నిర్మలానందతో నా ప్రయాణం

అందరూ ఆయన్ని పని రాక్షసుడు అంటారు- నిజమే టేబుల్ ముందు కూర్చుంటే గంటల తరబడి రాస్తూనే ఉండేవారు. ఎటొచ్చీ కాగితాలన్నీ మనం జాగ్రత్తగా ఏరుకుని లైనులో పెట్టుకోవాలి.

న జీవన ప్రయాణంలో అనేకమంది వ్యక్తులు పరిచయమవుతారు. వారిలో కొందరు మాత్రమే మనల్ని ప్రభావితం చెయ్యగలుగుతారు. అందుకు కారణం వారిలో ఉన్న ప్రత్యేకత ఏదో మనల్ని ఆకర్షించి ఆకట్టుకుంటుంది. వారిలాగే ఉండాలని మనమూ ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం అన్ని సమయాల్లో అందరికీ సఫలం కాకపోవచ్చు. ఆ వ్యక్తిలో మనల్ని ఆకట్టుకునే ఆ ప్రత్యేక గుణానికున్న శక్తి తీవ్రతనుబట్టి మనమీద ఆ సాధ్యాసాధ్యాల ప్రభావం ఉంటుంది.

అలాగే ప్రతి మనిషిలో ఏవో శక్తులు నిగూఢంగా దాగి ఉంటాయి. అవి అంత తేలిగ్గా బయటపడవు. ఏదో ఒక అద్భుతం జరిగినప్పుడో, తీవ్ర సంకల్పం కలిగినప్పుడో అవి బయటికి వస్తాయి. ఆ వ్యక్తి స్వరూప స్వభావాలనే మార్చివేస్తాయి. అందుకే సామాన్యమైన వ్యక్తులు అసామాన్యమైనవారిగా రూపుదాల్చటం అరుదుగానే అయినా మనం చూస్తూనే ఉంటాం.

***

ఇదంతా ముప్పన మల్లేశ్వరరావు అనే సామాన్య సాహిత్యజీవి, సామాజిక బాధ్యతను తలకెత్తుకున్న నిర్మలానంద అనే అసాధారణమైన వ్యక్తిగా రూపాంతరం చెందిన వైనం గురించి చెప్పటానికే.

నిర్మలానంద గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టాలి? ఎన్ని చెప్పినా, ఎంత రాసినా ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించగలనా? ఆయన నన్ను ప్రభావితం చేశాడా లేక ప్రారంభదినాల్లో నేనాయన్ని ప్రభావితం చేశానా? ఒకరకంగా రెండూ సత్యాలే! తొలుత నాలోని ఉత్సాహాన్ని ఆయన అంది పుచ్చుకున్నాడు, ఆ వయసులో సైతం. ఆ తర్వాత ఆయన ప్రభావంలోకి నేను వెళ్లినా తన వేగాన్ని మాత్రం అందుకోలేకపోయాను.

ఇది 48 సంవత్సరాల కథ. 1977 ఫిబ్రవరిలో బ్యాంకు ఉద్యోగం చెయ్యటానికి వెళ్లినప్పుడు విజయనగరంలో మొదలైన కథ. నిష్టల వెంకటరావు ద్వారా పరిచయమైన 21స్ట్ సెంచరీ రైటర్స్‌కి వచ్చిన ఆహ్వానం మేరకు జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య ఏర్పాటులో భాగంగా ఆగస్ట్ నెలలో మంగళగిరిలో జరిగిన సన్నాహక సమావేశానికి వెళ్లటంతో ముందుకెళ్లిన కథ. విజయనగరపు గురజాడ గాలి తగిలి, ఆ బొంకులదిబ్బ చుట్టూ తిరుగుతూ, రంగనాయకమ్మగారి సంపాదకత్వంలో అప్పుడే మొదలైన ప్రజాసాహితి పత్రికను ప్రచారం చేస్తూ, చందాలు కట్టిస్తూ, కరపత్రాలు పంచుతూ, వాల్‌పోస్టర్లు అతికిస్తూ, పాఠకుల సమావేశాలు నిర్వహిస్తూ, తిరుగాడిన రోజులు. ఆ వెంటనే 1978 జనవరిలో జరిగిన జనసాహితి మొదటి మహాసభకు హైదరాబాదు వెళ్లటం, ఆ ఉత్సాహంతో జనసాహితి విజయనగరం శాఖ ఏర్పాటుకోసం ప్రయత్నాల్లో ఉండగా కొత్తపల్లి రవిబాబుగారు ఇచ్చిన ఆచూకీతో నిర్మలానందతో ఉత్తరాల పరిచయం పెంచుకోవటం, మళ్లీ 1979 జనవరి వచ్చే నాటికి విజయనగరంలోనే జనసాహితి రెండో మహాసభకు కన్వీనర్‌గా సభలు నిర్వహించటం, దానికి నిర్మలానంద రావటం- అలా తెలియకుండా గడిచిపోయిన కాలంలో, అప్పటికే ప్రసిద్ధులైన రచయితలు జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, రంగనాయకమ్మ, ఓల్గా, భూమన్‌ల పరిచయాల కోలాహలంలో నా 24వ ఏటనే జనసాహితి కార్యవర్గ బాధ్యతల్లో పడ్డాను.

సరిగ్గా ఇక్కడే మొదలైంది నిర్మలానందతో నా ప్రయాణం. అప్పటికే ఆయనకు 43 సంవత్సరాలు. 1980 ఫిబ్రవరి నెలలో సంపూర్ణ సూర్యగ్రహణంరోజు నిర్మలానందని కలవాలని, కలిసి సాహిత్యోద్యమంలో భాగం కావడానికి వీలుగా జనసాహితి సంస్థలో చేరమని అడగటానికి విజయనగరం నుండి ఎస్. కోటకి వెళ్లాను. ఆనాటి నా అజ్ఞానం నాకు ఇప్పటికీ నవ్వు పుట్టిస్తూనే ఉంటుంది. నేను అప్పుడే సాహిత్యంలో ఓనమాలు దిద్దుతున్నవాడిని. ఆయన అప్పటికే లబ్ధప్రతిష్టుడు. ఆయనకు సాహిత్యంలో పాతికేళ్ల అనుభవం ఉంది. ఒరిస్సాతో తెలుగు సాహితీసంస్థను నడిపిన అనుభవమూ ఉంది. తెలుగు కథలను ‘యుగప్రభాత్’, ‘ధర్మయుగ్’ వంటి పత్రికల్లో అనువాదాలు చేస్తున్నారు. రెండేళ్లుగా వస్తున్న విపుల మాసపత్రికలో వివిధ భాషల నుండి తెలుగులోకి అనువాదం చేసిన డజనుపైగా కథలు రకరకాల పేర్లతో అచ్చయ్యాయి. ప్రముఖ మలయాళీ రచయిత కేశవదేవ్, సంపాదకుడు రవివర్మ నుండి ప్రేమ్‌చంద్ గురించి నడిచే నిఘంటువుగా పేరున్న కమల్ కిషన్ గోయంకా, ప్రముఖ హిందీకవి దినకర్, ఉర్దూకవి షంషుల్ ఇస్లాం వంటి గొప్ప రచయితలు ఆయనకు మిత్రులు. ఇదంతా ఆరోజే ఆయన మాటల్లో అర్థమయింది. ఇవేవీ తెలియని నేను అన్నీ తెలిసిన ఆయనకు చెప్పబూనటం అజ్ఞానం కాక మరేమిటి? అయినా నా అజ్ఞానాన్ని పట్టించుకోకుండా నా ఉత్సాహాన్ని చూసి ముచ్చటపడి జనసాహితిలో చేరటానికి అంగీకరించారు. ఆ తర్వాత ఆయన వేగానికి నేను ముచ్చటపడి ఆయనతో పరిగెత్తే ప్రయత్నం చేశాను. అప్పట్నుంచి నిర్మలానంద జనసాహితిలో ముఖ్యభాగమయ్యారు.

1981లో ప్రజాసాహితి రెండు ప్రత్యేక సంచికలు ప్రచురించింది. ఆగస్ట్‌లో తెలంగాణ రైతాంగ సాయుధపోరాట ప్రత్యేక సంచిక ఒకటి; ప్రముఖ చైనా రచయిత లూషన్‌పై మరొకటి. మొదటిదానికి నేను, రెండోదానికి నిర్మలానంద ప్రత్యేక సంపాదకులు. ఈ రెండు సంచికలు తెలుగునేలపై సంచలనాలే. తెలుగు సాహితీలోకానికి అంతగా పరిచయం లేని లూషన్ సాహితీ విశ్వరూపాన్ని తొలిసారిగా వెలుగులోకి తెచ్చింది ఆ సంచిక. అక్కడ నుండి ఆయన దృష్టి గోర్కీపై పడింది. ప్రత్యేక సంచిక వచ్చింది. ఆ తరువాత పాలస్తీనా పోరాటం, వెంటనే భగత్‌సింగ్- ఇలా రెండు దశాబ్దాలపాటు ప్రజాసాహితి ప్రత్యేక సంచికలు వస్తూనే ఉన్నాయి. పనిలో మేం పోటీపడుతూనే ఉన్నాం.

భగత్‌సింగ్ పేరు చెప్తే తెలుగువారికి వెంటనే నిర్మలానంద పేరు గుర్తుకు రావలసిందే. భగత్‌సింగ్‌ని కేవలం రాజకీయ ఉద్యమకారుడిగానే కాక సాహిత్య పిపాసిగాను, స్వాతంత్ర్యపోరాటంలో ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచి ఉరికంబమెక్కిన త్యాగధనుడిగానే కాకుండా, ఆయన్నొక మార్క్సిస్ట్‌గా నిలబెట్టింది నిర్మలానంద ద్వారా వెలుగు చూసిన ఆధారాలవల్లనే. భగత్‌సింగ్ డైరీలు, సంభాషణలు, వ్యాసాలు మొదలైన ఆధారాలు సేకరించి తెలుగులోకి అనువదించారు. ఈ ఆధారాల సేకరణ కోసం ఉత్తరభారతంలో ముఖ్యంగా పంజాబ్‌లో విస్తృతంగా పర్యటించారు. అనేకమందితో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించారు. అంత సాధికారత ఉండబట్టే ఆయన సంపాదకుడిగా వెలువడిన ‘నా నెత్తురు వృధా కాదు’ అన్న భగత్‌సింగ్ జీవితచరిత్ర అన్నిసార్లు పునర్ముద్రణలు పొందింది, పొందుతోంది. ఆయన ఒక పని పట్టుకుంటే అంత తేలిగ్గా వదిలే రకం కాదు.

తెలంగాణ రైతాంగ పోరాటాన్ని, నిజాం దౌర్జన్యాలను కళ్లకు కట్టినట్టు చిత్రించిన బెంగాలీ చిత్రకారుడు చిత్తప్రసాద్ తెలుగువారికి ఆత్మీయుడు. ఆయన ఆరోజుల్లో దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన పోరాటాలను, బెంగాల్ కరువు విషాదాలను కూడా చిత్రించారు. చిత్రకారుడిగా ఆయనను అభిమానించేవారు తెలుగునేలపై చాలామందే ఉన్నారు. వారిలో ఆర్టిస్ట్ మోహన్, చలసాని ప్రసాదరావు ముఖ్యులు. 80వ దశకంలో చిత్తప్రసాద్ బొమ్మలన్నీ సేకరించి ఎగ్జిబిషన్ పెట్టాలని నేను, మోహన్, చలసాని ప్రసాదరావు ఆలోచన చేసాము. ఎగ్జిబిషన్‌కి అనుగుణంగా చలసాని ఆ బొమ్మలని పెద్దసైజు ప్రింట్లు వేయించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో నిర్వహించిన ఎగ్జిబిషన్‌కి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి చిత్రకారులు, అభిమానులు వచ్చి ఆదరించారు. అలా వచ్చినవారిలో నిర్మలానంద ఒకరు. ఆ ఎగ్జిబిషన్ చూసి ఆయన ముగ్ధుడైపోయాడు. చలసానిని అభ్యర్థించి, ఆ బొమ్మలన్నీ తీసుకుని జనసాహితి తరఫున ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు ఏర్పాటుచేసారు. సంస్థాగతమైన మిగిలిన అన్ని పనులు చేస్తూనే, అనువాదాలు కొనసాగిస్తూనే దాదాపు రెండేళ్లు ఆ ప్రదర్శన నిర్వహణలో తీరిక లేకుండా గడిపాడు. అంతేకాదు, ప్రతి సంవత్సరం జనసాహితి తరఫున చిత్తప్రసాద్ జయంతి సభ నిర్వహించడంతోపాటు ఆయన శతజయంతి సభ హైదరాబాదులో జరిపాడు.

1981 నుంచి 91 వరకు ప్రజాసాహితి సంపాదకుడిగా ఉన్న నేను, జనసాహితి సంస్థ నుండి తప్పుకున్నాక 91లో నిర్మలానంద సంపాదక బాధ్యతలు స్వీకరించి రెండు దశాబ్దాలకు పైగా దానికి దిశానిర్దేశం చేసి నిరాటంకంగా నడిపారు. ఒకవైపు సంస్థాగత కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు అనువాదాలు మానలేదు. ఒక్క ‘విపుల’ పత్రికలోనే ఆయన చేసిన అనువాద కథలు రెండు వందలకు పైగా వివిధ పేర్లతో అచ్చయ్యాయి. వాటిల్లో కొన్ని ఈ సందర్భంగా మూడు సంపుటాలుగా రావటం సముచితంగా ఉంది. అందరూ ఆయన్ని పని రాక్షసుడు అంటారు- నిజమే టేబుల్ ముందు కూర్చుంటే గంటల తరబడి రాస్తూనే ఉండేవారు. ఎటొచ్చీ కాగితాలన్నీ మనం జాగ్రత్తగా ఏరుకుని లైనులో పెట్టుకోవాలి. అంత మతిమరుపు మనిషి. పైగా చేతిరాత బ్రహ్మరాతే. అది కొందరికే అర్థమయ్యేది. అందుకే ఆయన్ని అమితంగా ఇష్టపడిన చలసాని ప్రసాదరావు, ‘మతిమరుపు నిర్మలానందస్వామి’ అనీ, గజిబిజిరాతల నిర్మలానందం అనీ ప్రేమగా దెప్పి పొడిచేవారు.

ఈ సందర్భంలోనే ఆయన వ్యక్తిత్వం గురించి, సంస్థలో ఒదిగిన తీరు గురించి చర్చించుకోవాలి. సాధారణంగా యవ్వనదశలో ఉద్యమాలపట్ల ఆకర్షితులయ్యి కొనసాగుతారు. అందుకు భిన్నంగా నిర్మలానంద జనసాహితిలో చేరింది తన నడి వయసులో. తరిమెల నాగిరెడ్డిగారు ఒక మాట అనేవారట. ‘How the Steel was tempered’ అని. అది నిర్మలానందకు పూర్తిగా వర్తిస్తుంది. రానురాను మార్క్సిజం పట్ల ఆయనకున్న విశ్వాసం ఉక్కు సంకల్పంగా మారింది. ఈ వ్యాసం ప్రారంభంలో చెప్పినట్లు మామూలు సాహిత్యజీవి తనలో నిగూఢంగా ఉన్న శక్తులన్నీ మార్క్సిజం ఆలోచన ప్రేరణగా ఒక్కసారి జూలు విదిల్చి తాండవం చేశాయి. చివరంటా అచంచల విశ్వాసంతో ఉద్యమంలో కొనసాగేలా చేశాయి. అందుకు ఆయన వ్యక్తిత్వం కూడా కారణం. ఏ విషయమైనా వ్యక్తి కేంద్రంగా కాక, సమూహ కేంద్రంగా ఆలోచించటం వల్లే అది సాధ్యమయింది.

ఉద్యమ పనుల్లో ఇంత మునిగిపోయిన ఆయన కుటుంబాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యలేదు. అనారోగ్యంగా ఉండే భార్యను అపురూపంగా చూసుకున్నారు. పిల్లలంటే ఎడతెగని ప్రేమ. నేను హైదరాబాద్ వచ్చాక కుటుంబసమేతంగా అరకు వెళ్లి అటు నుంచి ఎస్. కోటకు వెళ్లి ఓ రోజంతా ఆయన ఇంట్లోనే ఉన్నాం. ఆ రోజంతా మా పిల్లలిద్దర్నీ భుజాల మీదెక్కించుకుని అలుపెరగకుండా ఆడుతూనే ఉన్నాడు. బహుశా పిల్లల మీద ఉన్న ఆ ప్రేమతోనే కావచ్చు ప్రజాసాహితి పత్రికలో పిల్లల కోసం ప్రత్యేక శీర్షికను నడిపాడు, చంద్రశేఖర ఆజాద్ సహకారంతో. ఒక ఉద్యమ సాహిత్య పత్రికలో ఇది అరుదైన విషయమే. వారి బంధువులెందరున్నా ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంట్లోనే ఉండేవారు. ఉన్నన్ని రోజులు నాతో కంటే పిల్లలతో ఎక్కువ గడిపేవారు.

ఉద్యమంలో పరిచయం అయినా, కౌటుంబిక సంబంధాలు ఆత్మీయంగా కొనసాగాయి.

విప్లవ ఆత్మీయత పెనవేసుకున్న అనుబంధం మాది.

*

వాసిరెడ్డి నవీన్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు