ఖ్వాబ్ (Khwaab) of love and revolution. ఈ పుస్తకం పేరు. దీనికి నాదైన మాటలు కొన్ని రాయాలి. రాయడం ఇష్టంలేక పోయినా ఎందుకు రాసుకున్నానో చెప్పేందుకైనా రాయాలి.
రాయాలి. కానీ, రాయాలి అనుకుంటే సరిపోదు. దానికో ట్రిగ్గరింగ్ పాయింట్ ఉండాలి. నా అప్తమిత్రురాలు ‘అల’ ఓ రోజు మాట్లాడుతూ… మాట్లాడుతూ…. కాలర్ పట్టుకు దగ్గరకు లాక్కొని భుజంపై వాల్చిన తలను కాస్త ఎదపై దాచుకుంది. ‘ఏంటి? ఇప్పుడు ఏడుస్తావా?’ అని అనగానే, ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నట్లు గొంతులో దాచుకున్న దుఃఖాన్నంతా గుండెపై ధారపోసింది. ఆ రాత్రి ఎందుకో చాలాకాలం వెంటాడింది. అట్లా వెంటాడిన రాత్రిని ఓ కథ రాసి పంపితే, ‘ఈ మాట నేనెప్పుడు చెప్పిన?’ అని అడిగింది. ‘నువ్వెప్పుడూ చెప్పలేదు. ఆ క్షణాన నాకలా అనిపించింది.’ అన్నాను. “that’s my weakness, which I do not want to share with anyone. నీకట్లా ఎందుకు అనిపించిందో నాకిప్పటికీ ఆశ్చర్యమే.” అన్నది. అప్పుడు రాసిందే నా మొదటి కథ. నా మొదటి కథ గురించో, నా చేత కథ రాయించిన అల గురించో ఇప్పుడు చెప్పట్లేదు.
ఈ ప్రేమలేఖలకూ అటువంటి ట్రిగ్గరింగ్ పాయింటే ఉంది. ఎప్పటినుండో లేఖలు అనే ఓ సీరిస్ రాద్దామని అనుకున్నా, రాసింది మాత్రం…ఓ రోజు వెంటాడిన ఒంటరితనంలోనే. ఈ ఒంటరితనం వైయుక్తికం కాదు అనుకుంటాను. నేను సంఘజీవిని, అట్లాగే రాజకీయ జీవిని. సంఘంలో, రాజకీయంలో ఉండే వైరుధ్యాలు ఏదో ఒక సందర్భంలో మనిషిని ఒంటరితనంలోని నడిపిస్తాయి. ఆ వైరుధ్యాలు మనిషిని కొన్నిసార్లు రాటుదేలిస్తే, మరికొన్నిసార్లు కుంగదీస్తాయి. ఇట్లా ఒంటరితనంలోకి ఉద్యమాల్లో ఉండే మనుషులు వెళ్ళడంపైన వెస్ట్రన్ లో మంచి పరిశోధన జరిగింది. ఇండియాలో జరిగిందో లేదో తెలియదు. ఒంటరితనంలోకి పోయిన మనిషికి సూసైడల్ టెండేన్సిస్ వస్తాయి. (దీనిమీద పెద్దగా చర్చించాల్సిన పనిలేదు. కావలసినంత చర్చ ఇప్పటికే జరిగింది.) ఉద్యమాల్లో ఉండే మనుషులు ఒంటరితనంలోకి పోయి బలవన్మరణం చేసుకోవడంపై పరిశోధనలు జరిగినట్లుగా లేదు. ‘దళితులారా… ఇకనైనా ఐక్యం అవ్వండి’ అని గోడమీద రాసి చనిపోయిన విలాస్ ఘోఘ్రే అయినా, కాను సన్యాల్, సత్నామ్, రోహిత్ వేముల అయినా అట్లా ఒంటరితనంలో చనిపోయినవారే. వారందరికీ ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉంది.
అయినా వాళ్ళను ఒంటరితనంలోకి నడిపించిన సంఘ, రాజకీయ వైరుధ్యాలు ఏవై ఉంటాయి? వీటిమీద చర్చ జరగాలి. దళిత – విప్లవ శక్తుల ఐక్యత కావాలనుకున్నాడు విలాస్. ఈ దేశం పెట్టుబడిదారీ సమాజంగా మారిందా? ఇంకా అర్థ వలస, అర్థ భూస్వామ్య సమజామేనా? అనే చర్చలో ఉన్నాడు సత్నామ్. పీడితుల అంతర్గత సంక్షోభాన్ని రాసి కొట్టివేశాడు రోహిత్ వేముల. అయితే రాజకీయ వైరుధ్యాల ఉక్కపోతలోంచి వచ్చిన ఒంటరితనాన్ని వ్యక్తిగతం అనే విప్లవనియోగితనాన్ని చూశాను. సత్నామ్ కి రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయని ఒప్పుకుంటూనే తన భార్య వియోగం, కూతురూ పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం వలెనే ఆ ఒంటరితనం వచ్చిందని, విలాస్ అంతే వైయుక్తిక కుటుంబ అంతఃఘర్షణలోంచే సూసైడ్ చేసుకున్నాడని, దానికి రమాబాయి అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ కి చెప్పుల దండ వేయడం అదనం అని తేల్చేశారు. రాజకీయాల్లో ఉండే మనిషి ఒంటరితనం వైయుక్తికానికి ఎందుకు కుదించబడుతుంది అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతుంటే ఓఆర్టికల్ దొరికింది. అందులో “movements inevitably fray. They fray because the passionate ideals that bring us there make us impatient and touchy when people don’t see the work in the same way as we. We put ourselves on display, give our hearts and souls and sweat to the group and it’s easy to feel unseen or underappreciated. And this brings us back to our sense of alienation.”అని అంటుంది కేట్ రాఫెల్. నిజమే కదా. మనిషి పరాయికరణ గురించే మాట్లాడే మనుషులు పరాయికరణ కావడం ఇందువల్లే కదూ. ఈ మాటలన్నీ ఎందుకంటే? ఈ లేఖలన్నీ ప్రేమ రాహిత్యపు జనాల మధ్య బతుకుతూ, నాదైన ఒంటరితనంలో ప్రేమను గురించి రాసుకున్న రాతలు గనుక.
ప్రేమ. ఈ పదం అనుకోగానే నవ్వొస్తుంది. ఈ మాట నేననడం నీకు ఆశ్చర్యమే అయిన నవ్వే వస్తుంది. అత్యంత ప్రేమ రాహిత్యపు, రసహీన జనాలను చూశాను గనుకే నవ్వొస్తుంది. నిజానికీ ప్రేమ లేకుండా విప్లవం లేదు. “నిజమైన విప్లవకారున్ని గొప్ప ప్రేమ భావన నడిపిస్తుంది.” అంటాడు కామ్రేడ్ చేగెవేరా. ప్రేమ అంటే కేవలం ఇద్దరు అపోజిట్ జెండర్ మధ్య ఉండేదే కాదు. ప్రేమ పలు రకాలు అని రాసాడు ఎరిక్ ఫ్రాం తన ఆర్ట్ ఆఫ్ లవింగ్ లో. శివసాగర్, పాబ్లో నెరుడా ఇద్దరూ ప్రేమనూ, విప్లవాన్నీ కలిపి రాశారు. ప్రేమ క్షణాలు – జ్ఞాపకాలు యుగాలు అని రాసిన పాబ్లోనే ప్రియురాలిపై కవితలు అల్లడం లేదని అడిగావు కదూ… రా వీధుల్లో ప్రవహిస్తున్న రక్తం చూడు అనీ రాశాడు. శివసాగర్ తూర్పు పవన సంగీతంలో రాగం నీవు. తానం నేను అంటూనే మనిద్దరం కలిసి ఉద్యమిస్తే ఉప్పెన, విప్లవిస్తే విజయం అన్నాడు. ఫైజ్ కూడా అంతే కదా. నీ కళ్ళకు మించి ఈ ప్రపంచంలో ఏమున్నాయ్ అంటూనే ప్రేమయే కాదు లోకాన బాధలింకా ఉన్నాయి. శరీర కలయికే కాదు ఓదార్పులెన్నో మనకున్నాయి అన్నాడు. ఎంత గొప్ప ప్రేమికులు కదూ వీళ్ళంతా. మహానుభావుడు మార్క్స్ మాత్రం ఏమైనా తక్కువా జెన్ని విరహంలో మూడు సంపుటాలు రాయలేదూ. నా మల్లియ రాలేను అని మావో రాసుకోలెదూ. వీళ్ళందరికీ తెలిసిన ప్రేమ వారి బాటలో నడుస్తున్నాం అనేవారికి తెలియకపోవడమే విషాదం. ఇది జెనరల్ స్టేట్మెంట్ లా అనిపిస్తున్న మెజారిటీ జనాలు అట్లే ఉన్నారు. మేము కాదు అని భుజాలు తడుముకునే వారితో నాకేమీ పనిలేదు. విప్లవ హిప్పోక్రాట్స్ ని అనేకం చూశాను. ముందే అన్నట్లు అటువంటి ప్రేమ రాహిత్యపు జనాల మధ్య బతుకుతూ రాసుకున్న లేఖలు ఇవి.
నేను చెప్పాలనుకున్న చాల విషయాలు ఈ లేఖల్లో ఉన్నాయి. ఒకరకంగా ఇవి స్వగతాలు. అయితే ఇందులో రాసిన ప్రతీది నా అనుభవమే కానవసరం లేదు. లేదు ఇది ఖచ్చితంగా నాదే అని ఎవరైనా అనుకున్నా పోయేదేమీ లేదు. అట్లా అనుకోవడం మొదటిసారి కాదు గనుక. నీకో కథ చెప్తా విను. పూర్వం ఇలాగే నాలాంటి పిచ్చోడు ఒకడు ఉండేవాడు. వాడికి ఒక స్నేహితురాలు ఉండేది. వొట్టి స్నేహితురాలేనా? అంటే కాదు. ప్రియమైన స్నేహితురాలు. వాడి బతుకుపుస్తకం రాస్తే అందులో దాదాపు నిండి ఉండే మానవి అన్నమాట. వీళ్లిద్దరిని చూసి ప్రేమికులు అనుకునేవారు. అవును. వాళ్ళిద్దరూ పరస్పరం ప్రేమించుకుంటారు. అయితే ఆ ప్రేమ జెనరల్ నోషన్ లో ఉన్న ప్రేమకాదు. ఎరిక్ ఫ్రాం అన్నట్లు ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అనే ప్రతిపాదనలు పెట్టె మానవి ఉండేది. అయితే ఆమెప్పుడూ ఇద్దరు ఉన్నప్పుడు గాక, వేరు వేరుగా కలిసినప్పుడు ఈ మాట అనేది. సోయి, ఎరుక ఉన్న జనాలు కదా. ‘మాకిష్టమైతే మేమే చేసుకుంటాం గానీ ఈ ప్రతిపాదన ఇంకోసారి మా దగ్గర తేవద్దు.’ అని సూటిగానే చెప్పారు. ఏమైందో ఏమో గానీ అతడు ఆ పిల్లన్ని ప్రేమిస్తున్నాడు (జెనరల్ నోషన్ లోనే) అనే ప్రచారం మొదలయ్యింది. మొదలుపెట్టిందేవరో వాళ్ళకూ తెలుసు. ఎప్పటిలానే నవ్వుకొని ఊరుకున్నారు.ఆ తరువాత ఆ నవ్వుల జుగల్ బందీ వినిపించడం ఆగిపోయింది. ఇద్దరు స్నేహితుల్లో ఒకరు బాధితులుగా, మరొకరు నిందితులుగా మిగిలిపోవడం విషాదం కదూ… ఈ కథలో లాంటి జనాలను నా బతుకులో చూశాను. ఇట్లాంటి కథలు అనేకం చెప్పగలను. అయితే సందర్భం ఇది కాదు.
చివరగా ఒక్కమాట. ప్రేమా, విప్లవమూ, వాటినుండి వచ్చే ఒంటరితనం ఏదీ వైయుక్తికం కాదు. ఈ మూడింటిలో ఏవీ రాజకీయాలతో ముడిపడకుండా లేవు. వాటన్నింటికీ మించి ప్రేమకీ, విప్లవానికీ మధ్య అడ్డుగోడగా నిలిచిన కుల వ్యవస్థ ఈ దేశపు ప్రత్యేకత. ఇక్కడ ప్రేమించేవాడికీ, విప్లవించేవాడికీ కులం ఉంది. అదో కాదనలేని సత్యం. అట్లా వికసించిన ప్రేమల్ని చిదిమేయడం నా కళ్ళతో చూశాను. కొన్ని విన్నాను. కంచికచర్ల కోటేశు నుండి మొన్నటి ప్రణయ్ దాక అట్లా చిదిమేయబడిన ప్రేమలే. ‘The caste system is one of the specific problems of the Indian democratic revolution. It is linked to Indian society and has been one of the most important means for the exploitation of the labouring masses.’ అంటుంది అనురాధ గాంధీ. కుల నిర్మూలనకు ఇరవై తొమ్మిది పాయింట్లను చెప్పింది. ‘ఒకవేళ హిందూరాజ్యం అనేది అస్తిత్వంలోకి వస్తే అది ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదం’ అని అంబేద్కర్ చెప్పినా, ‘కులవ్యవస్థ ఇండియా ప్రజాస్వామిక విప్లవానికి ప్రధాన సమస్య’ అబూ అనురాధ గాంధీ చెప్పినా ఈ దేశంలో ప్రజాస్వామ్యానికీ, విప్లవానికి కులం ప్రధాన అడ్డుగోడగా నిలబడి ఉందని గుర్తించారు గనుకే. కులనిర్మూలనా, విప్లవమూ ఒకదానితో ఒకటి ముడిపడున్న అంశాలు. ఇవి వేటికవే, వేరువేరుగా పరిష్కరింపబడవు. మతమిప్పుడు దేశభక్తి ముసుగేసుకోని మనుషుల చుట్టూ జంధ్యప్పోగుల సంస్కృతినద్దుతుంది. భిన్నత్వాన్ని అంతంచేసి ఏకత్వమే మిగలాలంటుంది. ఆ సంస్కృతిని ఓడించాకుండా, ఆ గోడను కూల్చకుండా ఈ దేశంలో ప్రేమలూ, విప్లవాలూ ఏవీ వికసించవు. ఏ కటిక చీకట్లోనో వికసించినా అవి నిలబడవు.
(ఖ్వాబ్ Of love and revolutionకి రాసుకున్న కాసిన్ని మాటలు)
నవంబర్ 2, సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ స్టడీ సర్కిల్, దోమల్ గూడలో ఖ్వాబ్ పుస్తక పరిచయ సభ.
ప్రచురణ, నిర్వహణ: ఛాయా రిసోర్స్ సెంటర్.
భలే రాశారు ప్రేమతో. ఒక వ్యాసంలో కొత్త విషయాలు తెల్సుకున్నా. మీకు అభినందనలు.