నిజమైన స్త్రీవాదులు చెప్పవలసిన మాట!

కిందటి శేఫాలికలలో కాళిదాసు కుమార సంభవం. సంస్కృత శ్లోకాలు ఎవరేనా చదువుతారా అని భయపడుతూ రాసాను. కానీ చాలామంది ఇష్టంగా చదివారు. మరికొందరు ఇంకా కావాలన్నారు. నాకూ ఇంకా రాయాలనే ఉంది.
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని అత్తవారింటికి పంపవలసి వచ్చినప్పుడు తండ్రి మనసులో ఏయే భావాలుంటాయి. స్వంత తండ్రికి సరే, పెంపుడు తండ్రికయినా ఎలాంటి స్పందనలుంటాయి. ఆ తండ్రి గృహస్తుడు కాక ఆశ్రమవాసి అయితే కూడా ఇలాంటి స్పందనలు తప్పవా! అయితే ఇవి మానవ సంబంధాలను మరింత విలువ గలవిగా చెయ్యడంలో దోహదపడే విషయాలా లేక బలహీనతలా!
చూద్దాం.కాళిదాసు శాకుంతలం నాటకంలో కణ్వమహర్షి మాటల లోంచే.
”కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతలా తత్రాపిచ చతుర్థాంకః, తత్ర శ్లోక చతుష్టయం”
అన్న శ్లోకం చిన్నప్పుడు చదువుకునే రోజులనాటి మాట. కానీ అప్పుడు చతుర్థాంకం కంటె పంచమాంకమే నచ్చింది. పంచమాకంలో క్లైమాక్స్, కుదుపులాంటి మలుపు, సంవాదం, సంఘర్షణ. అందుకే నచ్చి ఉండవచ్చు. అదంతా ఇప్పుడు గుర్తులేదు.
కానీ ఇప్పుడు తపోవనంలో జరిగిన ఎడబాటును చెప్పే చతుర్థాంకం ఎంతో గొప్పగా తోస్తోంది.
 శకుంతలను దుష్యంతుని దగ్గరకు అత్తవారింటికి పంపడానికి తండ్రి కణ్వుడు సన్నాహాలు మొదలుపెట్టాడు. మొదలుపెట్టగానే ఆయన గుండె అందరి తండ్రులకు లాగే బరువెక్కిపోయిందట.
అలా మొదలుపెట్టి ఆయన భావాలు నాలుగు శ్లోకాల్లో రాస్తాడు కాళిదాసు. నాలుగూ నాలుగు రకాల అవస్థ లు.
మొదటి శ్లోకంలో కూతుర్ని అత్తారింటికి పంపే తండ్రి మూగవేదన. అది ఆయన తనకి తానే అర్థం చేసుకోలేడు, అరాయించుకోలేడు. తండ్రులు కూతుళ్ళ మీద లేదా పిల్లల మీద ప్రేమలు బయటికి తెలియనివ్వకూడదనుకునే తరం అది.
”యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ముత్కంఠయా
కంఠస్థంభిత బాష్పవృత్తి కలుషం చింతా జడం దర్శనం”
శకుంతల అత్తారింటికి వెళ్ళిపోతోందంటే మనసంతా బెంగతో నిండిపోయింది. కంఠం నిండా బెంగ తాలూకు దుఃఖం. కళ్ళు చింతతో దేనిమీదా దృష్టి నిలపలేకపోతున్నాయి – ఇదంతా ఎవరికి చెప్తాడు?  తనలో తనే అనుకుంటున్నాడు. ఇంకా ఇలా కూడా
”వైక్లబ్యం మమ తావదీదృశమహోస్నేహాదరౌణ్యౌకసః
పీడ్యంతే గృషిణః కథంను తనయా విశ్లేష దుఃఖైర్నవైః”
అన్ని బంధాలూ వదిలి అడవులలో ఉండే మాకే ఇటువంటి అనుబంధం తాలూకు ఎడబాటు వికలత కలిగిస్తోంది కదా – ఇక గృహస్తులు ఇలాంటి ఎప్పటికీ కొత్తగా ఉండే తనయా విశ్లేష దుఃఖానికి ఎంతగా పీడించబడతారో కదా – అనుకుంటాడు.బాధతో పీడించబడడమే. అంటే మామూలు బాధ కాదు.
“ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలవలేక నా గుండె నీలాలై పారితే..
అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా”
అని ఆ బెంగని కవులు ఇప్పటికీ రాసుకుంటూ పాడుకుంటూ ఉంటారు. అంతటి పెను బెంగ అది.
 నవైః అన్న విశ్లేషణం ప్రత్యేకమైనది ఎన్ని వందల ఏళ్ళు గడిచినా, చదువుకు అమెరికా పంపిన కూతురయినా పెళ్ళి చేసి పంపేటప్పుడు తలిదండ్రులు ఇలాగే గుండె బరువుతో బెంగటిల్లుతారు కదా. ఇది నవైః దుఃఖైః అన్నమాటలో ఉంది.ఎన్నేళ్లు గడిచినా కొత్తగా ఉండే తనయా విశ్లేషదుఃఖం అంత కొత్తది అంటే ఎన్నటికీ పాతబడనిది
ఇక తన దుఃఖం ఎవరికి చెప్పుకుంటాడు. నిరంతరమూ తపోవనంలో ప్రకృతికి చేరువగా ఉన్న మనిషి. శకుంతలకు తోబుట్టువు లెవరూ లేరు. కానీ తోబుట్టువుల్లాంటి మొక్కలున్నాయి. వాటికి చెప్పుకుంటున్నాడు. తన దుఃఖం సంగతి కాదు.
 మీకూ చాలా బెంగ కదా ఆమె వెళ్ళిపోతోందంటే. ఎందుకంటే అంత బాగా మిమ్మల్ని చూసుకునేది ఆమె పోక పెద్ద లోటే. కానీ సంతోషంగా పంపాలి, పంపుదాం అంటాడు.
”పాతుం న ప్రథమం వ్యవస్యతి జలం
యుష్మాత్ స్వపీతేషు యా
నాదత్తే ప్రియ మండనాపి భవతాం
స్నేహేన యా పల్లవం”
మొక్కలతో ఇలా అంటున్నాడు. మీకు నీరు పెట్టకుండా తాను ఎన్నడూ పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టలేదు. తనకి తలలో అలంకరించుకోవాలని కోరిక ఉన్నా మీమీద ఉన్న స్నేహం వల్ల చిగురాకు కూడా కోయలేదు. పైగా
”ఆద్యేవ కుసుమ ప్రసూతి సమయే యస్యాః భవత్యుత్సవః”
మీ మొదటి పూవు వికసించే సమయం ఆమెకు ఉత్సవమే.మొగ్గ రేకులుగా విచ్చుకోగానే ఈ వనమంతా పండగ చేసేది. అలాంటి శకుంతల మీ ప్రియ నెచ్చెలి అత్తారింటికి వెళ్ళిపోతోంది మిమ్మల్ని వదిలి. అనుజ్ఞ ఇవ్వండి.
”సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం”
తన బెంగంతా ఇలా వాటితో చెప్పుకున్నాడు.
 పర్యావరణ స్పృహ అన్నమాట అర్థం కూడా సరిగ్గా తెలీకుండా వాడుతున్న మనకి కాళిదాసు ఈ శ్లోకం ద్వారా ఆ స్పృహ గురించి చెప్పేడనిపిస్తుంది.
 అంతకుముందే శకుంతలకి మధుపర్కాల దగ్గరనుంచి అరణ్య దేవతలెలా అనుగ్రహించారో రాస్తాడు. ఇప్పుడు ఆ వనదేవతల తో ఆమె చేసిన సపర్యా రూపమైన చెలిమిని గుర్తు చేసి ఆనందంగా పంపండి అని కోరుతున్నాడు.ఎందుకంటే తనలాగే వనమంతటికీ శకుంతలను వదిలడం అంత బెంగానూ అని ఆయనకు తెలుసు. అది ఆయన స్పృహ.
మూడవ శ్లోకం తండ్రిగా కుమార్తెకు అత్తవారింట్లో నడుచుకోవలసిన విధానాన్ని గురించి చేసే హితబోధ.
ఇది ఇవాళ మనకి పాతబడినట్టనిపిస్తుంది కానీ పాతది కాదు.
”శుశ్రూష స్వ గురూన్ కురుప్రియ సఖీవృత్తిం సపత్నీ జనే
భర్తృర్వి ప్రకృతాపి రోషణతయా మాస్మ ప్రతీపం గమః”
అక్కడ పెద్దలందరినీ సేవించు అన్నాడు. ఈ శుశ్రూష అన్నమాట చిత్రమైనది. దానికి వ్యుత్పత్తి’ శ్రోతుం ఇచ్ఛా’ అని. అంటే వినాలనే కుతూహలం కలిగి ఉండడం అని.
 అంటే పెద్దవాళ్ళ మాట విను అనే అర్థం. వాళ్ళు చెప్పినట్లు చేసినా చెయ్యకపోయినా కనీసం మాటైనా విను అనే కదా.అలాగైనా పెద్దవాళ్లను గౌరవించవచ్చు. ఇది ఇప్పటిపిల్లలకోసం నేను మార్చేను. కణ్వుడి ఉద్దేశం సేవించమనే.
ఆ మాటతో మొదలుపెట్టాడు.
 ”నీ భర్త మహరాజు కదా. చాలామంది భార్యలుంటారు. అంటే నీకు సపత్నులు. వారితో ప్రియసఖిగా ప్రవర్తించు. ‘కురుప్రియ సఖీవృత్తిం’ అన్నమాట అర్థం అది మరి. ఈ పెళ్ళి నీ ఎంపిక. కాబట్టి నువు ఇలా ఉంటే నీకు మంచిది అన్నాడు.
”భర్తుర్విప్రకృతాపి రోషణతయా మాస్మప్రతీపం గమః”
“భర్త వల్ల కష్టం కలిగినా రోషంతో ప్రతిస్పందించకు” అన్నాడు కణ్వుడు ఆశ్రమవాసి కావడం వల్ల.
కానీ నిన్న మొన్నటిదాకా గృహస్తులు కూడా పిల్లలకి అదే మాట చెప్పేరు. ఇప్పుడు గృహస్తులు చెప్పకపోయినా ఆ తర్వాత గొడవలు పడినప్పుడు కౌన్సిలింగ్ సెంటర్లలో ఆ మాటే చెప్తున్నాం. అవతలివాళ్ళు కోపంగా ఉన్నప్పుడు కాస్త తగ్గండి అని. ఐతే ఆ కోపం మితిమీరితే ఎవరూ ఊరుకోరు. ఇంత చెప్పినా శకుంతలే ఊరుకోలేదు.
నిండు సభలో దుష్యంతుడు నువు అసత్యమాడుతున్నావు మీ ఆడవాళ్ళలో ఈ ‘అశిక్షితపటుత్వం’ జంతువుల్లో కూడా ఉంటుందంటూ నిందించాడు. అంటే నేర్చుకోకుండానే మానిప్లేట్ చెయ్యగలగడం. మీ ఆడవాళ్ళు సులువుగా అబద్ధాలాడేస్తారు అన్నట్టు.
అప్పుడు కణ్వుడి మాటలు తల్చుకుని ఆవిడ ఊరుకోలేదు. రాజు మొత్తం స్త్రీ జాతినే నిందించాడు. అప్పుడు ఇలా అంది
ధర్మకంచుకం తొడుక్కున్న నువ్వు తృణచ్ఛన్న కూపంలా ఉన్నావు అంది. గడ్డితో కప్పబడిన నుయ్యి ఎలా మోసగిస్తుందో అలా నువ్వు ధర్మం అనే చొక్కా తొడుక్కుని ఉన్నావంది.
సరే ఏది ఏమైనా కణ్వుడు ఆ ఉపదేశం కూతురికి చేశాడు.
”భూయిష్టం భవదక్షిణా పరిజనైః భాగ్యేష్వనుత్సేకినీం”
ఇది అసలైన మానవతా వాదులు, నిజమైన స్త్రీవాదులూ చెప్పవలసిన మాట.
“నువు మహారాజుకు భార్యగా వెడుతున్నావు. ఎందరో పరిజనులు ఉంటారు. వారిపట్ల దాక్షిణ్యంతో ఉండు. దక్షిణస్యభావం దాక్షిణ్యం. అంటే అందరిపట్లా సమానమైన దృష్టి. అలా ఎప్పుడు ఉండగలవంటే సంపదల పట్ల ఉత్సాహం లేకుండా ఉండగలిగితేనే సుమా. కొత్తగా సంపదలలోకి వెడుతున్నావు. కాబట్టి ‘భాగ్యేషు అనుత్సేకినీం’ అన్నాడు.
చివరిగా యాంత్యేవం గృహిణీపదం యువతయోః వామాః కులస్యాధయః
ఒక గృహిణీ స్థానానికి వెళ్ళవలసిన యువతి ఇలా ఉండకపోతే ఆమె ఆ వంశానికే అనారోగ్యకారణమవుతుంది అన్నాడు. ఇది కేవలం ఆడవాళ్ళ మీద మాత్రమే పెట్టిన బాధ్యత అనుకుంటే ఈ చివరి వాక్యం మనం ఒప్పుకోవద్దు. కానీ పురుషధర్మాలు కూడా కాళిదాసువంటివారు చెప్పకుండా వదలలేదు.
ఇప్పటికి మూడు శ్లోకాలయ్యేయి. ఒకటి ఆత్మగతం. రెండవది ప్రకృతి నివేదనం. మూడు కూతురికి ప్రేమబోధ.
ఇక అల్లుడికి చెప్పవలసిన మాటలు కూడా ఉన్నాయి. అవి మరీ ముఖ్యంగా చెప్పుకోవలసినవి.
”అస్మాన్ సాధు విచింత్య సంయమ ధనాన్ ఉచ్ఛైఃకులంచాత్మనః”
నీకన్న సంయమ ధనులము, సాధువులము అయిన మేము అన్నివిధాలుగా పెద్దలమని భావించి మేం చెప్పే ఈ మాటలు విను. మీ ఇద్దరిమధ్య ఏర్పడిన ఈ స్నేహం అబాంధవ కృతం. అంటే మేం నిర్ణయించి చేసింది కాదు. మీ ఇద్దరూ ఇష్టపడి స్వేచ్ఛితంతో చేసుకున్నది. కాబట్టి ఈమెను నీ భార్యలందరిలోనూ సామాన్య ప్రతిపత్తి పూర్వకంగా స్వీకరించు అన్నాడు.
”తృయ్యస్యాం కధమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్తించతాం
సామాన్య ప్రతిపత్తి పూర్వక మియం దారేషు దృశ్యా త్వయా”
ఈ “సామాన్య ప్రతిపత్తిపూర్వకమియం” అనడంలోనే ఆయన వివేకం అంతా ఉంది. నీ మిగిలిన భార్యలతో సమానంగా చూడు అని పైకి తోస్తోంది కానీ మరో రెండు రకాలుగా విడదీసే వీలు ఉండేలా చెప్పేడు. సా అంటే ఆమె మిగిలిన భార్యల కంటె ‘మాన్య ప్రతిపత్తిపూర్వకం ఇయం’ గౌరవప్రదమైన దానిగా చూడాలి అని ఒకర్థం.
సా, మ, అన్యప్రతిపత్తి పూర్వకమియం. అంటే ఆమె మరెవరితోనూ సమానంగా చూడబడని ప్రత్యేకత కలది అనే అర్థంలోనూ ఆ పదం విరిగేలా రాస్తాడు.
 అంటే ఈ మా అమ్మాయి నీ అంతఃపురంలో నీ భార్యలందరికన్న గౌరవప్రదమైనది, వేరెవరితోనూ పోల్చదగినది కాదు అని గోప్యంగా చెప్పాడు.
 చివరకు,
”భాగ్యాయత్తమతఃపరం నఖలు తద్వాచ్యం వధూబంధుభిః”
అని పూర్తి చేసాడు. ఇక తర్వాత వారి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది వధువు తాలూకువాళ్ళు ఇంతకన్నా వాచ్యంగా వాళ్ళమ్మాయి గురించి చెప్పకూడదు అంటూనే నా మాటల వెనక ఉన్న శ్లేష గమనించు అని సూచించాడు. సామాన్య అన్న పదం ఊరికే వాడలేదు. అందులో విరుపు వల్ల కలిగిన వ్యంగం ఉంది సుమా గ్రహించు. ఇది మనకి అంటే పాఠకులకు కూడా సూచనే అనమాట.
అమ్మా అక్కడ నువు పద్ధతిగా ఉండు అని చెప్తూనే మా అమ్మాయిని మర్యాదగా చూసుకో అని సందేశం పంపేడు.
అందుకే కావ్యాలలో దృశ్య కావ్యం అంటే నాటకం గొప్పదని నాటకాలన్నింటిలోనూ శాకుంతలం గొప్పదనీ, అందులోనూ నాలుగో అంకం గొప్పదనీ, అందులోనూ ఈ నాలుగు శ్లోకాలూ గొప్పవనీ ఒక శ్లోకం ముందే అనుకున్నాం కదా!
మానవీయ సంబంధాలలోని సున్నితమైన అనుభూతిని వాటికి దూరంగా ఉండే పెంపుడు తండ్రి కణ్వమహర్షి అనుభవంలోకి తేవడం ఒకటైతే, దాంతోపాటు ముగ్గురితో మాటాడిన మూడు విధాలయిన కోణాలను ఈ శ్లోకాలలో ఆవిష్కరించడం వీటిల్లో విశేషం. ఇప్పటికీ ఇవే అనుభూతులు మనకు కవిత్వంలోనూ, జీవితంలోనూ కనిపిస్తూ ఉన్నాయంటే వాటి విశ్వజనీనతను వాటిని అప్పుడెప్పుడో పట్టుకున్న కవుల ప్రాచీనతను గుర్తు చేసుకోక తప్పదు.
”భాసోహాసః కవికుల గురుః కాళిదాసో విలాసః
భాసుడి చిరునవ్వులాంటి కవిత్వం కాళిదాసులో విలాసంగా విజృంభించిందట. ఈ శ్లోక రచయిత ఎవరో గానీ కాళిదాసుని కవికుల గురువు అన్నది ఇందుకేనేమో.
*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నా 10th క్లాస్ లో అభిజ్ఞాన శాకుంతలం నాండి టేల్ వుండేది..మాతెలుగు సర్ ఈ లెసన్ చెబుతుంటే ఎంతో పారవశ్యం గా విన్నాను.. మళ్ళీ గుర్తుచేసి నందులకు కృతజ్ఞతలు వీరలక్ష్మి గారు

  • మానవ సంవేదనలు తరతరాలకు మరికొంచెం లోతుగా ఉండాలి అని ఉపదేశిస్తున్నట్టున్న మీ వ్యాఖ్యానం బహు సుందరం మేమ్.

  • వీరలక్ష్మి గారు,
    మీరు శాకుంతలం లో వున్న జ్ఞాన సంపదను నాలుగు స్లోకములతో చాలా బాగా వివరించారు. Please keep writing these for the likes of me that do not have expertise in Sanskrit.

  • పెళ్ళంటే నూరేళ్ళ స్నేహం అని భవభూతి అన్నాడని చిన్నప్పుడు విన్న్నా ..

    నాకు పెళ్ళై అయిదేళ్ళు గడిచినా ఇంకా ఈ మాట నాకు నిరంతరంగుర్తుకొస్తూనే వుంటుంది .

    . ఆ పద్యం ఏంటో చెప్పరా…

    • సుధీర్ గారూ
      ఇది శేఫాలికలు పేరుతో నెలనెలా రాస్తున్న రచన. వెనకటి నెలల్లో ఏదో నెలలో ఈ శ్లోకం మీదే రాసాను. శ్రమఅనుకోక ఒక్కసారి వెనక్కి వెళ్లి చూడండి. దొరకకపోతే మీరు కోరిన ట్టు ఇక్కడే రాస్తాను

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు