1.
ఆకుపచ్చనిదీపం కింద
అలుముకున్న చీకటిసముద్రం – అడవి !
బతుకుపచ్చనిఅడవి బహుళజాతి సంతయ్యాక
అభివృద్ధివధ్యశిల మీద ఆదివాసీయే తొలి బలిపశువు !
2.
శాటిలైట్ కళ్లతో అడవిని తోడిపోసీ
కార్పోరేట్ భూతాలకు కుంభాలుగా పెట్టేందుకు
బంగారుకడియం ఆశపెడుతోంది పెద్దపులి !
తుపాకీనీడలో….తెగిన బొటనవేళ్లు
బలవంతపు ప్రజాభిప్రాయాలయ్యాక
సహజ కవచకుండలాలను చీకటిగోళ్లతో చీల్చేసి
నెత్తురోడుతున్న దేహాలమీద లేపనం పూస్తోంది !
3.
ఒకచోట జలసమాధి జేసి
మరోచోట కొండదేహాన్నొక ఖనిజంగా తవ్విపోసి
కాళ్లకింద నేలను తన్నుకుపోతున్న గండభేరుండాలు !
తునాతునకలై…. గుదిగుచ్చిన కొండల పూదండలు !
కన్నీటిధారలై…. తెగిపోతున్న సెలయేటిపాయలు !
నిత్యగాయాల నెలవంకయ్యింది – అడవి
నిఘాకళ్ల పహారాలో నెత్తుటివాగయ్యింది – అడవి !
4.
ఒక పరాయికరణ !
సంస్కృతిమీదా….సాంప్రదాయాలమీదా….ఒకదాడి !
గూడెంమధ్యలో కొలువైన
జాకరమ్మను మింగేస్తోంది కొండ’శిలువ’ !
సమస్తప్రకృతిని పూజస్తూ….వేపమండలాలతో ఊరేగే
జాతరల్ని మాయంచేస్తోంది గిరిజనగోవిందం !
యిపుడీ వెన్నెలకొమ్మల మీద
పిలనగర్ర పాటా లేదు ! కిన్నెరమోతా లేదు !
తీరొక్కరీతుల తుడుందెబ్బల్లేవు ! టిల్లకాయ సవ్వళ్లూ లేవు !
పదం పదం కలిపిఆడే నెమలిపిట్టల థింసానాట్యాల్లేవు !
చీకటికొమ్మమీద వెలుతురుపూల నెగళ్లచుట్టూ
తుమ్మెదలై మూగే బృందగానాల్లేవు !
అడవిపుడొక మూగవోయిన జీవనగీతం !
పుట్టిననేలకు పరాయిగామారి
పుట్టెడుదుఃఖంతో బతుకును ముక్కున కరచుకొని
ఎగిరిపోతున్న వలసపావురం !
5.
ఎంతకాలమీ నేలూనని నడకలు ? ఏ వెలుగులకీ పరుగులు ?
విచ్చుకున్న విప్పపూవుల్లాంటి గూడలిపుడు విహారకేంద్రాలు !
ఆకుపచ్చని ఆకాశానపూసే చుక్కలిపుడు పడుపుగత్తెలు !
కల్చర్ వలలో చిక్కిపోతున్న కుందేటికూనలు !
అడవితనాన్ని మింగేసిన అభివృద్ధి – ఒక చిల్లుల కడవ !
6.
ఒంటరిగా నడచీ నడచీ….విరిగినగీతాలై నేలకూలీ….
ప్రతి దుఃఖపుసందర్భాన్ని దిగమింగిందిక చాలు !
కాలం కదలమంటోంది కోనమ్మా….దారివిడు !
కొండవాలులోంచి పల్లానికి వెల్లువెత్తే వాగమ్మా….
పోరునాదాల గొంతుతడుపు !
యుద్ధారావాల తుడుంకొడుతూ వెదురువనమా….విల్లమ్ములు కా….!
యిది మరో సాయుధ గిరిజన రైతాంగపోరాటం !
అడవిపుడొక అనివార్య యుద్ధరంగం !!
పెయింటింగ్: సత్యా బిరుదరాజు
అవును అడవిపుడొక అనివార్య యుద్ధరంగం
మంచి కవితకు అభినందనలు మీకు
ధన్యవాదాలమ్మా….నమస్తే