ఏ క్షణం ఉన్నానో
ఏ క్షణం లేనో
నాకే తెలియదు
ఎక్కడుంటే అక్కడ
నాకోసం నిరీక్షిస్తున్న వాటికి
నన్ను నేను
కొద్దికొద్దిగా పంచుకుంటూనే ఉంటాను
నన్ను తెలుసుకోవాలని అవి
వాటిని తెలుసుకోవాలని నేను
అస్పష్ట భాషలో
మాటాడుకుంటూనే ఉంటాం
ఇంకాస్త దగ్గరవడానికి
వస్తు మార్పిడిలా కాస్సేపటికి
ఒకరం ఇంకొకరం అవుతాం
శబ్దం చేయకపోతేనేం
నిశ్శబ్దంగానే అంతా
2
దొరికీ దొరకనపుడు
దూదిలా
చుట్టూ ఎగురుతూ
ఊరించే పదాలు
దొరికేవెన్నో దొరకనివెన్నో
అంత వేకువనే పక్షులు
కిటికీ దగ్గరసా వచ్చి
పోటీలు పడుతూ అరిచేవే
లేచి చూసేసరికి
మూకుమ్మడిగా ఎగిరిపోతున్నట్టు
కొన్ని
వేటికవే వేర్వేరు గూటిలో ఉంటున్నా
ఇతర పక్షుల అరుపులతో
జతకలుపుతూనే ఉంటున్నట్టు
మరికొన్ని
మంచులో కనుమరుగైన దృశ్యాల్లా
గుర్తుకుతెచ్చుకుంటున్నవి ఇంకెన్నో
అదే పనిగా
విన్నవే విననంటున్న చెవులు
చెప్పినవే చెప్పనంటున్న నోరు
రాసినవే రాయనంటున్న చేతులు
మూగవానిని చెవిటివాడు వింటున్నట్టు
తెలిసినవయినా కాకపోయినా
ఏ రోజుకారోజు సరికొత్తగా పదాలు
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
లలితంగా ఉన్నాయి కవనాలు…
ధాన్యవాదాలు ఆండీ
“నిరీక్షణలో”
చాలా ఉదాత్తంగా ఉంది. నిజానికి Big Bang
మొదలుకుని నేటి వరకూ మనం ఉన్నాము, తిరిగి
సృష్టిలోని ద్రవ్యరాశి/ పదార్ధం అంతా సంకోచించి
మరొక Big Bang కి సన్నద్ధమయే వరకూ, ఉంటాము.
కాకపోతే మన అస్తిత్వాలే వేరు… అస్తిత్వ సమయాలే
వేరు. అందులో భాగమే మనం ఒక రూపం నుండి
మరొక రూపంలోకి, లేదా ఒక అస్తిత్వం నుండి మరొక
అస్తిత్వంలోకి … వస్తు మార్పిడి… లేదా ఒలకడం
జరుగుతూ ఉంటుంది అనంతంగా… అది కూడా
నిశ్శబ్దంగా.
చాలా నిగూఢమైన తాత్త్విక విషయాన్ని బాగా చెప్పారు
ముకుంద రామారావు గారూ. అభివాదములు.
ధాన్యవాదాలు ఆండీ
అద్భుతంగా ఉంది సార్ కవిత్వం. నేను మీ ఇంటికి వచ్చాను గుర్తుపట్టారా సార్? నన్ను ఎంతో గౌరవంగా చూసుకున్నారు. మీ పుస్తకాలు ఇచ్చారు. ఆ హృదయత అనే పదానికి సరైన వ్యక్తి మీరే సార్.
ధాన్యవాదాలు ఆండీ