ప్రయాణంలో ఉన్నాం.
ఎప్పటినుండి అనుకుంటున్నది ఇది? నాలుగేళ్లయిందా?? అన్ని సిద్ధం అనుకున్నాం ఆరోజు. పిల్లలతో కలిసి ఇద్దరం సరదాగా ఓ నాలుగు రోజులు ఆ మంచు కొండల దగ్గర గడిపి రావాలి. అందమైన జ్ఞాపకాలను మూట కట్టుకొని తెచ్చుకోవాలి. అప్పటి ఆలోచన అదే. ఇప్పుడో మరి ?ఏమో! తెలియదు. వెళ్లాలి. అంతే! దేనికోసం?? అదీ తెలీడం లేదు. ప్రయాణం చెయ్యాలి .అదొక్కటే మనసులో. జ్ఞాపకాలను మోసుకుని వస్తానో… వదులుకోవలసినవి వదులుకొని వస్తానో… ఏమో! వెనుకకే పరిగెడుతోంది మనసు.
నాలుగేళ్ల క్రితం మాట .ఇక నాలుగు రోజుల్లో బయలుదేరుతాం అనగా ఆ వార్త. నాన్న వెళ్ళిపోయిన వార్త .మాకు చివరి చూపు కూడా లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్న నాన్న నిద్రపోతున్నట్టే వెళ్లిపోవడం. దేనికీ ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు, ఎవరి చేతా ఏమీ చేయించుకోకూడదు అని ఎప్పుడూ అనుకునే నాన్న అలాగే వెళ్ళిపోవడం సంతోషించాల్సిందే .మనసుకి తృప్తి ఎక్కడ? చివరి చూపు దక్కడం అంటే?? నాన్న మంచం మీద ఉండగా మమ్మల్ని చూడాలని కోరుకోవడమా? లేక స్పృహ లేని స్థితిలో నాన్న ఉంటే మేము నాన్నని చివరిసారిగా ఊపిరితో ఉండడం చూడడమా ??ఎవరికి చివరి చూపు అది??? ఎన్నెన్నో నాన్న జ్ఞాపకాలు. మధ్యలో నేను.
ఎంత తృప్తి నాన్నకి! చిన్న చిన్న విషయాల్లో కూడా .ఎప్పుడూ ఏదీ కావాలని కోరుకోకుండా ఉండడం .ఎలా సాధ్యం అసలు ? ఎక్కడ ఉంటే అదే ఆనందం, పరమానందం .ఏం చేసిపెట్టినా అమృతమే. పక్కనే ఉన్న శివ కోవెల కూడా నాన్నకి కైలాసమే. ఎక్కడికైనా వెళదాం అన్నా “మీరు వెళుదురూ … నే ఉంటా!” ఇదే మాట. ఎందుకన్నింటిలోనూ ఇంత నిరాసక్తం .నా ఆలోచన ఎప్పుడూ అదే. ఎప్పుడైనా మా దగ్గరకు వచ్చిన ఆ కొద్ది రోజుల్లోనే ఏవో తిప్పి తీసుకురావాలని, చూపించాలని మా తాపత్రయం .అన్నిటికీ అదే చిరునవ్వు .మా బలవంతం మీదే ఎక్కడికైనా తప్పనిసరిగా రావడం. ఎప్పుడూ ఏదో ధ్యానం, పాటలు ,మాటలు , పిల్లల కోసం కథలు,కబుర్లు…. ఎప్పుడూ చిరునవ్వు నవ్వే నాన్న నోట అన్నీ మధురాలే .
“అందరం వస్తే ఇల్లు చిన్నదవుతోంది నాన్నా! ఇది అమ్మి కొత్తది తీసుకోవచ్చుగా”
“మా ఇద్దరికీ చాలదూ? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే మీకోసం మాకెందుకు ఆ లంపటం?”
ఉన్నది చాలు .అంతే. నాన్నకి మరేం వద్దు.
” ఒరేయ్ ఈసారి పరీక్షల్లో ఫస్ట్ రావాలి రా.”
” ఎందుకురా అంత ఒత్తిడి వాళ్ళమీద? చదువుతారు లే .హాయిగా చదువుకోనీ”
ఇదీ నాన్న పద్ధతి .
“నాన్నా! ఈసారి సెలవుల్లో తుంగనాథ్ వెళదాం. అన్నిటికన్నా ఎత్తులో ఉన్న శివాలయం అది తెలుసా?
” పక్కనే ఉన్న శివుడు చాల్లెద్దు నాకు. మీరు వెళ్ళండి .”
ఇదీ నాన్న ఆలోచన.
ఎప్పుడూ ఏ కోరికా లేని నాన్న కోరిక ఒక్కటే. అది కోరికేనా? కాశీ వెళ్లి గంగ ఒడ్డున ప్రశాంతంగా కొన్ని రోజులు ఉండి రావాలి. అంత జనం,ఆ ఇరుకు వీధులు, ఆ ఘాట్లు, అక్కడి కార్యక్రమాలు…. అన్నీ నేను వినడమే గాని చూసింది లేదు. అక్కడ ఏం ప్రశాంతత?? ఏమో !”ఎప్పుడో వీలు కుదిరితే వెళదాం” ఇదే నా సమాధానం.
ఇంతలోనే ఇలా… తీసుకుని వెళ్లి ఉండాల్సింది .ఎప్పుడూ ఏదీ అడగని, కావాలని కోరుకోని నాన్న కోరిక తీరలేదు. కాదు… తీర్చలేదు .మా ఉరుకుల పరుగుల జీవితాలు, ఉద్యోగాలు ,చదువులు, పోటీలు…. వీటి మధ్యలో ఆటవిడుపుగా గొప్ప పర్యాటక స్థలాలను ఎంచుకొని మా పర్యటనలు.
నాన్న వెళ్లిపోయిన ఏడాది మేం ప్లాన్ చేసుకున్న తుంగనాథ్ ప్రయాణం ఆగిపోయింది. మళ్ళీ వెళ్ళడం పడలేదు. నాలుగేళ్ళ తర్వాత ఇలా.
ప్రోగ్రాం అంతా పిల్లలదే హడావిడి. ఈ నాలుగేళ్లలో పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్లే ప్లాన్ చేసేంత ఒక్కళ్ళూ తిరిగి రాగలిగినంత .మరింత చదువులు… మరింత ఒత్తిడి… ఇంకా పెరిగిన మాసంపాదన… పెరుగుతున్న బాధ్యతలు… ఉక్కిరిబిక్కిరి జీవితం. ఆటవిడుపు కావాల్సిందే .నిజంగా అందుకే ఈ ప్రయాణం .
నలుగురం సిద్ధం ట్రెక్కింగ్ కోసం .ఢిల్లీ ఫ్లైట్లో చేరుకుని అక్కడి నుండి ట్రైన్ లో హరిద్వార్ .హరిద్వార్ నుండి బస్సులో ఋషికేశ్ చేరాలి .అక్కడ మజిలీ తర్వాత రిషికేష్ నుండి రుద్రప్రయోగ్. అక్కడి నుండి ఊఖీమఠ్ . ఆ తర్వాత చోప్టా. ఇక చోప్టా నుండి తుంగనాథ్ ట్రక్కింగ్ మొదలెట్టాలి. ఇది మా వాళ్ళ ప్లాన్ .ఎక్కడ ఎక్కువ టైం వేస్ట్ అవ్వకూడదు .ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తుంగనాథ్ మందిరం చేరుకోవాలి .ఇంకా మీదకి చంద్రశిల కూడా వెళ్లి రావాలి .అక్కడ నుండి కనిపించే ఆ సుందరమైన హిమాలయ పర్వత శిఖరాల శ్రేణుల్ని చూడాలి.
ప్రస్తుతం హరిద్వార్ నుండి రిషికేష్ చేరుకున్నాం .సాయంత్రం గంగ ఒడ్డుకు చేరుకున్నాం .చల్లటి గాలి హాయిగా వంటిని తాకుతోంది .హారతి వేళ. పిల్లలకు బీటిల్స్ ఆశ్రమం వైపు వెళ్లాలని సరదా. ఈ హారతులు, పూజలు వీటికి ఇంకా టైం ఉంది మాకు అంటూ వాళ్ళ దారిన వాళ్లు.
మేం మాత్రం గంగ ఒడ్డునే. కాసేపు ప్రశాంతంగా ఆ గంగ ఒడ్డున కూర్చోవాలనిపించింది. ఆ గంటల శబ్దం, గంగా హారతి ,జనాలు…. చుట్టూ అన్నీ ఉన్నా ఏదో ప్రశాంతత మనసుకి. నాన్న స్మృతి మనసులో. పాదాలను గంగలో పెట్టి కూర్చున్నాను. అలసిన పాదాలను చల్లగా తాకుతూ గంగ…అలసట అంతా తీరిపోయినట్టు. నీటిదా ఆ స్పర్శ ?కాదు ఎప్పటిదో! తెలిసినదే ఏభై ఏళ్లుగా. నేను ఎరిగిన స్పర్శ అది. చిన్నప్పుడు ఆడి ఆడి అలిసిపోయిన పాదాలను మెత్తగా రాస్తున్నట్టు …నాన్నదే కదూ ఆ స్పర్శ !
బయట చలిగా ఉన్నా గంగలో మునుగుతుంటే గుండెల పై గంగ వెచ్చగా…. లోపల మనసుని చల్లగా తడుపుతున్న గంగ .పరీక్ష పోయిందని వెక్కెక్కి ఏడుస్తున్న నా గుండెలను రాస్తూ ఓదారుస్తున్న నాన్న స్పర్శ.
నా దోసిలి నిండా గంగ…. నా చేతులను మెత్తగా స్పృశిస్తూ కబుర్లు చెప్పే నాన్నదే ఆ స్పర్శ !
గంగలో పూర్తిగా మునక ….నా తలను తడుపుతూ గంగ…. ప్రయాణమవుతున్నప్పుడల్లా నా తల నిమురుతూ జాగ్రత్తలు చెప్పే నాన్న చేతి స్పర్శ… ఆ గంగా స్నానం…. అలసిన నన్ను తన ఒడిలో చేర్చుకుని ఒళ్లంతా నిమురుతున్న నాన్న.
గంగ …. గంగ….గంగ…. ఇప్పుడు అనిపిస్తోంది .గంగ ఒడ్డున ప్రశాంతంగా గడపాలనుకోవడం నిజంగా నాన్న కోరిక కాదేమో … నా మనసంతా ఓ నెమ్మది …చల్లదనం ఇప్పుడు. బహుశా ఎక్కడికీ వెళ్ళక ఈ ఒడ్డునే వాళ్ళు తిరిగి వచ్చేదాకా ప్రశాంతంగా ఉండిపోయినా….
(వచ్చే సంచికలో మరిన్ని విశేషాలు)
*
స్వరరాగ గంగా ప్రవాహమే…
దోసిలి నిండా గంగ…
మనసు నిండిన గంగ…
నాన్న నవ్వంత ప్రశాంతమైన గంగ…
నాన్న మనసంత గంభీరమైన గంగ…
అమ్మ నాన్న ఆశీస్సులు పొదువుకున్న
చల్లని గంగ…
Thank you
మనసులో గూడు కట్టిన గంగ కన్నుల వెంట ఆర్ద్ర గంగగా మారి అక్షరాలై ఒలికింది.
ధన్యవాదాలు అండి
నాకు యాత్రా సాహిత్యం, లేఖా సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తి.ఈ రెండూ రాసేవాళ్ళ మనసుల్లో తప్పనిసరిగా ఒక ఆలోచన భావుకత నిండి ఉంటుంది.అది పాఠకుడికి పంచుతారు.కల్పన తక్కువ వాస్తవం ఎక్కువ ఉంటాయి. రచయితతో కలిసి నడిచి గడిపి కబుర్లు చెప్పుకున్న సంతోషాన్ని కలిగిస్తాయి, ఈ రెండు సాహితీ ప్రక్రియలు.స్వాతి గారు బాగా రాస్తారు.
మీ స్పందనకు ధన్యవాదాలు అండి
బాగుంది
Thank you