నీళ్లు…నీళ్లు..

నీళ్లు…నీళ్లు…ఊరు మొత్తాన్ని మహా సముద్రం ఏదో కావలించుకుందా అన్నట్టుగా ఉన్నాయి ఆ నీళ్లు.

రెండేళ్ల తర్వాత…..హైదరాబాద్ నుంచి తన సొంత ఊరికి బస్సులో వస్తున్న సోమయ్యకు …. పొలి మేర లోకి రాగానే….నేల మీద అద్దం పరచినట్టు నీళ్లు….ఆ నీళ్లలో ఎత్తైన తాటిచెట్లు తమ ప్రతిబింబాలు చూసుకుంటూ సంతోషంతో ఊగుతున్నాయి. అన్ని నీళ్లను చూడగానే సోమయ్యకు  కడుపునిండినట్లు అనిపించింది.

ఊరి స్టాపు దగ్గర బస్సు…ఆగి ఆగడంతోనే వంట గిన్నెలు మూటకట్టిన గోనె సంచి బస్తాను నెత్తికి ఎత్తుకుని గబగబా కిందకు దిగిండు సోమన్న. బట్టలు,ఇంకొన్ని సామాన్లు  కుక్కిన ఇంకో బస్తాను తలపై పెట్టుకుని వెనకాలే  భర్త వెనకాలే దిగింది పూలమ్మ.

బస్టాపు నుంచి కిలోమీటర్ దూరం ఉంటుంది ఊరు. బస్సు దిగి ఊరి వైపు చూసిన సోమన్నకు అంతా కలలా ఉంది. ఖాళీగా ఉన్న పొలాల నిండా నీళ్లు. రోడ్డుకి ఇంకో వైపున తమ
ఊరి చెరువు.  కడుపు నిండా నీళ్లతో తొమ్మిదో నెల గర్భిణిలా కళగా ఉంది.

నీళ్లను చూస్తూనే…. తల్లిని చూసిన చిన్నపిల్లాడిలా …గబగబా  కాలువలోకి దిగిండు. దోసిలి నిండా నీళ్లు తీసుకుని ఒక్క చుక్క జారిపోకుండా కడుపులో నింపుకున్నాడు. నీళ్లను తనివితీరా చూసుకుంటూ కాలువ ఒడ్డున కూలబడ్డాడు. ఇంత కాలానికి మా మీద, మా ఊరి మీదా దయపుట్టిందా తల్లీ…అంటూ కళ్లనిండా నీళ్లు నింపుకున్నాడు. సోమయ్య కళ్ల నుంచి జారిన నీళ్లు,  కాలువ నీళ్లలో కలిసి …ఏ తీరాలకో కదిలి పోతున్నాయి.

“తల్లీ గంగమ్మా. నిన్ను నమ్ముకుని ఊరి బాటపట్టినం. నువ్వే చల్లంగా చూడాలే” అంటూ పూలమ్మ తలపై నీళ్లు చల్లుకున్నది. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నడూ తమ ఊరిలో చూడని వాళ్లకు….  అన్ని నీళ్లను చూసి మాటలు రావడం లేదు.

ఒకప్పుడు తమ ఊరు ఎట్లా ఉండేది.? ఎటు చూసినా ఎండిపోయి నెర్రెలు వాసిన భూమి. తుమ్మ చెట్లు, మోదుగు చెట్లు మొలిచి …..సగం కాలిన అడివిలాగా ఉండేవి.  ఊరి చెరువు నిండా లొట్టపీసు చెట్లు తాచుపాముల్లా అల్లుకుని ఉండేవి.  ఏళ్లకు ఏళ్లు చుక్కనీరు లేక…. చీలికలుగా పగిలిపోయిన చెరువు…నోరు తెరిచి ఆకాశం వైపు ఆబగా ఎదురు చూసేది. ఒక ఏడు కాలమైతే….నాలుగేండ్లు కరువు.

అందుకే ఆ ఊరి వాళ్లకు  నీళ్లంటే బంగారం కంటే ఎక్కువే. తాగు నీళ్లకే చాలా కటకటగా ఉండేది.  ఎండిపోయిన బావుల చుట్టూ, బోరున ఏడుస్తూ కాసిన్ని నీళ్లు కార్చే….  బోర్ల చుట్టూ రోజంతా తిరిగినా నాలుగు బిందెలు నీళ్లు దొరికేవి కాదు.  ఇక  చుట్టాలు వస్తే పరువు పోయేది. ఏం ఊరు నాయనా ఇది. గుక్కెడు నీళ్లు దొరకని ఈ ఊరు ఖాళీ చేసి వెళ్లిపోక…ఏం బావుకుందామని ఈ ఊళ్లో ఉన్నారు. అని జాలి చూపించే వాళ్లు. ఊళ్లో ఓ పెళ్లో, చావు కార్యమో, ఏదైనా చేయాలన్నా చాలా కష్టంగా ఉండేది. పెళ్లి కార్యానికి వచ్చిన నలుగురు  బంధువులు స్నానాలు చేయాలన్నా నీళ్లు దొరికేవి కాదు. ఆఖరుకు ఏదైనా చావు జరిగితే….శవాన్ని దానం చేసిన తర్వాత స్నానం చేయడానికి కూడా నీళ్లకు కనాకష్టంగా ఉండేది.

ఈ ఊరికి పెళ్లి సంబంధం కోసం పొరుగూరికి పోతే మానం పోయినంత పనయ్యేది.  “మీ ఊళ్లో నీళ్లకు కరువు…మా ఆడబిడ్డను మీ ఊరు  పంపి వాళ్లను మీలాగే గోస పెట్టమంటారా…..” అని మొఖం మీదే కడిగినట్లు మాట్లాడేటోళ్లు.

తాగడానికి కటకటగా ఉండే ఊళ్లో …..ఏం పంటలు పండుతాయి..!. ఆముదాలు, కందులు, పెసళ్లు లాంటి మెట్టపంటలు తప్ప…వరి పొలాలు తక్కువ. ఎవరో అదృష్టమున్న మారాజులకు వరిపొలాలు.  అది కూడా అర ఎకరం , ముప్పావు ఎకరం పొలాలు దూరం దూరంగా మూలకు విసిరేసినట్టు ఉండేవి.  రెండు వందల ఫీట్లు బోరు వేసినా కూడా నీళ్లు పడేయి కాదు. ఇక రెండెకరాల వరిపొలం ఉన్న రైతు…మల్లారెడ్డి ఊరి దొర కిందే లెక్క.  మిగిలిన అందరికీ కంది చేలు, శనగ చేలు… అటువంటి ఊరిలో ఇప్పుడు…..  నాలుగు దిక్కులా పరుచుకున్న నీళ్లు చూసి నమ్మలేకపోతున్నాడు సోమయ్య.

***

నాలుగేళ్ల నుంచి పట్నంలో బతుకుతున్న సోమయ్య ఊరికి వచ్చిండని తెలిసిన….దోస్తులు రాత్రి పూట ఇంటికి వచ్చినరు. సోమయ్య పట్నం కెళ్లి తెచ్చిన పుల్ బాటిల్ తాగుతూ…ఊరి  ముచ్చట్లు చెప్పుకుంటున్నరు.

ఏరా సోములూ… ఇంగ పట్నం నుంచి తట్ట బుట్ట సదురుకుని వచ్చినట్టేనా, మళ్ల మూడు రోజులు కాంగనే పట్నం దోవ పడతవా…నీ యక్క’’ అంటూ ఎకసెక్కం చేసిండు బావ వరుస అయ్యే సైదులు.

“ఎహే…ఇంత కాలం మన ఊళ్లె నీళ్లు లేవు కాబట్టి…పట్నం పోయిన గానీ, ఇంగ ఇప్పుడేమి అవసరం బావా… ఊళ్లెనే ఉంట. ఎకరానికి ఐదు పుట్లు పండిస్త చూడు. బాంచెత్…’’ అంటూ మీసాలు తిప్పుతూ ….“ఓ పూలమ్మా. రెండు ఆమ్లెట్లు ఏస్కుని రావే…” భార్యను కేకేసిండు సోమయ్య.

“ ఓ అయ్యా నీకేమన్నా సోయి ఉందా. రెండేళ్ల తర్వాత ఇంటికొచ్చినం. ఇల్లంత ఎట్ల ఉన్నది చూసినవు కద.  పడావు పడ్డది. కంపచెట్లు మొలిచినయి. అయ్యన్ని పీకి ఇల్లంత సాపు చేసిన. ఎక్కడి సామాను అక్కడనే ఉంది.  పొద్దటిన్నుంచి తట్టితాంబాలం సదురుతున్న. కనీసం సాయం చేయకుండా…రాంగనే మందు దుకాణం పెట్టినవు “  అని మొత్తుకుంది.

తాగడం ఐపోగానే పూలమ్మ చేసిన అన్నం తిని….మంచంల పడుకున్నడు సోమయ్య.  దేవుడు దయతలిచి ఇంతకాలానికి తమ ఊరికి నీళ్లు ఇచ్చినడు.

భూమిని తడిపే దోసెడు నీళ్ల కోసం పడుతున్న తండ్లాట ఇయ్యాల్దిది కాదు. తాతల కాలం నుంచి వాన మీదనే ఆధారపడి సేద్యం చేసినరు. వాన చినుకుల కోసం ఆకాశం వైపు చూసీచూసీ మెడలు వంకర పోయినయి. అట్ల తరాలు గడిచిపోయినయి. తమ తాతల కాలంలో మోట బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసేటోళ్లు. ఊరు గుట్టల మధ్యలో…ఎత్తుగడ్డ మీద ఉన్నందున ఆరేడు కండాలు తవ్వితే కానీ బావుల్లో నీళ్ల ఊట కనపడేది కాదు.

ఏటా వేసే కంది, పెసర కాకుండా ఎప్పటికైనా ఒక అర ఎకరం వరి పంట వేయాలని, తాను పండించిన తిండి గింజలతోనే  నలుగురికి దావత్ చేసి తినిపించాలని కలలు కనేవాడు. ఒక ఎకరం వరి పంట వేయాలనే తన కల….ఈ జన్మది తీరేది కాదు అని సోమయ్యకు అర్థమై చాలాకాలమైంది.

ఆ రోజుల్లో ఒక తెల్లవారు ఝామున…..ధడ ధడ ధడ..మంటూ పెద్ద చప్పుడూ ఊరు మొత్తం ప్రతిధ్వనిస్తుంటే ఉలిక్కిపడి నిదరలేచిండు. కాపోళ్ల లింగారెడ్డి తన పొలంలో వేయడానికి  బోరుబండిని తీసుకొచ్చిండు. అప్పట్లో ఊల్లో ఎవరు బోరు వేసినా…ఊరంతా అదొక వార్త. ఊళ్లో రైతులతో పాటూ ఆ ఊరి చిన్నపిల్లలు, ముసలోళ్లు బోరు వేసేదగ్గరికి వచ్చేటోళ్లు. అట్ల లింగారెడ్డి బోర్ వేస్తుంటే.. సోమన్నతో పాటూ చాలా మంది రైతులు అక్కడకు చేరుకున్నరు. దగ్గర దగ్గర రెండు వందల ఫీట్లు ఏసినంక రెండు ఇంచుల నీళ్లు పడ్డయి. పుట్టపగిలి ఉసిళ్లు బయటకు ఉరికినట్లు….ఒక్కసారిగా పైకి ఎగజిమ్మిన నీళ్ల ధార చూసి…బోరు వేసిన లింగారెడ్డే కాదు, ఊరి రైతులంతా సంబరపడ్డరు. అక్కడ చేరిన చిన్నపిల్లలంతా ఆ నీళ్లు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ …వానజల్లు కింద తడిసినట్టు ఆడుకున్నరు. ఎక్కడెక్కడో బావుల చుట్టూ తిరిగే బాధ తప్పిందని…తాగడానికి నాలుగు బిందెల నీళ్లు తెచ్చుకోవచ్చు అని సంతోషపడ్డరు ఆడోళ్లు.

లింగారెడ్డి బోరులో అంతెత్తున చిమ్మిన నీళ్లను చూసినంక తనకు కూడా బోరు వేయాలని అనిపించింది సోమయ్యకు. ఆ సంగతే పూలమ్మకు చెపితే తోక తొక్కిన తాచుపాములాగా బుస్సున లేచింది.

“మీ తాత దాచిపెట్టిన ముల్లె ఐదైనా అటక మీద దాచి పెట్టినవా… డబ్బులు ఏడికెల్లి తెస్తవు” అన్నది.

“యాడనో ఓ దగ్గర అప్పు తెద్దాం. మనకు ఐదెకరాల బూమి ఉండి ఏం లాభం. పొద్దంతా జోడెద్దుల్లాగా కష్టపడినా మట్టి తప్ప ఏం మిగులుతోంది. అందుకే ఒక ఎకరం అమ్ముదాం. దేవుడి పుణ్యాన  నీళ్లు పడితే… మిగిలిన నాలుగు ఎకరాలు తడుస్తది కదా. ఆ పంట డబ్బుతో.. మన పొలం మనమే తిరిగి కొనుక్కోవచ్చు…” అని ఆశపెట్టిండు. చాలాసార్లు బతిమాలేసరికి పూలమ్మకు కూడా భర్త చెప్పింది బానే ఉన్నట్టు అనిపించింది.

పక్క భూమి రైతు వెలమోళ్ల  రామారావుకి ఎకరం భూమి రాసిచ్చి ముప్పై వేలు తీసుకున్నడు.

బోరు వేయాలంటే ముందుగా నీళ్లు పడే చోటు…పట్టుకోవాల. అందుకని కొబ్బరి కాయతో పాయింట్ పెట్టే ఆచారి దగ్గరకు పోయిండు సోమన్న. ఆయన వెయ్యి రూపాయలు తీసుకుని…కొబ్బరి కాయ చేతిలో పట్టుకుని సోమన్న చేను మొత్తం సాలు-ఇరువాలు తిరిగిండు. ఏం చేసిండో కానీ జిల్లేడు పొద ఉన్న దగ్గర టక్కున కొబ్బరికాయ తోక పైకి లేచింది. ఇగో సోమయ్య నీ కష్టాలన్నీ తీరినయి. ఈ జాగలో వంద ఫీట్ల లోతులో… పెద్ద జలపాయ పొంగి ప్రవహిస్తోంది. ఆలస్యం చేయకుండా ఇక్కడ బోరు వేయి. పుష్కలంగా నీళ్లు పడతయి…” అని పూనకం వచ్చినట్టు ఊగిపోతూ చెప్పిండు ఆచారి.

ఆ జాగను మర్చిపోకుండా ఉండేందుకు… అక్కడ ఒక పెద్ద బండ రాయిని ఎత్తుగా పాతిండు సోమన్న. ఆచారి చెప్పినట్టే  దేవుని పుణ్యాన బోరులో రెండించుల నీళ్లు కానీ వస్తే….తమ బతుకులు మారిపోతాయని సంబరపడ్డరు భార్యాభర్తలు.

“రెండెకరాలల్లో వరి పొలం వేయొచ్చు. ఇంకో రెండెకరాలు కూరగాయలు. వాటిని అమ్మితే  చేతినిండా డబ్బులు వస్తయి…మనం అమ్మిన పొలం మనమే కొనుక్కుందాం. ఆ తర్వాత నీకు మెడలో పెద్ద బంగారం చైను చేయిస్తా…” అని పూలమ్మకు ఆశ పెట్టిండు. వెలమోళ్ల రామారావుకు భూమి అమ్మగా వచ్చిన డబ్బులతో  మరునాడే పట్నం పోయి…. బోరు బండిని తీసుకొచ్చిండు.

సోమన్న బోరు వేస్తుండని తెలిసి ఎప్పటిలాగే ఊళ్లో రైతులు, చిన్నపిల్లలు  అందరూ…అక్కడకి చేరుకున్నరు. సోమయ్యకు ఒక పక్క ఆనందంగా, ఇంకో పక్క భయంగానూ ఉంది.

బోర్ పాయింట్ దగ్గర కొబ్బరికాయ కొట్టి….”తల్లీ గంగమ్మ. నీ బాంచను. మాకు రెండు ఇంచుల నీళ్లు రావాలె. గంగ బయటకు దుంకాలె..” పసుపు కుంకుమ చల్లిండు.

“అసలు నీకు కొంచెమైనా ఇవరం ఉన్నదా. మన ఇంటి దైవం ఎల్లమ్మ దేవత. ఆమెకు మొక్కవా.తల్లికి కోపం తెప్పిస్తవా…” గుర్తు చేసింది భార్య.

“అమ్మా ఎల్లమ్మ….బోరులో నీళ్లు పడితే నీకు పెద్ద ఏటపోతును కోస్త. మస్తు పండగ జేస్త…” అని ఏపచెట్టు కింద ఉన్న ఎల్లమ్మ బండరాయికి మొక్కుకున్నరు.

ధడ…..ధడ ధడ మని భూమి గుండెలు చీలుస్తూ ….లోపలికి పోతోంది బోరు మెషిన్ హైమర్ రాడ్డు. ఆ బోరు తన గుండెల మీదనే వేస్తున్నట్టు భయం భయంగా అనిపించింది సోమయ్యకు.  పది ఫీట్లు, ఇరవై ఫీట్లు, ముప్పై, యాభై…..అట్ల ఇనుప రాడ్లు భూమిలోకి దిగుతున్నయి. భూమిలోంచి ఉత్త దుమ్ము మాత్రమే బయటకి వస్తోంది. వంద ఫీట్ల దగ్గర కొద్దిగా బురద బయటకు వచ్చింది. హమ్మయ్య ఇగ నీళ్లు వస్తయి అని సంబరపడ్డరు కానీ మళ్లా బూడద పైకి లేచింది.  ఆ తర్వాత ఉత్త బండ పొర తగిలింది. నూటయాభై, రెండువందలు ఐనా బండే తప్ప నీళ్లు రాలేదు. అప్పటికే ….బిల్లు ముప్పై వేలు దాటింది. కండ్లల్లో నీళ్లు కక్కుకుంటూ  ఇంగ వద్దు ఆపు అని బోరు బండి మనిషితో చెప్పిండు. ముప్పై వేల డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు బోరుబండి మనిషి.

ఎకరం భూమి అమ్మిన పైసలు…. రెండు గంటల్లో బోరు బండికి ఐపోనయి. మాయదారి గద్ద వచ్చి తన భూమిని తన్నుకపోయినట్టు అనిపించింది సోమయ్యకు. తట్టుకోలేక ఎంత సారా తాగినా బాధ తగ్గలేదు.

“పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు… కాపోళ్లకు బోరు పడిందని, నువ్వు కూడా బోరు వేసినవారా సోమా..” అని కొంతమంది గేలి చేసినరు.

భర్త సంగతి అట్లుంటే….వారం రోజులు ముద్ద ముట్టలేదు పూలమ్మ.

“బోరు పాడుగానూ…మాయదారి బోరు వేయకపోయినా ఎకరం భూమి మిగిలేది. ఎల్లమ్మకు, మైసమ్మకు ఎంత మందికి మొక్కినా లాభం లేకపాయే…”అని వెక్కివెక్కి ఏడ్చింది.

ఆ బాధలోనే ఉన్న వ్యవసాయం కూడా నిర్లక్ష్యం చేసినరు. చివరకు చేను మీద ఉన్న పంట కూడా దక్కలేదు. అప్పులు పెరిగిపోయినయి. మళ్ల ఏడాది తిరిగేసరికి అసలు,వడ్డీ అసలు కలిసి…తడిసి మోపెడు అయ్యింది. ఇంకో ఎకరం అమ్మక తప్పలేదు. దాంతోని ఇంగ వ్యవసాయం చేసినా బతుకులు మారవని తేలిపోయింది. అప్పటికే ఊళ్లో చాలామంది పట్నం బాట పట్టినరు.  వాళ్ల ఎనకాలనే…వీళ్లు కూడా హైదరాబాద్ చేరుకున్నరు.

పట్నంల స్కూలు ఫీజులు కట్టలేమని ఉన్న ఒక్క బిడ్డను తల్లిగారింటికి పంపి అక్కడ బడిలో చేర్చింది.

ఐదెకరాల రైతు సోమన్న చివరకు హైదరాబాద్ ఊరి శివార్లలోని అపార్ట్ మెంట్లో…. వాచ్ మెన్ గా చేరాడు.  పూలమ్మ అపార్ట్ మెంట్లో ఉన్న ఫ్లాట్లల్లో పనిమనిషిగా చేరింది.  ఇద్దరికీ కలిపి నెలకు ఇరవై వేలదాకా ఆదాయం. ఇంట్లె కర్సులు పోగా మిగిలిన డబ్బులు…ఒక చిట్టీ వేసినరు.

ఎపుడైనా ఏదన్న పెండ్లికో, చావుకో….ఒక రోజు, రెండు రోజులు తమ ఊరికి పోయి….వచ్చేటోళ్లు.  నీళ్ల వసతి లేనందుకు చెలక ఎవరూ కౌలుకు కూడా అడగలేదు. చేను నిండా కంపచెట్లు మొలిచినయి.  ఊరికి, మనకు రుణం తీరిపోయినట్టేనా అని…అప్పుడప్పుడూ బాధపడేవాళ్లు. అట్లా ఐదేండ్లు గడిచినయి.

ఓ రోజు తమ ఊరి వాడే లింగయ్య… సోమన్నకు ఫోన్ చేసిండు.

“ఒరేయ్ సోమన్నా..బాగున్నావ్ రా. మన ఊరికి ప్రాజెక్టు కాలువ ద్వారా నీళ్లు వచ్చినయిరా. పుష్కలంగా నీళ్లు పారుతున్నయిరా. నువ్వు కూడా మన ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకో…” అని పట్టలేని ఆనందంతో ఫోన్ చేసిండు.

ఎప్పడో పదేండ్ల కిందట….నీళ్ల ప్రాజెక్టు పేరుతో  జేసీబీలు తీసుకొచ్చి భూముల మధ్య పెద్దపెద్ద కాలువలు తవ్వినరు.

గత పదేళ్ల నుంచి ఆ కాలువలో…కంపచెట్లు మొలిచినయి తప్ప సుక్కనీళ్లు పారలేదు. ఇన్నాళ్లకు ఆ ప్రాజెక్టు పూర్తికావడంతో గవర్నమెంటు నీళ్లు వదిలింది.

ఇంతకాలం గూడు చెదిరిన పక్షుల్లా పట్నంలో బతికిన సోమయ్య లాంటి రైతులు చాలామంది  సొంత ఊరుకు చేరుకున్నరు.

***

ఇంతకాలం కంపచెట్టు మొలిచిన నేలను సాపు చేసిన అద్దంలా తయారు చేశారు సోమయ్య, పూలమ్మ.  ఐతే గతంలో లా ఇప్పుడు ఎద్దులు లేవు, నాగళ్లు లేవు. అందరూ ట్రాక్టర్ ను కిరాయికి తీసుకొచ్చి దున్నుతున్నరు. ఏ పని జేబుల కెళ్లి డబ్బులు తీయాల్సిందే. హైదరాబాద్ లో పని చేసి సంపాదించిన లక్ష రూపాయల చిట్టీకి  కమీషన్ పోనూ 95 వేలు చేతికి వచ్చినయి. ఆ డబ్బులు చేతిలో పట్టుకుని వ్యవసాయం మొదలు పెట్టిండు. భూముల నిండా నీళ్లే కావడంతో…వరిపంట తప్ప ఇంకో పంట వేసే పరిస్థితి లేదు. ఇంకో పంట వేసినా పక్క పొలం నుంచి నీళ్లు ఊటదిగుతాయి.

గతంలో అరెకరం, ఎకరం  పొలాలు కాబట్టి భార్యాభర్తలతో పాటూ ఇంకో నలుగురు మనుషులను పెట్టుకుని నాటు పెట్టుకుంటే పని ఐపోయేది. కానీ ఇప్పుడు ఐదారు ఎకరాలు….నాటు వేయాలంటే చాలా మంది కూలీలు కావాలి. ఊరిలో ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కానీ….కూలీలు లేరు. పూర్వంలా ఇప్పుడు కూలీలు దొరకడం లేదు. భూములు ఉన్న వాళ్లు సేద్యం చేస్తున్నారు, భూమిలేని వాళ్లు పట్నంలో బిల్డింగ్ పనికి పోతున్నరు. మనుషులు దొరక్క కూలిరేట్లు విపరీతంగా పెరిగిపోయినయి. ఎకరానికి ఐదు వేల చొప్పున….దూర ప్రాంతం నుంచి లారీలో కూలీలను తీసుకొచ్చి నాటు వేయించారు. కష్టమో, నష్టమో పొలం నాటు పడ్డందుకు సంతోషించారు.

ఎటు చూసినా…పచ్చచీర కప్పినట్టు కనిపిస్తున్న పొలాలు. గాలికి అటూఇటూ వయ్యారాలు పోతున్న తమ వరిపొలాన్ని చూసి…పసిపిల్లల్లా సంబరపడ్డారు.  నాలుగు నెలలు నీళ్లు పెడుతూ… పంటని కాపాడుకుంటే చాలు. ఎంత లేదన్నా మూడు లక్షలు చేతికి వస్తాయి. ఇక తమ ఊరిలో ఎప్పుడూ నీళ్లు వుంటాయి కాబట్టి తమ జీవితం మారిపోతుందని కలలు కన్నారు. అష్టకష్టాలు పడి, పురుగు మందులు కొట్టీ, కలుపు తీయించి…. పంట పండించారు. పొలం కోసే మెషిన్ తోనే పంట కోయించి వడ్ల రాశి కుప్ప పోయించారు.  గతంలో పొలాల కోత సీజన్ అంటే కనీసం నెలరోజులు పని ఉండేది. ఊరందరికీ ఏదో ఒక పని దొరికేది. మూలకు ఉన్న ముసలమ్మలు కూడా పరిగలు ఏరుకుని నాలుగు పైసలు సంపాదించేవాళ్లు. ఇప్పుడు మెషిన్ కోత కాబట్టి ఒకటే రోజులో పని ఐపోతుంది. కోత మెషిన్ కి తప్ప ఎవరికీ పని దొరకడం లేదు కాబట్టి కూలీలంతా….పట్నంలో తాపీ పనికో, ఇంకేదో పనికో పోతున్నరు.

పంట ఐతే పండించారు కానీ… అప్పుడే అసలు కష్టాలు మొదలయ్యాయి. ఒక్క తమ ఊళ్లోనే కాదు, చుట్టు పట్టు ఊళ్లలో ఎక్కడ చూసినా వరి పంటే. ఎటు చూసినా పొలాల నిండి వడ్ల రాశులే. పంట ఎక్కువ కావడంతో…కొనే వ్యాపారులు ధర తగ్గించారు. రైస్ మిల్లు వాళ్ల దగ్గరకు అమ్మడానికి తీసుకెళితే అక్కడ వందల ట్రాక్టర్లు చీమల దండులా బారులు తీరి ఉన్నాయి.  పోనీ మార్కెట్ కి తీసుకెళదామన్నా అదే పరిస్థితి. వందల ట్రాక్టర్లు రావడంతో రోజుకు కొన్ని చొప్పున మాత్రమే కొంటాము… అని టోకెన్ సిస్టమ్ పెట్టారు. ఆ ప్రకారం తమ పంట మార్కెట్ లో అమ్మాలంటే  నెల రోజులు పడుతుంది. అప్పటి దాకా….వడ్లు పొలంలో ఉంటే కష్టం.  ఏ వానో, వరదో వచ్చిందంటే పంట మొత్తం తడిచిపోతుంది. పంట ఐతే పండించాడు కానీ…ఆ వడ్లు ఎలా అమ్మాలో తెలియక తల పట్టుకుని కూచున్నాడు సోమయ్య.

చివరకు ఒక బ్రోకర్ తక్కువ ధరకు ఇస్తే రైస్ మిల్లుకు అమ్మి పెడతానని, కానీ తనకు కింటాకు వంద రూపాయల కమీషన్ ఇవ్వాలని షరతు పెట్టాడు. అమ్మేదే తక్కువ ధరకు, మళ్లీ అందులో వంద రూపాయల కమీషన్ ఇవ్వమనే సరికి …సర్రున కోపం తన్నుకొచ్చింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.  రెండు మూడు రోజుల్లో తుఫాను కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని టీవిలో చెబుతున్నారు.  గతి లేక అడ్డికి పావుశేరు చొప్పున రైస్ మిల్లులోనే అమ్ముకుని అమ్ముకుని బయటపడ్డాడు సోమయ్య. పంట పండిన ఆనందం  సంగతి ఏమోకానీ….దాన్ని అమ్మేసరికి పెద్ద గండం గడిచినట్టు అనిపించింది.

“ఇంతకీ ఎన్ని డబ్బులు వచ్చినయి..” అని అడిగిన పూలమ్మకు లక్షన్నర బిల్లు కాగితం చూపించాడు.  తమ పెట్టుబడి పోనూ మిగిలింది యాభైవేలు. ఆరు నెలలు కష్టపడితే వచ్చింది ఈ యాభై వేలు. అదే పట్నంలో పని చేసి బతికినా లక్ష రూపాయలు సంపాదించేవాళ్లు. పైగా ఈ నరకం ఉండేది కాదు.

పట్నంలో  ఉన్నంత కాలం కడుపుకి ఇంత తిని….కంటినిండా ఐనా పడుకునే వాళ్లం కదా….ఎందుకీ అవస్త అనిపించింది పూలమ్మకు. అందుకే కుండ బద్దలు ఐనట్టు…ఒక్కసారిగా కడుపులో బాధ వెళ్లగక్కింది.

“ఊరికి నీళ్లు వచ్చినయి, పంటలు పండుతయి అని… తీసుకొచ్చినవు. నీ నీళ్లు పాడు గాను. ఏం మిగిలిందయ్యా మనకు. నీళ్లు ఉన్నా , లేకున్నా…ఎవసాయం అంటేనే దోపిడీ. ఎప్పటికైనా ఈ దళారీలు దోచుకుని బతుకుతారు తప్ప, మనకు పైస లాభం రానియ్యరు. మనకు ఎవసాయం వద్దు ఏమీ వద్దు…పట్నం పోదాం పద….”అని మొత్తుకుంది పూలమ్మ.

“ఈ సారి అంటే ఏదో కలిసి రాలేదు. వచ్చే సారి ఐనా కలిసిరాదా. పంట పండక పోతదా. లాభం రాకపోతదా. ఇంతకాలం అంటే నీళ్లు లేక పట్నానికి  పోయినం. ఇప్పుడు నీళ్లు వచ్చినంక కూడా…పట్నం పోతె ఎట్లా.  మనం ఎక్కడికీ పోయేది లేదు. ఈడనే ఉందాం. వ్యవసాయం చేద్దాం” అని భార్యను దగ్గరకు తీసుకుని సముదాయించిండు.

భర్త మాటలు విన్న పూలమ్మ రెండు చేతులతో తల పట్టుకుని కూలబడ్డది.

నీళ్లు…నీళ్లు…ఊరంతా నీళ్లే, చివరకు తమ కళ్లల్లోనూ.  తమ బతుకులు నడి సముద్రంలో చిక్కుకున్న నావలా అనిపించింది పూలమ్మకు.

ఏ అర్ధరాత్రో  హఠాత్తుగా పెద్ద ఉప్పెన వచ్చినట్టు….,

ఊరంటినీ, తమ ఇంటిని మొత్తం నీళ్లు కమ్మేసినట్టు….

పీకల్లోతు నీళ్లలో ఎటో కొట్టుకుని పోతున్నట్లు ఉలిక్కి పడింది పూలమ్మ.

*

చిత్రం: సృజన్ రాజ్ 

చందు తులసి

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎవుసం మూలాల్లోకి కథ నడిపించిన కలం
    ముగింపు బావుంది

  • నా కథ ప్రచురించిన సారంగ సంపాదకులకు ధన్యవాదాలు

  • కథ చాలా బావుంది సర్
    నిజమే నీళ్లున్నా మన కండ్లల్లోనే చివరికి నీరు నీళ్లు…నీళ్లు…ఊరంతా నీళ్లే, చివరకు తమ కళ్లల్లోనూ అని రచయిత చాలా హృదయవిదారకంగా చెప్పారు.

  • పట్టణ వలస నేపద్యంలో ఇలాంటి కథలకు ప్రాసంగీకత ఉంటుంది… సోమయ్య లాంటి ఆశావహులు అడుగడుగునా కనిపిస్తారు….పంటల వెరైటీ చూపకుండా అందరూ ఒకే తీరు పంటలు సాగు చేస్తున్నారు. ఇది అసలు విషాదం… Indian agriculture is the gambling in the rain

    • థాంక్యూ సర్. తెలంగాణలో ఇప్పుడు అది చాలా అవసరం సార్. వరి పంటకు ప్రత్యామ్నాయం కావాలి

  • కథ చాలా బాగుంది. తెలంగాణా పల్లెల్లో ప్రతి ఊరిలో నిజంగా జరిగిన కథ

  • చందు…
    ఇది కథ కాదు, ప్రతి రైతు వ్యధ.
    భవిష్యత్తు లో రైతులు ఉండరు…
    మన దేశం‌లో రైతుకి చాలా అన్యాయం జరుగుతుంది.
    పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించే రైతుకి మిగిలేది శూన్యం.
    నిజం గా ఇది రైతు కన్నీటి కథ.
    మనస్సు ని తొలిచేస్తుంది.
    రైతు కష్టలు తీరవు గాని, రైతు కష్టలమీద తీసిన సినిమాలు కోట్లు గడిస్తాయి.
    రైతుల బాగు కోసం మన వంతుగా ఏం చేస్తే బాగుంటుందో చర్చిద్దాం….

  • కొన్ని నిజాలు చాలా దగ్గరగా ఉంటాయి…
    మనకు కావలసినవి ఎక్కువైనా బాధానే, తక్కువ అయినా బాధనే…

    రైతు కి ఎంతా భూమి (ఆశలు) ఉన్న, చివరికి తన చేతి పిడికిలో మెతుకు బియ్యం నిలువ అదృష్టం కూడా ఉండాలి…

    కొన్ని కథలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి …. అందులో ఇది ఒకటి…

  • ఎంతో గొప్ప వర్ణన తో కూడినటువంటి, హృదయవిదారకమైన తెలంగాణ రైతుల గోస,యాతన, తపన.
    మధ్యతరగతి రైతుల కన్నీళ్లు, కష్టాలు, సాధక బాధలు,
    దళారుల దోపిడీ,
    ఇందుకే కదా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
    చాలా బాగా రాసారు.

  • కథ వాస్తవికంగా వుంది. నీళ్ళు వున్నా లేకపోయినా రైతుకు కన్నీళ్లు తప్పవు. దళారీ వ్యవస్ధ లో ధళారీ అనుకున్న ధరకే ధాన్యం అమ్మాల్సిన పరిస్థితి. వ్యవసాయం గిట్టుబాటు లేని అప్పుల ఊబిలోకి నెట్టే వృత్తి. పంటను నమ్మి కాదు రియల్ ఎస్టేట్ ని నమ్మి భూమిని కాపాడుకుంటున్నారు రైతులు. ప్చ్.. ఇదొక విషాద పరిణామం.

  • కథ చాలా బాగుంది. వ్యవసాయాదారుని జీవితం కండ్లకు కట్టినట్టు ,ఉన్నది ఉన్నట్టు చూపించిన చందుకు అభినందనలు.
    ముగింపు అద్భుతం అంతటా నీళ్ళు కళ్ళల్లో నీళ్ళు .రైతుల బతుకుల్లో నీళ్ళు .జీవితమే కన్నీళ్ళ సంద్రం అని నిరూపించిన కథ. వాస్తవాలను కాగడగా ఎత్తి చూపిన కథ. చదువుతుంటే భయం వేసింది. భవిష్యత్తు తరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందా అని ప్రశ్నిస్తున్న కథ. చదివిన తర్వాత హృదయాన్ని పట్టి పిండేసింది. వ్యవసాయం జీవితాల్లో కల్లోలం రెపడానికి కారణాల్లో ఒకటి పండించిన పంటకు సరియైన ధర లభించక,గత్యంతరం లేక పల్లెవాసులు పట్టణం దారి పడుతున్నారు. ఈ పరిణామం ప్రమాదకరం. అనే హెచ్చరికే ఈ కథ. చందు తులసి గారి నుండి ఇంకా మంచి మంచి కథలు వస్తాయని ఆశిస్తున్నాం. మన్నే ఏలియా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు