నిజం! నా లోపల ఒక పాలస్తీనా వుంది.
సమాజం సంగతి ఏమో కానీ నన్ను నేను అర్ధం చేసుకోడానికి, మనిషిగా బాగుచేసుకోడానికి ఉపయోగపడ్డ భావజాలాల్ని, భావోద్వేగాల్ని, ఉద్యమాల్లో భాగస్వామ్యాన్ని అన్నింటినీ బైటకి తరిమేసి స్వార్ధంతో కుటుంబమనే ఇజ్రాయెల్ని నిర్మించుకొని, అందులోనే మునిగిపోయి ఒక పదిహేను, ఇరవై ఏళ్లు బతికేసిన అనంతరం నాలోని పాలస్తీనా మళ్లీ నన్ను నిద్ర లేపింది.
తెలియక కొంత, తెలిసి కొంత కులమో జెండరో ఏదోటి, లేదంటే ఆ రెండూనో నేను బోనులో దోషిలా నిలబడేలా చేశాయని మరోసారి గుర్తుకొచ్చింది. ఆధిపత్య సంస్కృతి మనిషిని నిద్రలో కూడా నేరస్తుడినెలా చేస్తుందో గుర్తుకొచ్చి కకావికలై పోయాను. ప్రభావవంతమైన ఒక మాట కూడా ఒక మంచి చర్యేనని ఎరుక కలిగింది. వదిలేసిన బాటలు మళ్లీ తారసపడ్డాయి. మరపులోకెళ్లి అగాధాలలోని బండ రాళ్ల కింద కూరుకుపోయిన ఆవేశాలన్నీ కస్సున పైకి లేచి నన్ను మళ్లీ కవిని చేశాయి. పునరుత్తానంలో ఒక్కొక్క వాక్యం వెలువడుతుంటే అంతరంగం కొద్దికొద్దిగా పునీతమౌతున్న భావన! హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసినట్లు నా మీద నేను దాడి చేసుకుంటూ మరీ రాస్తూ వస్తున్నాను.
మొదటి నుండీ ఏ గణాంకాలను చూపించి నిరూపించలేని గాట్టి నమ్మకం నాకోటుంది. లేదా అది కనీసం నా వరకు కరెక్టేమో అనిపిస్తుంది. హృదయం నుండి వచ్చిన కవిత్వం కవిని బాగు చేస్తే అదే హృదయం నుండి వచ్చే వచన సాహిత్యం మరింత విస్తృతిని కలిగి వుంటుందని, సమాజాన్ని మరింత ఆలోచింప చేస్తుందదని నాకనిపిస్తుంటుంది. కవిత్వం కంటే వచన సాహిత్యం వల్లనే ఎక్కువగా ప్రభావితమైన అనుభవం నాది. అంతే! వచనం రెండు కాళ్లని భుజాల మీదకి ఎత్తుకొని తిరిగాను. అలసిపోతే గుండెలకు హత్తుకునే పడుకున్నాను. సామాజిక మాధ్యమమే కాదు, సారంగ వంటి వెబ్ మేగజైన్లు కూడా నాకు వేదికలయ్యాయి. సాధన చేసుకునే అవకాశం ఇచ్చిన మైదానలయ్యాయి. అది నచ్చిన పుస్తకం గురించి కావొచ్చు, లేదా ఓ సినిమా మంచి చెడుల గురించి కావొచ్చు లేదా సమాజానికి సంబంధించిన ఏదో రాజకీయ, సాంస్కృతిక విశ్లేషణ కావొచ్చు. గతంలో కంటే వాక్యాన్ని ప్రేమించడం ఎక్కువైంది అది కవిత్వానిదైనా లేదా వచనానిదైనా!
ఇప్పుడు రోజులెలా గడుస్తున్నాయంటే చెప్పడానికి నాకు మామూలుగానే వున్నా మీకు గమ్మత్తుగా అనిపించొచ్చు. ఏ పుస్తకమూ ఒకే ఊపున చదివే అలవాటు లేనందు వల్ల మంచం మీద కొంత కొంత చదివి ఫ్లాప్స్ పెట్టి వదిలేసిన ఒక పది పుస్తకాలు నా వంతు ఎప్పుడొస్తుందని ఏదో ఒక పుస్తకం అశరీరవాణిగా అడుగుతున్నట్లుగా అనిపిస్తుంటే నాకు మాత్రం మహా ముచ్చటగా వుంటుందిలే! ఈ మధ్య చలం నన్ను మరీ కలవర పెడుతున్నాడు. ఒక సాంస్కృతిక దిగ్భ్రాంతకారుడిగా భయపెట్టిన చలాన్ని మెజారిటీ సమాజం అర్ధం చేసుకోవడం కంటే వ్యతిరేకించింది ఇప్పటివరకు. ఆయన ఆచరణ సాధ్యుడు కాదని తోసిపుచ్చింది. ఆధునికత వల్లనో, విద్య వల్లనో అర్ధం చేసుకునే సామాజికుల సంఖ్య పెరుగుతున్నందున వర్తమానానికీ ఆయన సాపేక్షుడేనని, ఆయన అవసరం ఎక్కువుందని నా అభిప్రాయం. అందుకే చలం నవలా నాయకల్ని పరిచయం చేసే సిరీస్ రాస్తున్నా. కాసేపు ఆ విధంగా చలంతో సంభాషిస్తున్నా.
నాది తిరిగే కాలు. ఎక్కువ తిరగనందు వల్లనే మనుషులు మరీ ఎక్కువ చెడిపోతుంటారని నాకో ప్రగాఢ నమ్మకం! మరీ పెద్ద సైజులో కాదు కానీ చిన్న దిమ్మరిని. ఎటో అటు వెళ్లకుండా ఒకే చోట ఎక్కువ కాలం ఊపిరి తీసుకోలేను. అలా వెళ్లి వచ్చిన వాటన్నింటి గురించి రాయకున్నా కొన్నైనా యాత్రా కథనాలు రాస్తుంటా. అలా ఇప్పుడు గత సంవత్సరం తన సంక్షుభిత కాలంలో చేసొచ్చిన శ్రీలంక పర్యటన గురించి కూడా రాస్తున్నా!
ఏడేళ్లైంది నా చివరి కవిత్వ సంపుటి “కవిత్వంలో ఉన్నంతసేపూ….” వచ్చి. ఆ తరువాత రాసిన సుమారు నలభై కవితలతో మరొక్క సంపుటి తీసుకొచ్చి ఇంక నా కవిత్వానికి జోహార్లు పలికేద్దామనుకుంటున్నా. నా వల్ల కాదు తండ్రీ ఇంక! ఇష్టంగానూ, ఎక్కువగానూ చదివేది కథలూ, నవలలూ! రాసేది మాత్రం కవిత్వమా? అన్యాయం కదూ ఇది! అందుకే కొత్త సంవత్సరం నుండి వచనానికే శేష జీవితాన్ని అంకితం చేయదల్చుకున్నా. అందువల్ల నా చివరి కవిత్వ సంపుటి కోసం రోజూ కాసేపు ఏదో ఒక కవితని పరామర్శించుకుంటున్నా.
పైన చెప్పిందంతా ఇవాల్టి నా దినచర్య. అంటే ఇదంతా ఏదో డ్యూటీలా చేస్తున్నాననుకునేరు! కాదు కాదు. నేనలా బతికేస్తున్నా. నా లోపలి పాలస్తీనాని బతికించుకుంటున్నా!
*
Add comment