మేము చేరిన వారం రోజులలో అదే హాస్టల్ లో మాకు సీనియర్లు మరో ఐదారుగురు తెలుగు కుర్రాళ్ళు, యావత్ కేంపస్ లో ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ కుర్రాళ్ళలో ఇద్దరు తెలుగు వాళ్ళు, ఇద్దరు ప్రొఫెసర్లు, నలుగురు రీడర్లు, సుమారు పదిహేను మంది లెక్చరర్లు, అరడజను టెక్నికల్ అసిస్టెంట్స్…ముఖ్యంగా రిజిస్ట్రార్ తర్వాత అధికారిగా ముక్కవిల్లి వెంకటేశ్వర్లు గారు అనే ఆకౌంట్స్ ఆఫీసర్ గారు ..వెరసి సుమారు 50 మంది తెలుగు వారు లెక్క తేలారు.
అన్నింటికన్నా కుర్రకారుకి విచారం కలిగించే విషయం మొత్తం కేంపస్ లో చదువుకుంటున్న ఆడ పిల్లలు ఇద్దరే….రేఖా రేగే అనే మరాఠీ అమ్మాయి, సుమన్ అనే కన్నడం అమ్మాయి. వీళ్ళు కాక వెంకటేశ్వర్లు గారి ఇద్దరు అమ్మాయిలు మాత్రమే తెలుగు ఆడ పిల్లలు క్వార్టర్స్ లో ఉండే వారు. ఇంచు మించు రెండేళ్ళ పాటు అంతే సంగతులు. ఎడారే ఎడారి. గొంతు తడుపుకోవాలీ అంటే బొంబాయి ఊళ్లోకి వెళ్ళాల్సిందే..రోజూ…..ఆ వివరాలు ఇప్పుడు కాదు…అసలు ఎప్పుడు చెప్పవచ్చో, ఎంత చెప్పవచ్చో ఇంకా నిర్ణయించుకో లేదు..అలా అని అంత దారుణమైన విషయాలు అంతగా లేవు సుమా. అన్నీ కుర్ర తనం అయినా సంసార పక్షమే!
ఇక తెలుగు వారిలో ఒక ప్రొఫెసర్ గారి పేరు జి.కె. భాగవత్..అసలు పేరు భాగవతుల గోపాల కృష్ణ గారు. ఆయన జర్మనీలో చదువుకుని ,ఆ భాషలోనే ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ వగైరాలు చేసి జీనియస్ అని పేరున్న బందరు తెలుగాయన. ఇంకొక ప్రొఫెసర్ గారి పేరు జి.ఎస్.ఆర్.ఎన్. మూర్తి గారు. అంత పెద్ద పేరు పలక లేక ఆయన్ని కుర్రాళ్ళు “గసరన్” గారు అనే వారు. ఆయన కెమికల్ ఇంజనీరింగ్ విభాగం హెడ్. వీరిద్దరూ విడి విడిగా ఉండే ప్రొఫెసర్ల ఇళ్ళల్లో ఉండే వారు. ఏమ్వీ లూ గారికీ..అంటే ముక్కవిల్లి వెంకటేశ్వర్లు గారి కీ, ఈ సీనియర్ ప్రొఫెసర్లకే తెలుగు భాష మీద మక్కువ గానే ఉండేది. లెక్చరర్లలో మేం ముగ్గురం అతి త్వరలోనే దగ్గర అయిన వారిలో ముఖ్యులు సి.ఎస్. రావు & కస్తూరి, తమిళ తెలుగు ఆవిడ నాగరాజమణి నటరాజన్, తమిళుడైనా చిట్టి బాబుతో పాటు ఈమని శంకర శాస్త్రి గారి దగ్గర కాకినాడ లో వీణ నేర్చుకున్న విశ్వనాథన్, మురళీధర రావు గారి కుటుంబం (ఆవిడ పేరు మర్చిపోయాను కానీ వాణిశ్రీ అని పిలుచుకునే వాళ్ళం), జయంతి మూర్తి గారు, అంజనేయులు గారి కుటుంబం, గబ్బిట గురునాధం గారు…ఇందుతో ఒక పిక్నిక్ లో తీసిన ఆ “వాణిశ్రీ గారు, వెంకటేశ్వర్లు గారి రెండో అమ్మాయి ఉమ ఫోటో జతపరుస్తున్నాను. ఈ కుటుంబాలు అన్నీ మాకు దగ్గర అవడానికి కారణం…తెలుగు ఆటా, పాటల మీద ప్రేమ….పరాయి రాష్ట్రంలో తెలుగులో పలకరించుకుని పండుగలు చేసుకోడానికి మూర్తీ, రావూ, నేనూ మూడు నెలల్లో పన్నిన పన్నాగం…..దాని పేరు “తెలుగు సాంస్కృతిక సమితి, బొంబాయి I I T”….
అంత వరకూ..అంటే మేము ముగ్గురం రంగ ప్రవేశం చేసే వరకూ తెలుగు కార్యక్రమాలు అప్పుడప్పుడూ జరిగేవి. వాటికి స్ఫూర్తి, చాకిరీ వెంకటేశ్వర్లు గారు, విద్యార్థులలో మాకు సీనియర్ సి.వి.ఆర్. బాబు. కానీ ఈ తెలుగు వాతావరణానికి ఒక రూపూ, పద్దతీ కావాలంటే వ్యక్తులుగా కాకుండా ఒక సాంస్కృతిక సంఘంగా ఉంటే బావుంటుంది అనే మా ఆలోచనకి అందరూ ఒప్పుకున్నారు. ముఖ్యంగా వెంకటేశ్వర్లు గారు చాలా ప్రోత్సహించారు. వెంటనే ప్రొఫెసర్ భాగవత్ గారు అధ్యక్షుడుగా, ప్రొఫెసర్ జి.ఎస్.ఆర్.ఎన్. మూర్తి గారు, ముక్కవల్లి వెంకటేశ్వర్లు గారు ప్రధాన సభ్యులుగా, మేం ముగ్గురం విద్యార్ధి సభ్యులుగా తెలుగు సాంస్కృతిక సమితి అనధికారంగానే…1966 దసరా సమయానికి ప్రారంభం అయింది.
ముందుగా మేము చేసిన పనులు ….ఐ ఐ టి లో ఏయే డిపార్ట్ మెంట్లలో ఏయే తెలుగు వారు ఉన్నారో, వారి పేర్లూ, చిరునామాలు, ఇతర వివరాలు సేకరించి ఒక సమగ్రమైన డైరెక్టరీ తయారు చెయ్యడం. తర్వాత అందరి ఇళ్ళకీ వెళ్లి ఏడాదికి 15 రూపాయలు తెలుగు సాంస్కృతిక సమితి రుసుము వసూలు చెయ్యడం….మొదటి అధికారిక సాంస్కృతిక కార్యక్రమానికి రూప కల్పన చెయ్యడం…కార్యక్రమ వివరాలు 60 చిన్న కార్డుల మీద చేతి వ్రాతతో వ్రాసి అందరికీ అంద జెయ్యడం…అంతా కాలినడకనే…ఎవరికీ ఫోన్లు లేవు. తమాషా ఏమిటంటే ఎవరి ఇంటికి వెళ్ళినా మా ముగ్గురికీ చిక్కటి టీ ఇచ్చే వారు. అడిగితే మటుకే కాఫీ..ఎందుకంటే పాలు బాగా ప్రియం. వద్దు అనలేక అలా రోజుకి పాతిక సార్లు టీ తాగిన సందర్భాలు ఉన్నాయి…అసంబద్ధమైన సందర్భాలలో….అంటే బ్రహ్మచారులమైన మేము తెలుగు సమితి రుసుము కోసమో, సాంస్కృతిక కార్యక్రమానికి ఆహ్వానించడం కోసమో అప్పుడే పెళ్లి అయిన వాళ్ళ ఇళ్ళకి రాత్రి తొమ్మదింటికి వెళ్లి ఇబ్బంది పెట్టిన సందర్భాలూ ఉన్నాయి….ఇప్పుడు తల్చుకుంటే అదోలా ఉంది.
ఇదంతా జరగడానికి ముందు…నేనూ, మూర్తీ, రావూ హాస్టల్ 1 లో అడుగు పెట్టిన తొలి రోజుల్లో మరొక తెలుగు కుర్రాడు పరిచయం అయ్యాడు. పరిచయం అవగానే అతను నన్ను అడిగిన ప్రశ్న “నాటకంలో వేషం వేస్తారా?”. అప్పటి వరకూ నేను నాటకాలు చాలానే చూశాను కానీ వేషం వెయ్యాలన్న ప్రగాఢమైన ఆలోచన ఎప్పుడూ రాలేదు. అతను అలా అడగ్గానే, అనాలోచితంగా “యస్. ఏ వేషం?” అని అడిగాను.
అంతే. ఆ తర్వాత అతను నన్ను “అండీ” అని పిలవ లేదు. ఆ క్షణం నుంచీ ఇద్దరం నువ్వు, నువ్వు అనుకునే గాఢ మిత్రులం అయిపోయాం. అతని పేరు టి.పి. కిషోర్…తల్లాప్రగడ పూర్ణ చంద్ర కిషోర్….నేను అన్నట్టుగానే మూర్తి కూడా “యస్” అనేసి తను అప్పటికే మణిపాల్ లో వేసిన రాజకీయ నాయకుడు గరిటయ్య, బామ్మ వేషాల గురించి చెప్పాడు. రావు మటుకు “నేను పాడతాను. మీరు ఆడండి” అన్నాడు. ఇంచు మించు అదే సమయంలో హాస్టల్ లో ఓ రోజు ఎలెక్ట్రానిక్స్ లో మాస్టర్స్ చేస్తున్న, మాకు ఒక ఏడాది సీనియర్ అయిన చందూ పరిచయం అయ్యాడు. పూర్తి పేరు జొన్నలగడ్డ చంద్ర శేఖర్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బొంబాయి ఐ ఐ టి వాళ్లకి “జేసీ” అనే తెలిసిన ఆదర్శవంతమైన ఎయిరోనాటిక్స్ ప్రొఫెసర్ ఆ నాటి మా చందూ నే.
సాంస్కృతిక రంగం, రంగస్థల రంగం, రచనా వ్యాసంగం లోనూ నేను అడుగుపెట్టడానికి ఆ నలుగురూ ప్రత్యక్షంగా కారకులు… బి.వై. మూర్తి, పి.ఆర్.కె. రావు, టి.పి. కిషోర్, చందూ. వీరిలో ఎవరు ముందు, ఎవరు వెనుక, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని చెప్పడం కష్టం. మా హాస్టల్ గదుల ముందు తీసిన మూర్తి, రావు, చందూల ఫోటోలు, నా గదిలో నాకు తీసిన ఒక ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను.
టి.పి. కిషోర్ అనబడిన తల్లాప్రగడ పూర్ణ చంద్ర కిషోర్:
కిషోర్ గుంట్రు వాడు..అదే గుంటూరు వాడు. మంచి రచయిత. బొంబాయి ఐ.ఐ.టి. లో జియాలజీ లో మాస్టర్స్ డిగ్రీ లో చేరే ముందు ఆంధ్ర ప్రభ దీపావళి కథల పోటీలో 25 వేల రూపాయల మొదటి బహుమతి అందుకున్నాడు.నాటకాలు, కవిత్వమూ కూడా రాస్తాడు. మంచి భావుకుడు. నిత్యాగ్ని హోత్రుడు. పైగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అతను టేబుల్ టెన్నిస్ ఆటగాడు. ఇవన్నీ ఎలా ఉన్నా, మేము కలుసుకున్న తర్వాత మూడు, నాలుగేళ్ళలో అతను వ్రాసిన నాలుగైదు నాటకాలోనూ నా చేత వేషాలు వేయించి, నాటక రచన, రంగస్థలం మీద ఆసక్తి కలిగించిన వాడు కిషోరే. 1966 లో అతను వ్రాసిన మొదటి నాటకం…. పేరు మర్చిపోయాను….అందులో ఒక డైరెక్టర్ సినిమాలలో వేషం ఇస్తాను అని ప్రకటన ఇచ్చి, వచ్చిన నలుగురి నటననీ పరిశీలించినట్టు నటించి, డబ్బు అడగ్గానే అంతా రసాభాస అవుతుంది. అందులో దర్శకుడిగా చందూ, గరిటయ్య గా మూర్తి, హీరోగా వేద్దాం అని వచ్చి హాస్య పాత్రకి ఎంపిక అయిన వాడిగా నేనూ నటించాం. నేను నాటకాలలో వేషం వెయ్యడం అదే మొదటి సారి…బొంబాయి ఐ ఐ టి ..లెక్చర్ థియేటర్ లో 1966 లో….కిషోర్ రచన, దర్శకత్వంలో…60 మంది సమక్షంలో. …ఏం చేస్తాం ఒక్క ఫోటో కూడా లేదు.
కిషోర్ తో ఒక చిన్న ఉదంతం…..
ఒక రోజు కిషోర్ నా హాస్టల్ లో నా గదికి వచ్చి, “గురూ, మనం అర్జంటుగా హైదరాబాద్ వెళ్ళాలి…వచ్చే వారం” అన్నాడు. “ఎందుకు రా? “ అనగానే అసలు విషయం బయట పెట్టాడు. అంతకు నెల ముందు వాడు ఎక్కడో “కొత్త తెలుగు సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలకు నటీ నటులు కావలెను” ఒక ప్రకటన చూసి వాడి ఫోటోలు, ఇతర వివరాలు పంపించాడుట, దానికి స్పందనగా వాణ్ణి స్క్రీన్ టెస్ట్ కి పిలిచారుట…అంచేత నేను వాడి కూడా రావాలిట…అదీ విషయం.
ఇక్కడ నాకు అతి పెద్ద ఇబ్బంది ఏమిటంటే ..నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా మా అక్క ఇంట్లోనే ఉంటాను. కిషోర్ కూడా ఉండవచ్చును కానీ “ఎందుకు వచ్చావురా?” అని మా అక్క అడిగితే “సినిమాలో వేషం కోసం” అని చెప్పే పరిస్థితి మన కుటుంబాలలో లేదు కదా! అంతే కాదు. మూర్తి, రావు, ఇతర మిత్రులకీ కూడా చెప్పే ధైర్యం లేదు…నవ్వుతారేమో అని భయం..ఇప్పుడు ఎలాగా అని ఆలోచించి, ఏదో వంక పెట్టి హైదరాబాద్ వెళ్లి, రహస్యంగా ఏదో ఒక లాడ్జ్ లో ఉందాం అని అనుకున్నాం నేనూ, కిషోరూ…ఆ రోజుల్లో గది కావాలంటే లాడ్జ్, టిఫిన్, భోజనం కావాలంటే హోటల్..అంతే కానీ ఈ రెస్టారెంట్ అనే మాట వాడుక లో లేదు. తీరా ఇద్దరి దగ్గరా ఉన్న డబ్బు లెక్క కడితే… సరిగ్గా హైదరాబాద్ వెళ్లి, లాడ్జ్ లో రెండు రోజులు ఉండి, వెనక్కి రావడానికి సరి పడా…సుమారు 100 రూపాయలు ..ఉన్నాయి. అంతే..ఛలో, రంగా అని ఇద్దరం హైదరాబాద్ వెళ్ళిపోయాం. ఎక్కడో టేక్సీ వాడు దింపేసిన మారుమూల లాడ్జ్ లో దిగిపోయాం. అవును రహస్యం గానే…
ఆ మర్నాడు ఆ సినిమా దర్శకుడు, నిర్మాత చెప్పిన చోటికి వెళ్లాం నేనూ, కిశోరూ. ఏదో ఇంట్లో పైన డాబా మీద ఒక కెమెరా వాడు, అసిస్టెంటు, రిఫ్లెక్షన్ పడేలా గొడుగులు…ఇలా హడావుడి కి లోటు ఏమీ లేదు. ముందు ఐదారు భంగిమల్లో ఫోటోలు తీసుకున్నాక డైరెక్టర్, రచయితా కలిసి పది సంభాషణలు ఉన్న కాగితం చేతిలో పెట్టి కిషోర్ ని చెప్పమన్నారు. బాగానే చెప్పాడు కానీ వాడి తర్వాత మరొక నటుడు..ఈయన ఖరగ్ పూర్ రైల్వే నాటక సమాజం నుంచి వచ్చాడుట…ఈయన కిషోర్ కంటే అద్భుతంగా అవే సంభాషణలు చెప్పగానే కిషోర్ మొహం వాడిపోయింది. ఆ రోజుల్లో ఖరగ్ పూర్ రైల్వే నాటక పరిషత్ కి చాలా పేరు ప్రఖ్యాతులు ఉండేవి. ఆ డైలాగులు వినగానే కిషోర్ నన్ను పక్కకి పిలిచి “గురూ, వీడు ఉండగా మనం నోరు విప్పకూడదు. జస్ట్ ఏక్షన్ తోటే ఆదరగొట్టాలి.” అనేసి నన్ను వేరే గదిలోకి తీసుకు పోయి మహానటి సావిత్రి లాగా మొహం లో రకరకాల హావభావాలు ప్రాక్టీస్ చేశాడు. ఈ లోగా మళ్ళీ డాబా మీద నుంచి కబురు వచ్చింది. ఈ సారి తమాషా ఏమిటంటే..అది వారం క్రితం రికార్డు చేసిన ఒక యుగళ గీతం. పాడినది మన్నా డే & సుశీల…
నాకు తెలిసీ హిందీ గాయకుల్లో ఒక్క మహమ్మద్ రఫీ తప్ప అప్పటి దాకా ఇంకెవరూ తెలుగులో నేపధ్య గానం చెయ్య లేదు. ఇప్పుడు ఆ పాటకి కిషోర్ అభినయనం చెయ్యాలి. నిజానికి హీరో అవుదాం అని ఉన్నా కిశోరేమో జగ్గయ్య టైపు కేరెక్టర్. అంచేత ఆ పాటకి వాడి అభినయం అంత నప్ప లేదు. ఆ మాటే నేను అంటే “సర్లే, పక్కన హీరోయిన్ లేకండా నువ్వు ఉంటే ఇలాగే ఉంటుంది” అని సద్ది చెప్పుకున్నాడు. అన్నట్టు ఆ రోజుల్లో పాటలకి స్టెప్పులు ఉండేవి కాదు. మహా అయితే చెట్టు చుట్టూనో, సముద్రం ఒడ్డునో పరిగెత్తడమే. పాటలో ఉన్న మాటలకి పెదాలు సరిగ్గా అతకాలి. ఏది ఏమైతేనేం ఆ రోజు సాయంత్రానికి డాబా మీద ఎండలో మాడిపోవడం తప్ప కిషోర్ ఏ పాత్రకీ ఎంపిక అవ లేదు. కనీసం హీరోయిన్ వేషం కోసం వచ్చిన అమ్మాయిలనయినా మేం చూడ లేదు. వాళ్ళంతా వేరే డాబా మీద ఉన్నారుట. ఆ మాట కొస్తే అసలు ఆ సినిమా తెరకి ఎక్కనే లేదు. మన్నాడే పాడిన తెలుగు పాట మేము తప్ప తెలుగు సినిమా ప్రేక్షకులు ఎవరూ వినే అదృష్టానికి నోచుకో లేదు.
ఈ సినిమా స్క్రీన్ టెస్ట్ కి కిషోర్ పంపించిన మూడు ఫోటోలు ఇక్కడ జతపరిచాను. అప్పటిదే నా ఫోటో కూడా ఇక్కడ చూడ వచ్చును.
అన్నట్టు ఈ సినిమా స్క్రీన్ టెస్ట్ కథకి చిన్న కొస మెరుపు కూడా ఉంది. ఆ రోజు సాయంత్రం మేము ఇద్దరం లాడ్జ్ కి వచ్చి, బయట వరండాలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సుమారు 8 గంటలకి ఒక పెద్దాయన..యాభై ఏళ్ళు ఉంటాయేమో….తను బొంబాయి రెండు రోజుల పని మీద వచ్చినట్టూ, రాగానే తన పెట్టె ఎవరో దొంగతనం చెయ్యగా కట్టుబట్టలతో, జేబులో పైసా లేకుండా హైదరాబాద్ లో ఇరుక్కుపోయినట్టూ, మేము అతనికి సరిగ్గా బొంబాయి రైలు టిక్కెట్టు సరిపడా డబ్బు ఇస్తే …మర్నాడు వెళ్లి పోతానూ అనీ చెప్పి, మేము బొంబాయిలో విక్టోరియా టెర్మినస్ దగ్గర ఉన్న క్రాఫర్డ్ మార్కెట్ లో స్టాల్ నెంబర్ 462 లో తన ఉల్లిపాయల వ్యాపారం ఉన్నట్టూ….మేము అక్కడికి వస్తే మా డబ్బు తిరిగి ఇచ్చేస్తాను అనీ అని మంచి నమ్మదగ్గే విధంగా కథ చెప్పాడు. మేము ఇద్దరం అది నమ్మేసి, జేబులో డబ్బు లెక్క పెట్టుకుని, లాల్ చంద్ అనే ఆయన బొంబాయి టిక్కెట్టు కి కావలసిన 33 రూపాయలు ఇచ్చేసి సాటి మనిషికి సహాయం చేసినందుకు సంబర పడిపోయాం. వారం తర్వాత బొంబాయి లో ఆ క్రాఫర్డ్ మార్కెట్ కి వెళ్లి చూద్డుం కదా…అక్కడ అలాంటి స్టాల్ నెంబర్ కానీ..ఆ మాట కొస్తే అసలు ఉల్లిపాయల వ్యాపారం కొట్టు ఒక్కటి కూడా కనపడ లేదు…ఆ లాల్ చంద్ పేరు ఎవరికీ తెలియదు. అప్పుడు అర్ధం అయింది….మాకు 33 రూ పాయల టోపీ పెట్ట బడిందీ అని!
ఇలాంటివి కాదు కానీ…ఆ నలుగురితో …అనగా మూర్తి, రావు కిషోర్, చందూలతో మరిన్ని బొంబాయి అనుభవాలు….వచ్చే సంచికలో !
బావుంది.
నాకు తెలిసీ హిందీ గాయకుల్లో ఒక్క మహమ్మద్ రఫీ తప్ప అప్పటి దాకా ఇంకెవరూ తెలుగులో నేపధ్య గానం చెయ్య లేదు.
తలత్ మెహమూద్ చేసేడేమో! ఆలోచించండి.
శ్యామ్
అవునండి, భలేతమ్ముడు 1969 నాటిది. అదే రఫీ తెలుగు పాటపాడిన మొదటి సినిమా. అంతకుముందు 1964 లో భక్తరామదాసు అనే నాగయ్యగారి సొంతసినిమాలో హిందీ భక్తిగీతాలు పాడి పైసా కూడా పుచ్చుకోలేదు. కానీ, రమేష్ నాయుడు తలత్ మెహమూద్ చేత 1959 లోనే ‘మనోరమ’ చిత్రంలో పట్టుబట్టి మరీ పాడించారు.
ఏదో పాటలు విని ఆనందించడమే కానీ ఈ డిపార్ట్ మెంట్ లో నాకు అంత పరిచయం లేదు సుమా..మంచి విషయాలు చెప్పారు.
మీ స్పందనకి ధన్యవాదాలు. అవును, తలత్ మెహమూద్ తెలుగు లో పాడిన జ్ఞాపకం ఉంది, శ్యామ్ గారూ…