రాత్రి నిశ్శబ్దం
తేలులా కాటేస్తుంటే
కాంతిని ఇముడ్చుకున్న కళ్లను
బలవంతంగానైనా మూయాలి
తమను తామే పక్కమీద
మరచిపోయిన వారికి తెలియకుండా
ఇటూ అటూ దొర్లాలి
లేదా పచార్లు చేయాలి
ఆలోచనల్ని తరమాలి
లేదా మరో గదిలోకి పోయి
ఏదైనా చూసుకోవాలి
చదువుకోవాలి
జోలపాటలేవైనా వినాలి
ధ్యానంలోకైనా పోవాలి
అమాంతం పెరిగి పోతున్నట్టున్న
రాత్రిని జయించడానికి
నిద్ర ఆయుధంగా
మంత్రతంత్రాల మాత్రనైనా
ఏదో ఒకటి వేసుకోవాలి
చుట్టూ ఎన్నున్నా ఎందరున్నా
తప్పించుకోలేని ఒంటరితనం
గంటల్ని చూస్తూ గడపలేని భయం
లేదు లేదు ఎలా అయినా నిద్రపోవాలి
నిద్ర సొరంగాలలో
కలల పాలనని ఆహ్వానించాలి
రాత్రీపగళ్ల ఆకాశాలకు సరిహద్దులే లేవు
అవి నిర్బంధించే నిద్ర సరిహద్దులు తప్ప
జీవిస్తూ ఎవరు దానిని సంపూర్ణంగా చెరిపేయగలరు
*
బావుంది
నిద్రకోసం ప్రయత్నం అంతా కలల మార్మికలోక సంచారం కోసమేకదా. స్వప్నలోకానికి ఫ్రీ పాస్పోర్ట్ ఉంటే ఎంత బాగుండు.
నిద్ర ప్రాముఖ్యతను చాలా అందంగా సృజించారు రామారావుగారూ. అభినందనలు.