ఈ ప్రాంతం అదే
ఇక్కడే నేను జన్మించి ఉంటాను
ఈ జన్మకు ముందు
ఈ వాతావరణం అదే
ఇక్కడే నేను ఎప్పుడో ప్రేమించి ఉంటాను
ఈ ప్రేమకు ముందు
ఈ సమయం అదే
ఇక్కడే నేను గడిపి ఉంటాను
ఈ సమయానికి ముందు
ఇక్కడే ఆగి వెళ్లి ఉంటుంది ఒక కవిత
నేను మళ్లీ కలుస్తానని చెప్పి ఉంటానెప్పుడో
ఈ శబ్దం అదే
అందులోనే నేను అసంపూర్తిగా జీవించి ఉంటాను
ఈ జీవితానికి ముందు
పాత పుస్తకాలను, పాత స్నేహితులను, పాత అనుభూతులను, పాత పరిచయాలను నెమరు వేసుకుంటూ ఉంటే ఈ ప్రయాణం నేనే చేశానా అని అనిపించి కున్వర్ నారాయణ్ కవిత గుర్తుకు వస్తుంది.
‘జీవితాన్ని సిద్దించుకునే మార్గంలో రోజువారీ ప్రపంచం వెనక్కువెళుతుంది.వ్యక్తి ముందుకువెళతాడు. తన స్వంత ఆత్మ నుంచి తాను వేరుపడాల్సిరావడం ఎంత విచిత్రం…’అని నాలుగేళ్ల క్రితం 90 ఏళ్ల వయస్సులో మరణించిన కున్వర్ నారాయణ్ మాట్లాడిన మాటలు అంతరాత్మలో ప్రతిధ్వనిస్తున్నాయి.
హిందీ సాహిత్యంలో నవ్య కవితా ఉద్యమంలో గొంతెత్తి కవితలు ఆలపించిన కున్వర్ నారాయణ్ ఆరు దశాబ్దాలు ప్రయాణిస్తూ, ఎన్నో సాహిత్యోద్యమాలను నడిపిస్తూ, కవితలు రాస్తూ జీవించారు. తీస్రా సప్తక్ పేరుతో ఏడుగురు కవులతో కలిసి కవితలు రాశారు.
ఉదయమవుతున్నట్లుంది
ఒక చమత్కారం జరిగింది
ఒక ఆశా కిరణం
ఎవరో పసివాడిలా
నా గదిలోకి తొంగి చూసింది
నా గది వెలుగుతూ ప్రకాశించింది
రా లోపలికిరా.. నన్ను నిద్రలేపు
బహుశా నా మౌనం ప్రతిధ్వనించింది
అని రాసిన కున్వర్ నారాయణ్ ఆజ్ఞేయ, కేదర్ నాథ్,సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా, నిరాలా, ముక్తిబోధ్, శ్రీకాంత్ వర్మ ఎంతమందితో ప్రయాణించారో? ఆచార్య నరేంద్ర దేవ్, కృపలానీ లాంటి ఎంతమంది సోషలిస్టులతో కలిసి తిరిగారో? నజీం హిక్మత్, పాబ్లో నెరూడా వంటి ఎంతమందితో కరచాలనం చేశారో? ఎంతమంది ప్రపంచ కవుల్ని తర్జుమా చేశారో? సత్యజిత్ రే వంటి ఎంతమంది అద్భుత చలన చిత్ర దర్శకులు తమ సినిమాలకు స్క్రిప్టు కోసం ఆయన నివాసంలో చర్చలు సాగించారో? ఆధునిక కవిత్వమే కాదు, అమీర్ ఖుస్రో, గాలిబ్, కబీర్ నుంచి బౌద్దిజం వరకు ఎన్ని మెట్లెక్కి ప్రపంచ గవాక్షంలోకి ప్రవేశించారో?
ప్రపంచంలో
పోరాడేందుకు ఎన్నో ఉన్నాయి
కాని నాకు ఎలాంటి మనసు దొరికిందంటే
కొద్ది ప్రేమలోనే మునిగిపోయాను
జీవితం గడిచి పోయింది
అన్న కున్వర్ నారాయణ్ ఒక అలిసిపోని ప్రేమికుడు.
నేనీ దారులను
ఎలాంటి నెత్తుటి మరకలు లేకుండా
దాటగలిగితే మంచిదే
కాని నాకు మరక అంటితే
అది అమాయక రక్తం మరకకాదు
అది దీర్ఘకాలం ప్రేమచేసిన గాయం
మానడానికి నిరాకరించే గాయం..
అని ఆయన రాసుకున్నారు.
అయోధ్య ప్రక్కనే ఉన్న పైజాబాద్ లో జన్మించిన ఆ కవి 1992లో అయోధ్యలో బాబ్రీమసీదు ధ్వంసం తర్వాత చేసిన ఆలాపన హిందీ సాహిత్య ప్రపంచంలో ప్రతిధ్వనించింది.
హే రామ్,
జీవితం ఒక కఠిన యధార్థం
నీవు ఒక మహాకావ్యం
ఈ అవివేకంపై విజయం
సాధించడం నీ తరం కాదు
ఇక్కడ పది, ఇరవై తలకాయలు కాదు,
లక్షల శిరస్సులు, లక్షల చేతులు ఉన్నాయి
ఇప్పుడు విభీషణుడు కూడా
ఎవరి వైపు ఉన్నాడో తెలియదు..
ఇంతకంటే పెద్ద దౌర్భాగ్యం ఏమున్నది
ఈ వివాద స్థలంలోనే
నీ సామ్రాజ్యం పరిమితమైంది..
ఈ అయోధ్య
నాటి నీ అయోధ్య కాదు
అది యుద్దోన్మాదుల లంక
రామచరిత మానస్ నీ జీవిత గాథ కాదు
అదొక ఎన్నికల శంఖారావం .
‘ఈ కవిత్వం రాసినందుకు ఒక రోజు కాలినడకన వెళుతుండగా కొందరు హెచ్చరించి వెళ్లారు. అవేవీ నా ఆత్మను చంపలేకపోయాయి…’అని ఆయన చెప్పుకున్నారు.
1956లో ‘చక్రవ్యూహ్’ పేరిట తన తొలి కవితా సంకలనాన్ని ప్రచురించిన కున్వర్ కలం ఏనాడూ ఆగలేదు. కోయీ దూసురా నహీ, ఇన్ దినో, ఆత్మజయీ,అప్ నే సామ్నే మొదలైన అనేక కవితా సంకలనాలు వెలువడ్డాయి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, వ్యాస్ సమ్మాన్,కబీర్ సమ్మాన్,ప్రేమ్ చంద్ పురస్కార్ నుంచి జ్ఞానపీఠం వరకు వందలాది పురస్కారాలు పొందిన కున్వర్ నారాయణ్ నిత్య ప్రయాణీకుడు.
మనమంతా ఒకే రైలు పట్టుకుని
మన మన ఇళ్లకు వెళ్లాలనుకుంటాం
రైళ్లు మారే ప్రయాస నుంచి
తప్పించుకోవాలనుకుంటాం
మనందరం యాత్రలు బాధాకరమని
వాటి నుంచి తప్పించుకోవాలని
అనుకుంటాం
కాని యాత్ర ఒక అవసరం
ఇల్లు ఒక అవకాశం
అన్నది కూడా నిజమేమో
రైళ్లు మార్చడం
ఆలోచనలను మార్చడం లాంటిది
మనందరం ఎక్కడ దేని మధ్య ఉన్నామో
అదే మనం ఇల్లు చేరుకోవడం
అని ఆయన రాశారు. ఆయన భాషను ఒకవైపు ప్రేమ,మరో వైపు మృత్యువు దృక్కోణం నుంచి ఉపయోగించుకున్నారు.వాటి అన్నికోణాలూ వివరించారు.’ఒక కల్లోలిత ఆధునిక,అస్తవ్యస్థ అశాంతియమమైనప్రపంచంలో ఆయన స్వచ్ఛమైన , ప్రశాంతమైన ప్రపంచం కోసం అన్వేషించారు.’.అని ప్రముఖ కవి మంగ్లేష్ దబ్రాల్ కున్వర్ నారాయణ్ గురించి ఒక సందర్భంలో రాశారు.
అతడు అస్వస్థుడు కాడు
అప్పుడప్పుడు ఒకరి సంతోషంకోసం
రోగిష్టిలా పడి ఉంటాడు
నిజంగా అనారోగ్యంగా ఉంటాడు
ఎప్పుడో ఒకరోజు
అతడు మరణించవచ్చు కూడా
చచ్చిపోయినట్లు పడి ఉన్న
ఒకరి సంతోషంకోసం
కవులకు ఒక
ఆచూకీ అంటూ లేదు
ఏం తెలుసు ఎన్నిసార్లు వారు
తన కవితల్లో జీవిస్తూ, మరణిస్తూ ఉంటారో
అన్న కున్వర్ నారాయణ్ చాలా సరళమైన వాక్యాల్లో అనంతమైన అర్థాలు ఇమిడ్చాడు. సామాన్యులు అసామాన్యవిషయాలను చూసి ఆశ్చర్యపోయినట్లే గొప్ప కవులు సామాన్య అంశాలను చూసి అబ్బురం చెందడం అనేది ఒక యోగి లక్షణం. కున్వర్ నారాయణ్ వాక్యాలన్నీ ఒక యోగి వాక్యాల్లానే ఉంటాయి.
పార్కులో కూర్చున్నా ఎంతో సేపు
బాగా అనిపించింది
చెట్టు నీడ సుఖం
బాగా అనిపించింది
కొమ్మనుంచి ఆకు రాలింది
నేను ఇక వెళ్లిపోనా ..అన్నట్లుంది
అదీ బాగా అనిపించింది
ఢిల్లీలోని చిత్తరంజన్ దాస్ పార్క్ లో కున్వర్ నారాయణ్ 50 ఏళ్లపాటు తన పాత ఇటాలియన్ టైప్ రైటర్ పై రచనలు చేస్తూ జీవించారు. కవిత్వం, కథ, విమర్శ,సినిమా ఇలా ఎన్నోరంగాల్నిస్పృశించారు.
ఆలోచనకూ భాషకూ మధ్య, విషయానికీ, నిర్మాణానికీ సున్నితమైన సమతుల్యాన్ని ప్రదర్శించేదే కున్వర్ నారాయణ్ కవిత. ‘వాస్తవానికీ,వాస్తవానికీ మధ్య భాష మనను వేరు చేస్తుంది. నీకూ నాకూ మధ్య ఒక తెగని నిశ్శబ్దం మనను కలుపుతుంది..’ అంటారు ఆయన.
నారాయణ్ ఒంటరి కవి కాదు.అతడి కవితలు వ్యక్తినీ,సమాజాన్నీఅనుసంధానం చేస్తాయి.విశ్వప్రపంచంలో ప్రతిధ్వనిస్తాయి.కుప్పకూలిపోతున్న విలువల ప్రపంచంలో విశ్వాసాన్నికల్పిస్తాయి. మనిషిగా ఉండడమే ఒక గొప్ప సవాలుగా మారుతున్న ప్రపంచంలో ఆయన మనిషిలా జీవించాలని నిరంతరం ఆకాంక్షించారు.
మిగిలిన కవితలను
శబ్దాలతో రాయలేం
మొత్తం అస్తిత్వాన్ని ఒక విరామంలా లాగి
ఎక్కడో వదిలి పెడతాం..అన్న
కున్వర్ నారాయణ్ ‘నేను కవితలాగా అన్నిటినీ అంటిపెట్టుకుని ఉంటాను…’అని తన జీవిత చరమాంకంలో రాశారు. నిత్యం జీవించే ప్రతి కవితలో ఒక కున్వర్ నారాయణ్ ఏదో రూపంలో జీవించి ఉంటాడు.
*
Add comment