నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా…

పాటలన్ని మనసును కదిలించవు.కొన్ని పాటలు వద్దనుకొని దూరం దూరం జరిగినా ఏదోచోట నీలోకి ప్రవేశిస్తాయి.ఏ వయసువారినైనా మురిపిస్తాయి,మైమరిపిస్తాయి.అడుగుకదలని వాడిని దుంకిపిస్తాయి.అలలలోతేలియాడిస్తాయి.ఏడ్పిస్తాయి,నవ్విస్తాయి,కవ్విస్తాయి.
ఏదైనా కావచ్చు ప్రేమో,విరహమో,విప్లవమో,శృంగారమో ఇక్కడ చెప్పని ఇంకేదో కావచ్చు.ఎవరి అభిరుచికనుగుణంగా వారిలోకి
“పాట తూటాలా దిగబడుతుంది”.పాటతో శ్వాసించే వాడిలోకి,ఆరాధించేవాడిలోకి ప్రాణం పోసే ఔషధమై దిగబడుతుంది.ఇష్టం లేని వాడికి గాయం చేసే ఇనుపముక్కలా గుచ్చుకుంటుంది.సాధారణంగా పాటంటే ఇష్టంలేని వారున్నారంటే అది అతిశయోక్తి.
అలా పాటలలోని సృజనను,సాహిత్యాన్ని వెలికి తీసే ప్రయత్నమిది.
యువసేన సినిమాతో తెరంగ్రేటం చేసి లిరిక్ రైటర్గా స్థిరపడ్డ “రామజోగయ్యశాస్త్రి” ఈనాటి మన పాట “మగువా మగువా ” రచయిత.ఈయన స్వస్థలం గుంటూరు జిల్లా ముప్పాళ్ళ.మొదటగా గాయకుడిగా స్థిరపడుదామనుకొని ప్రయత్నాలు చేసి చివరకు పాటల రచయితగా స్థి‌రపడ్డారు.తానోటి తలిస్తే దైవమొకటి తల్చాడనే సామెత ఈయన విషయంలో ఋజువైంది.ఈయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి శిష్యుడు.
ఒకప్పుడు మాతృస్వామ్యవ్యవస్థ ఉండేది.అన్ని విషయాల్లో కుటుంబానికి అమ్మే ఆధారం.ఎప్పుడైతే పితృస్వామ్యవ్యవస్థ వచ్చిందో అప్పుడు అమ్మది వెనుకడుగు పడింది.స్త్రీగా కూడా వెనకడుగు వేయాల్సివచ్చింది.వాస్తవంగా స్త్రీ తరతరాలుగా నలుగుతూ వస్తూనే ఉంది.ఆమె తన కుటుంబం కోసం
పోషించని పాత్రేది ఉండదు.జీవిత చరమాంకం వరకు
ఆమె తన కోర్కెలను,ఆనందాలను అణిచివేసుకుంటూ
కుటుంబాన్ని నిలబెడుతుంది.అలాంటి మాతృసమానురాలైన స్త్రీ ప్రాధాన్యతను తెలపటం కోసం ఈ పాటను రాయటం ముదావహం.అంతకు ముందు స్త్రీ ప్రాధాన్యతలను తెలిపేవి చాలా పాటలు మనం చూడొచ్చు.”దేవత” సినిమాలో ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ,ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అనే పాట,”అమ్మ రాజీనామా” లో నుండి ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం అనే పాట,20వ శతాబ్దం సినిమాలో అమ్మను మించి దైవమున్నదా అనే పాట,పవిత్ర బంధం సినిమాలో అపురూపమైనదమ్మ ఆడజన్మ అనే పాట ఇలా మనం చాలా పాటలను చూడొచ్చు.ఆ పాటలన్నీ ప్రేక్షకుల మన్ననలు పొందినవి.ఇన్ని పాటలను చూసినపుడు ఈ పాటలో ప్రత్యేకత ఏంటని మనం గమనిస్తే ఈ పాటంతా పూర్తిగా కవిత్వం చేయబడిన పాటగా చెప్పగలను.ఈపాటలో కాటుక కనులు,వెలుగులు పూయటం,విప్పార్చటం,ప్రియమగుపాలన,సిరి మెరుపులు లాంటి పద ప్రయోగాలు చూస్తాము.ఇందులో మొదటి మూడు సహజంగా రచయితలంతా ఏదో పాటలో ఉతికారేస్తున్న పదాలే కానీ చివరి రెండు పదాలు మాత్రం కొత్తగా ఆకట్టుకుంటాయి.
తెలుగులో స్త్రీ కి ఉన్నన్ని పర్యాయపదాలు పురుషుడికి ఉన్నట్టు నాకు కనిపించలేదు.పర్యాయపదాల విషయంలో మాత్రం స్త్రీ ముందంజలో ఉంది.మగువా అనే పదం స్త్రీకీ ఓ పర్యాయపదమే.రచయిత పాట మొదట్లోనే “ఓ స్త్రీ లోకానికి నీ విలువ తెలుసా” అని  ఓ సందేహాన్ని వెలిబుచ్చాడు.ఇప్పటికీ మనం వేసుకోవాల్సిన ప్రశ్నే అది.ఇన్ని ఆకృత్యాలు జరుగుతున్నాయంటే ఇంకా స్త్రీ విలువ తెలియట్లేదనే అర్థం కదా.ఆ విలువను తెలియజేస్తూ రచయిత తరువాతి వాక్యాలను సమన్వయం చేశాడు.
“సరిహద్దు” అనే పద ప్రయోగం చాలా చక్కగా కుదిరింది.స్త్రీ సహనాన్ని చెప్పటం కోసం వాడిన గొప్ప  ప్రతీక.మన జీవితంలో తారసపడ్డ కొన్ని అంశాలను నెమరువేసుకుంటే స్త్రీ సహనమెంతో అర్థమవుతుంది.తనకు ఇష్టమైనవి వదులుకొని జీవితాన్ని భర్తకు,పిల్లలకు సమర్పించేంతా సహనం స్త్రీలో ఉంటుంది.ఈ సహనం గురించి ఒక మాటలోనో,ఒకపాటలోనో చెప్పలేం .కానీ రచయిత   గొప్పగా మనముందుంచారు.ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక గుటుకలో తినేయగల ప్రసాదాన్ని  కుటుంబమంతటికి పంచాలని చూస్తుంది.అవసరమొస్తే ఆమె వంతును కూడా కొడుకు చేతుల్లోనో,కూతురు చేతుల్లోనో పెట్టి తానేమి మిగుల్చుకోకుండా చేతులు దులుపుకుంటుంది.తాను చల్లన్నం తిన్నరోజులు ఎన్నుంటాయో మనము ఊహించలేము.ఇప్పుడు కాస్తా పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు అది వేరే విషయం.ఇంతటి విషయాన్ని సహనం,సరిహద్దు అనే చిన్న పదాలలో గొప్పగా చెప్పటం ఆశ్చర్యం కల్గిస్తుంది.
సమాజంలో చాలా ఏళ్ళనుండి మనం గమనిస్తే స్త్రీలు ఇల్లే ప్రపంచంగా భావించుకొని బ్రతకాల్సిన పరిస్థితి ఉండేది.ఇప్పుడిప్పుడు కొన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు.కొంతమంది స్త్రీలు ప్రభుత్వ ఉద్యోగాల్లోను,ప్రయివేటు ఉద్యోగాల్లోను పనిచేస్తూ ముందంజలో ఉన్నారు.ఆ స్త్రీలను దృష్టిలో పెట్టుకొని
రచయిత నువ్వే జగమంతా ఉన్నావని,పరుగులు తీస్తావని రాసుండవచ్చు.అది ముమ్మాటికి వాస్తవం.
ఏకకాలంలో రెండు పనుల్లో దృష్టి సారించటం,రెండింటికి న్యాయం చేయటం అంత మాములు విషయమేమి కాదు.కుటుంబాన్ని నడిపించే స్త్రీ ఏరంగంలోనైనా  సమర్థవంతంగా రాణిస్తుందని చెబుతూ తాను ఏ పని చేసినా,ఏ దారిలో వెళ్ళినా వెలుగులు పూస్తుందని రచయిత చక్కగా అభివర్ణించారు.ఇంకా చాలా మంది స్త్రీలు ఆ కాస్త వెలుగులేని వారు ఉన్నారు.కానీ వాళ్ళు ఎటువంటి అలుపులేకుండా ఉన్నంతలో కుటుంబానికి వెలుగులు పంచుతూ తృప్తిగా జీవిస్తున్నారు.మొత్తంగా స్త్రీ తాను చేసే ఏ పనిలోను కొంచెం కూడా అశ్రద్ధ చూపదు.
స్త్రీ పొద్దున్నే లేచి చక్కగా ఇంటిముందు కల్లాపి చల్లి ముగ్గులు వేయటంతోనే తెల్లారినట్టుగా భావిస్తారు.ఆమె నిద్రలేస్తేనే అన్ని పనులు మొదలయ్యేది.ఆమెలేని ఓ రెండు రోజులను ఊహించుకుంటే పూర్తిగా ఆమె విలువ అర్థమవుతుంది.నేను వ్యాఖ్యానించిందే కాకుండా రచయిత రాసిన “నీ కాటుక కనులు విప్పారకపోతే”అనే పదాల కలబోతలో ఇంకా ఎన్నో అర్థాలు వెతుక్కోవచ్చు.గాజులచేయి అనే పదం ఇక్కడ సరిగ్గా సరిపోతుంది.ఆ చేయి కదలితేనే కడుపులు నిండుతాయి.ఆ చేయి కదిలితేనే ఎవరి పనుల్లోకి వారు బయలుదేరుతారు.ఆ చేయికదలని స్థితిని మనం అనుభవిస్తే ఆ రోజులోని అన్ని పనులు నత్తనడకన సాగుతాయి అనే వివరణలో ఆ వాక్యం మేలైనదిగా చెప్పవచ్చు.గాజులచేయి స్త్రీత్వానికి ప్రతీకగా తీసుకొని
విషయంలోపలికి భిన్నంగా తీసుకెళ్ళారు.శ్రీనాథుడు కూడా స్త్రీల చేతుల్ని వర్ణించే సందర్భంలో ఓ చోట “కమ్రకరములు”అనే పదం వాడారు.అర్థం “ఇంపైన చేతులు”.విషయంలో రసికతను జోడించి చెప్పటం ఆయన ప్రత్యేకత. శాస్త్రి ఇక్కడ వాడిన పదాలు కాటుక కనులు,గాజులచేయి రెండు రమణీయతకు సంబంధించినవి.ఎవరైనా ఏమరపాటులో వింటే ఇదేదో శృంగారపరమైన పాట అనుకునే ప్రమాదం లేకపోలేదు.కానీ చక్కటి సమయస్ఫూర్తితో వాక్యనిర్మాణం చేసి నిపుణతను ప్రదర్శించారు.సౌందర్యాన్ని తెలియజేసే పదాలను స్త్రీ ప్రాధాన్యతను తెలపటంలో జొప్పించి విజయం సాధించారు.
స్త్రీ ఓ తల్లిగా,ఓ చెల్లిగా ,ఓ అక్కగా,భార్యగా ఏ పాత్రలో నైనా ఒదిగిపోతుంది.ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీని అనుబంధాలకు పుట్టినిల్లని చెప్పొచ్చు. స్త్రీ ప్రభావాన్ని తెలియజేసే ఈ వాక్యాలను ఓ సారి మననం చేసుకుందాం.”కార్యేశు దాసి,కరణేశుమంత్రి,శయనేశు రంభ,భోజ్యేశు మాత”.ఆంతార్యాన్ని చూస్తే పనులుచేయటంలో దాసిలాగా,సలహాలు ఇవ్వటంలో మంత్రిలాగా,సుఖాన్ని ఇవ్వటంలో రంభలాగా, కడుపునింపటంలో తల్లి లాగ పాత్రలెన్నైనా  సమర్థవంతంగా పోషిస్తుంది.రచయిత అన్ని వరుసలలో ఇలా స్త్రీ ప్రేమగా అల్లుకుంటుందని,ఇన్ని పనులు చేసే తన శ్రమను ఇంతేనని అంచనా వేయలేమని తనదైన బాణీ కట్టారు.
మహిళ పనిగంటల పరిమితిలేకుండా అలుపులేకుండా తన కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేస్తుంది.ఎలాంటి ప్రశంసలను కోరుకోదు.ఆమె లేకుంటే ఈ లోకమంతా ముందుకు సాగదు .అందరిలో చీకటే ఆవహిస్తుంది.రచయిత ఈ విషయాలను చెప్పటం కోసం తను ఆదిశక్తిరూపమని,దీపమని ఉపమానాలు తీసుకొని కొత్తగా స్త్రీని పరిచయం చేశాడు.
స్త్రీ పిల్లలనే కాదు భర్తను కూడా పసిపిల్లవాడిలాగే చూస్తుంది.పొద్దున స్నానానికి నీళ్ళు పెట్టే దగ్గరనుండి
మొదలెడితే రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించేవరకు ఆవిడ చేసే సపర్యలే పై ఉదాహరణకు తార్కాణాలు.ఆ చేసే ప్రతి పనిలో ఆమె ఆనందాన్నే చవిచూస్తుంది.ఆ విషయాన్ని ఎంతో సున్నితంగా “ప్రియమగు పాలన”అని రచయిత చెప్పిన తీరు ఆకర్షణీయం.
ప్రతి మగవాడి విజయం వెనకాలా ఓ స్త్రీ ఉంటుందని అంటారు.అది ఆమోదయోగ్యమైన మాట.ఏ కుటుంబమైనా సంతోషంగా ఉండటానికి స్త్రీ యే కారణం.కుటుంబసభ్యుల పెదవులు చిరునవ్వులతో కళకళలాడుతున్నాయంటే అంతకన్న మించిన సిరి ఏముంటుంది.అది చెప్పటానికి రచయిత చిరునవ్వును “సిరిమెరుపులు”గా చెప్పటం నేటి రోజుల్లో ఆహ్వానించదగ్గ పరిణామం.మహిళా ప్రాధాన్యతను తెలియజేసే పాటలు ఎన్ని వచ్చినా దేని ప్రత్యేకత దానిదే.ఒక పల్లవి ,ఒక చరణంతో మాత్రమే సాగినా అలతి పదాలతో ఎన్నో అర్థాలను స్ఫురింజేసాడు.భావోద్వేగాలను పూర్తిస్థాయిలో సందర్భాన్ని బట్టి పాట రూపంలో తీసుకురావటంలో స్పెషలిస్ట్ గా రామజోగయ్యశాస్త్రిని పేర్కొనవచ్చు.ఎలాంటి స్వార్థం లేకుండా తమ సంతోషాలను త్యజించి శ్రమిస్తున్న స్త్రీ మూర్తులందరికీ రచయిత మహిళ దినోత్సవం రోజున ఈ పాట రూపంలో గొప్ప కానుకను అందించారు.
పాట:
పల్లవి:
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..
అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయట…
అలుపని రవ్వంత అననే అనవంట…
వెలుగులు పూస్తావు వెళ్లే దారంత…
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..
చరణం:
నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా…
నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా…
ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమా అంచనాలకందునా…
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా…
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా…
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా…
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా…
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..
చిత్రం:వకీల్ సాబ్
రచన:రామజోగయ్యశాస్త్రి
గానం:సిద్ శ్రీరామ్
సంగీతం :తమన్

తండ హరీష్ గౌడ్

22 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తండా హరీష్ గౌడ్ గారికి నమస్తే
    మీ విశ్లేషణ చాలా బాగుంది. సినిమా పాటల విశ్లేషణ వరుసలో మీరు ఎంచుకున్న రెండో పాట చాలా ప్రాధాన్యత కలిగిన పాట. ఈ పాటలో వాడిన పదబంధాలు సార్థక పదబంధ ప్రయోగాలు ఎలా అయ్యాయో మీ విశ్లేషణ చక్కగా చూపించింది. ఈ పాట విశ్లేషణకు ముందు అమ్మ పై వచ్చిన మిగతా పాటలను పరిచయం చేయడం మీ పరిశోధనాత్మక దృష్టిని పట్టి చూపుతుంది. మీరు ఇటువంటి విశ్లేషణలను కొనసాగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.

  • స్త్రీల మీద వచ్చిన పాటలను ప్రస్తావిస్తూ స్త్రీ యొక్క పాత్రను చెప్పడం వ్యాసానికి నిండుదనం అన్న.రామజోగయ్య గారి సినిమాపాటల ప్రస్తానం ,స్వస్థలం విశేషాలు చెప్పడం ఎంతో ఉపయోగకరం.ఎంచుకున్న పాటను కేవలం శృంగారపరమైన పాటగా కాక అందులోని లోతులు ఏమిటో సాధికారకంగ విశ్లేషించిన వ్యాసం అన్న.

  • పాటపై మీ విశ్లేషణ ఆసాంతం చదివిస్తుంది.
    హరీష్ గారు మీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • పాటలో ఉన్నటువంటి అనేక కోణాలను మహిళ గొప్పతనాన్ని వ్యాసం ద్వారా అందించడం చాలా బాగుంది. సినిమా రంగంలో సాహిత్య పరమైన లోతైన పరిశీలన చాలా అవసరం …అభినందనలు సర్.💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు