తల్లిదండ్రులు సుంకోజి ఈశ్వరమ్మ, సుంకోజి రెడ్డెప్పాచారి. స్వస్థలం చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలంలోని గుడ్రెడ్డిగారిపల్లె. ప్రస్తుత నివాసం కడప. వృత్తి రీత్యా జర్నలిస్టు. ప్రవృత్తి సాహితీవ్యాసంగం. మొదటి కథ ‘బంగారుపంజరం ‘ 1997లో వార్త దినపత్రిక లో వచ్చింది. ఇప్పటి వరకూ దాదాపు 100 కథలు, వందకు పైగా కవితలు, 7నవలలు రాశారు. తానా, ఆటా, నాటా, పులికంటి సాహితీ సత్కృతి తదితర సంస్థలు, పలు పత్రికలు నిర్వహించిన పోటీల్లో కథలకు, నవలలకు బహుమతులు అందుకున్నారు. కథల సంపుటాలు: అన్నంగుడ్డ, దృశ్యాలు మూడు ఒక ఆవిష్కరణ, ఒకమేఘం కథ; నవవలు: నీరు నేల మనిషి, రెక్కాడినంతకాలం; గ్రామీణ క్రీడలపై రాసిన కథనాలు ‘మనమంచి ఆటలు ‘ పుస్తకాలు వెలువరించారు. భారతీయ భాషాపరిషత్ (కలకత్తా), పెద్దిభొట్ల సుబ్బరామయ్య స్ఫూర్తి పురస్కారంతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి సందర్భంగా కేంద్రసాహిత్య అకాడమీ ఆహ్వానంపై 2010 డిసెంబర్ లో శాంతినికేతన్ వెళ్లివచ్చారు. కథకులు ఎంతో గౌరవంగా భావించే ‘కథా సంధ్య’ను కేంద్రసాహిత్య అకాడమీ వీరితో 2013లో కడపలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో నిర్వహించింది.
*
‘‘నీళ్లు నాగరికతకు చిహ్నం..’’ ఆ వాక్యం పూర్తయిందో లేదో వీపుపైన దెభీమని పడిందో దెబ్బ. గుడ్డి లైటు వెలుగులో సాంఘికశాస్త్రం పుస్తకాన్ని ఎదురుగా పెట్టుకుని గట్టిగా చదువుతున్న పదేళ్ల మహేష్ పుస్తకాల సంచిపైన పడి తిరిగి లేచి కూర్చున్నాడు. ఏం జరిగిందో వాడికి అర్థం కాలేదు.
‘‘ఎందుకుబా పిల్లోన్ని కొడతాండావే.. నీకంత రోషంపాశముంటే ఆ ఇడ్సిన్నాబట్టలను కొట్టు.. పిల్లోడేం జేసే నీకు..’’ భర్త మీదకు ఒంటికాలిపైన లేచింది సుహాసిని.
తనను నాయన కొట్టినాడనే విషయం అర్థం కాగానే వాడు వీపుపైకి రెండు చేతులు పోనిచ్చి బేర్‍మంటూ ఏడుపు మొదలుపెట్టాడు.
భార్యను, కొడుకును గుడ్లురిమి చూసి.. ‘‘థూ.. దీనెమ్మ బతుకు..’’ అనుకుంటూ లుంగీని పైకి మడచి కడుతూ ఇంట్లోనించి వీధిలోకి అడుగులేశాడు కృష్ణ.
వీధి దీపాలు వెలగడం లేదు. కరెంటు వీక్‍గా వస్తుండడంతో ఇళ్లల్లో లైట్లు గుడ్డివెలుతురుతో ఉనికి చాటుకుంటున్నాయి. కొందరిళ్లలోంచి టీవీల చప్పుడు వినిపిస్తోంది. చాలా ఇళ్లల్లో శ్మశాన నిశ్శబ్దం. మనుషులు ఎవ్వరూ బయట కనపడ్డం లేదు. రాత్రి ఎనిమిది గంటలు. నీళ్లమీద తెల్ల పెయింట్ వేసినట్టు వెన్నెల దారంతా పరచుకోనుంది. కృష్ణకు ఊర్లోకి పోబుద్ధి కాలేదు. కుడివైపు ఊరు, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ. ఎడమవైపు అడుగులేశాడు. తమ ఎస్టీ కాలనీ దాటి ముందుకు పోతున్నాడు. పొలాలకు వెళ్లే దారి.. నిముషం నడవగానే జలాశయం కనిపించింది. నీళ్లతో కళకళలాడుతున్న జలాశయం. చంద్రుని వెన్నెల పడి, సన్నగాలికి కదులుతున్న నీటి కెరటాలతో తళతళలాడుతున్న జలాశయం.. ఆ నీళ్లను చూడగానే కృష్ణ అడుగుల్లో వేగం పెరిగింది. పళ్లు పటపటా కొరుకుతూ ఉన్మాదం మనిషిలా నడిచాడు. కాదు.. పరిగెత్తాడు. మరో నిముషంలో వెళ్లి నీళ్లల్లో పడ్డాడు.. ‘‘చావు.. చావే లంజదానా.. చావే చావు.. నీయమ్మా.. చావు..’’ అంటూ కాలితో నీళ్లను ఎగిసెగిసి తన్నుతున్నాడు. నీళ్లలో అడుగు ఎంత వేగంగా పడితే అంత వేగంగా నీళ్లు ఎగజిమ్మి తన ముఖాన్ని తాకుతున్నాయి. నీళ్లను తన్నీ తన్నీ అలిసిపోయి.. కళ్లలో నీళ్లు సుడులు తిరిగి.. గుండె బరువెక్కి అక్కడే నీళ్లల్లో కుచ్చలబడి.. వెక్కివెక్కి ఏడుస్తూ నీళ్లల్లో నీళ్లలా కరిగిపోతున్నాడు కృష్ణ.
ఊర్లో ఏదో కోలాహలం.. గట్టిగా అరుపులు కేకలు.. కిట్టన్నా.. కిట్టన్నా.. అంటూ ఎవరో నీటివైపు పరుగులు పెడుతూ వస్తున్నారు. వాళ్ల అరుపులకు మామూలు మనిషయ్యాడు కృష్ణ. గుండెను నిబ్బరం చేసుకున్నాడు. కన్నీళ్లు తుడుచుకునే ప్రయత్నం చేసినా, నిండా నీళ్లే కాబట్టి ఏ నీళ్లు పక్కకు పోయాయో ఏ నీళ్లు బుగ్గలపైన ఉన్నాయో అర్థం కాలేదు. తెలుసుకోవాలనీ కృష్ణ అనుకోలేదు.
గసపోస్తూ పాతికేళ్ల యువకుడు అంత దూరంనుంచే ‘‘అన్నా.. కిట్టన్నా.. ఊర్లోకి కొండచిలువ వచ్చిండాది.. కొండచిలువ..’’ అరుస్తూ వస్తున్నాడు.
అప్పటి వరకూ గుండెను పిండుతున్న ఆలోచలన్నీ పిడికిటిలోంచి జారిన నీళ్లలా జారి జలాశయం నీళ్లలో కలిసిపోయాయి. తేటపడిన ముఖంతో.. ‘‘ఎక్కడుంది’’ అంటూ ఊరివైపు పరుగులాంటి నడక మొదలుపెట్టాడు. అతడిని ఆ యువకుడు అనుసరిస్తూ ‘‘మనకాలనీలోనే.. శీనుగాడి దొడ్లో దూరిందంట.. రెండు పుంజులను మింగేసిందంట.. ఒగ దూడ కనిపించడం లేదంట..’’ చెప్పాడు గసపోస్తూనే.
రెండు నిముషాల్లో ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. దాదాపు వందమంది దాకా జనం ఉన్నారు.
‘‘నేను జూసినా.. రెండుబారలుండాది..’’
‘‘నేను గూడా జూసినా.. దానిది ఇంత నోరుగినీ.. పెద్దపెద్ద కండ్లు.. తలతెత్తి నన్ను చూసేలకు భయపడిపోయి ఉచ్చపోసుకున్నే’’
‘‘సరాసరా.. అంటాన్నింది.. గాలికి ఎండాకులు కదలతా ఉండాయేమో అనుకున్నే.. తీరా జూస్తే.. పెద్ద పాము దొడ్లోకి దూరింది..’’
రకరకాలుగా చెబుతున్నారు మాటలు. ఆ ఊర్లో పాములు పట్టేదాంట్లో కృష్ణను మించిన మొనగాడు లేడు. కట్ల పాములు మొదలు, పెద్దపెద్ద నాగుపాములు, జెర్రిపోతులు, రక్తపింజరలను కూడా పట్టిన నేర్పుంది. పాములను పట్టేదానికి ఇంట్లో ఎప్పుడూ తమరకట్టెలు ఉంటాయి. వాటి సాయంతో చానా నేర్పుగా పామును పట్టేస్తాడు. పట్టి గోతంలో వేసుకోని దూరంగా అడవిలో వదిలేస్తా ఉంటాడు. అప్పటికే సుహాసిని తమరకట్టెతో సిద్ధంగా ఉంది. ఆమె చీర కొంగు పట్టుకుని మహేష్ వెనకే నిలబడుకుని ఉత్సాహంగా చూస్తున్నాడు. భార్య చేతిలోని కర్రను తన చేతిలోకి తీసుకున్నాడు. కృష్ణ చేతిలోకి కర్ర తీసుకోగానే అందరూ మాటలు ఆపేశారు. ఆ కర్ర పిడికిట్లో పట్టేంత లావుతో ఆరడుగుల పొడవుంది. చివర్లో తమర ఉంది. ఆ తమరను నేలపైన ఆనిస్తే నేలకు కర్రకు మధ్యలో రెండు ఇంచీల సందు ఉంటుంది. అలాంటి తమరకట్టెలు కృష్ణ దగ్గర నాలుగైదు ఉన్నాయి. పాము సైజును బట్టి కర్రను వాడుతుంటాడు.
ఊర్లో నుంచి వచ్చిన సుబ్బారెడ్డి చేతిలో టార్చిపట్టుకుని గొడ్ల కొట్టంవైపు వేస్తున్నాడు.
‘‘లోపలికి పోయింది కిట్టా.. కోడిపుంజులయితే కొటారించి అరిసినాయి. కొంచేపుటికి అలికిడి లేదు. ఆవు బెదిరి తాడు తెంచుకోని అట్ల పరిగెత్తా పోయింది.. కొట్టంలోకి కొండచిలువ దూరిందని ఈడుండేవోళ్లంతా అంటా ఉండారు.. లోపలికి పోదామంటే ఎవురికీ దైర్నం లే’’ చెప్పాడు శీను.
‘‘అడవుల్లో తిరగతా, కొండలు గుట్టలు ఎక్కేటోళ్లు.. మీకే దైర్నం లేకపోతే ఎట్ల?’’ ప్రశ్నించాడు సుబ్బారెడ్డి.
‘‘అడవులు వదిలేసి, ఊర్లోకి వచ్చి చాన్నాళ్లయిపాయ. ప్రాజెక్టులోకి నీళ్లొస్తానే అడివిలోకి పొయ్యేదానికి నీళ్లొదులుకున్నేం కదా.. ఏంబా శీనా.. పాము లోపలికే పోయిందా.. ఆ పక్కకు ఈ పక్కకు ఏమన్నా పోయిందా..?’’ అడిగాడు కృష్ణ.
‘‘ఈ దోవంటి లైటేసుకోని పోతాన్నేడు సుబ్బారెడ్డెన్న. ఆయన్న కేకేస్తానే అందరం ఈడికి వచ్చేసినాం.. ఈ పక్కకు రాలా.. అట్లే పోయింది’’ చెప్పారెవరో.
‘‘ఇట్లీన్నా లైటు..’’ అంటా సుబ్బారెడ్డి దగ్గరున్న టార్చి లైటు ఎడమ చేతిలోకి తీసుకుని, కుడిచేతిలో కర్ర పట్టుకుని గొడ్లకొట్టం వైపు మెల్లగా అడుగులేశాడు. మిగతావాళ్ల చేతుల్లో కూడా టార్చిలైట్లు వెలిగాయి. ఒక్కొక్కరే కృష్ణను అనుసరిస్తున్నారు.
కట్టుగొయ్యకు తెగిన తాడు సచ్చిన పాము మాదిర్తో పడుంది. కోళ్లగూడు ఖాళీగా ఉంది. అక్కడే ఉండాల్సిన లేగదూడ కనిపించడం లేదు. పెద్ద పాము పోయిన జాడ నేలపైన గోడవారగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ జాడను పట్టుకోని అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాడు కృష్ణ. అతడి వెనకే వస్తున్నారు మిగిలిన వాళ్లు. ఎవ్వరూ మాట్లాడ్డం లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. తుపాను ముందరి ప్రశాంతతలా ఉంది. గొడ్లకొట్టం వెనక తలుపు దగ్గర ఆగాడు కృష్ణ. విరిగి పోయి మనిషి పట్టేంత సందున్న తలుపును చూసి, తిరిగి శీను ముఖంవైపు చూశాడు ప్రశ్నార్థకంగా.
‘‘అది పోయి చాన్నాళ్లయింది కిట్టా. సీఎం చెప్పినాడు కదా 27 టీఎంసీలు నీళ్లు పెడతామని.. మనకు గవర్నమెంటు పరిహారం ఇచ్చేస్తాదిలే.. ఖాళీచేసేసేదానికి రిపేరీ ఎందుకని పట్టించుకోలేదు’’ అన్నాడు శీను నంగినంగిగా.
ఆ మాటలు వినగానే అందరిలో అలజడి. నీళ్లలో మునిగిపోతున్నప్పుడు ఆదుకునే మనిషికోసం ఊపిరిబిగబట్టి కొట్టకలాడుతూ ఎదురుచూసే అలజడి. నీళ్లకారణంగా తమ జీవితాలకు పడిన ఎన్నో బొక్కలు గుర్తొచ్చి, ఎక్కడ తమ జీవితం నీళ్లలా మారి చేతికి చిక్కకుండా కారిపోయి నీళ్లలో కలిసిపోతుందో అని భయపడ్డారంతా. వారి కళ్లలో ఇప్పుడు కొండచిలువ లేదు. అపార జలరాశి అనకొండలా మారి తమను మింగేందుకు వస్తున్నట్టు భయపడ్డారు. ముందుకు కదులుతున్న వాళ్లు ఒక్క క్షణం ఆగారు. కృష్ణ ఆగలేదు. విరిగిన తలుపును పూర్తిగా తెరిచి చేతిలో కర్రతో టార్చి లైటు వెలుగులో, నేలమీద జాడను అనుసరించాడు. మిగిలినవారు కూడా కాస్త ఎడంగా వెంట వస్తున్నారు. ఇద్దరి ముగ్గురి చేతుల్లో పొడవాటి కర్రలున్నాయి. కొండచిలువ కనిపిస్తే చంపేయాలన్నంత కసి వాళ్లలో. ‘ప్రాజెక్టులో నీళ్లు పెరిగిందానికే కదా కొండచిలువ ఊర్లోకి వచ్చిండేది’ అన్నారెవరో గుసగుసగా. అందరి గుండెల్లో అదే విషయం ఘోషగా వినిపిస్తోంది. అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాన్ని ఏమీ చేయలేని నిస్సహాయత.. కొండచిలువపైకి తీవ్ర కోపంగా మారింది.
నేలంతా తెల్లటి మంచు పరచుకున్నట్టు.. వెన్నెల కాంతులీనుతోంది. సమీపంలోని జలాశయం నీళ్లలోంచి చల్లటి గాలి వస్తోంది. వీళ్ల గుండెల్లో నిప్పుల కుంపట్లు ఉన్నట్టు ముఖాలు జేగురు రంగులో ఉన్నాయి. ఉఛ్వాస నిశ్వాసలు చాలా వేడిగా సాగుతున్నాయి.
కాసేపట్లో ముందు వెళుతున్న కృష్ణ కాళ్లకు నీళ్లుతగలడంతో ఆగాడు. ఎదురుగా ఎన్నో కుటుంబాలను కబళించనున్న జలాశయం అమాయకంగా నిద్రపోతున్నట్టు ఉంది. నీళ్లతో నిండుగా భయపెడుతున్నట్టుగా ఉంది. వెనక ఉన్నవాళ్లంతా ఆగారు. కృష్ణ చేతిలోని టార్చిని నీళ్లలోకి కాసేపు, ఒడ్డున అటూ ఇటూ వేసి చూశాడు. నేలపైన పరిశీలనగా చూశాడు. పాము జాడ నీళ్లలోకే పోయింది.. టార్చి వేసి నీళ్లలో కనిపించేంత దూరం చూశాడు. దూరంగా సుమారు యాభై మీటర్ల దూరంలో మెడలోతు నీళ్లలో మునిగి తపస్సు చేస్తున్న మనుషుల్లా చెట్లు గుంపుగా ఉన్నాయి.
‘‘పాము ఆడికి పోయింటాది..’’ అన్నాడు కృష్ణ.
‘‘మా దూడా’’ అన్నాడు శీను.
‘‘నోరుండే మనుషుల్నే మింగేస్తాంటే నోరులేని దూడదేముండాదిలే..’’ అన్నారెవరో.
‘‘దాని జాడ చూస్తే దూడను మింగినట్టే ఉండాది.. నిదానంగా పాకతా పోయిండాది.. అది కొట్టంలోకి వచ్చి చానాసేపే అయినట్టుండాది.. మీరు చూసుకోలేదేమో..’’
‘‘మళ్లా ఊర్లోకి వస్తాదేమో..’’
‘‘రాకుండా ఎందుకుంటాది.. నీళ్లొచ్చి పొలాలు, గుట్టలు, చెట్లు మునిగిపోతాంటే అది మాత్రం యాడుంటాది..? వచ్చి ఊరిమింద పడతాది?’’
‘‘ఈసారి వస్తే మాత్రం చంపేయాల..’’ ఎవరో కసిగా అరిచారు.
‘‘దూడను మింగేసే కొండచిలువను చంపేస్తావు.. మన బతుకులను మింగతాండే నీళ్లను ఏం చేస్తావు?’’ అడిగాడు కృష్ణ.
ఎవ్వరూ సమాధానం చెప్పలా? జలాశయమే కొండచిలువలా మారి అందరినీ మింగేసేదానికి కోరలు చాస్తున్నట్టు అనిపించి కొందరు భయపడ్డారు. అప్రయత్నంగా రెండడుగులు వెనక్కు వేశారు.
రోజూ చూస్తా ఉన్నా కళ్లకు కనిపించని విధంగా.. పిందె కాయగా మారినంత సహజంగా నీళ్లు ఊరి దగ్గరికి రావడం అందరికీ అర్థమవుతానే ఉంది.
‘‘పదాం పాండి.. దూడను తినేసిండాది.. ఇంగ ఒకటి రెండురోజులు మనూర్లోకి రాదు.. ఈసారి వస్తే ఏం చేయాలో తీరిగ్గా ఆలోచిద్దాం.. దానికంటే ముందు మనం ఈ నీళ్లగండాన్ని ఎదుర్కోవాల..’’ అన్నాడు కృష్ణ.
ధైర్యస్తులు కొందరు కృష్ణకు దారి వదిలారు. భయస్తులు కొందరు ముందు వైపు వడివడిగా ఊరిదిశగా అడుగులు వేస్తున్నారు. అందరూ కొండచిలువను మించి, ముక్కుల్లోతు నీళ్లు ముంచేసినట్టు శ్వాస కష్టంగా తీస్తూ సాగుతున్నారు. చేతుల్లో టార్చి లైట్లు వెలుగుతున్నా, దారీ తెన్నూ కనిపించని అపార జలరాశి మధ్య ఉన్న వారిలా భారంగా సాగుతున్నారంతా.
- • •
మనుషులునున్నాక ఒక ఊరు, ఆ ఊరికొక ప్రాంతమూ, ఆ ప్రాంతానికొక పేరూ ఉంటాయి కాబట్టి.. దీనిని రాయలసీమలోని ఓ వెనుకబడిన పల్లె అనుకుందాం. రాయలసీమలో నెర్రెలిడిసిన నేలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో 16 ఏళ్ల క్రితం ఇక్కడ 26.85 టీఎంసీల నీటినిల్వతో జలాశయం నిర్మాణానికి రూపకల్పన చేశారు. 22 గ్రామాలు ముంపునకు గురవుతాయని గుర్తించారు. వారికి నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి రైతులు బాగుపడతారని తెలియడంతో తాము కొంత నష్టపోయేదానికి ఇక్కడి రైతులు సంతోషంగా అంగీకరించారు. దసరా రోజు పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. జనంలో కూడా సంబరం. తమ ఎండునేల జలాశయంగా మారి, చుట్టూ బీడునేలలు పచ్చని పంటలతో కళకళలాడతాయని ఆశించారు. శంకుస్థాపన జరిగిన తొమ్మిదేళ్లకు కొంతమేర పనులు చేసి మొదటిసారిగా 3 టీఎంసీల నీళ్లు నిలిపారు. మరో నాలుగేళ్లకు పునరావాసకాలనీలు కట్టించి, 14 గ్రామాలను ఖాళీ చేపించి జలాశయంలో 12 టీఎంసీల నీళ్లు నిలిపారు. మరో రెండేళ్లు గడిచాయి. పరిహారం పెంచుతున్నామని కొత్త ముఖ్యమంత్రి ప్రకటించాడు. ఇక్కడున్న నిర్వాసితులంతా సంబరపడ్డారు. అందరి కళ్లలో నీళ్లు ఆనందంతో.. తమ ఎదుటే నీళ్లు నీలుస్తాయనీ సంబరం. పరిహారం మొత్తం విడుదల చేస్తాం.. వచ్చేఏడాది వానాకాలంలో 27 టీఎంసీల నీళ్లు నింపుతామని డిసెంబరులో ముఖ్యమంత్రి చెప్పాడు.
కొందరిలో కలవరం. కొందరిలో సంతోషం.. ఇది అయ్యేది కాదులే అనుకున్నారు అందరూ. తమకు పరిహారం ఇచ్చి, పునరావాస కాలనీల్లో వసతులు కల్పిస్తే వెళ్లిపోతామని అక్కడున్న నిర్వాసితులందరూ అధికారులకు చెప్పారు. అధికారులు అప్పటికి సరే అన్నట్టు తలలూపారు. నాలుగు నెలలకంతా నిధులు విడుదలయ్యాయి. చేతికి చెక్కు ఇస్తాం.. ఇల్లు కూల్చేస్తాం అని అధికారులు అన్నారు. ఇక్కడే మొదలయ్యాయి పంతాలు పట్టింపులు. వేదనలు రోదనలు.. అధికారుల బెదిరింపులు.
ఎక్సకవేటర్‍తో ఇళ్లు కూల్చేందుకు వచ్చిన తొలిరోజు అధికారులను నిర్వాసితులంతా ఒక్కటై అడ్డుకున్నారు. అగ్రవర్ణాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు.. అందరూ ఒక్కతాటిపై నిలబడ్డారు. పిల్లల మొదలు ముసలివాళ్ల వరకూ.. రోడ్డుపై బైఠాయించారు. ఇదేదో గంటకో రెండుగంటలకో సర్దుకుంటుందిలే అని అధికారులు అనుకున్నారు. ఆర్డీవో వచ్చాడు. రెవెన్యూ అధికారులు వచ్చారు. పోలీసులు చుట్టూ మోహరించారు. అయినా నిర్వాసితులు బెదరలేదు.
మాకందరికీ నష్టపరిహారం ఇవ్వండి.. ఇల్లు కట్టుకునేదానికి గడువు ఇవ్వండి. పునరావాస కాలనీల్లో కనీస వసతులు కల్పించండి. ఇవే నిర్వాసితులందరి డిమాండ్.
అధికారులు ససేమిరా అన్నారు. చెక్కు చేతిలో పెడతాం, ఇల్లు కూల్చేస్తాం అని చెప్పారు. విషయం తెలిసి ప్రతిపక్ష పార్టీల వాళ్లు వచ్చారు. మానవహక్కుల వేదిక కార్యకర్తలు వచ్చారు. ఎందరొచ్చి ఎంత వాదించినా, విన్నవించినా అధికారులు వినలేదు. ఇళ్లు కూలుస్తామనే మంకుపట్టు మానలేదు. నిర్వాసితులది బతుకు బాధ.. అధికారులది ఉద్యోగ బాధ్యత. ఎక్కడ మునిగిపోతామో అని నిర్వాసితుల గుండెలు నీళ్లయిపోతున్నాయి. ఎక్కడ తగ్గిపోతామో అని అధికారులు గుండెలు ఆగ్రహంతో మండిపోతున్నాయి. ఉదయం మొదలైన ఆందోళన రాత్రి పదిగంటలైనా కొనసాగింది. ఓ వైపు వర్షం. వర్షానికి తడుస్తామని భయపడి ఇళ్లలోకి పోతే.. ఇంటితో సహా మునిగిపోతామని భయం.. రోడ్డుమీద నుంచి నిర్వాసితులు కట్టుకదల్లేదు. గొడుగులు వేసుకుని, సంచిపట్టలు కప్పుకుని అక్కడే కూర్చున్నారు.
అధికారులంతా గుసగుసలు పోయారు. అక్కడి నుంచి తోకముడిచినట్టు కనిపించారు. ఒక్కొక్కరే వెళ్లిపోయారు. అలా వెళ్లిన వారంతా ఊరవతల ఎవ్వరూ నివాసం లేని ఇంటిని ఎక్సకవేటర్‍తో కూల్చడం మొదలుపెట్టారు. విషయం తెలిసి జనం అక్కడకు పరుగులు తీశారు. వారు రావడం చూసి అధికారులు వెళ్లిపోయి పోలీస్‍స్టేషన్‍లో మకాం వేశారు.
తెల్లవారితే అధికారులను ఎలా ఎదుర్కోవాలనే దిగులు నిర్వాసితుల్లో.
తెల్లవారితే వారిని ఎలా ఏమార్చి ఇళ్లు కూల్చేయాలనే ఆలోచన అధికారుల్లో.
అప్పటికే జలాశయంలో 12 టీఎంసీల నీళ్లున్నాయి.. రాష్ట్రమంతటా వానలు పడుతున్నాయి.
ఎవరి ఆలోచనలతో నిమిత్తం లేకుండా తెల్లారింది. జలాశయం నీళ్లలో అప్పుడే స్నానం చేసినట్టు సూర్యుడు తేటగా ఎగబాకుతున్నాడు. నిర్వాసితులకు రాత్రంతా సరిగా నిద్రలేక కళ్లు ఎర్రగా మండుతున్నాయి.
తెల్లవారకముందే రెండోరోజూ రోడ్డుపైకి వచ్చేశారు. మీడియా వచ్చింది. అధికారపక్షం తప్ప ఇతర పార్టీల నేతలంతా వచ్చారు.
‘‘చూడండయ్యా.. మాకు నాలుగెకరాల పొలముంది. పరిహారం రాలా.. సేద్యం చేసుకోని బతుకుతాండాం.. ఇంట్లో గొడ్డూగోదా ఉండాయి.. ఇప్పటికిప్పుడు చేతిలో చెక్కు పెట్టి ఉండే ఇల్లు కూలగొట్టేస్తే.. ఉన్నఫలాన మేము ఎక్కడికి పోవాల. ఎట్ల బతకాల.. మేమేమన్నా ఊరు ఖాళీచేయమని చెప్తాండామా.. పునరావాస కాలనీల్లో ఇంకా ప్లాట్లే వేయలేదు. మురుగు కాలవలు తీలేదు. మంచినీళ్లకు బోర్లేయలేదు. కరెంటు లేదు.. కొందరికి స్థలాలే చూపీలేదు. మేము యాడికని పోయేది.. యాడని ఇల్లు కట్టుకునేది.. అప్పటిదాంకా గొడ్డూ గోదా, పిల్లాపీచును యాగంప కింద మూసిపెట్టేది’’ అంటూ ఒక పెద్దాయన కళ్లనీళ్లుపెట్టుకున్నాడు.
అక్కడున్న చాలామంది మాట్లాడారు. దాదాపు అందరిదీ ఇదే రకమైన బాధ. అగ్రవర్ణాల కళ్లలో నీళ్లు.. బీసీల కళ్లల్లో నీళ్లు.. ఎస్సీల కళ్లల్లో నీళ్లు.. ఎస్టీల కళ్లల్లో నీళ్లు.. అందరి బాధా నీళ్లే.. అందరిచుట్టూ నీళ్లే.. నీళ్లపై రాతలు రాసి నమ్మించే యత్నం చేసేవారిని ఎదుర్కొనేదానికి కలసికట్టుగా అందరూ రోడ్డుపై బైఠాయించారు.
అధికారులు వచ్చారు. నచ్చచెప్పాలని చూశారు. బెదిరించారు. భయపెట్టారు. సాయంత్రందాకా మాటువేసిన పులుల్లా ఆ చుట్టుపక్కలా తిరుగుతా ఉన్నారు. నిర్వాసితులంతా మాటలు రాని కుందేళ్లలా మారిపోయారు. వారు ఎంత అరిచినా అధికారుల చెవుల పడ్డం లేదు. వేటే పరమావధిగా పులులు తిరుగుతున్నాయి.
చీకటి పడింది.. నిర్వాసితులు రోడ్డుపైనే పడుకున్నారు. చలికి వణుకుతున్నా.. ముంచేసే నీళ్లకంటే ఈ వణుకు తక్కువే అనుకున్నారు.
అధికారులంతా తిరిగి కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రంతా మంతనాలు సాగించారు. వారి చేతికి కరోనా అస్త్రం దొరికింది. కరోనా నిబంధనలను అతిక్రమించారంటూ మగవాళ్లందరినీ అరెస్టు చేసేస్తే.. ఆడవాళ్లు ఆందోళన విరమిస్తారని భావించారు. పొద్దు పుట్టీపుట్టకముందే అధికారులంతా మందీమార్బలంతో అక్కడ దిగేశారు. అదనంగా పోలీసు బలగాలను రప్పించారు. పొరుగూర్ల నుంచి వచ్చి నిర్వాసితులకు సంఘీభావం తెలుపుతున్న ముఖ్య నాయకులను, హక్కుల కార్యకర్తలను అప్పటికే హౌస్ అరెస్టు చేశారు. విషయం ఉప్పందడంతో మగవాళ్లెవ్వరూ రోడ్డెక్కలేదు. ఇళ్లకే పరిమితమై పోయారు. ఆడవాళ్లంతా రోడ్డుపై బైఠాయించారు. ఆడవాళ్లను భయపెట్టేదానికి అధికారులు మధ్యాహ్నానికి మహిళా పోలీసులను రప్పించారు. అయినా ఎవ్వరూ భయపడలేదు. భయపడేదానికి ఇది జీవితానికి సంబంధించిన సమస్య. ఇప్పుడు భయపడి ఆందోళన సళ్లిడిస్తే.. జీవితం నీళ్లలో చివికి పోయిన పండులా తారుమారైపోతుందని వారందరికీ తెలుసు.
సుబ్బారెడ్డి ఆ మండల బీజేపీ నాయకుడు. కృష్ణ కమ్యూనిస్టు నాయకుడు. మరో నలుగురు ఇతర పార్టీ ముఖ్య నేతలు.. అందరూ ఎంపీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు. నీళ్లల్లో ముంచేయొద్దని వేడుకున్నారు. ఎమ్మెల్యేకూ విన్నవించుకున్నారు. జిల్లా కేంద్రానికి వెళ్లి కలెక్టర్‍కూ వినతి పత్రం ఇచ్చారు. మరుసటి రోజు ఎమ్మెల్యే, ఎంపీతో కలసి మీటింగ్ పెట్టి మాట్లాడుకుందామని, సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని, ఆందోళన విరమించాలని కలెక్టర్ కోరాడు.
సమస్య పరిష్కారం అయ్యేదాకా ఆందోళన విరమించేది లేదని వీరు చెప్పి వచ్చారు. మరుసటి రోజు జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ముంపు గ్రామాలకు ప్రాతినిధ్యం వహించే ఎంపీ వచ్చాడు. ఎమ్మెల్యే వచ్చాడు. ఆర్డీవో, డీఎస్పీ.. మరికొందరు అధికారులు హాజరయ్యారు. నిర్వాసితుల తరఫున సుబ్బారెడ్డి, కృష్ణతో పాటు సుమారు పదిమంది వచ్చారు.
ఏసీ గదిలో కూడా నిర్వాసితులకు చెమటలు పడుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి నీళ్ల మూటలు ఇస్తామంటూ మభ్యపెట్టి నీళ్లలో ముంచేస్తారా.. లేదంటే నిజంగానే పీకల్లోతు నీళ్లలో మునిగిన తమను ఒడ్డునేస్తారా..? అని ఆలోచిస్తున్నారు.
‘‘మీకేమయ్యా ఇబ్బంది.. ఒక్కొక్కరికి పదిలక్షల చెక్కు ఇస్తాండారు.. ఊరు ఖాళీ చేసి పోయేదానికి ఏం’’ అడిగాడు ఎమ్మెల్యే.
‘‘ఇప్పటికిప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతాంనా..’’
‘‘మన సీఎం చెప్పి ఆర్నెళ్లయింది కదా 27 టీఎంసీలు నింపతామని. మీరు అప్పట్నించే ఏదైనా చూసుకోనుండాల్సింది..’’
‘‘మాకు న్యాయం చేయకుండా కట్టుబట్టలతో ఎళ్లిపొమ్మంటే ఎట్ల..? ఎక్కడికి పోవాల.. ఎట్ల బతకాల.?’’
‘‘పది లక్షలు ఇస్తాండ్లా..’’ కోపంగా ప్రశ్నించాడు ఎమ్మెల్యే.
‘‘మీరు చెప్పండి సార్.. 12 టీఎంసీలకు మించి ఒక్క టీఎంసీ నీళ్లు పెట్టినా మా ఊరి దగ్గరికి వచ్చేస్తాయి. 14 టీఎంసీలంటే వీధుల్లోకి వచ్చేస్తాయి.. మాకు మీరే న్యాయం చేయాల..’’ కలెక్టర్‍తో అన్నారు నిర్వాసితులు.
‘‘ప్రాబ్లెమ్‍ను మీరు కూడా అర్థం చేసుకోవాలండీ.. చూస్తున్నారు కదా.. ప్రాజెక్టులో 27 టీఎంసీలు నీళ్లు నిలుపుతామని సీఎం లాస్ట్ ఇయరే చెప్పారు. దాదాపు నైన్ హండ్రెడ్ క్రోర్స్ ఫండ్స్ రిలీజ్ చేశారు. చెక్కులు ఇచ్చేదానికి ఆర్డీవో వచ్చారు. మీరేమో చెక్కులు తీసుకుని ఇళ్లు ఖాలీ చేయకపోతే… నీళ్లు ఎలా నిలపాలి? మేము సీఎంకు ఏం సమాధానం చెప్పాలి? ఇది ప్రిస్టేజియస్ ఇష్యూ. మీరూ కాస్త కోఆపరేట్ చేయండి. సీఎం చెప్పినందుకు కనీసం 16 టీఎంసీల నీళ్లన్నా నింపుదాం..’’ బదులిచ్చాడు కలెక్టర్.
‘‘నేను చెప్తాండా కదా.. ఊర్లోకి నీళ్లు రావు.. అంటే ఓసీలు ఎవ్వరికీ భయం లేదు. బీసీ కాలనీలోకి కూడా రావు.. వాళ్లూ భయపడే అవసరం లేదు. చివర్లో ఉండే ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోకి మాత్రమే నీళ్లొస్తాయి.. ఎందుకు అందరూ టెన్షన్ పడతారు. మీ పాటికి మీరు నిశ్చింతగా ఉండండి.. కొందరికే కదా ఇబ్బంది.. మీ జీవితంలో పదిలక్షలు ఎప్పుడు కండ్ల చూడాల. తీసుకోని పోయి హాయిగా బతుక్కోండి’’ ఎమ్మెల్యే కలగజేసుకున్నాడు.
కాసేపు నిర్వాసితులు గుసగుసలు పోయారు. చివరకు ఒకతను లేచి ‘‘అయ్యా సోములూ.. మీ రాజకీయాలకు నమస్కారం. ఇన్నాళ్లు మేమంతా ఒక్కటిగా ఉండాం.. కాలనీల పేర్లు వేరే గానీ మా అందరి సమస్యా ఒక్కటే. ఎవరింట్లోకి నీళ్లొచ్చినా అందరి కండ్లల్లో నీళ్లొస్తాయి.. మేమంతా కలసే పోరాడతాం.. మమ్మల్ను విడదీయొద్దండి.. సార్.. డబ్బు వచ్చిందంటా ఉండారు కదా.. మాకు పరిహారం ఇచ్చేయండి. ఇళ్లు కట్టుకునేదానికి కనీసం సంవత్సరం గడువు ఇవ్వండి. పునరావాస కాలనీల్లో కనీస వసతులు కల్పించండి.. అప్పుడు మేము ఖాళీ చేయకపోతే మీ కాలి మెట్టుతో కొట్టండి.. అంతవరకూ మా జోలికి రావద్దండి.. మా ఊర్లను ముంచద్దండి..’’ అంటూ రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు.
మిగిలిన నిర్వాసితులంతా లేచి నిలబడ్డారు. అందరూ ఏసీ గదిలోంచి బయటొచ్చి గుండెలనిండా గాలి పీల్చుకున్నారు. వెళుతున్న వారందరినీ కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ మౌనంగా చూస్తూ ఉండిపోయారు.
మరుసటి రోజే ఎమ్మెల్యే మొదట ముంపు గ్రామంలోకి వెళ్లాడు. తమకులం వాళ్ల ఇళ్ల వద్దకు చేరుకున్నాడు. కొందరు పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడాడు. ‘మీకేం భయం లేదు. మీ ఊరు మిట్టన ఉండాది. 16 టీఎంసీలు నింపుతామని కలెక్టర్ చెప్పాడు. మహా అయితే ఎస్సీ ఎస్టీ కాలనీల్లోకి నీళ్లొస్తాయి.. లేదంటే బీసీ కాలనీదాకా వస్తాయంతే.. మీకేం కాదు.. మీరెందుకు అనవసరంగా వాళ్లతో కలసి రోడ్డుపైన కూర్చుంటారు. మనమంతా ఒకటి. నన్ను చూసే అధికారులు మీ జోలికి రావడం లేదు. లేదంటే ఎప్పుడో ఈడ్చకపోయి అందరినీ లోపలేసేసింటారు. ఆలోచించుకోండి. ఇంతటితో పోలా.. ఇంకా ఏదైనా అవసరం అయినా చేయాల్సింది నేనే గుర్తుంచుకోండి..’ అని సుతిమెత్తగా వివరించాడు.
బీసీ కాలనీకి వెళ్లాడు. అక్కడున్న ముఖ్యవ్యక్తులకు కూడా ఇదే చెప్పాడు. బీసీ కాలనీకి భయం లేదని భరోసా ఇచ్చాడు. ఆందోళన మానుకోమన్నాడు. పరిహారం తీసుకుని ఊరు ఖాళీ చేయాలని ఆదేశించాడు. ముందుముందు తనసహాయం ఎప్పుడూ ఉంటుందన్నాడు. ఎస్సీ, ఎస్టీ కాలనీల నేతలను ఒకచోటుకు పిలిపించాడు. పదహారేండ్లుగా ఇంత పెద్ద పరిహారం ఎప్పుడూ రాలేదని, ఏదో పేదలని దయతలిచి సీఎం సహాయం చేస్తున్నారని, ఈ అవకాశం వదులుకుంటే జీవితంలో ఎప్పుడూ ఇంక సహాయం అందదని చెప్పాడు. పది లక్షలు తీసుకుని ఊరొదిలి వెళ్లిపోతే, చేతిలో డబ్బయినా ఉంటుందని.. నీళ్లు నింపేది ఖాయమని.. పరిహారం తీసుకోకపోతే చేతిలో డబ్బూ ఉండదు, ఉండేదానికి ఇల్లూ ఉండదని హెచ్చరించి వెళ్లాడు.
ఎమ్మెల్యే మాటలు చాలామందిలో ప్రభావం చూపాయి. మునిగేది మా ఇండ్లు కాదు కదా.. కాలనీలు కదా అని ఊర్లో వాళ్లు ఒక్కొక్కరే రోడ్డెక్కడం మానుకున్నారు. బీసీలు కూడా తమ కాలనీ కాదుకదా మునిగేది. ఎందుకు రోజూ రోడ్డెక్కి గొంతు చించుకోవాల అనుకున్నారు. చివరకు చాలా తక్కువమంది నిలిచారు.
ఆర్డీవో సహా ఇతర అధికారులు కూడా నిర్వాసితులను భయపెట్టేదానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు విపరీతమైన వానలు. జలాశయంలోకి వరద ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఇంజనీర్లు నీళ్లను గేట్లెత్తి దిగువకు వదలడం మానుకున్నారు.
మరో నాలుగు రోజులకంతా జలాశయంలో 13 టీఎంసీలకు చేరడంతో ఎస్సీ, ఎస్టీ కాలనీలకు రెండువందల మీటర్ల దూరంలోకి వచ్చాయి నీళ్లు.
- • •
ఆరోజుతో ఆందోళనకు పదహారురోజులు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఇళ్ల గడపల వద్దకు నీళ్లొచ్చాయి. కాస్త ఎత్తు తక్కువ ఉన్న ఇళ్లల్లో నీళ్లు చేరాయి. ఇళ్లు వదిలి ఆందోళనలో కూర్చోవాలో, ఖాళీ చేసి ఎక్కడికైనా పోవాలో తెలీని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. దాదాపు రెండు వందల కుటుంబాలు.. అంతమందికి ఎలా సరిపోతుంది?
ముందు రోజు రాత్రి కొండచిలువ ఊర్లోకి వచ్చి పోయిన విషయం గురించి ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడ్డం లేదు. ఇప్పుడు కాలనీలోకి వచ్చి తిష్ట వేసిన నీళ్ల గురించే మాట్లాడుతున్నారంతా.
ఆ రోజు పేపర్లో అందరూ భయపడే వార్త.. జలాశయంలో 23 టీఎంసీల నీళ్లు నింపుతామని సీఎం చెప్పాడని ఉంది. ఆ వార్తను ఊర్లో అగవ్రర్ణాల వాళ్లు నమ్మలేదు. అది బీసీలను, ఎస్సీ, ఎస్టీలను భయపెట్టి ఖాళీ చేయించేదానికే.. తమదాకా నీళ్లు రావని అనుకున్నారు. ఇళ్లల్లో దూరుకుని టీవీ చూడ్డంలో మునిగిపోయారు.
కృష్ణ మరో ఇద్దరు కలసి రాజధానికి వెళ్లి హైకోర్టులో కేసు వేశారు. రెండు రోజుల్లో విచారణకు వస్తుందని చెప్పడంతో అక్కడే ఉండిపోయారు. ఎక్కడున్నా వారికి నీళ్లల్లో మునిగి ఊపిరాడనట్టుగానే ఉంది. తమ ఊరును చుట్టుముట్టిన నీళ్లే కనిపిస్తున్నాయి.
అనుకున్నట్టుగానే రెండురోజుల్లో కేసు విచారణకు వచ్చింది. యథాతథ స్థితిని కొనసాగిస్తూ బాధితులకు పునరావాస పరిహారం పంపిణీ చేయాలంటూ విచారణను రెండువారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.
యాభై అడుగుల ఎత్తునుంచి నీళ్లలోకి దూకి, అడుగుదాకా పోయి పైకి వచ్చి తల విదిలించి ఉత్సాహంగా గట్టుకు ఈదుకుంటూ వెళ్లే ఈతగాళ్ల ఆనందం నిర్వాసితుల్లో. తమ కష్టాలు తీరిపోయాయని సంతోషించారు. మరుసటి రోజు తెల్లవారే సరికి ఊరికి చేరుకున్నారు.
అక్కడి దృశ్యాలు చూసి వారి ఆనందంపై ట్యాంకర్లతో నీళ్లు కుమ్మరించినట్టయింది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోకి నడుముల్లోతు నీళ్లు వచ్చేశాయి. బీసీ కాలనీలోని ఇళ్ల గడపలను తాకుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలంతా పిల్లలను తీసుకుని ఇంట్లో వీలయిన కాడికి సామాన్లు తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలిపోతున్నారు. కొందరు నెత్తిన వస్తువులు పెట్టుకుని నడముల్లోతు నీళ్లల్లో నడుస్తున్నారు. ట్రాక్టర్లు, ఆటోల్లో లగేజీ వేసుకుని కొందరు వెళుతున్నారు. వందల ఇళ్లు ఒకేసారి ఖాళీ అవుతున్న సామూహిక విధ్వంసం అక్కడ అందరి కళ్లల్లో నీళ్లుగా పెల్లుబుకుతోంది. చేతిలో కాస్త డబ్బున్న వారు, అప్పు పుట్టేవారు అప్పటికే మెయిన్ రోడ్డు దగ్గర ఊర్లో ఇళ్లను అద్దెకు తీసుకుని సామాన్లన్నీ చేరవేసుకున్నారు. డబ్బు లేని వాళ్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్‍లో చేరి, చుట్టుముట్టిన వరద నీటిలో ఎత్తయిన బండపైన రక్షణ పొందుతున్న వారిలా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.
మెల్లిమెల్లిగా జలాశయంలో 15 టీఎంసీల నీళ్లు నింపారు. ఎలాంటి అధికార బలమూ ఉపయోగించకుండా, ఎవ్వరినీ అరెస్టు చేయకుండా, ఎవ్వరినీ బెదిరించకుండా, ఊరొదలమని చెప్పకుండా.. ఊర్లోకి నీళ్లొదులుతున్నారు.
రోజూ కుండపోత వానలు.. రాయలసీమలోనే కాదు, రాష్ట్రమంతా వానలు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కట్టలు, రోడ్లు తెగిపోతున్నాయి. ఆ జలాశయం పరిధిలోని ఇతర జలాశయాలన్నీ నీళ్లతో నిండుకుండల్లా ఉన్నాయి. కుందూ పరవళ్లు తొక్కుతోంది. పెన్నా ఆ గట్టును ఈ గట్టునూ తాకుతూ ఉగ్రరూపం చూపుతోంది. సోమశిల నిండిపోయింది. దాని బ్యాక్‍వాటర్‍తో చాలా గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. చాలా ఏళ్ల తర్వాత పాపాఘ్ని, చెయ్యేరుల్లో నీళ్లు పారుతున్నాయి.
అయినా అధికారులు తమ ప్రయత్నం మానుకోలేదు. వారిపై ప్రజాప్రతినిధుల కర్రపెత్తనం తగ్గలేదు. సీఎం మాట ఇచ్చాడు. నిధులు ఇచ్చాడు. నీళ్లు నింపాల్సిందే. ఊర్లు ఖాళీ చేయాల్సిందే.. ప్రాణాలను కాపాడే నీళ్లు, మెల్లమెల్లగా బతుకులను మింగుతూ ముందుకు సాగుతున్నాయి.
ఊర్లో పరిస్థితి చూడగానే హైకోర్టు ఆర్డరుతో వచ్చిన వారి గుండెలు నీళ్లయిపోయాయి. వెంటనే తేరుకున్నారు. గుండెను గట్టిచేసుకున్నారు. కోర్టు కాపీయే తమకు శ్రీరామ రక్ష అన్నట్టుగా వెంటనే వెళ్లి ఆర్డీవోను కలిశారు. ఆయన చేతికి కోర్టు కాపీ ఇచ్చారు.
ఆయన ఆ కాపీని చేతిలోకి తీసుకుని మొత్తం చదివాడు.
‘‘మొత్తానికి బాగా పోరాడతాండారు.. కంగ్రాట్స్’’ అన్నాడు అభినందిస్తున్నట్టుగా.
‘‘థ్యాంక్స్ సార్.. ఇంకన్నా నీళ్లు నింపేది ఆపండి.. మాకు పరిహారం ముందుగా ఇవ్వండి. ఇళ్లు కట్టుకునేదానికి గడువు ఇవ్వండి.. పునరావాస కాలనీల్లో కనీస వసతులు కల్పించండి’’ అన్నారు సంతోషంగా.
కోర్టు కాపీని అటూ ఇటూ తిప్పి చూస్తూ ‘‘దేనికైనా ఓ ప్రాసెస్ ఉంటుందయ్యా. దీనిని మీరు తెచ్చి ఇవ్వడం కాదు.. కోర్టు నుంచి మాకు నేరుగా ఆర్డర్ వస్తుంది.. అప్పటి దాకా మేమేమీ యాక్షన్ తీసుకోలేం’’ అన్నాడు నింపాదిగా ఆర్డీవో.
‘‘సార్..’’ అన్నారంతా ఆందోళనగా.
‘‘సారీ.. ఈ విషయంలో నేనేమీ చేయలేను. మాకు పై నుంచి ప్రెజర్స్ అలా ఉన్నాయి. మీరు వచ్చి కలిశారు కాబట్టి.. రేపటిదాకా వెయిట్ చేస్తాం.. ప్రాజెక్టులోకి నీళ్లు వదలరులే.. ఈలోపు కోర్టు ఆర్డర్ వస్తే, దాన్ని బట్టి ఫరదర్ యాక్షన్ ఉంటుంది’’ అన్నాడతను.
నీట మునుగుతున్న వాడికి గడ్డిపోచ ఆధారమైనట్టు, ఆ మాటలకే అందరిలో సంతోషం. వెనుదిరిగారంతా.. వెళుతున్న వాళ్లను నర్మగర్భంగా నవ్వుతూ చూస్తూ ఉండిపోయాడు ఆర్డీవో. జలాశయంలో 23 టీఎంసీలు చేరితే ఎక్కడిదాకా నీళ్లు వస్తాయనే దృశ్యాన్ని ఊహించుకుంటున్నాడు. ఇప్పటిలాగే కొద్దికొద్దిగా నింపుకుంటూ పోతే ఎన్నిరోజుల్లో, 23 టీఎంసీలు చేరతాయనే లెక్కలూ వేసుకుంటున్నాడు. అవి నోటిలెక్కలే అయినా నీళ్లపై లెక్కలు కానేకావు. ఊళ్లను ముంచేసే నీళ్ల లెక్కలు.
- • •
నిర్వాసితుల ఆందోళన మొదలై 30 రోజులు దాటింది. నీళ్లు 16టీఎంసీలు దాటాయి. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఇళ్లు సగం మునిగిపోయాయి. బీసీ కాలనీలో నడుముల్లోతు వచ్చాయి. అగ్రవర్ణాలున్న ఊర్లోని ఇళ్ల గడపలనూ తాకుతున్నాయి. నీళ్లకు తరతమ భేదం లేదనే విషయాన్ని నిరూపిస్తున్నాయి.
నీళ్లల్లో మునిగి ఊపిరి ఆగిపోతున్న వాడు చివరి నిముషంలో ఒడ్డున పడ్డట్టు.. ఆ రోజు నిర్వాసితుల్లో కాస్త ధైర్యం. కాస్త సంతోషం. ఏదో న్యాయం జరుగుతుందనే నమ్మకం.
సీపీఐ జాతీయ కార్యదర్శి ఊర్లోకి వచ్చాడు. పంచె ఎగ్గ్ట• మోకాల్లోతు నీళ్లల్లో తిరిగాడు. చిన్న తెప్ప తీసుకుని, స్వయంగా తెడ్డు వేసుకుంటూ కాలనీలన్నీ చుట్టి వచ్చాడు. మీడియాతో మాట్లాడాడు.
‘‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా వానలు పడుతున్నాయి. నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలన్నీ నిండుకుండల్లా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ జలాశయాన్ని నీళ్లతో నింపకుంటేనేమి? ఎవరికోసం మీరు నీళ్లు నింపుతున్నారు? ఎందుకు వేలాది కుటుంబాలను నీళ్లల్లో ముంచేస్తున్నారు. నీళ్లకోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులంటే మీకు అపహాస్యంగా మారిపోయింది. పునరావాసమంటే ఇప్పటి జీవితానికన్నా మెరుగైన జీవితం కల్పించడం. మీరేం చేస్తున్నారు.. చేతిలో చెక్కుపెట్టి ఇళ్లు ఖాలీ చేయమంటున్నారు.. ఇది చాలా దుర్మార్గం. వీళ్లకు ఇళ్లు కట్టుకునేంత సమయం ఇవ్వాలి. పునరవాస కాలనీల్లో మౌలికవసతులు కల్పించాలి. తర్వాతే వీళ్లను ఖాళీ చేయించాలి. అంతవరకూ ప్రాజెక్టులో 12 టీఎంసీలకు మించి నీళ్లు నింపరాదు. అలా చేస్తే రాజధానిలో సీఎం ఇంటిముందు పెద్ద ఎత్తన ఆందోళన చేస్తాం.. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎన్‍హెచ్‍ఆర్‍సీ దృష్టికి తీసుకుపోతాం’’ అని హెచ్చరించాడు.
ఆ రోజు చానెళ్లల్లో అంతా ప్రసారం చేశారు. మరుసటి రోజు పేపర్లలో వార్తలు వచ్చాయి. జిల్లా పేజీల్లో బ్యానర్ కథనాలు ప్రచురించారు. అయినా అధికారుల ముఖాన నీళ్లు చిలకరించినట్టు కూడా లేదు. తమ పంతం మానుకోలేదు. క్రమంగా నీళ్లు పెంచడం ఆపలేదు.
తహశీల్దార్ కార్యాలయంలోకి నీళ్లు వచ్చాయి. పోలీస్ స్టేషన్‍లోకి నీళ్లు వచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రిలోకీ నీళ్లు వచ్చాయి. క్రమంగా ప్రతి ఇంటినీ మింగుతున్నాయి. అయినా ఏ అధికారి దీనిని వద్దని చెప్పడం లేదు. కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయకపోయినా వారికేమీ పట్టింపులేదు. ఉన్నతాధికారులు ఆశించినట్టు నీళ్లు ఒక్కో గడపనూ తాకుతూ వస్తుంటే.. స్థానిక అధికారుల్లో సంబరం. తామేదో సాధించేశామనే గర్వం.
బడి దగ్గర ఏర్పాటు చేసిన షెల్టర్ వద్దే నిర్వాసితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళన 40 రోజులకు చేరింది. జలాశయంలో నీళ్లు 17 టీఎంసీలను దాటాయి. ఊర్లోని అగ్రవర్ణాల్లోనూ దడ మొదలైంది.
సాయంత్రం నాలుగు గంటలవుతా ఉంది. నల్లటి మేఘాలు ఆకాశంలో నీళ్లతో వేలాడుతున్న చెరువుల్లా ఉన్నాయి. ఇప్పుడో ఇంకాసేపట్లోనో భారీ వర్షం పడేలా ఉంది ఊర్లో నించి రాఘవరెడ్డి పరుగున వచ్చాడు శిబిరం వద్దకు.
‘‘క్రిష్ణా.. మా ఇంట్లోకి కొండచిలువ దూరింది.. జాతర కోసరం మేపతాండే పొట్టేలిపిల్లను మింగేసింది.. ఇంట్లోనే పడుకోనుంది. దాన్ని చూస్తే మాకు భయంగా ఉంది.. నువ్వు రా’’ అన్నాడు ఉద్వేగంగా. అతడి వెనకే వారి కులంవాళ్లతో పాటు, బీసీ కాలనీ వాళ్లు కూడా కొందరు ఉన్నారు.
కృష్ణ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు.
‘‘క్రిష్ణా.. మా ఇంట్లోకి కొండచిలువ దూరిందంటే గమ్మున ఉండావే. రాప్పా పోదాం.. ఇంట్లోకి పోవాలంటే భయంగా ఉండాది.. పొట్టేలిని మింగేసింది. మనుషులను కూడా మింగేస్తుందేమో’’అన్నాడు. అతని ఒళ్లంతా కుండనీళ్లు మింద కుమ్మరించినట్టు చెమట.
‘‘అన్నా.. అది కొండచిలువ.. నా దగ్గరుండే తమరకట్టెతో దాన్ని పట్టుకోవడం సాధ్యం కాదు.. ఈడా ఇద్దరి ముగ్గురి దగ్గర తమర కట్టెలుండాయి. మీరందరూ కూడా తలా ఒక తమర కట్టి తీసుకోనొస్తేనే కొండచిలువను పట్టుకోగలం. లేదంటే దాని నోటికి నేను ఎర అయిపోతా’’ అన్నాడు కృష్ణ.
అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సరే అన్నట్టు తలలూపారు.
తమ ఊర్లో ఒక్కో జీవాన్నే గుటుక్కున మింగేస్తున్న కొండచిలువ అంతు చూసేదానికి అందరూ తలా ఒక తమరకట్టి తీసుకుని సిద్ధమయ్యారు.
‘‘… బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావదె సుమతి’’ పుస్తకంలో చూసి గట్టిగా చదువుతున్న కొడుకు మహేష్ బుగ్గపై కృష్ణ ముద్దుపెట్టుకున్నాడు.
కళ్లకెదురుగా ఉన్న అపార జలరాశిని చూసి, కళ్లలోంచి ఉబికి వస్తున్న నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయకుండా.. అందరితోపాటు కొండచిలువ అంతు చూసేదానికి అడుగులేసింది సుహాసిని.
*
చిత్రం: సృజన్ రాజ్
నమస్తే సార్.,! కథ చాలా అద్భుతంగా ఉంది. కథనం మరీ అద్భుతంగా ఉంది.. కథ చదవడం మొదలు పెట్టి ఏకబిగిన చదివేశాను…. గండికోట నిర్వాసితులు కడగండ్లు కళ్ళకు కట్టినట్టు చూపించారు.. కథ చదువుతుంటే ఆద్యంతం ఏదో తెలియని బాధ… గుండెను మెలేసి నట్టు విలవిల లాడి పోయా.. !