పాకిస్థాన్ లో జనరల్ జియావుల్ హక్ నియంతృత్వం పెచ్చరిల్లినప్పుడు, ఆ దమనకాండకు నిరసన వెల్లువెత్తిన వాతావరణంలో విప్లవ కవి ఫైజ్ అహమ్మద్ ఫైజ్ ఒక నజ్మ్(కవిత) ఎంతో ఆదరణ పొందింది. దాని మకుటం పేరు “హమ్ దేఖేంగే…” 1979లో జెడ్ ఏ భుట్టో ఉరితీత అనంతరం నాటి పరిస్థితులను అద్దంపడుతూ ఫైజ్ సాబ్ ఈ కవిత రాశారు. పాకిస్థాన్ కు చెందిన ప్రసిద్ధ గజల్ గాయని ఇక్బాల్ బానూ 1985 లో లాహోర్ స్టేడియం లో దీన్ని తొలిసారి పాడినప్పుడు అనూహ్య స్పందన వచ్చింది. “ఇంక్విలాబ్ జిందాబాద్” నినాదాలతో స్టేడియం మిన్నుముట్టింది. దానికి కారణం- జనరల్ జియావుల్ హక్ నిషేధించిన ఫైజ్ షాయిరీని బానూ నల్లని చీర ధరించి నిరసన గళంతో సాహసోపేతంగా బహిరంగంగా పాడడమే! ఇస్లామీకరణలో భాగంగా ముస్లిం మహిళలు చీరలు ధరించరాదంటూ జియా ఫర్మానా జారీ చేయడంతో అప్పట్లో ఈ పాట గొప్ప సంచలనమయ్యింది. ఆ తర్వాత ఫైజ్ అహమ్మద్ ఫైజ్ గజళ్ళు, నజ్మ్ లు బానూ పాడి ఆయనకు ఉన్న అంతర్జాతీయ ఖ్యాతిని మరింతగా ఇనుమడింప చేశారు.
నియంత జియా మార్షల్ పాలనను చీల్చి చెండాడుతూ ఫైజ్ తన నిరసనను దట్టించి తూటాల మాదిరిగా ఈ నజ్మ్ లోని పంక్తులను వదిలాడు. ఆ తర్వాత భారత్ ఉప ఖండంలో అనేక నిరసన ప్రదర్శనలలో ఈ కవిత ఆందోళనకారుల నాల్కల పై పల్లవించింది.
పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ఉత్తర భారతాన కొనసాగుతున్న ప్రదర్శనలలో ఇటీవల “హమ్ దేఖేంగే” కవిత పాడడం తీవ్ర వివాదాస్పదమయ్యింది. ఇందులో హిందూ దేవతా రూపాలను కించపరిచే పంక్తులు ఉన్నాయంటూ ఐఐటీ కాన్పూర్ లెక్చరర్ ఒకరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాన్ని కొందరు సమర్థించారంటే వారీ నజ్మ్ ను సరిగా అర్థం చేసుకోలేదని చెప్పాలి. పౌరసత్వ సవరణ చట్టం పై భారత ముస్లింలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఆందోళనలకు దిగడం, తమ నిరసనను వ్యక్తం చేయడానికి పొరుగున పాకిస్థాన్ కి చెందిన షాయర్ ఫైజ్ అహమ్మద్ ఫైజ్ కవితని ఎంచుకోవడం సంఘ్ పరివార్ శక్తుల అసహనానికి ఒక కారణం అయి ఉండొచ్చు. లేకుంటే వారు ఫైజ్ భుజాలపై తుపాకీ ఉంచి, భారత్ లోని ముస్లిం మైనారిటీలను టార్గెట్ చేస్తున్నారని భావించవచ్చు.
——————————
హమ్ దేఖేంగే….కవితకు ఇది అనువాదం
——————————
మేము చూస్తాం.
తప్పకుండా మేమూ చూస్తాం!
ఆ రోజున మాకిచ్చిన ఆ మాట కోసం
విధిరాతలో రాసిన దాని కోసం చూస్తాం!
పీడనల మేరువులు మీద పడినా
దూది పింజల్లా దూసుకెళ్తాం!
మా పదఘట్టనల కింద
భూమి నిలువునా కంపిస్తుంది.
పాలకుల నెత్తిన పిడుగులు పడతాయి.
అల్లా కాబా నుంచి
నియంతల విగ్రహాలన్నీ లేపేస్తాం.
మాకు మతోన్మాదులు అడ్డు తగిలినా
రాజ్యాధికారం అందుకుంటాం.
సామ్రాజ్యాలన్నీ పతనమవుతాయ్!
పతాకాలన్నీఅవనతమవుతాయ్!!
అదీ, మేము చూస్తాం.
తప్పకుండా మేమూ చూస్తాం!
ఆ రోజున మాకిచ్చిన ఆ మాట కోసం.
అల్లా పేరు అజరామరం
అది దృశ్యాదృశ్య గోచరం!
దృశ్యమూ ఉంటుంది, వీక్షకుడూ ఉంటాడు.
నేనే దైవం అనే ఆవాహన సాగుతుంది.
నేనూ ఉంటాను, నువ్వూ ఉంటావు.
ప్రజల దేవుడే పాలిస్తాడు.
నేనూ ఉంటాను, నువ్వూ ఉంటావు.
-అనువాదం: మెహక్ హైదరాబాదీ
Add comment