అలా ఒక ఆఖరి ముట్టు
అప్పటికే అనేక వ్యోమోగాములు అక్కడ పాదం మోపారు
అది అనంత సంఖ్యారాశిని మింగిన మృత్యుబిలంగా అగుపించింది కొందరికి
వెంటనే అందులో దూకి నెత్తురు తాగి మరణించారు.
కాలాల కొద్దీ భవిష్యత్తునే వెతుక్కుంటున్న దేహాలు కొన్ని
వైవిధ్యాన్ని తట్టుకోలేక
వాస్తవిక యుద్ధాలలోని అసమర్ధతతో
అక్కడ తమను సజీవంగా సమాధి చేసుకున్నాయి
ఎందరో అక్కడ చచ్చిన రక్త కణాల మరకలని వెదికారు
జీవ నదిలో కళేబరాలు నిలవవని తెలీక
ఆ వేడి సొనల్లో పడి బూడిదయ్యారు
నిశ్శబ్దాల ఉప్పెనలు ఉత్పాతాలుగా మారినప్పుడల్లా
అదృశ్యంగా గట్టును తెగనివ్వని మార్మికత
ఎప్పటికప్పుడు ఆశ్చర్యాన్ని పుట్టించేదే
మోహం కన్నా మాయ అసాధ్యమైనది
అయినా మోహపు మాయలో మృత్యువొక చిరునవ్వు
అలా నిగూడంగా ప్రవహిస్తున్న నదిని ప్రేమిస్తూ
ఎప్పటిలాగే నాలోని ఆంతరంగిక శత్రువుతో
ప్రవహిస్తున్న నదిలో ప్రవహిస్తూ…
*
పెయింటింగ్: సత్యా బిరుదరాజు
Add comment