భూగర్భంలో ఏదో జరుగుతోంది. ఏదో జరగకుంటే నీళ్లెటుపోయాయి?
మా వ్యవసాయ బావుల్లో ఒకటి గదగుండ్ల బావి. ఈ బావి గదగుండ్లు(గద్దగుండ్లు) అనబడే పెద్ద రాతిగుట్ట కిందనే వుండడంతో దానికి ఆపేరు వచ్చింది. అయిదు మట్ల లోతు వుంటుందేమొ. మట్టు అంటే మనిషెత్తు అని అట. దాంట్లో మాకు, మరొకరికీ సమాన వాటాలు వుండేవి. ఆ బావి చుట్టూ కానగ చెట్లు, వేప చెట్లు, వెదురు పొదలు, ముట్టి చెట్లతో పచ్చగా వుండేది. దాని గట్టున వున్న రేగు చెట్టు అదనపు ఆకర్షణ. దాని రేగుపళ్ళు మామూలు సైజులో కాక పెద్దగా మంచికండతో వుండేవి. కానీ బావిలోకి వంగివుండడంతో ఎక్కువ పళ్ళు బావినీటిలో పడేవి. నీటికోసం బావిలోకి దిగినపుడు దిగుడుదారిలో, నీటి అంచునా పడిన పళ్ళను గొప్ప తన్మయంతో తినేవాళ్లం. వర్షాకాలంలో ఆ బావి పూర్తిగా నిండి పారేది. పారడం అంటే ఇక ఏ మోటారు సహాయం లేకుండా బావినుండి నీళ్ళు బయటకు ప్రవహించేవి. వరిమళ్ళు సులభంగా పండేవి.
వేసవిలో బావిలో నీటిమట్టం బాగా తగ్గినా ఎప్పుడూ పూర్తిగా ఎండిపోలేదు. మా తాత చెప్పేవాడు, అది ఎండిపోవడం ఎవరూ చూళ్ళేదని. దాని నీళ్ళు తాగితే పడిశం పడుతుందని పెద్దలు భయపెట్టినా మేమెప్పుడూ తాగడానికి భయపడలేదు. డీజలు ఇంజన్లు వచ్చాక దాన్నుండీ తోడేనీరు గొట్టంలో నుండి అంత దూరాన కాలువలో పడిపోతుంటే… ఆ గొట్టానికి మూతి ఆనించి కడుపునిండా చల్లటి నీరు తాగడం గొప్ప అనుభూతి. ఆ బావి నీళ్ళు రెండు సమాన వాటాలు కాబట్టి, ఒకరోజు నీళ్ళు తోడుకోవడానికి మావంతు వుంటే, మరసటి రోజు అవతలి వాటాదారుడు వెంకటయ్యకు వుండేది. మావాటా నీళ్ళు పరిపూర్ణంగా వాడుకోవాలనే ఆశతో, మావాటా రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాతే ఇంజను పెట్టేవాళ్ళం. ఎంత రాత్రయినా అవనీ బావినీళ్ళు పూర్తిగా గొట్టానికి అందకుండా తోడేవరకూ ఇంజను ఆపేది లేదు. మళ్ళీ మరుసటిదినం వెంకటయ్యా అదేపని చేసేవాడు. అలా రోజంతా అడుగంటా నీళ్ళు తోడేసినా మళ్ళీ మరుసటి దినానికి మట్టిలోతుకు పైనే నీరు వూరేది. వేసవిలో వేరుశెనగ పండించి విత్తనం కోసం కోమటోళ్ళ ముందు మానాన్న చేయి చాచలేదన్నా, టమాటా వేసి అదనపు ఆదాయం కళ్ళచూసేవాడన్నా ఆ బావి చలవే! ఎంత కరువు వచ్చి ఎన్ని బావులు ఎండిపోయినా, “ఎప్పుడూ గదగుండ్లబావి” ఎండిపోలేదు అన్న భరోసానే గొప్ప వెన్నుదన్నుగా వుండేది.
మా వూరికి పడమరగా వున్న ఎర్రగొండను (పెద్ద చెట్లు పొదలూ లేకుండా ఎర్రగా కనిపిస్తూ వుంటుంది) దాటామంటే, దాని అంచునుండి శేషాచల కొండలవరకూ (తిరుపతిలో మొదలయ్యే శేషచలం కొండలు మా వూరికి పడమరగా, యిడుపుల పాయకు తూర్పుగా అంతమవుతాయి) కొన్ని వందల ఎకరాల భూమి అటవీ బంజరు. మా వూరే కాదు ఆ చుట్టుపక్కల ఎన్నో వూర్లు పశువులను మేపుకొనే స్థలం. పది పన్నెండేళ్ళ పిల్లయినా, పిల్లాడయినా ఆవులనూ, ఎద్దులనూ ఆ ఎరగొండ కనుమ దాటిస్తే చాలు. ఇక నిర్భయంగా కూనిరాగాలు పాడుతూ ఏ చెట్టుకిందనో కూచోవచ్చు. చూచినంత దూరంలో పొలమూ గట్రా లేవు కాబట్టి, ఏ పొలంలోనో దూరతాయన్న చింత లేదు. అలా మధ్యాహ్నపు సూరీడు పడమరకు వాలేంతవరకూ, చెట్టు చుట్టూ, గుట్ట చుట్టూ, పొదల చుట్టూ తిరిగి మేసిన ఆవులు నీళ్ళు తాగడానికి మాత్రం వడుబ్బాయికి వచ్చేయి.
వడుబ్బాయి అంటే గదగుండ్లబాయిలా ఎన్నోమట్లు లోతున్న బావి అనుకునేరు. నిండా నడుము లోతైనా లేని గుంత. బహుశా ఒకప్పుడు అది వ్యవసాయ బావి అయ్యుండవచ్చు. ఎంత వేసవిలోనయినా ఆ నడుములోతున్న వడుబ్బాయిలో నీళ్ళుండేవి. ఎక్కడెక్కడో తిరిగి మేసిన ఆవులూ, గొర్రెలూ, మేకలూ సమస్తమూ మధ్యాహ్నమయ్యేసరికి ఆ బావిదగ్గరకు నీళ్ళు తాగడానికి వచ్చేవి. పశువుల కాయను పోయిన మేము కూడా వడుబ్బాయి నీళ్ళు తాగి, ఆ చెంతనే ఏ చెట్టు కిందనో తెచ్చుకున్న అన్నం మూట విప్పి తినేవాళ్ళం. నీళ్ళు తాగి చెట్టునీడన కాసేపు సేద తీరిన ఆవులు మళ్ళీ సాయంత్రం దాకా అది ఇదీ తిని అప్పుడు ఇంటిదోవ పట్టేవి. మనిషికే కాదు పశుపక్ష్యాదులక్కూడా నీళ్ళకు వడుబ్బాయి నెలవని తెలుసు. ఎటు తిరిగినా అక్కడికి రాక తప్పదని పశువుల కాపర్లం మేము అక్కడే కూచునేవాళ్లం.
మా వూరి చెరువు కిందనున్న వెంకటప్పయ్యోళ్ళ బావి మాత్రం తక్కువా! వేసవి సెలవులు వచ్చాయంటే చాలు, మా మధ్యాహ్నాలన్నీ అందులో ఈతకొట్తడంతోనే గడిచిపొయ్యేవి. ఎండ తాపానికి పెద్దలంతా చూర్ల కింద, పందిళ్ళ కిందా నులక మంచాలపై కునుకు తీస్తుంటే, పిల్లకారంతా ఒకర్నొకరు జత జేసుకోని, ఈతరానివాళ్ళు మునగబెండ్లో, ఎండిన సొరకాయో వీపులకు కట్టుకొని ఈతకు బయల్దేరేవారు. వెంకటప్పోల్ల ఈ చెరువుకింది బాయే మాకంతా స్విమ్మింగ్ పూల్. మేమంతా నీళ్లలో మునిగిపోకుండా కాపాడుకునే ఈతలను ఇందులోనే నేర్చుకున్నాం. బావికున్న మోట దూలాలని ఎక్కి కొందరు దూకితే, బావిగట్టునే వున్న వేప చెట్టెక్కి కూడా కొందరు దూకేవాళ్ళు. రెండు మూడు మట్ల లోతైనా నీళ్లుండేవి. మునక వేసి అడుగున వున్న పూడు మట్టి తెచ్చిన వాడు ఒక హీరో! ఎంతసేపు ఈదినా తృప్తి తీరేది కాదు. అమ్మో నాన్నో తంతారనో, ఏదైనా పని వుండో ఎవడైనా వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తే వాడి తలలో బలవంతగా మట్టి పులిమేవారు. అది పోగొట్టుకునేందుకు వాడు మళ్ళీ బావిలో దూకాల్సిందే! వేసవి ఈతలకి వెంకటప్పోల్ల బావికీ అంత అనుబంధం.
వూరంతటికీ దప్పిక తీర్చే చేదబావి లోతు కూడా మహా అంటే నాలుగు మట్లు. ఒక చేంతాడు పూర్తిగా మునగక్కర లేకుండానే బకెట్టో, బిందెనో నిండేది. వూరంతటికీ తాగునీళ్ళకూ, మంచి నీళ్ళ తొట్టికీ, కుడితి తొట్టికీ, పేడనీళ్లకూ సమస్తానికీ ఆబావి నీళ్ళే! ఇంకా ఉగాదో, సంక్రాంతో వచ్చిందంటే ప్రతి యింటోళ్ళూ ఒకేసారి ఇంటిముందు అలకుతారు కాబట్టి.. బావిచుట్టూ నీళ్ళు చేదే వాళ్లతో సందడే సందడి. సుబ్బరాయుడి కొట్టం ఒక అర్ధరాత్రి తగలబడుతుంటే, ఆ నిప్పును ఆర్పడానిక్కూడా ఈ బావే నీళ్ళిచ్చింది. ఇదీ అంతే..ఎప్పుడు తవ్వించారో గానీ వూరి దాహాన్ని తీర్చనుపో అన్నది లేదు. ఈ బావి నీళ్ళు పోస్తే కందిపప్పు వుడకదని రాగాబాయికి వెళ్ళి అప్పుడప్పుడూ ఓ బిందెడు నీళ్ళు తెచ్చేది మా అవ్వ.
మా అమ్మకు అక్క ఒకామె వుండేది. మేము పుట్టక ముందు ఏవో కలతల కారణాన జీలగోల్ల వ్యవసాయ బావిదగ్గరికి వెళ్ళి, చేతిలో వున్న గంపా, కొడవలీ ఒడ్డున పెట్టి అందులో దూకి చచ్చిపోయింది. మావూరి లక్షుము అనే ఆమె కూడా బావిలోకి నీళ్ల కోసం దిగి కాలుజారి మునిగి చచ్చిపోయింది. మావూర్లో వురేసుకొని చచ్చిపోయినోల్లెవరూ నాకు తెలిసి లేరు. కోపం వస్తే “బావిలో దూకి చస్తా” అనడమే రివాజు.
ఆ నీళ్ళన్నీ ఎటుపోయాయో! నీళ్ళు లేవని బోరుబావులు వేశారో, బోరుబావులు వేశారని నీళ్ళు మరింత లోతుకు వెళ్ళాయో గానీ.. ఏ బావిలోనూ చారెడు నీళ్ళు లేవు.. తాగడానికే కాదు, చావడానికీ బావుల్లో నీళ్ళు కరువే!
*
ప్రభుత్వాల నిర్వాకమే ఇది.
ఏమోనండి. ప్రభుత్వాలా, ప్రజలా, అవసరాలా? ఫలితం మాత్రమే చూస్తున్నా. కారణం ఏమిటో తెలియదు.
నీటి అవసరాలు ఎక్కువ వుండే పంటల వైపు దృష్టి సారించి న ఫలితం. బావులు పోయి బోర్లు, బోర్లు పోయి భారీ నీటి ప్రాజెక్టు లు, ఆ తర్వాత నదుల అనుసంధానాలు… విధ్వంసం కొనసాగుతూనే వుంటుంది.
మా తాతలు సజ్జలు, రాగులు, జొన్నలు, ఉలవలు, అరికెలు వగైరా తక్కువ నీటితో పండే పంటల్ని తినేవారు.
వరి అన్నం వండిన రోజున మా తాత, “అమ్మా ఆ మెతుకులు నేను మింగలేను, కాసింత సంగటి వుంటే పెట్టు” అనేవాడు. ప్రజల అలవాట్లు మారిపోయె, ఆశలు మారిపోయె, దాంతోపాటే నీటి అవసరాలూ మారిపోయె.
ప్రసాద్ గారు మీరు చాలా బాగా వ్రాసారు. నా చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నాను.
దసరా , వేసవి సెలవులకు ఊరికి వెళ్ళి చెట్టు చెట్టు, గుట్ట గుట్ట కు తిరుగుతూ ఆడుకునే వాళ్ళం. మునగ బెండ్ల కట్ట వీపులో కట్టుకుని కప్పలు, చేపలు ఉన్న బావిలో ఈత నేర్చు కోవడం, మఱ్ఱి ఊడలు పట్టుకుని ఊగుతూ (టార్జాన్ తెలీదప్పుడు) బావి లో దూకడం ఆ ఆనందాలు అనుభవించాను. ఆర్గానిక్ పదమే లేదా రోజుల్లో. నాకింత చావు అనే రోజులవి.
ఇప్పుడు క్లీన్ అంటూ పురుగులను చంపుతూ , ఆర్గానిక్ అంటూ అన్నిట్లో మందులు చల్లి వాటిని తింటూ బతకలేక చివరికి తాగే నీటిని కూడ నమ్మలేని స్థితికి వచ్చాం. ఎంతున్నా
ఇంకా కావాలనే రోజులు ఇవి! నీరు ఇంకిపోక ఏమవుతుంది!!
థ్యాంక్యూ సుధేష్ణ గారూ,
అవును అప్పుట్లో అంతా ఆర్గనిక్కే. పాలు పెరుగు కోసం కాకుండా కేవలం అవి పెట్టే పేడకోసమే మానాన్న గేదెల్ని, ఆవుల్నీ సాకేవాడు. కానీ ఆ పద్దతిలో పండించిన ఆహారం పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చగలదా అని సందేహం.
హరిత విప్లవం వచ్చి విపరీతంగా మందులు, రసాయన ఎరువులూ వాడడం మొదలెట్టాకే దిగుమతుల్లేకుండా కరువుల్లోనూ అందరూ తినగలుగుతున్నారేమో!
ప్రసాద్ గారు మీరు చాలా బాగా వ్రాసారు. నా చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నాను.
దసరా , వేసవి సెలవులకు ఊరికి వెళ్ళి చెట్టు చెట్టు, గుట్ట గుట్ట కు తిరుగుతూ ఆడుకునే వాళ్ళం. మునగ బెండ్ల కట్ట వీపులో కట్టుకుని కప్పలు, చేపలు ఉన్న బావిలో ఈత నేర్చు కోవడం, మఱ్ఱి ఊడలు పట్టుకుని ఊగుతూ (టార్జాన్ తెలీదప్పుడు) బావి లో దూకడం ఆ ఆనందాలు అనుభవించాను. ఆర్గానిక్ పదమే లేదా రోజుల్లో. నాకింత చాలు అనే రోజులవి.
ఇప్పుడు క్లీన్ అంటూ పురుగులను చంపుతూ , ఆర్గానిక్ అంటూ అన్నిట్లో మందులు చల్లి వాటిని తింటూ బతకలేక చివరికి తాగే నీటిని కూడ నమ్మలేని స్థితికి వచ్చాం. ఎంతున్నా
ఇంకా కావాలనే రోజులు ఇవి! నీరు ఇంకిపోక ఏమవుతుంది!!
ఇక్కడ పేర్కొన్న సంగతులకీ, పెట్టిన శీర్షికకీ పొసగలే దనిపిస్తుంది. “కుట్ర” అనగానే, “ఎవరు, ఎక్కడ, ఎలా?” అన్న ప్రశ్నలకి జవాబు వ్యాసంలో దొరుకుతుందని అనిపిస్తుంది గానీ ఆ కుట్ర అన్న పదమే గాక కారణాల గురించి గానీ కర్తల గూర్చి గానీ ఇందులో కనిపించలేదు. ప్రేమగా నెమరేసుకున్న గతమూ, మారిపోయి కనిపిస్తున్న వర్తమానాన్ని గూర్చిన వేదనా మాత్రం ప్రస్ఫుట మయ్యాయి.
శివకుమార్ గారూ,
నిజమేనండి. నాకది కుట్రో కాదో తెలియదు. కుట్రే అయితే ఎక్కడ ఎవరు చేస్తున్నారో కూడా తెలియదు.
తెలిసిందల్లా గతానికీ, వర్తమానానికీ తేడా మాత్రమే. అదే చెప్పదలచుకున్నాను.