పండిత్ భీంసేన్ జోషి గారి anthological album 2000 సంవత్సరంలో విడుదల చేయబడింది. దాని మకుటం ‘సిద్ధి’ అని ఉంచారు. చూడటానికి చాలా సాధారణంగా అనిపించినా ఇది ఎంతో యోచించి ఎంచుకున్నారని నా ఊహ. టిక్టాక్ యూట్యూబ్ ల ఊతంతో వైరల్ ఫేమ్ కూరగాయల బేరమైన నేటి పరిస్థితుల్లో ‘సిద్ధి’ అనే చిన్న పదం తనలో అపూర్వమైన ప్రతిభ, అచంచలమైన నిబద్ధత, అనంతమైన కృషి, అద్వితీయమైన నైపుణ్యం, అమేయమైన గాంభీర్యం ఇముడ్చుకుందన్న విషయం సులభగ్రాహ్యం కాదు. ‘సిద్ధి’ని పొందడం అంటే ఒక జీవితకాలపు సాధన సఫలీకృతం కావడం. భీమన్న అరనిముషం ఆలాపనతో ఎన్నెన్నో అదృశ్యహృదాంతరాళాలను సున్నితంగా తాకగలరు. అరగంటలో రాగసుధని రసవృష్టిగా కురిపించి మనోప్రాకారాలని ముంచేయగలరు. ఒక అవిరళపరిశ్రమతో, అకుంఠిత దీక్షతో ఆ కళ వారికి ‘సిద్ధించింది’. అదే విధంగా ఉర్దూ గజల్ అనే కళ ‘సిద్ధించిన’ అతికొద్దిమంది కవుల్లో ఒకరు అహ్మద్ ఫరాజ్!
*
కవిపరిచయం చేసేటప్పుడు ఇతరేతరులు వారిని గూర్చి ఏమన్నారో చెప్పడం కంటే ఆ కవులే ఆత్మావలోకనంగానో ఆత్మచిత్రణగానో చెప్పిన మాటలు ఉటంకించడం ఒక అరుదైన అవకాశం.
‘ఏననంత శోక భీకర తిమిర లోకైకపతిని
నాకు నిశ్వాస తాళవృంతాలు కలవు
నాకు కన్నీటిసరుల దొంతరలు కలవు
నాకమూల్య మపూర్వ మానంద మొసగు
నిరుపమ నితాంత దుఃఖంపు నిధులు కలవు!
ఎవ్వరని యెంతురో నన్ను?”
కృష్ణశాస్త్రి బాధామయకవితాంతరంగాన్ని ఇంతకన్నా చిక్కగా చక్కగా ఎవరు ఆవిష్కరించగలరు!
అలాగే ‘గిరులు/సాగరులు/కంకేళికా మంజరులు ఝరులు నా సోదరులు’ అని శ్రీశ్రీ, ‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అని తిలక్ వారి మాటల్లోనే మనకు పరిచయవాక్యాలు అందించారు.
ఫరాజ్ కూడా ‘ముహాస్రా’ అనే కవితలో ఇలా అన్నారు:
మేరా కలమ్ తో అమానత్ హై మేరే లోగోఁ కీ
మేరా కలమ్ అదాలత్ మెరే జామీర్ కీ హై
నా కలం నా ప్రజల యొక్క ఆస్తి
నా కలం నా అంతఃకరణకు న్యాయస్థానం
ఫరాజ్ ఒక కుబూల్-ఎ-ఆమ్, మక్బూల్-ఎ-ఆమ్ షాయర్ అంటారు. అంటే జనబాహుళ్యంచే స్వీకరింపబడినవాడు, కీర్తింపబడినవాడు అని. పైన మొదటి పంక్తిలో తను ప్రజలకు ఎంత చేరువయ్యాడో చెప్పాడు. అదే సమయంలో ‘playing for the gallery’ అనే వలలో పడకుండా వ్రాసింది శ్రద్ధతో చిత్తశుద్ధితో వ్రాశాడు. అందుకే తన అంతఃకరణకు కలాన్ని న్యాయమూర్తిగా నియమించాడు.
*
ఫరాజ్ కవిత్వంలో ప్రధాన ఆకర్షణ ప్రణయం. విశ్వవ్యాప్తంగా కవికీ కన్నీటికీ ఉన్న అవినాభావబంధాన్ని ఫరాజ్ కూడా ప్రదర్శించాడు.
జబ్ భీ దిల్ ఖోల్ కే రోయే హోంగే
లోగ్ ఆరామ్ సే ఫిర్ సోయే హోంగే
తనివితీరా విలపించి ఉంటారు
మనశ్శాంతిగా నిద్రించి ఉంటారు
అనువాదాలు నిత్యం యథాతథంగా ఉండవు. ఇక్కడ మూలంలో ‘జబ్’ అనే పదాన్ని అనువాదంలో ఉంచలేదు. అయినా భావస్ఫురణలో ఆ లోటు తీరిందనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ కొంతమేరకు beauty will always be lost in translation
ఎక్కడున్నాం.. కన్నీరు!
ఎక్ ఉమ్ర్ సే హూఁ లజ్జత్-ఎ-గిరియా సే భీ మెహ్రూమ్
ఎయ్ రాహత్-ఎ-జాఁ ముఝ్ కో రులానే కే లియే ఆ
కన్నీటి సుఖం కరువై కొన్నేళ్ళు కావస్తోంది
ఓ శాంతిదాతా నన్ను ఏడిపించడానికే రా
‘రంజిష్ హీ సహీ’ అని మొదలయ్యే గజల్ లోని ఈ షేర్ మెహఁదీ హఁసన్ గొంతులో ఇంకా మధురంగా ధ్వనిస్తుంది. వియోగభారాన్ని మోసే ప్రతి హృదయానికీ ఈ గజల్ వెచ్చని కౌగిలినిచ్చి, కన్నీరు తుడిచి, నువ్వు పడే వ్యథ నాకు తెలుసు అని ఓదార్చే ఆత్మీయుడి వంటిది. ఇది దాదాపు ఒక anthem of broken hearts స్థాయికి చేరింది. యమన్ లో స్వరపరిచిన ఈ గజల్ విన్న ప్రతిసారీ వెంటనే సాలూరి రాజేశ్వరరావు గారు కళ్యాణిలో స్వరపరచిన ‘మనసున మల్లెల మాలలూగెనే’ వినాలనిపిస్తుంది. రెండింటిలో ఏదో తీయని సారూప్యత! ఫరాజ్ ఐదో ఆరో షేర్లే వ్రాసినా అనుకరణప్రాయంగానో అనుసరణప్రాయంగానో ఎంతో మంది తమ సొంత షేర్లను జోడించారు. వేమన శతకమకుటంలో ఎన్నెన్నో పద్యాలు వ్రాయబడినట్టు! నిజానికి ఈ ఒక్క గజల్ వ్రాసి ఉన్నా ఫరాజ్ ఇంతే ఖ్యాతి పొందేవాడేమో అంటే అతిశయోక్తి ఖచ్చితంగా అవుతుంది, అయినా అనడం సబబే. మెహఁదీ హఁసన్ తో పాటు ఇంకా ఎందరెందరో ఎన్నో పర్యాయాలు పాడినా పాతదైపోని పలుచనైపోని ఈ గజల్ ఫరాజ్ అందించాడు. మన్నించాలి, మళ్లీ I digressed.
కన్నీరు! ఆ మాట వాడకుండా వాటి గురించి చెప్పిన ఫరాజ్ షేర్ చూడండి:
కుఛ్ తో సుబూత్-ఎ-ఖూన్-ఎ-తమన్నా కహీఁ మిలే
హై దిల్ తహీ తో ఆఁఖ్ కో భర్ జానా చాహియే
కోర్కె చంపబడి ఉంటే ఏదైనా సాక్ష్యం ఉండాలి
హృదయం వెలితిగా ఉంటే నయనాలు నిండాలి
*
నేను ‘పరమార్థం’ అనే కవితలో వ్రాసుకున్న పంక్తులు :
అపరగంధర్వ గానకౌశలప్రదర్శన వద్దు
మానసవీణ మంద్రంగా మీటి వెళ్తే చాలు
అతిసాధారణమైన సంభాషణాత్మకమైన భాషలోనే అతిగంభీరమైన సున్నితమైన కవిత్వాన్ని పలికించిన వారిలో ఫరాజ్ అగ్రగణ్యుడు.
ఆ సరళశైలే జనబాహుళ్యంలో తనకి అం తటి ఆదరణ తెచ్చిపెట్టింది.
అలా దైనందిన జీవితపార్శ్వాలలో నుండీ స్నేహం గురించి ఫరాజ్ వెలికితీసిన పర్స్పెక్టివ్స్ కొన్ని:
తుమ్ తఖల్లుఫ్ కో భీ ఇఖ్లాస్ సమఝ్తే హో ఫరాజ్
దోస్త్ హోతా నహీ హర్ హాథ్ మిలానే వాలా
నువ్వు కనీసమర్యాదని మమకారం అనుకుంటావు
చేయి కలిపిన ప్రతివాడూ స్నేహితుడు అనుకుంటావు
ఇస్ సే పెహ్లే కి బేవఫా హోజాయే
క్యూఁ న ఎయ్ దోస్త్ హమ్ జుదా హోజాయే
అపనమ్మకం కలుగకముందే
నేస్తమా మనం విడిపోదామా
బేబసీ భీ కభీ కుర్బత్ కా సబబ్ బన్తీ హై
రో న పాయె తో గలే యార్ సే లగ్ జాతే హై
నిస్సహాయత కూడా అపుడపుడూ దగ్గరచేస్తుంది
ఏడవలేకపోతే నేస్తాన్ని గుండెలకు హత్తుకుంటా ను
తేరీ బాతేఁ హీ సునానే ఆయే
దోస్త్ భీ దిల్ హీ దుఖానే ఆయే
నీ ఊసులే వినిపించడానికి వచ్చారు
నేస్తాలు కూడా ఏడిపించడానికే వచ్చారు
*
ప్రేమ, ప్రణయం, విరహం వీటి గురించి వ్రాయని కవులు ఉండడం అసంభవమని అనుకుంటాను. ఫరాజ్ కూడా వ్రాశాడు, కానీ తనదైన ముద్రను కూడా వేశాడు. ఉర్దూ సాహిత్యంలో ప్రేయసి సౌందర్యవర్ణన కంటే ఎక్కువ ఏకపక్షమైన ఆరాధన, వియోగము, విరహము, వంచితవ్యథ వంటి ఛాయలు కనిపించాయి. ఫరాజ్ రచనల్లో కూడా!
వో ఖార్ ఖార్ హై శాఖ్-ఏ-గులాబ్ కె మానింద్
మై జక్మ్ జక్మ్ హూఁ మగర్ గలే లగావూఁ ఉసే
గులాబీకొమ్మ లాగ తనకు నిలువెల్లా ముళ్ళున్నాయి
నాకు ఒళ్ళంతా గాయాలైనా తనని హత్తుకుంటాను
జిందగీ సే యహీ గిలా హై ముఝే
తూ బహుత్ దేర్ సే మిలా హై ముఝే
జీవితంతో ఉన్న పేచీ ఒక్కటే నాకు
నువ్వెంత ఆలస్యంగా దొరికావో నాకు
నలుగురిలో ఉన్నప్పుడు జరిగే చర్చల్లో ప్రేయసి గుర్తొచ్చే విషయాన్ని రెండు సందర్భాల్లో ఎంత విభిన్నంగా కవిత్వీకరించాడో చూడండి:
చలా థా జిక్ర్ జమానే కీ బేవఫాయీ కా
సో ఆగాయా హై తుమ్హారా ఖయాల్ వైస్ హీ
ప్రపంచంలోని నమ్మకద్రోహం ప్రస్తుతిస్తే
అప్రయత్నంగా నీ తలంపు కూడా వచ్చింది
యే లోగ్ తజ్కిరే కర్తే హై అప్నే లోగోఁ కీ
మై కైసే బాత్ కరూఁ అబ్ కహాఁ సే లాఊఁ ఉసే
వీళ్లంతా తమవాళ్ళ గురించి కథలు చెబుతున్నారు
నేనెలా మాట్లాడాను తనని ఎక్కడినుండీ తేను
*
అందరు సుప్రసిద్ధకవుల లాగానే ఫరాజ్ రచనల్లో కూడా తాత్వికచింతన తారసపడుతుంది.
కిసీ కో ఘర్ సే నికల్తే హీ మిల్ గయీ మంజిల్
కొయీ హమారీ తర్హా ఉమ్ర్ భర్ సఫర్ మేఁ రహా
కొందరు ఇల్లు దాటగానే గమ్యం చేరుకున్నారు
కొందరు నాలాగా జీవితాంతం ప్రయాణిస్తున్నారు
అలాగే మధువు, మధుపాత్ర, ఇతరేతర సంబంధిత ప్రతీకలు కూడా ఫరాజ్ రచనల్లో కనిపిస్తాయి.
తన కలం కలిపిన ఒక కాక్టెయిల్ రుచి చూడండి:
గమ్-ఎ-దునియా భీ గమ్-ఎ-యార్ మేఁ షామిల్ కర్ లో
నషా బఢ్తా హై షరాబేఁ జో షరాబోఁ మేఁ మిలే
ప్రీతిబాధల్లో ఈతిబాధలు కూడా కలిపేసుకో
మధువులో మధువు కలిస్తే మత్తు రెట్టింపవుతుంది
*
ఫరాజ్ స్ఫురద్రూపి, ఆజానుబాహుడు . కొంగర జగ్గయ్యగారిలా, గుమ్మడి గారిలా గంభీరమైన కంఠస్వరం కలవాడు.
ఫరాజ్ రచనలు చదువుకోవడం ఒక ఎత్తైతే, ముషాయిరాలలో తన గొంతులోనే ఆ రచనలు వినడం ఇంకొ ఎత్తు.
అతను చదువుతున్నంత సేపూ ‘వాహ్ వాహ్’, ‘ముకర్రర్ ఇర్షాద్’, ‘క్యా కెహెనే’, ‘క్యా బాత్ హై’ అంటూ సభలోని శ్రోతలే కాకుండా వేదికపై ఉన్న సహకవులు కూడా హర్షాతిరేకాల్లో మునిగి తేలడం యూట్యూబ్ లో చూడవచ్చు. ఇలా శ్రేష్టమైన కవిత్వాన్ని వ్రాసి, సభల్లో జనరంజకంగా వినిపించి ఫరాజ్ వే నవేల రసికహృదయాల్లో సుస్థిరస్థానం ఏర్పరచుకున్నాడు. ఆ అవ్యాజప్రేమకు గౌరవమిస్తూ, తాను ఎంతటి అభిమానానికి పాత్రుడయ్యాడో తన మాటల్లోనే:
ఔర్ ‘ఫరాజ్’ చాహియే కిత్నీ మొహబ్బతేఁ తుఝే
మాఁఓ నే తేరే నామ్ పర్ బచ్చోఁ కా నామ్ రఖ్ దియా
ఫరాజ్ ఇంకెంత అభిమానం కావాలి నీకు
తల్లులు పిల్లలకు నీ పేరు పెట్టుకున్నారు
చాలా కొద్దిమంది కవులకే ఇంతటి అమేయమైన కీర్తి ఆదరణ ‘సిద్ధి’స్తాయి. అహ్మద్ ఫరాజ్ ఆ కొద్దిమందిలోనూ ఒక మేరుపర్వతం! తనలో తానే ఒక కవనసంగ్రహం!!
*
ఇన్నాళ్లకు, నా కంట పడింది.. ఈఆణి ముత్యం.. చదువు తుంటే.. కన్నీరు కారింది. అప్రయత్నంగా..హృదయాలు వెలితి గా ఉంటే.. నయన లు నిండాలి… నిజమే.
Many many thanks, sir!,,🙏🙏.
ధన్యవాదాలు పద్మ గారు! మీ పఠనానుభూతి నాకు మరి కొందరు కవులను పరిచయం చేయడానికి ప్రోత్సాహాన్నిచ్చింది.