నిశ్శబ్దంలో కూడా వినలేని మన గుండె చప్పుడు   

మధ్య రాధేయ గారు అజేయుడు అన్న పేరుతో ఒక స్మృతి కవిత ప్రచురించారు. ఈ ప్రక్రియని ఇంగ్లీషులో ఎలిజీ (Elegy) అంటారు. a formal and sustained lament in verse for the death of a particular person, usually ending in a consolation (A Glossary of Literary Terms by Abrams & Harpham). రాధేయగారు డెబ్బయ్యేళ్ళ వయసులో తన కొడుకును కోల్పోయిన దు:ఖంలోంచి వచ్చిన కావ్యం ఇది. నాకు ఈ సమయంలో నాయని సుబ్బారావు గారు గుర్తుకువస్తున్నారు. ఆయన విషాదమోహనం గుర్తుకువస్తోంది. “అదవదపడు గుండెలోతులందుండి యాగక యుబికి,  వదలక రూపమ్ము కట్టు పద్యాల బరువులో నీవు; పదిమాటలికనేల బ్రదుకు సర్వమ్ము ప్రతిపదమ్మిట్టులదయుడా నీమయమ్మయ్యెరా యూపిరాడదు నాకు” అన్న వాక్యాలు ఎంతో ప్రేమగా చదివినప్పుడు కలిగిన విషాద క్షణం కళ్ళ ముందుకు వస్తుంది. నాయని సుబ్బారావు గారు కూడా తన కొడుకుని కోల్పోయిన సందర్భంలోనే విషాదమోహనం రాశారు. ఆ కొడుకు పేరు మోహనకృష్ణుడు (1933-1968); ఇప్పుడు ఉమ్మడిశెట్టి సతీష్ కుమార్ (1982-2024) వంతు. అంతే తేడా.

అనేక రకాలుగా ఉన్న ఈ స్మృతి కావ్య ధోరణిలో సుతాదికస్మృతి (పిల్లక మరణానంతరం వ్రాసినది) ఒకటని సినారె తన పరిశోధన పుస్తకంలో చెప్పారు. దువ్వూరి వారికి భార్య, పిల్లల వియోగాలు వెనువెంటనే జరిగినట్టు చెబుతారు. ఆయన తన శిశువియోగం లో ‘పూవురాలిన చిరు పిందెపూపయైన అంటుకొనియుండునన్న పేరాసనుంటి’ అన్నట్లు రాధేయ కూడా భార్యను, కొడుకును వెనువెంటనే కోల్పోవలసి వచ్చింది. తన భార్యావియోగంలో కుందుర్తి ‘హంస ఎగిరిపోయింది’ మనందరికీ తెలిసిందే. రాధేయ ‘సత్యారాధేయం’ రాశాడు.

కన్న తండ్రుల కళ్ళ ముందే కొడుకులు వెళ్ళిపోవడం అత్యంత బాధాకర విషయం. కొడుకులు అని ప్రత్యేకంగా చెప్పడంలో ఆడపిల్లల్ని తక్కువ చేయట్లేదు కానీ, వీడు నా ఇంటి పేరు, వీడు నా వారసుడు లాంటి విషయాలు మన కుటుంబాల్లో లేవనుకోవడం హిపోక్రసీ అవుతుంది. ఆడపిల్ల చనిపోతే అత్తగారింటికి మాత్రమే తీసుకెళ్ళి తదనంతర కార్యక్రమాలు చేయాలని పట్టుబట్టిన మహానుభావుల్ని మనం చూసే ఉంటాం. ఏది ఏమయినా కన్న పిల్లల్ని పోగొట్టుకున్న బాధని వర్ణించడం సాధ్యం కాదు. అసలు ఏ బాధ మాత్రం అక్షరాలకు తలొగ్గుతుంది ? అక్షరాలు నిమిత్తమాత్రమైనవి. గుండెలపై ఎత్తుకుని ముద్దాడి చదువు చెప్పించి ప్రయోజకుణ్ణి చేసి వాడి ఇంట్లో ఆరుబయట కూర్చుని సేదదీరాలనుకునే తండ్రి వాణ్ణి విగతజీవిగా చూడాల్సి వస్తే ఆ దు:ఖం ఎన్ని ఎలిజీలకు కవిత్వాంశం కాగలదు ?

ఎన్ని గాయాల్ని భరించగలదు ఈ దేహం ? 

ఈ పిడికెడంత గుండె ఎన్ని రక్తపోట్లను తట్టుకోగలదు చెప్పు ? (24)

*

సతీష్ 

నాకంటే నీకు మీ అమ్మే ఎక్కువైందా ? 

పై లోకాన ఇద్దరూ కలుసుకున్నారు 

ఒక్కటై కలసిపోయారు 

నేను మాత్రమే శాపగ్రస్తుణ్ణి 

ఇలా ఒంటరిగా మిగిలిపోయాను (14)

రాధేయ చాలా బలమైన కవి. మానవ జీవన ఎత్తుపల్లాలను అతని రచనలు చాలా సున్నితంగా ప్రకటిస్తాయి. మగ్గంబ్రతుకు వంటి దీర్ఘ కావ్యంలో నేతకార్మికుల స్థితిగతుల్ని ఎంత సహజంగా చిత్రించారో సాహిత్య లోకం మొత్తానికీ పరిచయమే. నిజానికి ఈ ‘అజేయుడు’ కావ్యం వ్యక్తిగత దు:ఖం. కానీ దీన్ని విశ్వజనీనం చేసేందుకు ప్రయత్నించిన పద్దతి గమనించదగ్గది. ‘కష్టంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదు’ ‘యవ్వనోద్రేకపు ఆదర్శాలు జీవితాంతం కొనసాగవని గుర్తుంచుకోవాలి’ వంటి వాక్యాలు తన దు:ఖం మరొకరికి ఏం చెప్పదలుచుకుందో ప్రత్యేకించి వివరించనక్కర్లేదు. నాకిప్పుడు ఓదార్పు కన్నా ఒంటరితనమే కావాలి. పలకరింపు కన్నా ఏకాంతమే కోరుకుంటాను అనడంలో కూడా రాధేయ తన దిగుల్లోనూ చుట్టూ ఉన్నవాళ్ళని, వాళ్ళ భావోద్వేగాల్ని, వాటి ప్రభావాన్నీ చాలా శక్తివంతంగా అంచనా కడతాడు. పాఠకుడి క్షేమాన్నీ మర్చిపోలేదన్నది నేను చెప్పదలుచుకున్నాను. కవిత్వస్పృహని ఆత్మాశ్రయ రీతిలో నిర్వహించే రచనల ప్రభావానికి వివరణ అనవసరం. అయినప్పటికీ రాధేయ ఈ కవితలో ఒక సామూహిక లక్షణాన్ని పొందుపరిచాడు. చదివిన ప్రతి ఒక్కరూ అతగాడెవరో మన ఇంట్లోనే చనిపోయాడా అన్నంత వేదనకి గురిచేస్తాడు. ఇంకొకరి బిడ్డ మనవాడెందుకయ్యాడు ? అని ఆలోచిస్తే అసలు విషయం తెలుస్తుంది. సతీష్ బాల్యాన్ని తల్చుకుంటూ రాధేయ పందిళ్ళపల్లిలో ఆ పిల్లాణ్ణి ఎత్తుకున్న అనేకమందిని గుర్తుకుతెచ్చుకుంటాడు. హెడ్మాస్టర్ డేనియల్, వెంకట సుబ్బన్న మేష్టారు ఇలా అనేక మంది పేర్లు వస్తాయి. వాళ్ళలో మనమూ ఒకరమై గుండెల్ని తప్పక తడుముకుంటాం.

రాధేయ ఉమ్మడిసెట్టి అవార్డు వ్యవస్థాపకుడు. భద్రుడు గారు ఒక చోట ‘శ్రీకృష్ణదేవరాయలు అని అనవలసి ఉంటే రాధేయ లాంటి వ్యక్తినే అనాలి. తాను కవి అయిఉండి గత ముప్పై ఏళ్ళుగా ఎందరో కవులకు గండపెండేరాలు తొడుగుతున్నందుకు’ అని అంటారు. ఇంకా చాలా మంది ఆయనపై ఎన్నో పొగడ్తలు కుమ్మరిస్తారు. అతని వ్యక్తిత్వమూ, సాహిత్య సేవ, కార్యకర్తృత్వమూ అలాంటివి. సాహిత్యప్రపంచానికి కొత్తతరాన్ని పరిచయం చేయడంలో రాధేయ పాత్ర చాలా ఉంది. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, అలాంటి రాధేయ సాహిత్య సేవలో పిల్లల ఆలంబన ఉంది. అందుకే ‘అమ్మ లేదని బాధ పడొద్దు నాన్నా నీ కవిత్వానికి నేను తోడున్నాను’ అన్న కొడుకు సతీష్ ని రాధేయ చాలా ఆర్దృంగా తలుచుకుంటాడు. ‘మా ఉమ్మడిశెట్టి పురస్కార రథచోదకులు ఈ త్యాగమూర్యులే’ అని భార్యా పుత్రుణ్ణి తలుచుకుంటాడు. కొడుకులేకుంటే తన అవార్డు తనను బ్రతికించదని తేల్చి చెబుతాడు. ఎవర్ని ఎవరు బ్రతికిస్తున్నారు ? మనకి పిచ్చితనం అనిపిస్తుంది కానీ ఈ బ్రతుకు తన గురించి టీకా తాత్పర్యం రాసేందుకు ఏ ఇజానికి అవకాశమిస్తుంది ? ఈ కావ్యాన్ని నేనిప్పుడు ఏ సర్రియలిజం, ఎగ్జిస్టెన్షియలిజం, లేదా సింబాలిజం, మార్క్సిజం లాంటివాటితో వివేచన చేయగలను ? కుటుంబ సభ్యుల మధ్య, అందునా పిల్లలతోగల ఉద్వేగాల సంఘర్షణ వ్యక్తిగత మూర్తిమత్వంపై కుటుంబానిగల ప్రభావం అంటాడు ప్రముఖ మానసిక శాస్త్రవేత్త మ్యాక్కిన్నాన్ (1950). సతీష్ ని పెంచడంలో ఉన్న అనేక విశేషకాలను ఈ కావ్యం ఆవిష్కరించింది.

సతీష్ మరణంతో చాలా పోరాడి తనువు చాలించాడు. అందుకే రాధేయ తనని తాను సగటు మనిషిగా చెప్పుకుని పుత్రుడిది మాత్రం వీర మరణం అంటాడు. ఈ కవిత్వమంతా కన్నీటికి తడిలేదంటాడు కానీ ఒక్కో వాక్యం మనల్ని ఒక్కో కన్నీటి సముద్రం చేస్తుంది. తన కొడుకు గురించి అతని మిత్రులు చెప్పే మాటల్ని సైతం రాధేయ కవిత్వంలోకి ప్రవేశపెట్టడం మనల్ని కవిత్వతీరం నుండి వాస్తవిక ప్రపంచంలో శిలను చేసి నిలబెడుతుంది.

ఎలిజీల ప్రయోజనం ఏమిటి ? ఈ పుస్తకం మొత్తం చదివాక మాత్రమే కాదు, ఇంగ్లీషులో వున్న ది వాండరర్, ఓడ్ టు మెలాంఖలీ, ఇంకా విట్మాన్, మిల్టన్, షెల్లీ, టెన్నిసన్ వంటివారి రచనలు అనేక వాటిని తెలుసుకున్నాక వీటి ప్రయోజనం తెలియజెప్పడం కష్టం అనిపిస్తుంది. బాధని అక్షరబద్దం చేశాక శోకం ఉపశమిస్తుందా ? గొల్లపూడి మారుతీరావు గారు ఒకప్పుడు ‘స్మృతి ఒక నివాళి’ అన్న వ్యాసం రాశారు. అది చదివాక విజయనగరంలో గురజాడ ఇల్లు, స్టాంఫర్డ్ లో షేక్స్పియర్, అరుణాచలం వద్ద చలం సమాధి వంటి వాటి విలువ తెలిసివచ్చింది. మనం ఇష్టపడే మనుషుల్ని మర్చిపోవడం అసాధ్యం. మారుతీరావు గారు తన ‘మారుతీయం’ లో వాసు స్మృతులు అని తన కొడుకు, వర్ధమాన చిత్ర దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్ చనిపోయినప్పుడు ‘ఒక ఆర్తి’ అనే పేరుతో అద్బుతమైన కవిత రాశారు.

ఏదీ ఆశను ప్రోత్సహించడం లేదు 

ఎవరిమాటా వినాలనిపించదు 

ఏ సానుభూతి అయినా తిట్టు లాగా వినిపిస్తోంది 

అందర్నీ వదిలి పారిపోవాలని ఉంది 

26 ఏళ్ళ జ్ఞాపకాల్ని ఒక్క చోట పోగు చేసుకుని 

మళ్ళీ జీవించాలనుంది 

 

వాసూ – 

యిలాంటి రోజు వస్తుందని తెలిస్తే 

ప్రతి అనుభవాన్నీ ఎంతో పదిలం చేసుకునే వాడిని 

ప్రతి సామాన్య సంఘటనా ఎంత అమూల్యమైపోయింది 

కాలంలో ఈ లోపం ఎలా భర్తీ అవుతుంది 

ఎన్నాళ్ళు నువ్వు లేని ఈ లోకంలో యింకా బ్రతకాలి (గొల్లపూడి) 

ఇందులోని 71 వ కవిత కూడా ఇలానే మనల్ని తప్పక కదిలిస్తుంది. బసవరాజు అప్పారావు, ఆచార్య ఎన్ గోపీ తమ కూతుర్లు చనిపోయినప్పుడు కూడా కవితలు రాశారు. పోలిక తేవడమే అసమంజసం గానీ 75 కవితల రాధేయ ‘అజేయుడు’ కవిత వేటికి తీసిపోని విధంగా ఉంటుంది. పంచుకునే దు:ఖానికి పోటీ ఏమిటి ? పిచ్చికాకపోతేను ? అయితే వాళ్ళ దు:ఖం మన మీద ఎందుకు చెరగని ముద్ర వేస్తుంది ? అన్ని దు:ఖానుభవాలూ ఒకటి కాదని ఎలా తెలుస్తుంది ?

దేనికైనా కొలమానాలుండవచ్చు. పోటీ ప్రపంచంలో వ్యక్తులక్కూడా దాన్ని వర్తింపజేసి అంకెల్లోకి మార్చవచ్చు. స్మృతి కవితల్ని ఏది బాగుంది ఏది బాలేదు ? ఏది గొప్ప ఏది కాదు? అని బేరీజు వేద్దామనుకున్నప్పుడు నా అమాయకత్వం నాకు తెలిసి వచ్చింది. మా సాహితీ మిత్రుడు సుంకర గోపాల్ స్మృతి కవిత్వం పై పరిశోధనా గ్రంథం వెలువరించాడు గానీ అందులో ఏం రాసి ఉంటాడా అన్న ఆసక్తి ఇప్పుడు మొదలయ్యింది నాకు. పరీక్షకుడి పరిజ్ఞానంలోంచి స్మృతిని అర్థం చేసుకోవడం ఎంత కష్టసాధ్యమైన పని ? నాకు గంభీరమైన నవ్వు వచ్చింది. ఎందుకంటే రాధేయ ‘నా అక్షరాలు మీకు గజిబిజిగా, తడి తడిగా, ముద్ద ముద్దగా, అలుక్కుపోయి కనిపిస్తున్నాయా ? అవి భయంలోంచీ, దు:ఖంలోంచీ, వియోగంలోంచీ, సొమ్మసిల్లిన శోకంలోంచీ ముంచి తీసినవేనని గమనించగలరు’ అన్నప్పుడు; ఈ స్మృతి కవితల్లో శిల్పం, శైలీ అనే వివేచన చేయడానికి మనసు నిరాకరిస్తోంది. అది ఉదాత్తమా, సంవాద,తాత్విక,అస్పష్ట, ఇంకా రకరకాల శైలీ భేదములలో ఏది సబబైనదీ అన్న తర్కం ఉత్త వ్యర్థమనిపిస్తోంది. యూ ఏ నరసింహమూర్తి గారు తన ‘తెలుగు వచన శైలి’ పుస్తకంలో ఒక చోట ‘రచన ముగిసినా తాను చెప్పదలుచుకున్నది ఇంకా ఏదో చెప్తూ రచయిత మనను వెంటాడుతుండటం చరమ శైలిలో ఒక లక్షణం అంటాడు. ఇంకా ‘వాస్తవానికి అనుకూలంగా కళ తన హక్కులను వదులుకోకుండా ఉండటమే ఆ శైలి’ ప్రత్యేకత అంటాడు. దాని సత్యాసత్యాలు తవ్వితీయను గానీ, రాధేయలోని జీవితపు ఆద్యంత అనుభవాత్మక స్థితి ఈ కవిత్వ శైలిలో మనం గమనిస్తాము. రాధేయ గారి ‘అజేయుడు’  ప్రముఖ హిందీ కవయిత్రి సుభద్రాకుమారీ చౌహాన్ గారి  ‘పుత్ర వియోగ్’ కవితను గుర్తుకు తెస్తుంది అంటారు ప్రముఖ సాహితీవేత్త తూముచెర్ల రాజారాం. సతీష్ స్మృతిలో ఎంత సాహిత్య పరిజ్ఞానం తెలిసివచ్చింది ? ఇది నాకు సంతోషం కలిగించడం లేదు. ‘రాధేయుణ్ణి కదా నాకు వరాలుండవు అన్నీ శాపాలే’ అన్న రాధేయ కవితా వాక్యమే వెంటాడుతోంది.

చెన్నైలో అతను పనిచేసిన కంపెనీ గురించి ఆ ఇల్లు ఖాళీ చేయడం గురించీ రాధేయ రాసిన పద్యం మనసుని మెలిపెడుతుంది. ఆ కంపెనీలోని మేనేజర్, అద్దెకున్న ఇంటి ఓనర్ల ప్రస్తావన, ఆ ఇంటి పొరుగున ఉన్న బాలూ, ప్రియా ఇలా అన్ని సందర్భాలలో మనుషుల ప్రస్తావన మనసుని వికలం చేస్తుంది. ఆ ఇల్లు ఖాళీ చేశాక ఒక తమిళ స్త్రీమూర్తి ఇంట్లో ఆమె పసి మనవణ్ణి చూస్తాడు. ఒక రోడ్డు ప్రమాదంలో ఆ పిల్లాడి తల్లితండ్రులు మరణిస్తారని మనకు చెబుతాడు. వాణ్ణి చూసిన దు:ఖంలో ‘ఆ పిల్లవాణ్ణి చూసి గట్టిగా పట్టుకుని ఏడ్చాను. పదివేల రూపాయలు చేతిలో పెట్టి వాణ్ణి నా హృదయానికి గట్టిగా హత్తుకున్నాను. ఏమీ అర్థం కాని వాడు అమయాకంగా నన్ను ఎగాదిగా చూశాడు. ఎవరీయన ? అన్నట్టుగా తన అమ్మమ్మవైపు చూశాడు’ అని ఆఖరి పద్యం ఉంటుంది. రాధేయ ఆ పిల్లాడి చేతిలో పదివేలుంచిబట్టు విలువకట్టలేని ఈ ‘అజేయుడు’ పుస్తకాన్ని మన చేతిలో పెట్టాడు. మనం దీన్ని చదివేశామనుకున్న తర్వాతి క్షణం ఎవో ఆ పసివాడిలా వెర్రి చూపులు తప్పక చూస్తాం. పోయినవాళ్ళు గుర్తుకు వస్తారు కామోసు; లేదా ఉన్నవాళ్ళలో పోయిన వాళ్ళ ముఖాలు కనిపిస్తాయనుకుంటున్నాను. మనం మనుషులతో ఎలా ఉంటున్నామో ఎలా ఉండాలో కొంత లోలోపల ఏదో సుడి రేగుతుంది. రేగి రేగి మనల్ని అందులో ముంచి లేపుతుంది. బహుశా అందుకే సతీష్ పేరిట రాధేయ నెలకొల్పిన యువపురస్కారం పొందిన మానస చామర్తి ‘ఈ పుస్తకం చదవలేని దు:ఖం’ అన్నారు. నేను దీన్ని ‘నిశ్శబ్దంలో కూడా వినలేని మన గుండె చప్పుడు’ అనదలుచుకున్నాను.

అజేయుడు (కవిత్వం) : రాధేయ, పేజీలు: 112, ప్రతులకు: ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్టు 9985171411 

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు