సుషుప్తికీ స్వప్నానికీ నడుమ
శపించిన కాలమొకటి
కనులెంత మూసినా
రెప్పల తాళం పడనివ్వదు
పగటికి చితిపేర్చి
రేయిలో ఇమిడి
సేదతీరాలని ఉన్నా
మనోవీధిలో దిగిన ముళ్ళకు
నిదురంతా రుధిరమౌతూ ఉంటుంది
అంతు తెలియని అలసట
ఆగని కాలాన్ని శపిస్తున్నా
రెప్పలు వాలని నిశిలో
గుండుసూదై గుచ్చుకుంటుంది
నిశ్శబ్ద శూన్యమేదో మనసుకంటి
మౌనవించిన అనన్య వేదనంతా
రాని నిద్రకు జోల ఎలా పాడాలంది.
రేయి గడిచాక.. పగలు వచ్చాక
వెలుగు చినుకు పడి
వాస్తవరేఖని లిఖించింది.
రెప్పల తలుపులు గడియపడకుండా
ఈ రేయి గడిచింది
మరో రేయి మొదలైంది
తలపులనిండా వదలని ఆ నీడ
అన్వేషించినా తెలియని జాడ
*****
2
ఆవాహనం
నాదంతా నిష్ప్రయోజన నిరీక్షణమే
ఎన్నెన్ని సుదీర్ఘ పగళ్ళు వెతికానో
ఎన్ని నిర్నిద్ర రాత్రులు వేచానో
గగనతలంలో నక్షత్రాలకే ఎరుక
కళ్ళను దివిటీలు చేసి నీకై
మనసంతా యుగాలు వేచాను
నువ్వు అత్తిపత్తి ఆకువై ముడుచుకుంటావు
నా కళ్ళ కొలనెప్పుడూ ఎండి పోదు
పెదవి దాటని మాటలెన్నో
గుండె మాటున గండి పడ్డా
ఆరని ఆశలన్నీ పెదవిపై స్వారీ చేస్తూ
నన్ను నాకు ఇవ్వాలని చూస్తుంటాయి
కల్లోల కొలిమి
అణువణువునూ దహనం చేసినా
సానుకూల దృక్పథం
ప్రతికూలతని తిప్పి కొడుతూనే ఉంది
నీకివన్నీ అర్థం కాని పదాలే
నావన్నీ వ్యర్థప్రయాసలే!
ఏ అనురాగబంధం అనన్య ప్రేమని
నామనసుకిచ్చిందో..!!
మనిషిలోని మనసుని వేరుచేసే
మరయంత్రానివి కమ్మని ఆజ్ఞాపించకని
ఒక్కొక్క క్షణానీకీ విన్నవిస్తున్నా..
మనం పల్లవించేలా
నాలోని నన్ను నీలోకి
నీలోని నిన్ను నాలోకి
ఆవాహనం చేయమని..
Add comment