ధనికొండ హనుమంతరావు రచయితగా, పత్రికా సంపాదకుడిగా క్రిందటి తరంలో పేరిన్నికగన్నవాడు. 1940, 1950 దశకాలలో విరివిగా, 1960లలో అప్పుడపుడు రచనలు చేశారు. కథలు, నవలలు, నవలికలు, నాటకాలు, నాటికలు, అనువాదాలు–ఇలా అనేక రచనా ప్రక్రియలతో ప్రయోగాలు చేశారు. ఆయన రచనలలో ప్రగతిశీల భావాలు కనబడతాయి. 2019 ధనికొండ శతజయంతి సంవత్సరం. ఆయన రచనల సర్వస్వము (దొరికినంతవరకూ) 12 సంకలనాలు, జనవరి 3 వ తేదీన, విజయవాడ బుక్ ఫెస్టివల్ లో ఆవిషరిస్తారు. మొదటి నాలుగు సంపుటాలు కథా సంకలనాలు (మొత్తం 132 కథలు). ఈ సందర్భంగా, ఆయన కథ “చెలియలికట్ట” ప్రచురిస్తున్నాము. ఆ కథ నాల్గవ సంకలనం ” అతను – ఆమె –ఈమె” లో ఉంది. ఆ సంకలనం లోని కొన్ని కథల పరిచయాన్ని (ముందు మాట) కూడా ఇక్కడ ప్రచురిస్తున్నాం.
*
ఇరవయ్యవ శతాబ్దంలో, స్వాతంత్య్రం వచ్చే ముందూ, వచ్చిన తరువాతా కాలంలో తెనాలి ఎంతోమంది రచయితలకు కాణాచి అయింది. వారిలో, రచయితగా, పత్రికా సంపాదకుడిగా, ప్రచురణకర్తగా, అనువాదకుడిగా పేరుగాంచినవాడు ధనికొండ హనుమంతరావు. ‘యువ’ లాంటి కుటుంబ పత్రికలకే కాక, అభిసారిక, రేరాణి వంటి, ఆనాటికి వివాదాస్పదమైన పత్రికలకి కూడా ఆయన సంపాదకుడిగా పని చేశారు. సెక్సు మానవ జీవితంలో భాగమని, దాని గురించి తెలుసుకుని, నేర్చుకుని జీవితాలను సుఖమయం చేసుకోవచ్చనీ నమ్మి, ఆ జ్ఞానాన్ని సగటు తెలుగు పాఠకులకి అందుబాటులోకి తేవడానికి పత్రికల ద్వారా, అనువాదాల ద్వారా ప్రయత్నం చేశారు.
ఈ సంకలనం లోని కథలు 1940-50 లలోరాసినవి; అవి కాక, 1966లో వచ్చిన ఒక కథ కూడా ఇందులో చేర్చారు. ధనికొండ కథలు ప్రధానంగా పట్టణ వాతావరణంలోని యువతీ యువకుల కథలు. ముఖ్యంగా యువకుల కథలు. ఆయన కథలు, వాటిలోని వైవిధ్యం ఆనాటి మధ్య తరగతి జీవితాలలో, సమాజంలో వస్తున్న మార్పులని చూపిస్తాయి. నీతి అవినీతులను ఎలా అర్ధం చేసుకోవాలో, ఎలా పాటించాలో చెప్పే కథలు కొన్ని; మధ్య తరగతి జీవితాల్లో డబ్బు పాత్రను విడమరిచి, కుటుంబ సంబంధాలను, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలను, డబ్బు ఎలా శాసిస్తుందో విశ్లేషించే కథలు మరి కొన్ని. కాలేజీ చదువులకి పట్టణాలకు వెళ్లిన యువకులూ, నిరుద్యోగులు, పెద్దలు ఇచ్చిన ఆస్తిని ఖర్చు పెడుతూ నిర్వ్యాపారంగా గడిపే వాళ్ళు, వాళ్ళని ఆకర్షించే యువతులు, వివాహానికి ముందూ, వివాహానికి బయటా జరిగే సెక్స్ సంబంధాలు కొన్ని కథలలో ముఖ్యాంశాలు. కథ, నవల, నాటకం, ఇత్యాది రచనా ప్రక్రియలతోనే కాక, కథా వస్తువుతో కూడా ఆయన ప్రయోగాలు చేశారు. ఈ సంకలనం లోని అలాంటి కొన్ని కథలను పరిచయం చేయడమే ఈ ముందుమాట ప్రయత్నం.
ఈ కథలన్నిటిలోనూ నాకు బాగా నచ్చిన కథ చెలియలి కట్ట.’ 1966లో వచ్చిన ఈ కథ, ఆనాటికి ఎంతోకాలం ముందున్న కథ. తరతరాలుగా స్థిరపడిన నీతి అవినీతులని సమాజంలో వచ్చే కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు, కొత్త టెక్నాలజీలూ ఎలా సవాలు చేస్తాయో, ఎలా మార్పులు తెస్తాయో చెప్పే కథ ఇది. రహస్య వీర్యదానం ద్వారా పుట్టిన అబ్బాయి, పెద్దయి, ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అదే తండ్రికి పుట్టిందని తెలిసినప్పుడు, ఆ రహస్యం తెలిసిన ఒక్క వ్యక్తీ (డాక్టరు) ఏం చెయ్యాలి? ఆ విషయం బయటపెట్టి సామాజిక నీతిని కాపాడాలా? లేదా, తన వృత్తి నిబంధనల ప్రకారం నోరు మూసుకుని ఊరుకోవాలా? ఆ కథలో ఒక్కరికైనా ఆ రహస్యం తెలిసింది. టెక్నాలజీ అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా ముందుకి వెళ్ళింది. ఊరూరా ఫెర్టిలిటీ క్లినిక్కులూ, స్పెర్మ్ డొనేషన్ సెంటర్లూ వెలుస్తున్నాయి. వీర్యదానంతో గర్భం దాల్చడం అసాధారణం కాకుండా పోయింది. చెలియలికట్ట కథ ఈరోజు నిజంగా జరిగితే, వీర్యదాత ఎవరనేది తెలిసిన వ్యక్తి ఒక్కరూ ఉండకపోవచ్చు. ఒకవేళ తెలిస్తే, మన స్పందన ఎలా ఉంటుంది? సామజిక నీతులు ఎలా ఏర్పడతాయి, అవి కాలంతోపాటు మారుతూ ఉంటాయా? వైద్య పరిశోధనా రంగంలో bio ethicist ల లాగా, రచనా రంగంలో సామాజిక ethicist లేవదీసే ప్రశ్నలు, జరిపే చర్చలతో ఈ కథ మనని ఆలోచించమని ప్రోత్సహిస్తుంది.
1944 లో వచ్చిన ‘అభిరుచులు’ కథ మరొక ఆలోచింపచేసే కథ. పెళ్లి అయి వెళ్ళిపోయిన ప్రేమికురాలు వచ్చి తనతో సంబంధం కోరితే దాసు ఎందుకు వెనకడుగు వేస్తాడు? తానూ ప్రేమించిన యువతి పట్ల అతను ఎలాంటి బాధ్యత ఫీల్ అయ్యాడు? మనుషుల అభిరుచులు ఘనీభవించి ఎప్పటికీ ఒకేరకంగా ఉండకుండా, పరిస్థుతుల రీత్యా ఎలా మారతాయి? అభిరుచులు మారినా, ప్రేమలూ, వాటిని వెన్నంటి వచ్చే బాధ్యతలూ మారనక్కరలేదని, మగవాళ్ళలో స్త్రీల పట్ల బాధ్యతాయుతమైన ప్రేమతో వ్యవహరించేవాళ్ళు కొందరు ఆ రోజుల్లోనూ ఉన్నారని ఈ కథ చెప్తుంది. మాములుగా ఇలాంటి సందర్భాలలో నీతి నియమాలు, పరాయి స్త్రీ, కుటుంబ భద్రతా, అనే విషయాలు అడ్డం వచ్చినట్లు అనేక కథలు వచ్చినయ్యి. కాని, ధనికొండ వాటిజోలికి పోకుండా, శరీర ఆరోగ్యం మీద ఫోకస్ చేయడం ఈ కథ ప్రత్యేకత.
‘అతను: ఆమె: ఈమె’ కథ (1954) నేను ఇంతకుముందు చదివిన త్రికోణ కథలలో చాలా భిన్నమైంది. పేదరికానికి భయపడిన ముగ్గురు వ్యక్తుల కథ ఇది. ప్రతివాళ్లూ మరొకరిని తెలిసే తమకి అనుకూలంగా వాడుకుంటారు–డబ్బుకవనీ, సెక్సుకవనీ. డబ్బు తెచ్చి కుటుంబాన్ని పోషించలేని భర్త మీద అసహ్యం పెంచుకున్న భార్యకి, అతను డబ్బు తెచ్చిన రోజే దాంపత్య ఙివితం రుచించడం మొదలవుతుంది. పేదరికంలో వేరే సంబంధం కష్టంగా అనిపించదు కానీ, కాస్త తేరుకోగానే, కొంత డబ్బు వెనకేసుగానే, అది అభ్యంతరకరమవుతుంది. అకస్మాత్తుగా పేదవాడైపోయిన ప్రేమికుడిని వదిలిపెట్టి ధనవంతుడిని చేసుకుని సుఖం లేక అలమటించే “ఆమె” తన డబ్బుతో పాత ప్రేమికుడిని కొనుక్కో చూస్తుంది. డబ్బు శక్తీ, మనుషుల అవకాశవాదమూ, తమ స్థానాలను కాపాడుకోవడానికి “ఆమె,” ముఖ్యంగా “ఈమె” చేసే ప్రయత్నాలూ–వెరసి ఈ కథ.
‘అభిప్రాయాలు’ (1953) కథలో వీరయ్య ప్రతి సందర్భంలో తనవేపు నుంచీ, అవతలి వాళ్ళ వేపు నుంచీ –రెండూ అలోచిస్తుంటాడు, ఎడతెరిపి లేకుండా. సగటు జీవి ఆలోచనా స్రవంతి ఈ కథ పొడుగూతా ఉంటుంది. అది మనలో ఎందరమో నిత్యమూ అనుభావించేదానిలాగే ఉంటుంది. రైల్లో అడుక్కునేవాళ్ళని తిట్టుకుంటూనే, పాపం, వాళ్ళు మాత్రం ఎలా బతుకుతారూ అనుకుంటాడు. ఎక్కవ డబ్బు అడిగిన కూలీని తిట్టుకుంటూనే, తను మాత్రం ధాన్యం ఎక్కువ ధరకి అమ్మాలనుకోలేదా అని ఆలోచిస్తాడు. వర్షంలో, బురదలో, చీకట్లో, తాటితోపులో వెళుతూ, దొంగలు వస్తారేమో అని భయపడీ, భయపడీ, చివరకు వాళ్ళు రాలేదే అని ఒక విధమైన నిరాశకు లోనవుతాడు. “ఐనా ఈ వానలో బురదలో దొంగలు ఏం వస్తారు, హాయిగా ఆవకాయ వేసుకొని తిని, వెచ్చగా ఇంట్లో పడుకుంటారు కాని,” అన్న ఆలోచన వెనకే, “ఇంట్లో ఆవకయా లేక, వెచ్చదనమూ లేక, చివరకు బహుశా అన్నం కూడా లేనప్పుడు రాక తప్పదు” అన్న ఇంకో ఆలోచన! బ్యాటరీ లైటు వేసి దొంగల కోసం చూస్తూనే, “ఇలా లైటు వేయడం వాళ్ళని ఆహ్వానించడం అవుతుందేమో” అనుకుంటాడు. కథ అంతటా హాస్యం తొంగి చూస్తూ ఉంటుంది.
‘పునశ్చరణ’ 1953లో ప్రచురించిన కథ. కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడే బడుగు జీవుల కథ. చదువుకోవాలనే కోరిక పిల్లలకి, వాళ్ళని చదివించాలనే కోరిక పెద్దలకీ ఉన్నా కూడా, పేదవాళ్ళకి మన విద్య విధానం ఎందుకు పనికిరాకుండా పోయిందో ఈ కథ చూపిస్తుంది. రెండేళ్లు కష్టపడితే ఒక వృత్తి నేర్చుకుని కుటుంబాన్ని పోషించవచ్చు; అదే చదువుకోవాలంటే హై స్కూలు పూర్తి కావడానికే 10-11 సంవత్సరాలు పడుతుంది. కుటుంబ పోషణ కోసం భద్రయ్య కొడుకులిద్దరూ ఒకరి తరువాత ఒకరు చదువు మానుకోవాల్సి వస్తుంది. భద్రయ్య ఎంతో జాగ్రత్తగా ప్లాను వేసి, మరెంతో జాగ్రత్తగా పనిచేస్తాడు; అయినప్పటికీ, పేదవాళ్ల కష్టాలు తీరడం తేలిక కాదు. భద్రయ్య ఆలోచనల్లో సమాజ రీతిని ఇలా విశ్లేషిస్తాడు: “ఈ బాధ పడేవాళ్ళే సుఖపడేవాళ్ళ సౌఖ్యానికి మరో అంతస్తు పైకే జరుపుతుంటారేమో? అదేవిధంగా ఈ సుఖపడే వాళ్ళు బాధపడేవాళ్ళ బాధను మరో మెట్టు కిందికి తోస్తుంటారేమో?” జీతం పెంచమని యజమానిని అడగమని భార్య పోరు పెడుతుంటే, యజమానికీ పనివాళ్ళకి మధ్య ఉండే అంతరం గురించి ఆమెకి వివరించి చెప్పలేని భద్రయ్య, “తనకూ ఆమెకూగల సంబంధ బాంధవ్యాలలాంటివే, తనకూ తన యజమానికీ ఉన్నవని ఆమె భ్రమ!” అనుకుంటాడు. భార్యాభర్తల సంబంధంలో ఉండగల స్వతంత్రమూ, ఎంతో కొంత హక్కూ, యజమాని – పనివాడు సంబంధంలో ఉండవు.
‘శిక్ష’ అనే పెద్ద కథ (1940) లేచిపోయిన పూర్ణ, శివా ల గురించి. ఇంటికి తిరిగివచ్చి తమందరి పరువూ కాపాడమని అడిగిన బాబాయి తో పూర్ణ చాలా ధైర్యంగా, అప్పటి కాలానికి ఫెమినిస్ట్ లాగా మాట్లాడుతుంది. ముసలి మొగుడిని వదిలి, డబ్బూ నగలతో వచ్చేసే హక్కు తనకు ఉన్నదంటుంది. శివతో సంభాషణలలో కూడా ఆమె తెలివీ, సమయస్ఫూర్తి కలదానిగా కనపడుతుంది. ఆమె డబ్బుతో సుఖాలనుభవిస్తున్న శివని ప్రేమిస్తుందేకాని విమర్సించదు. కాలేజీ చదువుతో నిరుద్యోగిగా ఉన్న శివ మాత్రం ఆమె డబ్బు దుబారా చేసి తాను సుఖపడాలని చూస్తాడు.
డబ్బు కథ (సంవత్సరం?) డబ్బుకున్న పవర్ని, ఒక తల్లినీ కొడుకునీ అది ఎలా విడదీయగలదో, అదే డబ్బు వాళ్ళని ఎలా కలపగలదో చూపిస్తుంది. కథ పొడుగూతా సీను ‘వెధవ డబ్బు’ గురించీ, అది తనని ఎంత సుఖపెడుతోందో, తనని ఎలా తల్లి నించి విడదీసిందో ఆలోచిస్తాడు. చివరకు అదే డబ్బు వాళ్ళిద్దరినీ కలిపిందని అతని చెల్లెలు గుర్తిస్తుంది. కథలో అధిక భాగం సీను ఆలోచనా స్రవంతి మీద నడుస్తుంది. ‘మామయ్య’, మంచితనం’ వంటి కథలు యువకుల సెక్సు ఫాంటసీ కథలు.
ధనికొండ రచనల్లో రాడికల్ భావాలు ఉంటాయి.పాత్రలు మూస పోసినట్లు ఉండవు. సంభాషణలు చాలా సాఫీగా సాగిపోతాయి. అవే ఆయనని నాటక రచయితని కూడా చేసిఉంటాయి. ఆలోచనా స్రవంతులకు కూడా ఆయన కథల్లో పెద్ద పీట వేశారు. ధనికొండ రచనల సమగ్ర సాహిత్యం ప్రచురణతో, ఆయన రచనలకూ, కొత్త పుంతలు తొక్కే ప్రయత్నాలకూ, సాహిత్య ప్రయోగాలకూ గల చారిత్రక ప్రాధాన్యం గురించి ముందుముందు విశ్లేషణలు వస్తాయని నమ్ముతున్నాను.
చివరగా ఒక disclaimer, దానితోపాటే ఒక claim, కాస్త వ్యక్తిగతమూ: ధనికొండ హనుమంతరావు మా మేనమామ. మా అమ్మకి సొంత అన్నయ్య. మా బాల్యంలో ఆయన కళ్ళకి కట్టినట్లుగా కథలు చెప్పేవాడు. చాలా చమత్కారంగా మాట్లాడేవాడు. ఎప్పుడూ తెల్ల లుంగీ, తెల్ల చొక్కా, భుజం మీద తెల్ల టర్కీ టవలు వేసుకుని తిరిగేవాడు. చేతిలో సిగిరెట్ టిన్ను ఉండేది. మీ నాన్న కథలు చెప్పడం గుర్తున్నదా అంటే, ఆయన కొడుకు బాబు, “నాన్న కథలు చెప్తుంటే కన్నీళ్ళు ఆగేవి కాదు; తన టవల్ తో కళ్ళు తుడిచేవాడు. కాని, కథా ఆగేది కాదు, కన్నీళ్ళు ఆగేవి కాదు” అన్నాడు. మా అమ్మ కూడా చాలా బాగా కథలు చెప్పేది. వాళ్ళ నాన్న(అంటే మా తాతయ్య) ఇంకా చాలా బాగా కథలు చెప్పేవాడట. ఆయన కథలు వినడానికి చుట్టుపక్కల పెద్దవాళ్లు కూడా వచ్చి కూర్చొనే వాళ్ళట. ఈ మా కుటుంబ కథకులలో ధనికొండ హనుమంత రావు “చెప్పే” కథకుడుగానే కాక, “రాసే” కథకుడుగా కూడా పేరు సంపాదించాడు. “చెప్పిన” కథలు వినే అవకాశం కుటుంబ సభ్యులకే, ముఖ్యంగా ఆయన పిల్లలకే దక్కినా, ధనికొండ “రాసిన” కథలు చదివే అవకాశం మాత్రం అనేకమంది పాఠకులకి కలిగింది. ఆయన శత జయంతి సందర్భంగా ఈ రచనలని తిరిగి ప్రచురించడం సంతోషకరం. మా పూర్వీకుల—మా తాతయ్య, అమ్మ, మామయ్యల కథక శక్తికి నమస్సులు, కృతజ్ఞతలు. వాళ్ళ పుణ్యమా అని, మేము కథలు వింటూ, చదువుతూ పెరిగాము. ఎంత అదృష్టమో!
” మా పూర్వీకుల—మా తాతయ్య, అమ్మ, మామయ్యల కథక శక్తికి నమస్సులు, కృతజ్ఞతలు. వాళ్ళ పుణ్యమా అని, మేము కథలు వింటూ, చదువుతూ పెరిగాము. ఎంత అదృష్టమో!”
అలా పెరగ గలగడం నిజంగా అదృష్టమే!
“వీర్య బేతాళుడు” అన్నది ఆ కాలానికి తప్పక కొత్త ప్రయోగం అయే వుండాలి (ముద్రా రాక్షసం లేకపోతే వత్తు బే అనే వుండేది). నా స్నేహితు లొకరు “మహాభారతంలోని రెండు పేర్లలోని రహస్యాన్ని వ్యాసుడు ప్రత్యక్షంగానే చెప్పాడు గదా!” అని అంటే, అవును గదా, అని ఆశ్చర్యపోయాను. ఆ రెండు పేర్లలోనే వాళ్లకి పిల్లలు పుట్టని కారణం ఉన్నది మరి! చూడండి ఆ రెండు పేర్లనీ – చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు!