ప్రతి నిదురలేని రాత్రీ
ఒక ప్రహేళిక నాకు
ప్రతి నిదురలేని రాత్రికీ
పూర్తికాని జోలపాటన్నేను.
రాత్రి వాకిట్లోనే దొరుకుతాను
నాకు నేనుగా.
రాత్రి దోసిట్లోనే తేలతాను
నల్లని సిరాగా.
ఏ పాస్ వర్డ్ లూ, ఓటీపీలూ
అడగకుండానే ఙ్ఞాపకాల వెల్లువ
ఈ సమయంలో
అమ్మ వర్షిస్తోంది
-కంటి చెమ్మ చిరునామా
వెలుగు ఆడుతుంటే
గాలి పొగబొమ్మలు గీస్తుండగా
దేహ సౌందర్యంతో కరుగుతోంది, కొవ్వొత్తి.
ఈ నీరవంలో,
గడియారపు ముల్లు శబ్దం
కుళాయి నుండి జారే
నీటి బొట్టు చప్పుడుతో కలిసి
కాలం కొలతలు తీస్తోంది.
శేష భాగాల్లోకి
ఇరుగ్గా ఇంకిపోవడమో
విస్తరిస్తూ వ్యాప్తి చెందడమో
శిలా సమయాల్లో
సజీవంగా నిలిచేందుకు
ఒక ప్రయత్నమైతే చేయాలి.
2
ఎంగిలి గాలి
ముస్తాబైన పరదాలమీంచి
జారుతున్న జరారహిత ఙ్ఞాపకాలు
కొన్ని కథలు చెబుతున్నాయి
…మార్మికంగా, మార్ధవంగా!
రాతిమెట్ల మీద
రాత్రి రాలిన వెన్నెలపిండిపై
నీ అడుగుల ఆనవాళ్లు
గడపదాకా
నువ్వొచ్చి వెళ్లిన సంగతి పట్టిచ్చాయి
సంశయం లేదు…
చిత్తానికి నిన్ను
అత్యంత సన్నిహితం చేసిన
క్షణాలన్నీ
ఈ ఏకాంతావరణంలో ఏరుకున్నవే!
పర్వాలేదు,
గాలినే ఎంగిలి చేసి విడిచిపెట్టు
ఒంటరితనాన్ని ఓడించేంత
ఒడుపు ఉంటుందా గాలికి.
ఉన్మత్త క్షణాల్ని ఉరితీసేంత
సత్తా ఉంటుందా ఎంగిలి గాలికి.
*
Fantastic