నిరంతరం
నడక సాగిస్తున్న చెడ్డవాణ్ణి
దారి
ఎంత పొడవో ఎంత వెడల్పో తెలియదు
ఎక్కడ ఆగాలో తెలియదు
ఎక్కడి దాకా నడవాలో తెలియదు
ఒక టెంటు నుండి మరొక టెంటుకు
ఒక ఇసుక ప్రాంతం నుండి
మరొక ఇసుక ప్రాంతానికి
ఒక నది నుండి మరొక నది వరకు
కేవలం ఒకేఒక్క సంచీ భుజానేసుకుని
నిరంతరం
నడక సాగిస్తున్న చెడ్డవాణ్ణి
ఇల్లును, ఇంటి మనుషులను
అందరినీ పోగొట్టుకున్న ఒంటరి ప్రయాణికుడిని
టెంటుల నుండి, ఇసుక రేణువుల నుండి,
నదీ జలాల నుండి
అనేకసార్లు వెలివేతకు గురైన చెడ్డవాణ్ణి
నిజమే కదా..
ముక్కులు ముక్కలైన పసిపిల్లల శవాలను
అక్కడే వదిలేసి లోకమంతా తిరగడం
ఎంత చెడ్డతనం!
బాంబులు పడిన దేశంలో
దొరికిన ఏకైక సంచీలో
లక్షల శవాలను సర్దడం చేతకాని చెడ్డవాణ్ణి;
బాంబులు నా మీద పడలేదని
వెక్కి వెక్కి ఏడ్చిన చెడ్డవాణ్ణి
దుఃఖాన్ని
ఒంటరి గుండెలో నింపుకొని తిరగడం
ఎంత చెడ్డతనమో తెలుసా!
•••
ఇంత చెడ్డవాడి సంచీలో
ఏముందని అడుగుతావు కదూ
నెలలు నిండని పసిపాప కోసం
ఓ కొత్త గౌను
దేశమంతా తిరిగి వెతుకులాడితే
ఆ సైజు పిల్లలెవ్వరూ బతికిలేరు
పిల్లలు మిగలని దేశంలో
గౌను మాత్రమే మిగిలిందని చెప్పడానికి
ఎంత చెడ్డతనం కావాలో తెలుసా!
*
Add comment