‘నువ్వు అంచు మీద ఉన్నావా?’

ప్రజల నాలుకల మీద నాట్యం చేసేదే జాతీయం (idiom) తప్ప, మనం ఇష్టం వచ్చినట్టుగా మలుచుకుంటే ఏర్పడేది జాతీయం కిందికి రాదు.

భాషలోని జాతీయాలనైనా వేరే భాషలోకి అనువదించేటప్పుడు చాలా జాగ్రత్తను పాటించడం అవసరం. ఎందుకంటే, వాటిని తర్జుమా చేసేటప్పుడు పొరపాట్లు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు జాతీయాలను మామూలుగా వాటి మూలభాషలో రాసేటప్పుడు సైతం పొరపాట్లు జరిగే వీలుంది. ఈ విషయాన్ని మొదట వివరించాలి. సామెతలను కానీ జాతీయాలను కానీ, సాధ్యమైనంత వరకు ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా రాయాలి. ఉదాహరణకు పప్పులో కాలేయడంను కందిపప్పులో కాలేయడం అని రాస్తే ఉచ్చారణ పరంగా మరింత బాగుండొచ్చు కాని, అప్పుడది జాతీయం కాకుండా పోతుంది. ప్రజల నాలుకల మీద నాట్యం చేసేదే జాతీయం (idiom) తప్ప, మనం ఇష్టం వచ్చినట్టుగా మలుచుకుంటే ఏర్పడేది జాతీయం కిందికి రాదు. ఏ భాషలోని జాతీయాలకైనా ఈ సూత్రం వర్తిస్తుంది. To look a gift horse in the mouth అనే ఆంగ్లజాతీయంలో పదాలు సరైన క్రమంలో లేనట్టనిపించి వాటిని To look in the mouth of the horse that was given as a gift అని మార్చితే, అప్పుడు ఆ వాక్యం జాతీయం కాకుండా పోతుంది. ఈ వాక్యానికి అర్థమేమిటో తెలుసా? ‘(మనకు) ఇవ్వబడిన కానుకలో వంకలను/ లోపాలను వెతకటం’ అని.

జాతీయాలను అనువదించేటప్పుడు ముందు అవి జాతీయాలు అనే విషయాన్ని అనువాదకుడు గుర్తించాలి. ఇది అన్ని సందర్భాల్లో అనుకున్నంత సులభం కాకపోవచ్చు. ఉదాహరణకు Wake up and smell the coffee (వాస్తవికంగా ఆలోచించు), Elvis has left the building (ఆట/ ప్రదర్శన ముగిసింది), I blew it (నేను అవకాశాన్ని వృథా చేసుకున్నాను), At the drop of a hat (ఆలోచించకుండా; నిస్సంకోచంగా/ తక్షణమే) – మొదలైనవి జాతీయాలు అని వెంటనే అనిపించకపోయే ప్రమాదముంది. Much water has flowed under the bridge ను వంతెన కింద చాలా నీరు ప్రవహించింది అని అనువదించకూడదు. చాలా సంగతులు/ సంఘటనలు జరిగాయి అనేదే దానికి సరైన అనువాదం. He came to me with a very long face ను ‘అతడు నా దగ్గరికి చాలా పొడవైన ముఖంతో వచ్చాడు’ అని కాక, ‘అతడు నా దగ్గరికి దిగులుతో, నిరాశతో వచ్చాడు’ అని అనువదించాలి. అదే విధంగా, To keep a straight face అంటే నవ్వును ఆపుకుంటూ గంభీరమైన ముఖం పెట్టడం అని అర్థం. ఇక To make faces అంటే అయిష్టాన్ని కనబరిచే ముఖం పెట్టడం అని అర్థం. To put your foot in it అంటే ఎవరినైనా ఇబ్బందికి గురి చేసేలా అకస్మాత్తుగా ఒక మాట అనడం.

ఈ వ్యాసరచయిత Ghalib – the Man, the Times గ్రంథాన్ని అనువదిస్తున్నప్పుడు మధ్యలో, As a far cry from his earlier statement అనే clause తగిలింది. ఇక్కడ Far cry ని దూరపు కేక అని అనువదిస్తే పప్పులో కాలు వేసినట్టే అవుతుందనే సందేహం వచ్చింది. మామూలు నిఘంటువుల్లో వెతికితే, సరైన అర్థం మొదట్లో దొరకలేదు. అప్పటికి దాన్ని పక్కన పెట్టి అనువాదాన్ని కొనసాగించి, కొన్ని నెలల తర్వాత నిఘంటువులను బాగా పరిశీలిస్తే, Far cry from = Very different from (చాలా భిన్నంగా) అని అవగతమైంది. కొన్ని జాతీయాలను ఎన్ని పదాలతో ఎంతగా వివరించాలని ప్రయత్నించినా ఫలితం సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. To take for granted ను ఎట్లా అనువదించాలి? తప్పదని అంగీకరించడం, ఒప్పుకోవడం, సమ్మతించడం – వీటిలో ఏదీ సంతృప్తికరమైన వివరణనివ్వదు. ‘ప్రశ్నించకుండా వాస్తవంగా ఎంచడం’ అని రాసినా మనసు నిండదు. Be (as) busy as a bee కి కచ్చితమైన అనువాదం చేయాలనుకున్నప్పుడు, busy అన్న పదానికి సరిగ్గా సరిపోయే తెలుగు మాట ఏమిటి? హిందీలో అయితే ‘వ్యస్తం’ అనే మాట వుంది. కాని, తెలుగులో దానికున్న అర్థం వేరు. ఒకవేళ తెలుగులో కూడా అదే అర్థం వున్నా అది అందరికీ సులభంగా అర్థమయ్యే పదం కాదు. ‘తీరిక లేనంత పనితో’ అని తర్జుమా చేసి సంతృప్తి చెందాల్సిందే. ప్రతి భాషలో ఇట్లాంటి ప్రత్యేకమైన పదాలు, నుడికారాలు కొన్ని ఉంటాయి.

ఒకే రకమైన భావాన్ని తెలుపడం కోసం ఒకటికన్న ఎక్కువ జాతీయాలు ఉండవచ్చు. ఉదాహరణకు Let the cat out of the bag అన్నా, Spill the beans అన్నా భావం ఒకటే – బండారాన్ని బయట పెట్టటం, లేక రహస్యాన్ని బట్టబయలు చేయడం అని. Costs an arm and a leg, Daylight robbery, ఈ రెండూ దాదాపు ఒకే అర్థాన్నిస్తాయి – విపరీతమైన ధర ఉండటం అని. అదే విధంగా Play it by ear అన్నా Cross the  bridge when you come to it అన్నా ముందుగా నిర్ణయం తీసుకోకపోవడం, ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడం అని అర్థం.

ఆంగ్లం మన మాతృభాష కాదు కనుక, తెలుగు జాతీయాలను ఇంగ్లిష్ లోకి అనువదించేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. కొట్టిన పిండి అనే జాతీయానికి Beaten flour సరైన తర్జుమా కాదు. Cakewalk లేక a piece of cake అన్నది దీనికి దగ్గరగా వచ్చే అనువాదం. ‘వడ్డించిన విస్తరి’కి a silver platter సరిపోయే పదబంధమని మనలో చాలా మందికి తెలుసు. కాని, దీన్ని వాక్యంగా మలిచేటప్పుడు దోషం దొర్లే వీలుంది. ‘అతని జీవితం వడ్డించిన విస్తరి’ని His life is a silver platter అనకుండా, He gets everything on a silver platter అని రాస్తేనే అది సరైన ఆంగ్లభాష అవుతుంది. ఎందుకంటే, ఆంగ్లభాషలో అటువంటి ప్రయోగమే ఉంది మరి. కన్నుల పండువును A treat for the eyes అని తర్జుమా చెయ్యాలి; a festival for eyes అని రాస్తే అది తప్పు అవుతుంది. Treat అంటే విందు. వీనులకు విందును కూడా A treat for the ears అనొచ్చు. I will see you out కు నిన్ను సాగనంపడానికి నీతో వస్తాను (I will see you off) అనీ, నువ్వు చనిపోయేటప్పుడు నేను బతికే ఉంటాను (నీకంటె నేను ఎక్కువ కాలం బతుకుతాను) అనీ రెండు రకాల అర్థాలున్నాయి. Are you on the edge? ను తెలుగులో ‘నువ్వు అంచు మీద ఉన్నావా?’ అని రాయకూడదు. నువ్వు ఆందోళనగా ఉన్నావా? అని రాయాలి.

కొన్నిసార్లు, మనం తర్జుమా చేస్తున్నది మాతృభాషలోని వాక్యమైనా దాన్ని ముక్కకు ముక్కగా అనువాదం చేస్తున్నామనే అనుమానం రాకపోవచ్చు. అంటే, తెలుగు వాక్యాలలో కూడా కొన్నింటిని జాతీయాలు అని గుర్తించకపోయే అవకాశముందన్న మాట. ఉదాహరణకు ‘కొంపలంటుకు పోలేదు’ను Houses have not burnt అని తర్జుమా చేయకూడదు. దాన్ని Nothing serious/ sinister has happened అని అనువదించాలి. Thank God, everything has gone well ను ‘భగవంతుడా, కృతజ్ఞతలు. ప్రతిదీ బాగా జరిగింది’ అని అనువదిస్తే పప్పులో కాలు వేసినట్టే. ఇది ప్రతికూల ఫలితమేదీ రానందుకు ఉపశమనంతో ఊపిరి పీల్చుకోవటాన్ని సూచించే వాక్యం. వాస్తవానికి దేవుడిని సంబోధించడం ఇందులో లేదు. కనుక, దేవుని దయవల్ల అంతా సవ్యంగా జరిగింది అని కాని, ‘హమ్మయ్య, బతికిపోయాను/ బతికిపోయాం; అంతా సవ్యంగా జరిగింది’ అని కాని తర్జుమా చెయ్యాలి. ‘అన్నంత పనీ జరిగింది’ని What was said, has happened అనకుండా What was feared, has happened అని రాయాలి. Done with, done in లు జాతీయాలే. As soon as I am done with combing my hair…. అంటే నేను నా తలను దువ్వుకోవడం పూర్తవగానే…. అని అర్థం. ఇక Done in కు నాశనమవడం (He was done in by his greed), మోసపోవడం (She was done in by her friend), అలసిపోవడం (I am done in after my exams) మొదలైన రకరకాల అర్థాలున్నాయి.

ఏ భాషకైనా జాతీయాలు సంపద వంటివి. కాబట్టి, వాటిని సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా అనువదిస్తేనే అనువాదకులుగా న్యాయం చేసినవాళ్లమౌతాం. లేని పక్షంలో హాని చేసినవాళ్లుగానే మిగిలిపోతాం. కనుకనే జాగ్రత్త ఎంతో అవసరం.

***

ఎలనాగ

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు