నువ్వు గోరంత దీపానివి నూర్ జహాన్!

నూర్ జహాన్  
వాడ్రేవు చినవీరభద్రుడు
నేను పిలుస్తానో, నువ్వే వస్తావోగాని ఆ క్షణం మనచుట్టూ
వందలు, వేలు అడివిపువ్వులు సురభిళిస్తాయి.
నువ్వు నీ పాటల తేరులోంచి స్మృతుల పరదా తప్పించి
కమానుతో ఉప్పెనలానో తుపానులానో నిలువెల్లా వూపుతావు.
రాత్రి గడిచిపోతూంటుంది.
చల్లని వెన్నెలల పెళ్ళి ఊరేగింపులో
ఆకాశవీథిలో తారకల కారవాన్ నిశ్శబ్దంగా సాగుతుంది.
పల్లకీలో అరమోడ్పుగా చిరునవ్వే నవవధువల్లే జాబిల్లి.
పాదాల్ని కుంగదీసే ఎడారి ఇసికపొరల వలలనుంచి
చూపుల్ని వేటాడే ఎండమావుల ముక్కుతాళ్ళనుంచి
ఈ పిట్టని ఆదరించి ఎగరేస్తావు.
ఏ ఆకుపచ్చని ఒయాసిస్సు నీలి అలలో కదా నీ పాటలు.
నీ స్వరం
ఏ అపరిచిత గృహాలోంచో నా ఆత్మీయులైన స్త్రీలు పిలిచినట్టుంటుంది
పాలపైని మీగడలా నీ గానంలో పేరుకునే ఆనందపల్లవం
దిక్కులేని ఆడవాళ్ళకి ఏ జీవనమాధుర్యమో క్రమంగా
అందినట్టుంటుంది.
నువ్వు తలుపులు తీసి
నీ కురుల్ని సవరించుకుని
నీ పెదాల సరసిలోంచి పాటని మృదువుగా పుష్పించగానే
వెయ్యి లఖ్నవీ సారంగులు తీయని బాధతో దిగులుగా అల్లలాడతాయి.
మీర్ కవిచక్రవర్తి ఏ పిరదౌసు పారిజాత వనాల్లోనో స్పృహ
తప్పుతాడు.
ముల్లాలు, మానవగణ పాలకులు
ఒక తృటి మైమరచి ప్రచారాన్నీ, యుద్ధాన్నీ వదిలేస్తారు.
నువ్వు పాటలు పాడుతుంటే
మాఘఫాల్గుణాల మధ్యాహ్నాల్లో
కొండ అంచుల్లోంచి వూగే ఎండుటాకుల వూయెలల్లో
దిగంతాల దాకా వూగిన నా పసితనం నన్నావరిస్తుంది.
అప్పుడు నా దేహం కరిగి, ఒలికి, చిట్లి లోకమంతటా చిందుతుంది.
ప్రతి బాధాదగ్ధ మానవుడి కపోలాలపైనీ నిలుస్తుంది.
నువ్వు శబ్దాన్ని మృదువుగా నీ స్వరపేటికలో మడిచిపెట్టగానే
చెదిరిన అనేకవేల నా ఆత్మశకలాలు ఒకటిగా చేరతాయి.
ఇప్పుడు లోకంలోని అన్ని బాధలూ నేనే, అన్ని ఆనందాలూ నేనే.
నీవు గోరంత దీపానివి, నూర్ జహాన్!
నువ్వు కొండంత వెలుగువి, నూర్ జహాన్!
1987
(వాడ్రేవు చినవీరభద్రుడు ” ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ” కవితాసంపుటి నుంచి )
సినీ సంగీత ప్రియులకు  నూర్ జహాన్  చిరపరిచితమైన పేరు . అయితే ఈ పేరు ఇంతవరకూ విననివారి కోసం కొన్ని పరిచయవాక్యాలు అవసరం. నూర్ జహాన్ (1926 – 2000) ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలో, ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. ఈమె పాకిస్తానీ నేపథ్యగాయని, నటి. భారత ఉపఖండంలోని అత్యంత ప్రభావవంతమైన గాయనీమణులలో ఒకరుగా పేరొందిన ఈమె ఉర్దూ, పంజాబీ, సింధీ భాషల్లో సుమారు 30,000 పాటలు పాడారు. ఈమెకు పాకిస్థాన్ లో ” మాలిక్ – ఎ – తరన్నుమ్ “(మెలోడీ రాణి) అనే గౌరవ బిరుదు ఇవ్వబడింది. ఈమె హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంతో పాటు, ఇతర సంగీత ప్రక్రియల్లోనూ దిట్ట.
నూర్ జహాన్ పాటలను విన్న కవి, ఆమెను సంబోధిస్తూ రాసిన కవిత ఇది. ఆమె గానాన్ని విన్నప్పటి అనుభూతిని (feel), అప్పటి తమ అనుభవాన్ని (experience), తమవైన ఊహలతో (imagination) మిళితంచేసి కవితనల్లారు కవి.
” నేను పిలుస్తానో, నువ్వే వస్తావో గాని ” అంటూ ఈ కవితను ప్రారంభించారు. కనుక ఇది, కవి ఆమె పాటలను ప్లే చేసి వింటున్న సందర్భం కావొచ్చు లేదా కవి ప్రమేయం లేకుండా పాటలు వినబడుతున్న సందర్భమూ కావొచ్చు.
” స్మృతుల పరదా తప్పించి” అనే వ్యక్తీకరణ, కవి ధ్యాస ఆమె పాటలవైపు మళ్ళడాన్ని సూచిస్తోంది.
” రాత్రి గడచిపోతూంటుంది ” అనే వాక్యాన్ని బట్టి పాటలు వింటున్న సమయమేమిటో తెలుస్తోంది.
“పిట్ట” అని కవి చెబుతున్నది తన గురించే. ఎడారి ఇసుక పొరలను, వలలతో పోల్చడం ( రూపకం చేయడం ),  ఎండమావులను, ముక్కుతాళ్ళతో పోల్చడం ( రూపకం చేయడం ) – అసాధారణ వ్యక్తీకరణలు. ఇసుక పొరల వంటి వలలు అన్నారు కాబట్టి , పిట్టను లోనికి లాక్కుంటున్నవి బలమైన వలలుగా భావించాలి. ” ఎండమావులు”, భ్రాంతికి సూచన. ఇక్కడ గాయని పాట కవిని, తనని బలంగా లోనికి లాక్కుంటున్న ఏవేవో వలల నుండి, భ్రాంతుల నుండి తప్పిస్తోంది లేదా రక్షిస్తోంది. అందుకే ” ఈ పిట్టను ఆదరించి ఎగరేస్తావు” అంటున్నారు కవి.  ఆ తరువాత పాదంలో ” ఏ ఆకుపచ్చని ఒయాసిస్సు నీలి అలలో కదా నీ పాటలు” అనడం ద్వారా, ఆమె పాటలు తనకు కలిగిస్తున్న హృద్యమైన సాంత్వనను అందమైన పదచిత్రం ద్వారా కళ్ళకు కట్టారు.
” నీ పెదాల సరసిలోంచి పాట మృదువుగా పుష్పించగానే
వెయ్యి లఖ్నవీ సారంగులు తీయని బాధతో దిగులుగా అల్లలాడతాయి
మీర్ కవిచక్రవర్తి ఏ పిరదౌసు పారిజాత వనాల్లోనో స్పృహ తప్పుతాడు.
ముల్లాలు, మానవగణ పాలకులు
ఒక తృటి మైమరచి ప్రచారాన్నీ, యుద్ధాన్నీ వదిలేస్తారు ” _  అంటూ కవి చేసిన ఊహలు గాయని గళమధురిమకు, గానవైదుష్యానికి కవి మెచ్చుకోళ్ళు.
ఇక,
” నువ్వు పాడుతుంటే…
కొండ అంచుల్లోంచి వూగే ఎండుటాకుల వూయెలల్లో
దిగంతాల దాకా వూగిన నా పసితనం నన్నావరిస్తుంది” అనడం, ఆమె పాటలు వింటూ కవి పొందిన
విశేష ఆనందాన్ని, తమ బాల్యకాలపు జ్ఞాపకాల్లోకి ప్రవేశించడాన్ని తెలుపుతున్న వ్యక్తీకరణ.
“నా దేహం కరిగి, ఒలికి, చిట్లి లోకమంతటా చిందుతుంది.
ప్రతి బాధాదగ్ధ మానవుడి కపోలాలపైనీ నిలుస్తుంది ” అనే వాక్యాలు – కవి హృది ఆర్ద్రం కావడాన్ని, నయనాలు అశ్రుపూరితం కావడాన్ని సూచిస్తున్నాయి.
“నువ్వు గోరంత దీపానివి నూర్ జహాన్!
నువ్వు కొండంత వెలుగువు నూర్ జహాన్! ” అంటూ కవితను ముగించారు.
” గోరంత దీపం కొండంత వెలుగు ” అనేది తెలుగు సామెత. ఈ సామెతను రెండుగా చేసి అందంగా ఉపయోగించారు కవి. గోరంత అంటే స్వల్పమని, కొండంత అంటే అనల్పమని మనకు తెలుసు. ఇక్కడ ఆమె గానదీపం కంటే అది ప్రసరించే వెలుగు విస్తారమైనది అని చెబుతున్నారు కవి. ఇది అనుభూతి ప్రధానంగా సాగిన కవిత. ఈ కవితలోని భావగాఢత పాఠకులను ఆకట్టుకుంటుంది. ఈ గాఢతను సాధించడానికి కవి పదచిత్రాలను, రూపకాలంకారాలను సాధనాలుగా తీసుకున్నారు.
ఊహల ప్రౌఢిమ కూడా భావగాఢతను సాధించడాన్ని గమనించవచ్చు.
*

మంత్రి కృష్ణ మోహన్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు