మూలవాసుల గాయాల మూలం అడివిపిట్ట గొంతులో స్రవిస్తూనే వుంటోంది కదా,
అయినా –మరబొమ్మలం
బోన్సాయ్ అడవి జాడల్లో ఇంద్రియాలు పారేసుకొన్న మరబొమ్మలకి ఎప్పటికి పట్టుబడేను పిట్టల గుండెచప్పుళ్ళు.
మాట ఎప్పుడూ ఓ పక్షిలాటిదే–
పంజరంలో ఉన్నప్పుడు పాటో, పాటలోని చింతో కావొచ్చు ,
గాలి ఒడిలో వూగేప్పుడు ఆటో ,ఆటలోని తెగువో కావొచ్చు..
ఏమైనా ఎరుకకి, ఇచ్ఛకి మరో పేరు మాటే కదా.. అది స్వేచ్ఛేకదా
ఎన్నిశిలాజాలో నేల ఒడిలో
ఎన్ని కతలో అడవి ఎదలో
ఎన్ని నాగరికతలో నీటి రుచిలో
ఎంత ఆర్తి ఋతువులది.
వూపిరిలో వూపిరై అల్లుకొన్న ఋతువులకి మాత్రమే తెలుసు
తిరిగి తిరిగి ఉదయించడం, చీకటిని ఛేదించడం
చావు బతుకంత సహజం కదా !
ఐనా బతికేహక్కుని లాగేయడం,
శకుని పాచికలతో ఆకలిదప్పుల్ని నిరాకరించడం,నిషేధించడం
వామనసంతతికి జూదమే..మాయాజాలమే–
గాయాల గురుతులు, మాటల సందర్భాలు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోవు.
ఫీనిక్స్ లాగానో, మర్రి మొలకగానో- ఉల్కగానో, ఊడగానో
ఓ అద్భుతంలా కాదుగానీ,
గుడ్డు పిగిలి ఓ పులుగుపిల్ల వెలుగుచూసినంత
సహజంగా, సహజాతిసహజంగా —
నీలో నాలో పునరుత్థానం !
అదే,అదీ అసలైన అద్భుతం !
*
ఎంత ఆర్తి ఋతువులది