు కారణం యెవరూ? నేను కాదూ! ఏడేడు జన్మలకు కలిసి నడుద్దాం అనుకున్న వాగ్ధానాలు నీటి బుడగలై పోయాయి.
“శ్రీ.. నువ్వు లేకపోతే నేనుంటానా? నెవ్వర్! ప్రేమ ముగిసినప్పుడు జీవితం కూడా ముగిసిపోతుందని నువ్వు అనుకున్నప్పుడు నేనూ నీ దారిలోనే! క్షణకాలం కూడా ఆలోచించకూడదు. ఈ బంధాలు బంధనాలు అన్నీ తృణప్రాయంగా విసిరేయాలి. అవును అంతే!”
“శ్రీ ! నేను భౌతికంగా నీతో కలిసి జీవించలేక పోయానన్నమాటే కానీ.. ఈ ఎడబాటులో నిన్ను మరిచింది లేదు. కేవలం ఈ దుఃఖ దేహంతో నిలిచి వున్నాను. నా ఆత్మ నీవు. ఆత్మను మాత్రమే నీకివ్వగలను. నువ్వు మాత్రం బ్రతకాలి,నిండు నూరేళ్ళూ బ్రతకాలి!! ఈ ప్రపంచానికి నువ్వు కావాలి. ముఖ్యంగా మీ అమ్మకు నువ్వు కావాలి. ఎవరికైనా నువ్వు పంచే అమృత ప్రేమ కావాలి. అతి మధురమైన నీ స్వరం నిర్జీవమై పోకూడదు. నీ ప్రేమ లో తడిసి తరించే భాగ్యం అదృష్టం నాకెలాగూ లేదు. పరువులు కోసం పడి చచ్చే పాపాత్ములు నాకు నిన్ను మిగలనీయరు. నా కోసం నిష్కారణంగా నువ్వు మరణించకూడదు!” అప్రయత్నంగా అంతులేని ప్రేమ నిండుకున్న నా గొంతు నుండి నా ఆత్మ చీల్చుకుని వచ్చిందా అన్నట్లు ఓ పెనుకేక. “శ్రీ”.. అంటూ.
చుట్టూ వున్నవాళ్ళు విచిత్రంగా చూసారు. వెళుతున్న వారు ఆగి వెనక్కి తిరిగి మరీ చూసారు. వెనుక నడుస్తున్నవారు ఆసక్తిగా నన్నే గమనిస్తున్నారు. లోకం అంతే! లోకానికి మరే పని లేదు ఇతరులను గమనించడం, నిందించడం తప్ప. వ్యాఖ్యానించడం తప్ప..
వేగంగా గూడ్స్ బండి దూసుకువస్తుంది. అంతవరకూ ప్లాట్ ఫామ్ పై నడుసున్నదాన్నల్లా వొక్క వుదుటున పట్టాల మీదకు దూకేసాను. పైన నిలబడినవారు వెనక్కి రమ్మని లేదా అవతలకు వెళ్లమని గోల గోలగా అరుస్తున్నారు.
ప్రేమ అగ్ని కీల. అందులోనే దగ్ధం కాదలుచుకున్నాను. శ్రీకాంత్ లేని జీవితం ఊహించలేను. ఆ విషాద గీతం ఆలపించలేను. నాకూ ఈ జీవితం వద్దనే వద్దు. మృత్యు భయాన్ని జయించాను. తెంపరితనంతో ముందుకు ఉరికి ఎదురుగా వస్తున్న రైలును క్షణ కాలం అతన్ని హత్తుకున్నట్టుగానే. అంతే! బాధల తుఫాన్ తీరం చేరడానికి సమీపంలో వుంది.
కథ ఇంకా వుంది. పాట సాగుతూనే వుంది అంతులేని ప్రవాహంలా!
*
చిత్రం: సృజన్ రాజ్
మీ కథలు ఎప్పుడూ పట్టుసడలకుండా చదివింపచేస్తాయి. ఈ కథ చదివాక మాత్రం మనసు భారం అయింది. ఎన్నో ఆలోచనలు ముగింపు మరోలా ఉంటే అని.. బహుశా నా మనసుకి బాధను ఓర్చుకునే శక్తి తగ్గిపోయినట్టుంది. నిజానికి దగ్గరగా ఉన్న కథ ఇలానే ముగుస్తాయి చాలా వరకు…
చక్కటి కథ అందించినందుకు థాంక్యూ వనజ గారు
చాలా బాగుంది
మీ కధ చాలా బావుంది