నీ ప్రయాణం! 

అంతర కుహరాలలో నీ ప్రయాణం.
నువ్వు తప్ప ఇక్కడ ఎవరు వుంటారు?
ఒంటరితనం విస్తృతంగా వ్యాపించి వుంది.
విశాలంగా, విస్తారంగా
అనంతంగా గోచరిస్తోంది.
అపార దుఖరోదనలు అయినా,
అపూర్వ అనంద తాండవాలు అయినా,
ఇక్కడ నువ్వు తప్ప ఎవరూ లేరు.
కోరికల ఉచ్చుల్లో చిక్కుకున్నా ,
మోహాల అంధకారాలు కమ్ముకున్నా,
స్నేహాల రాగాలు అలరించినా,
అనురాగాల సౌగంధిక పుష్పాలు మత్తెక్కించినా,
ఇక్కడ నువ్వు తప్ప ఎవరూ లేరు.
లోతు తెలియని భయాలు భయపెట్టినా,
నిరంతర సందేహాలు వేధించినా,
ద్వేషాలు పదునైన కత్తుల్లా గుచ్చుకుంటున్నా,
అపనమ్మకాల భ్రాంతిలో మార్గం కనరాకపొయినా,
ఇక్కడ నువ్వు తప్ప ఎవరూ లేరు.
అలౌకిక సంగీతాలు మైమరిపించినా,
అందమైన అనుభూతులలో
అనంతాల్లోకి ఎగసిపోయినా,
ఇక్కడ నువ్వు తప్ప ఎవరూ లేరు.
అంతర కుహరాలని మాటలతో
గాయాలు చేసి, రక్తసిక్తం చేసినా,
ఇక్కడ నువ్వు తప్ప ఎవరూ లేరు.
ఈ ఒంటరితనం..
అధిగమించలేని అపారం.
తప్పించుకోలేని అనంతం.
ఇక్కడ నువ్వు తప్ప ఎవరూ లేరు!
విస్తృతమైన ఒంటరితనం తప్ప.
ఏదో ఒక రోజు కెరటాలు తీరాన్ని
తమలోకి లాక్కున్నట్లు
నిన్ను తనలోకి లాక్కుంటుంది.
అప్పుడు కూడా ఇక్కడ
ఎవరూ ఉండరు నువ్వు తప్ప.
నువ్వూ మెల్లగా సాగర తీరంలా,
సాగరంలో కలిసిపోక తప్పదు.
అందుకే చేతులు చాచి
ఒంటరితనాన్ని కౌగిలించుకుని,
అపార తీరాలు అయినా,
అంతంలేని లోతులు అయినా,
కరిగిపోవడం సుఖం.
అప్పుడు నువ్వూ ఉండవు.
నువ్వు చేతులు చాస్తే చాలు,
నిన్ను అందుకొని,
నులివెచ్చని బాహువుల్లోకి
నిన్ను ఇముడ్చుకొంటుంది.
పొందికగా గుండలకి హత్తుకొని,
భయం ఎందుకు అని గుసగుసలాడుతుంది
ఇక్కడ నేను తప్ప ఎవరూ లేరు అంటుంది.
సడిలేని సవ్వడులు,
నిశ్శబ్ద సంగీతాలు,
వెలుగులు నింపుకున్న చీకట్లు,
సృష్టి అద్భుత విన్యాసాలు,
మరెన్నో రహస్యాలు నీకు చూపిస్తానని
మృదువుగా, మనోహరంగా నవ్వుతుంది.
ఆ నులివెచ్చని స్పర్శ,
మృదువుగా, వెచ్చగా తాకుతున్న
ఆ ఊపిరి నీకు పరిచయం అయినదే.
ఆది – అంతాలలో
అది నీ నెలవు.
నువ్వు పోగుట్టుకున్న నీ నివాసం.
ఒకప్పుడు నిన్ను ఆవరించిన గర్భకోశమే అది.
నీ మూలాలు దీనిలోనే దాగివున్నాయి.
నీ సృష్టి ఆరంభం దీనినుంచే.
నీతోనే, నీలోనే వున్నా,
నువ్వు ఎప్పుడూ పట్టించుకోని,
గుర్తుపట్టని ఆత్మబంధువు.
బొడ్డు కోసినా తెగని బంధం.
ఆలోచిస్తే అంతా అవగతం అవుతుంది.
అవగతం అయ్యాక
నీ గూడుని చేరుకోవడానికి
నీకెందుకు సంశయం? సంఘర్షణ ఎందుకు?
మెల్లగా ఒంటరితనంలో కరిగిపొయి,
కలిసిపోవడం సుఖం.
అప్పుడు
ఒంటరితనపు లోతులు నిన్ను భయపెట్టవు.
ఆ విస్తృతత్త్వం కంగారూ పెట్టదు.
స్వ నివాసాన్ని చేరుకున్నట్లు ఊరట,
విశ్రాంతి చెందుతావు.
మనసు ప్రశాంతంగా, ఉద్వేగ రహితంగా వుంటుంది.
అప్పుడు ఈ ఒంటరితనమే,
ద్వంద్వాతీత ప్రశాంతతని ఆవిష్కరిస్తుంది.
అంతర కుహరాలలో
ప్రయాణం.
ఇక్కడ విస్తారమైన ఒంటరితనం తప్ప
ఎవరూ లేరు.
నువ్వు కూడా లేవు.
*

మణి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు