“నేను నా విద్యార్థులను కవిత్వం చదువుతున్నప్పుడు కవితకు కవి పెట్టిన పేరుతో కవితను అర్థం చేసుకోవడం ప్రారంభించమని చెబుతాను. ఇది కవిత్వం చదివేవారికి కవిత విషయాన్ని గురించీ, కవి కవితను ఎంచుకున్న సందర్భాన్ని గురించీ, కవి ఆ కవితను రాస్తున్నప్పుడు కవి మానసిక స్థితినిగురించీ, కవి భావాన్ని గురించీ చదివే వారికి ఒక చూపునివ్వగలదు. ఒకవేళ ఆ కవి ఆ కవితకు ఒక పేరునివ్వకపోతే మిమ్మల్ని ఆకర్షించే విషయాలను గుర్తించేందుకు ఆ కవితను మళ్ళీ మళ్ళీ చదవమని చెపుతాను. ఆ కవితలో పునరుక్తి అయిన పదాలూ, విషయాలూ, దృశ్యాలూ కవితను అర్థం చేసుకోగల మార్గాలను చూపగలవు”*. అంటారు ఒక కవిత్వ ఉపాధ్యాయురాలు (Deborah Shepard in response to a post in fb American Literature wall: “What are some tips for analyzing poetry themes)
కవితకు పేరులేని సందర్భాలలో చదువరులు ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండానే కవితలోకి వెళ్ళవలసి వచ్చినప్పటికీ ఆ ఉపాధ్యాయురాలు పైన చెప్పిన విషయాల ద్వారా కవితను అర్థం చేసుకోగలరు కానీ అది చాలా సార్లు చదువరులకు సవాలు.
కవిత్వానికి మూలం కవి హృదయమైతే కవిత్వాన్ని ఆస్వాదించి అర్థం చేసుకోవలసింది చదివే వారు. కవిత్వానిది ఒక ప్రత్యేక భాష. ఆ భాష ద్వారా తన మదిలో మెదిలిన భావాలను సులభగ్రాహ్యంగా కవి చదువరులకు అందించగలిగినప్పుడే చదువరి ఆ రససిద్ధిని అందుకోగలడు. ఒక కవి తన కవిత ద్వారా ఎంత తాదాత్మ్యతను, ఎంత సహానుభూతినీ చదువరులలో కలిగించ గలిగాడు అనేదే కవిత్వ ప్రయోజనాన్ని తెలిపే ఏకైక గీటురాయి.
ఈ తాదాత్మ్యత, సహానుభూతి చదువరులలో కలిగించడానికి కవి ఏం చేయాలి? తన మదిలోని భావాలను అవి తనలో మేల్కొలపగలిగే సంవేదనలతో సహా కవిత్వీకరించగలగాలి. ఇది కవిత్వంలోని మొదటి పదంతో ప్రారంభమై అందమైన నిర్మాణానికి ఒక్కొక ఇటుకను నిర్మాణ నిపుణులు శ్రద్ధతో అమర్చేవిధంగా నిర్మాణపు అంతిమ దృశ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. అందుకే Wordsworth చెపినట్లు మన మదిలో ఉత్పన్నం (evoke) అయిన భావాలను ఆ భావాలు సద్దుమణిగాక ఒడిసి పట్టుకోవాలి. సద్దుమణిగాక మాత్రమే వాటిని అర్థవంతంగా చదువరులకు అందించే వీలుంటుంది.
ఒక యుద్ధం జరుగుతున్నపుడు ఆ యుద్ధం రేపిన భావాల జడిని అదే సమయంలో చదువరులకు బదిలీ చేయడానికి కవి ఒక విలేఖరి కాదన్న విషయం సదరు కవికి నిరంతరం గుర్తుండాలి. కవిత్వం సమాచార వాహిని కాదు. బయటి ప్రపంచంలో జరిగే సంఘటనలు కవిలో కలిగించే భావ ప్రకంపనల సహానుభూతి లక్ష్యంగా కవి కవిత్వాన్ని చదువరులకు చేర్చాలి.
కవిత పూర్తయింది. కవితకొక పేరు కావాలి. ఆ పేరు కవితలోని విషయాన్నీ, కవి హృదయాన్నీ చదువరులకు రేఖామాత్రంగానైనా చదువరులకు చేరాలి. ఆ పేరు ఆ కవిత పట్ల చదువరులకు ఆసక్తిని కలిగించగలగాలి.
ఉదాహరణకు మనం కొన్ని సుప్రసిద్ధ కవితల మకుటాలను పరిశీలిద్దాం. శ్రీశ్రీ రాసిన ఒక కవితకు మహాప్రస్థానం అని పేరు పెట్టారు. అంతకు ముందువరకూ, ఇప్పుడుకూడా మహాప్రస్తానమంటే సమ భూమికి అంతిమ యాత్ర. అయితే శ్రీశ్రీ పెట్టిన మహాప్రస్థానం పేరు సమానత్వానికి యాత్రగా మనముందున్నది. ఆ పేరు అశేష ప్రజానీకంలో ఆసక్తిని కలిగించింది. ఎందరికో ఉత్ప్రేరకంగా మారి కవిత్వాల జడులను తెలుగు నేలపై కురిపించింది.
సి. నారాయణరెడ్డి “విశ్వంభర” పేరు ఆ కవితలోని విషయాన్ని తెలియజేస్తూ చదువరులను ఆకట్టుకుంది. నగ్నముని “కొయ్యగుర్రం” చలనం ఉన్నా ముందుకు సాగని దేనినో కవితావిషయంగా చదువరుల ముందు ఉంచి సమాజంలోని అసహజ చలనాలనూ, మానవ జీవన స్థితినీ, ఆ స్థితి పట్ల కవికున్న అభ్యంతర భావావేశాన్నీ చదువరుల ముందు ఉంచింది.
కవిత పేరు నుండి చదువరి కవితను అర్థం చేసుకోవడం మొదలవుతుంది అనే విషయాన్ని కవి గుర్తినప్పుడు తనలోని విషయసంవేదనకూ భావావేశానికీ చక్కని పేరును పెట్టగలరు.
మహమూద్ తన కవితకు “వాన వొస్తదో… రాదో….” అని పేరు పెట్టారు. కవి పెట్టిన పేరులోనే సంశయం ధ్వనిస్తోంది. కవి సంశయం రెండు విధాలుగా ఉంది. వాన కోసం కవి ఎదురు చూపు ఉంది. వాన రాకపోతే ఎలా అన్న సంశయమూ వాన వస్తే అన్న ఆశా ఉన్నాయి. వాన లేని స్థితి ఏమిటీ, వానొస్తే ఏమిటీ అని ఒక సాధారణ చదువరిగా నాకు సందేహం వచ్చింది. ఈ రెండు స్తితులగురించి నాకు కొంత తెలిసినా కవి హృదయం ఏమిటీ అన్న కుతూహలం ఏర్పడి ఆ కవితను చూశాను. మీరూ చూడండి.
‘మాయదారి కరువు పాణం తీయకుండా నేన్ పోనంటాంది
వాన కోసం సూసి సూసి పాణం ఉగ్గబట్టి పోయినాది
సిన్నోడికి పాలు పడదామంటే ఆలి చన్నులు వడబారి యాలబడినాయి
పాలు పితుకుదామంటే మేకలు ఎండిన కాడలైనాయి
అమ్మకడుపుకాడ సెర్మం బీడుబడిన నేలమాదిరిగుందాది
నాయిన బీడీ కాల్చనీకి పెదాల్లో సత్తువ పోయినాది
ముఖం పీకేసిన గడ్డి వామైపోయినాది
గుడిసేకాడికి వట్టిసేతల్తో పోవాలంటే, థూ… ముండబతుకు గుండెధైర్యం కావాలంటాంది
ఆకలికి అరిసే పేగులను జోగొట్టే పాట నేలతల్లికి తెల్దంటాంది
దోమల కాట్లకు ఒళ్ళు మంట పుడ్తాంది కానీ ఎండిపోతున్న పైరుమీందకు వాలడానికి తూనీగ రానంటాంది
నీళ్ళు పార్తాంటే గలగల్లాడే పిల్ల కాల్వ పైట సర్దుకునే పడుసుపిల్ల మాదిరిగుంటాది
తేమ సుట్టం రాక అది మొగుడు సచ్చిన ముండలా మార్నాది
గొంతులోన్కి గుక్కేపడక గుండెకాయ రోజురోజుకు సొక్కిపోతావుండాది
పొద్దుగూకే దాకా దేకినా అరికాళ్ళు అరిగిపోయినా మోకాలి సిప్పలు నేప్పుల్ దీసినా
అప్పు పుట్టనంటాంది తిండి గడవనంటాంది
ఎండిపోయిన భూమిని సూస్తే ఎవనికి నమ్మకముంటాది ?
సాయం అడగనీకి పోదామంటే లీడర్లు శవాలమీంది రూకలు ఏరుకుంటాన్డారు
ప్రభుత్వం కళేబరాల్తో యాపారం సేస్చాంది
సినుకు రాలితే పరవశించే మట్టి ఇడిసే వాసన ముక్కుకు సోకి ఎన్ని నాళ్లైనాది
సూర్యుడు వస్చాడు పొలాన్ని గుడ్డను ఎండబెట్టినట్లు యాలబెద్తాడు
పాలిపోయిన ముఖంతో చందురుడొస్చాడు ఎన్నెల మట్టిలో తేమను సోకి ఎన్ని నాళ్ళైనాది
వాన కురిస్చే పల్లె తడిస్చే కాల్వలు పద్యాలు పాడ్తే పిల్లనాకొడుకులు కాయితప్పడవలైతే సూస్చామని
పైన గుడ్డిమోడమొస్చే నా ఆలికి సీరగా సుట్టుదామని
పైరు పసిమెక్కితే పెద్దదానికి కట్నంగా ఇయ్యాలని కాసుక్కూచోనుండా
వాన వస్తదో…. రాదో ……. (మహమూద్)
పై కవితలో వానకోసం మెట్ట ప్రాంతపు రైతు పడే వేదనను కవి తన భావాలుగా చేసుకుని సహానుభూతి పొంది కవితగా మార్చిన వైనం, అందులోని పదాలూ, చిత్రాలూ, రైతు మనసులోని వేదనా కలగలిసి కవితగా రూపు దిద్దుకున్న వైనం కవి తాదాత్మ్యతనూ, సహానుభూతినీ తెలియజేస్తే కవి ఈ కవితకు మకుటంగా ఎన్నుకున్న పదాలు కవిత లోతులనూ, సంభావ్యత పట్ల కవి/రైతు ఆందోళననూ తను ఎన్నుకున్న చిత్రాలు పరిసరాల వర్ణననూ సమర్థంగా చిత్రించిన వైనం మనం చూడొచ్చు.
*
ధన్యవాదాలు సర్