చిన్నప్పటి క్రికెట్ మాట ఎలా ఉన్నా, కాలేజ్ కి వచ్చాక నా క్రికెట్ అనుభవాలు ఎంతో సరదా అయినీ..ఇప్పటికీ నాకు బాగా గుర్తున్నవేనూ.
పి.యు.సి చదువు కోసం పి.ఆర్. కాలేజ్ లో చదివినది ఒక ఏడాదే కాబట్టి కుర్ర ఆటగాడి కిందే లెక్క. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్శిటీ లో ఇంజనీరింగ్ లో సీటు రాగానే అక్కడ చేరిపోయాను. నాకు 5వ బ్లాక్ లో హాస్టల్ గది కేటాయించారు. అది ఇప్పుడు గర్ల్స్ హాస్టల్…ట. ఆ రోజుల్లో మొత్తం ఇంజనీరింగ్ కేంపస్ లో ఒక్క చేమికల్ ఇంజనీరింగ్ భవనం ఒకటే పూర్తి అయిన పెద్ద భవనం. మిగిలివన్నీ నిర్మాణం లో ఉన్నవే. నెత్తి మీద గంగాళాలు పెట్టుకుని సిమెంట్ మోస్తునో, పదేసి ఇటికెలు అందిస్తోనో పుష్టిగా ఉన్న గంగమ్మ, సత్తెమ్మ లాంటి పడుచులని చూసి లొట్టలు వేసుకోవడం తప్ప ఇంజనీరింగ్ కేంపస్ మొత్తం మీద ఆడ వాసన లేదు.
రోజు సాయంత్రం క్లాసులు అయిపోయాక హాస్ట ల్ కి రాగానే క్రికెట్ ఆడుకోవడమే కాలక్షేపం. అయితే ఆంధ్రా యూనివర్శిటీ క్రికెట్ టీమ్ కి ఆడాలంటే చాలా పెద్ద తతంగమే ఉంది. ఒక సారి ఇంజనీరింగ్ ప్రాంగణం లో ఉన్న ఏడు హాస్టల్ టీమ్ లకి మధ్య ఏన్యువల్ టోర్నమెంట్ జరిగింది. ఒక విధంగా అది మొత్తం యూనివర్సిటీ టీమ్ కి సెలెక్షన్స్ లాంటివి అనమాట. మా 5వ బ్లాక్ టీమ్ మిగతా నాలుగైదు హాస్టల్ టీమ్ ల తోటీ నెగ్గి 2వ హాస్టల్ తో ఫైనల్స్ కి వచ్చాం. అది వాళ్ళ హాస్టల్ ఎదురుగానే జరగడం తో అందరూ కలిసి రెచ్చి పోయారు. ఒకే ఒక వికెట్ నష్టానికి 50 పైగా పరుగులు దాకా వచ్చేశారు. అప్పుడు మా కెప్టన్…అతని పేరు లక్ష్మీ నారాయణ -మా కాకినాడ వాడే అను గుర్తు…నాకు బౌలర్ గా అప్పుడు చాన్స్ ఇచ్చాడు.
అప్పుడు ఎం జరిగిందో ఇప్పటికీ నాకు తెలీదు. ఆఫ్ స్పిన్నర్ర్ గా నా విశ్వరూప సందర్శనం జరిగినట్టు ….నాలుగు ఓవర్లలో మూడే రన్స్ కి ఏడు వికెట్లు నావే – ఒక హేట్రిక్ తో సహా. అంత వరకూ విజృభించిన అవతలి టీమ్ 60 పరుగుల లోపుగా అల్ ఔట్ అయ్యారు. మేము ఆ మేచ్ ఓడిపోయాం. కానీ ఆ తర్వాత ఏర్స్క్విన్ కాలేజ్ లో ఉన్న బహిరంగ వేదికలో జరిగిన మొత్తం కేంపస్ క్రికెట్ సెలెబ్రేషన్స్ లో బెస్ట్ బౌలర్ ట్రోఫీ నాకు వచ్చింది. నిజానికి ఎక్కువ వికెట్లు వచ్చిన అది మూర్తి అని మరొకతనికి రావాలి కానీ ఫైనల్స్ లో నా పెర్ఫార్మెన్స్ కి ఆ ట్రోఫీ రావడమే కాక ఆంధ్రా యూనివర్శిటీ బి టీమ్ కి ఎంపిక అయిన అతి బక్కపలచన ఆటగాడిని నేనే. అక్కడ ఏడాది మాత్రమే ఉండి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ కి బదలీ చేయించుకున్నాను కాబట్టి యూనివర్శిటీ తరఫున ఒక్క మేచ్ కూడా ఆడలేక పోయాను. కానీ లాంగ్ పీడీ, పొట్టి పీడీ లతో పరిచయం బాగా ఏర్పడింది. పీడీ అంటే ఆనాటి కాలేజీ పరిభాష లో ఫిజికల్ డైరెక్టర్ అనమాట. వాళ్ళని మళ్ళీ మూడేళ్ళ తర్వాత కలుసుకున్నాను. ఆ కథ ఏమిటంటే…
వైజాగ్ నించి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ కి మారిపోయాక, హాస్టల్ లో కాక ఇంట్లోనే ఉండి చదువు కాబట్టి రొటీన్ లో తేడా వచ్చింది. ఇప్పుడు డే స్కాలర్ ని కాబట్టి క్లాసులు అవగానే ఇంటికి వెళ్ళిపోయే అలవాటు వచ్చింది. కొన్నాళ్ళయ్యాక, క్లాసులవగానే క్రికెట్ కొ టెన్నిస్ కో వెళ్ళే అలవాటు చేసిన వాళ్ళు మా సీనియర్లు. వాళ్ళలో ముఖ్యంగా మాకు బంధువు అయిన చింతలూరి సుందర వెంకట్రావు, బి.ఎస్.జి.కె.శాస్య్రి, పెంటా రామచంద్ర రావు మొదలైన వాళ్ళు. వీళ్ళంటే నాకు ఆరాధనా భావం ఎందుకంటే బాగా చదువుకునే ‘పకోడీ” గాళ్ళకి వాడికి ఆటలు రావు అనీ, ఆటల రాయుళ్ళు రౌడీల లా ఉంటారు అనుకునే ఆ రోజుల్లో వీళ్ళు అటు చదువులోనూ, ఇటు ఆటల్లోనూ ఫస్ట్ క్లాసే. ‘నాగార్జున’, నలందా’ లాంటి పేర్లు ఉన్న హాస్టల్ లో ఉండే వీళ్ళు ఎప్పుడైనా మంచి భోజనం కావాలంటే మా ఇంటికి వచ్చే వారు. వీళ్ళలో బాబాయ్ అని అందరూపిలుచుకునే చింతలూరి వెంకట్రావు ఇప్పుడు వర్జీనియా లో ఉన్నాడు.
అప్పుడప్పుడూ పాట కబుర్లు చెప్పుకునే అతను రాజమండ్రి పేపర్ మిల్ కి జనరల్ మేనేజర్ గానూ, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గానూ పనిచేశాడు. నేను మూడో ఏడు ఇంజనీరింగ్ లో ఉండగా ఇంటర్ క్లాస్ టోర్నమెంట్ లో అనుకుంటాను…బి.ఎస్.జి.కె. శాస్త్రి నన్ను తన కేప్టెన్సీ లో ఉన్న టీమ్ లో కి తీసుకున్నాడు. ఆ టీమ్ లో ఫాస్ట్ బౌలర్ గా మా తమ్ముడి క్లాస్ మేట్, మా ఇంటి పక్కనే ఉండే తురగా చంద్రశేఖర్ కూడా ఉన్నాడు. ఇక మా క్లాస్ మేట్స్ లలో ఎన్.ఎస్. నందా (సత్యానంద), డి. హనుమంత రావు కాక జి.రామ్మూర్తి అనే అద్భుతమైన అందగాడైన బేట్స్ మన్ ఉండేవాడు. అతను ఆడుతుంటే కూచిపూడి నృత్యం లాగా ఎంతో అందంగా ఉండేది. తర్వాత్తరవాత రంజీ ట్రోఫీ లో కూడా ఆడాడు అని విన్నాను. ఉస్మానియా లో ప్రొఫెసర్ గా పని చేస్తూ సుమారు పదేళ్ళ క్రితమే పోయాడు అని విన్నాను. మా ఎబ్డెన్ బ్లేజర్ లో నాదీ, రామ్ముర్తి దీ ఫోటోలు ఇక్కడ జతపరిచాను.
అలా నేను ఇంజనీరింగ్ కాలేజ్ క్రికెట్ టీమ్ లో మొదలుపెట్టాక కాలేజ్ టీమ్ కి ఎంపిక అయ్యాను. నేను ఆఖరి సంవత్సరం లో ఉండగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎబ్డెన్ టోర్నమెంట్ లో మా కాలేజ్ తర్రఫున ఆడే అవకాశం వచ్చింది. దానికి కావలసిన ఒక నీలం రంగు సొగసైన బ్లేజర్ కొనుక్కోవడం, అది వేసుకుని ఫొటో తీయించుకోవడం అంత గర్వకారణం ఆ రోజుల్లో కాలేజ్ క్రికెటర్ల కి లేనే లేదు. దాని ఖరీదు ఏకంగా 30 రూపాయలు. మా టీమ్ లో ఉన్న 12 మంది…అంటే ట్వెల్త్ మేన్ తో సహా ఏదైనా మేచ్ ముందు అవతలి టీమ్ కి ఎదురుగా నుల్చుని, ఈ నీలం బ్లేజర్స్ తో కలెక్టర్ గారికో, మంత్రి గారికో కరచాలనాలు చేస్తుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్ప లేను.
ఆ ఎబ్డెన్ టోర్నమెంట్ అనేది ఆంధ్రా లో ఉన్న అన్ని కాలేజీ టీమ్ లకీ మధ్య జరిగే పోటీ. ఆ రోజుల్లో ప్రధానమైన కాలేజ్ టీమ్ లు గుంటూరు, ఆంధ్రా, రంగరాయ మెడికల్ కాలేజ్యే కదా!. లు, మా పి,ఆర్, కాలేజ్, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్, ఏలూరు సర్, సి అర్.ఆర్ కాలేజ్ లు కాక ఆంధ్రా యూనివర్శిటీ, వైజాగ్ వాళ్ళ “ఏ” టీమ్, “బీ” టీమ్. అదిగో ..అక్కడ జరిగిన విచిత్రం ఏమిటంటే ….మొదటి మేచ్ మా ఇంజనీరింగ్ కాలేజ్ వెర్సస్ ఆంధ్రా యూనివర్శిటీ “బీ” టీమ్ వాళ్లతో…అదీ…వాళ్ళ ప్రతిష్టాత్మకమైన క్రికెట్ ఫీల్డ్ లో. అదే ‘బీ” టీమ్ కి నేను ఆటగాడిగా ఎంపిక అయి, ఒక్క మేచ్ కూడా ఆడకుండా, ఇప్పుడూ వాళ్ళకి వ్యతిరేకంగా ఆడే అవకాశం భలే తమాషా కదా!. కాకినాడ నుంచి మా టీమ్ వైజాగ్ వెళ్ళి, యూనివర్శిటీ వాళ్ళు ఇచ్చిన సధ్దర్మ సదన హాస్టల్ లో ఉన్నాం. ఆట ముందు ఇంకా అదే లాంగ్ పీడీ, పొట్టి పీడీ లు ఇద్దరూ నన్ను చూసి గుర్తు పట్టి “ఓరి రాస్కెల్” అని పలకరించి సంతోషించారు.
ఆ ఎబ్డెన్ టోర్నమెంట్ మేచ్ నా క్రికెట్ జీవితం లో చాలా గుర్తుపెట్టుకో దగ్గది. ఆంధ్రా యూనివర్శిటీ టీమ్ లో హేమాహేమీ ఆటగాళ్ళు ఉన్నారు. అందులో ఒక మీడియం పేస్ బౌలర్….అతని పేరు మర్చిపోయాను…ఏదో అప్పారావు అనుకుందాం. .నిజానికి ఆఫ్ స్పిన్నరే. కానీ బంతి స్పీడ్ మటుకు ఫాస్ట్ బౌలర్ స్థాయి. ఆ రోజుల్లో బి. ఎస్. చంద్రశేఖర్ అనే టెస్ట్ బౌలర్ సరిగ్గా అలాంటి వాడే. ఇప్పుడు ఈ కుర్రాడి బౌలింగ్ కి మా కాలేజ్ బేట్స్మన్ పిట్టల్లా రాలిపోవడం మొదలు పెట్టారు. నన్ను నాలుగో బేట్స్ మన్ గా పంపించారు కానీ ఈ బక్క ప్రాణం ప్రాణాలతో బయట పడితే చాలు అనే అందరూ అనుకున్నారు. కానీ నాకు ఏమయిందో తెలీదు కానీ నేను ఆ అప్పారావు బౌలింగ్ ని భలే ధైర్యంగా ఎదుర్కొని మొదటి ఓవర్ లోనే రెండు బౌండరీలు కొట్ట గలిగాను.
అందులో ఒకటి కవర్ డ్రైవ్ అనే సొగసైన కొట్టుడు. దాంతో పైన చెప్పిన నా సహ ఆటగాడు గిడుగు రామ్ముర్తి రెండో బౌలర్ ని మరో రెండు బౌండరీలు పీకాడు. దాంతో కోపం వచ్చి అప్పా రావు పెద్ద బౌన్సర్ వేశాడు. అది నా బుర్ర కి తగిలితే అంతే సంగతులు. కానీ ఆ బంతి నేను అద్దం పెట్టుకున్న బేట్ అంచు కి తగిలి ఈ సారి మిడ్ వికెట్ మీద నుంచి మరో నాలుగు పరుగులు నాకు జమ అయ్యాయి. అనుకోని ఈ పరిణామాలకి ఇటు ఆంధ్రా యూనివర్శిటీ కెప్టెన్ కీ, ఆ టీమ్ లోనే కాక అటు పెవిలియన్ లో కూడా హాహాకారాలు మొదలయ్యాయి. మొత్తానికి నేను క్రీజ్ లో ఉన్నది ఐదారు ఓవర్లే కానీ 30 పరుగులకి పైగా చేసి ఔట్ అయ్యాను. ఆ మేచ్ కూడా మేము ఓడిపోయాం. అదేమిటో తెలియదు కానీ, నేను బాగా ఆడిన మేచ్ లు అన్నీ ఓడిపోయినవే. అది నా క్రికెట్ జాతకం అనుకుంటాను.
ఇక కాకినాడ నుంచి 1966 లో బొంబాయి ఐ ఐ టి కి వెళ్ళే సమయానికి సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లాంటి పేర్లు విన లేదు. సచీన్ టెండుల్కర్ పుట్టడానికి ఇంకా ఐదేళ్ళు సమయం ఉంది. ఐదు రోజుల టెస్ట్ మెచ్ లు, మూడు రోజుల రంజీ ట్రోఫీ తప్ప వన్ డే క్రికెట్, 20 ఓవర్ క్రికెట్ లాంటివి లేవు.,,బొంబాయి లో నేను అనుకోకుండా కలుసుకున్న మొట్టమొదటి క్రికెట్ టెస్ట్ ఆటగాడు అజిత్ వాడేకర్ కానీ అప్పటికి అతను ఇంకా టెస్ట్ లకి ఎంపిక ఆవ లేదు. ఇక నేను చూసి ఆనందించిన టెస్ట్ ఆటగాళ్ళలో నవాబ్ ఆఫ్ పటౌడీ, గారీ సోబర్స్ మొదలైన హేమాహేమీలు. వాటిల్లో మహా రంజైన విశేషం ఆ వెస్ట్ ఇండీస్ దిగ్గజం గారీ సోబర్స్ బొంబాయి లో చిన్న నటి అంజు మహేంద్రు తో ‘రాత్రికి రాత్రే ప్రేమ లో పడి పెళ్ళాడడం”.. ఆ విశేషాలు..వచ్చే సారి..
*
Add comment