నీ లోకి నీవే నీ లోనికి నీవే
ఒక్కసారైనా తొంగి చూడు
గుండె గోడలకేమైనా
కొవ్వు పాకురులా పేరుక పోవచ్చు
నీ అంతరాత్మ కుహరంలోకి చెయ్యి పెట్టి
ఏకాంతంగా దేవులాడుతుండు
అహంకారపు మాటలు, ఎవరినైనా గుచ్చి
నొప్పించిన బుడిపెలు వేళ్లకు తగలవచ్చు
నీ సజీవ దేహంలోకి నీవే
సమయం చూసి ప్రశాంతంగా ప్రయాణించు
రక్తనాళాల దారులలోన
ఎగుడు దిగుడులు తట్టుకోనూవచ్చు
అవి ఎత్తుజిత్తుల పర్యవసానాలు కావచ్చు
ధ్యానముద్రలో ఒకసారి గతం తలుపులు తెరువు
తెలిసో తెలియకో, తెలిసిన వారికే చేసిన
ద్రోహ దృశ్యాలు రీల్లు రీల్లుగా కనపడతాయి
తెలవారంగనే తెల్లగా బ్రష్ చేసుకున్నా
దంతాలకు అంటిన అబద్ధాల గార అగుపిస్తనే ఉంటది
సబ్బు నురగలతో తలార స్నానం చేసినా
శరీరానికి పట్టిన పాపాల జిగట జారిపోదు
ఉపరితలం మీద ఎంత అద్దుకున్నా
మనసుపొరల్లో కలిసిపోయిన మరకలు
నీవు మారకుంటే నీ వెంటే నర్తిస్తుండవచ్చు
నీపై నీవే సంస్కరణ యుద్ధం చేసికుంటేనే
మస్తిష్కంలోని మాలిన్యపు మబ్బులు కరిగిపోతాయి
నీకు నీవే నగ్న నయనివై
నిరంతరం అంతరాత్మను యంఆర్ఐ చేపిస్తేనే
ఆత్మావలోకన పుష్పం వికసిస్తది.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
దంతాల కంటిన అబద్దాల గార
poem బాగుంది anna.abhinandanalu
Super poem…on human life…